కలం కూల్చే గోడలు

వాళ్ళు
స్వార్థమనే సిమెంటూ, ఇసుక కలిపిన
ఆధిపత్య కాంక్రీటుతో,
విద్వేషమనే ఇటుకలతో…
దేశమంతా గోడలు నిర్మించారు…

అవి ఆకాశాన్ని తాకే గోడలు….
అవని అంతటా విస్తరించిన గోడలు…

దేశానికీ, దేశానికీ మధ్య,
దేహానికీ, దేహానికీ మధ్య
లెక్కలేనన్ని గోడలు…
నీకూ, నాకే కాదు
నాలో నాకే గోడలు…

ఈ గోడల్ని
ఎవరు, ఎలా, ఎందుకు నిర్మించినా,
వాటిని కూల్చేసే బాధ్యత మనందరిదీ…

ఎన్నో అవమానాలు,
అణచివేతలు,
దుర్మార్గాలు, దురాగతాల
గురుతులతో నిండిపోయిన
ఆ గోడల నిండా…

పేదలు, పీడితులు,
స్త్రీలు, పిల్లల
ఒక్కో కన్నీటి బొట్టూ
ఒక్కో అద్దంలా మారి,
ఎన్నో సాక్ష్యాలను
మనకు చూపెడుతున్నాయి,
చివరికి మమ్మల్ని కూల్చేయండని
ఆ గోడలే ప్రాధేయపడుతున్నాయి…

ఎందుకంటే
కాలం కూల్చే గోడలు కావివి…
కలం కూల్చే గోడలు…

ఎక్కడైతే
లక్షల సిరా చుక్కలు నదీ ప్రవాహాలై
మూకుమ్మడిగా
ఈ గోడలపై విరుచుకుపడతాయో,
పగుళ్లు దేలిన గోడల గుండా
పదునైన అక్షరాలు
సముద్ర కెరటాలై విజృంభిస్తాయో…

అక్కడ…
అవి నిర్మించిన పుర్రెలలో,
వాటిని మోస్తున్న బుర్రలలో,
నెర్రెలు వారుతాయి…

అప్పుడే…
గోడలకు ఇరువైపులా ఉన్న చెట్ల వేర్లు
ఒకదానితో ఒకటి
ప్రేమగా పెనవేసుకుంటాయి…

ఇప్పుడూ
అక్కడ గోడలు కాదు,
భూమి పొరలను చీల్చుకుంటూ
మానవత్వపు విత్తనాలు మొలకెత్తుతాయి…
ఎన్నో ఆశలు, ఆశయాలు మళ్ళీ చిగురిస్తాయి…
మరెన్నో కొత్త కవిత్వాలు ఊపిరి పోసుకుంటాయి…

కవయిత్రి. కలం పేరు హంసస్వర.  ఉస్మానియా యూనివర్సిటీలో M.A. English పూర్తి చేశారు.  శ్రీశ్రీ, గుర్రం జాషువాల సాహిత్యమంటే  ఇష్టం.  అనుభవాలు, సామాజిక స్పృహతో కవిత్వం రాస్తుంటారు. ప్రస్తుతం ‘ఆకాశవాణి’లో వార్తా ప్రయోక్తగా పనిచేస్తున్నారు.

One thought on “కలం కూల్చే గోడలు

Leave a Reply