హైదరాబాద్‍లో మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఎండలు భగభగ మండిపోతున్నయి. వడగాడ్పులకు రోడ్డు మీద ట్రాఫిక్ మామూలు రోజుల కంటే కొద్దిగ రద్దీ తగ్గింది. వాహనాలు వేగంగా వెళ్లిపోతున్నయి.
రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమం కవర్ చేయడానికి నేను అక్కడికి చేరుకునే సరికి రవీంద్రభారతి రోడ్డు మీద పెద్ద కలకలం రేగింది. ‘‘జై తెలంగాణ, జై జై తెలంగాణ’’ అని నినదిస్తూ ఒక యువకుడు మంటల్లో కాలుతున్నడు. రోడ్డు మీద కొద్దిదూరం ఉరికి, ‘‘మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, ‘ముఖ్యమంత్రి మా గోడు వినాలి’’ అంటూ గట్టిగా నినాదాలు చేసిండు.
రోడ్డుపై నడుస్తున్న మనుషులు విగ్రహాల్లా నిలబడి చూస్తున్నారు తప్ప కదలడం లేదు. ఫుట్‍పాత్‍పై చెప్పులు కుట్టే ఓ పెద్దమనిషి పరుగెత్తుకొని వచ్చి గోనెసంచి కప్పి మంటలార్పిండు. మంటలకు ఆ యువకుడి ఒళ్లంత ఉడికి కమిలిపోయింది. శరీరం మీద తోలు వేలాడుతుంది. జనాలు చుట్టూ గుమి కూడారు.
అక్కడే నిల్చున్న ఒకరిని ‘ఏమైందని’ అడిగాను. ‘‘నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెట్రోలుతో నిప్పంటించుకున్నడు’’ అన్నాడు.
‘‘వాని నౌకర్లు పాడుగాను, ప్రాణం మీదకు తెచ్చుకుంటివి కొడుకా!’’ అనుకుంటూ ఓ మహిళ తన కొంగుతో కండ్ల నీళ్లు తుడుచుకుంది.
ఒళ్లంత కాలిన గాయాలకు రొప్పుతూ బాధిత యువకుడు ఏదో చెప్పబోయిండు. కానీ మాటలు స్పష్టంగా వినిపించటం లేదు. ఇంతలో పోలీసులు చేరుకున్నరు.
నలుగురు చేతుల్లోకి తీసుకొని జాగ్రత్తగా అంబులెన్సులోకి ఎక్కించి ఉస్మానియా దావఖానకు తీసుకుపోయిండ్లు.
0 0 0
వార్త రాయడానికి ఆఫీసుకు చేరుకున్న కానీ ఆ యువకుడే కళ్లలో మళ్లీమళ్లీ తిరుగుతున్నడు.
ఆత్మగౌరవం కోసం పోరాడిన యువత కలలు, ఆశలు మంటల్లో ఆహుతయిపోయినట్లుగా గుండె బరువెక్కింది. మనసులో మనసు లేకుండా పోయింది.
‘యూనివర్శిటిలో పీజీలు చదివి ఏం లాభం !’. ‘సర్కారు కొలువుల కోసం ఎన్ని కలలో. అమ్మనాయిన ఎంతో ఆశపడ్డరు. పాలకులు మారినా బతుకులో మార్పులేదు.’
మనసులో జ్ఞాపకాల తొంతరలు.
0 0 0
ఢిల్లీలో కేంద్రం చేసిన ప్రకటనకు తెలంగాణ గల్లీగల్లీలో జనంలో కొత్త జోష్ వచ్చింది. అన్నీ రంగుల జెండాలు బజారుల్లోకి వచ్చి ‘జైలంగాణ’ నినాదాలతో హొరెత్తింది. తీన్మార్ డ్యాన్సులతో బజార్లలో దుమ్ముదుమ్ముగా పడుసు పోరగాళ్ల నుంచి పండు ముసలోల్ల వరకు ఆటలు ఆడిండ్లు. ‘‘తెలంగాణ మేం తెచ్చినమంటే, మేం తెచ్చినమని’’ తెల్లఖద్దరు బట్టల లీడర్లు మైకుల ముందు గొప్పలు చెప్పుకున్నరు. ఎపుడూ జైతెలంగాణ అననోడు కూడ హడావుడి చేసిండు.
ఉమ్మడి ఆంధప్రదేశ్ చిట్టచివరి అసెంబ్లీ మీటింగ్. పేపర్లు, టీవీల విలేకర్లు హడావిడిగా ఉన్నరు. తెలంగాణ విలేకర్లు మస్తు హుషారుగా ఉన్నరు.
సమైక్యంగా కలిసి ఉందామని చెప్పిన విలేకరి రాయుడు మేకపోతు గంబీరంతో నవ్వుకుంట వచ్చి నాకేసి థమ్‍సప్ సింబల్ సూపిచ్చిండు. దగ్గరకు వచ్చి, అమాంతంగా కౌగిలించుకుండు. ‘‘తమ్మి! రాజిరెడ్డి గెలుపు మీదే. మా ఆంధ్రకు మేం వెళ్లిపోవడం ఖాయమైంది. ఇకనుంచి అసెంబ్లీ వార్తలు రాసుడు నువ్వే’’ అన్నడు.
‘‘మన బాస్ నన్ను బ్యూరోచీఫ్‍గా ప్రమోట్ చేస్తడంటవా అన్న. కొంచెం నాకు ఫెవర్‍గా జేయాల్నే’’ అన్నాను.
“మా గుంటూరు పంతులే కదా!. ఆ యవ్వారం నేను చూసుకుంటాలేరా తమ్ముడు” అన్నాడు నవ్వుతూ.
‘‘అన్న జర్ర గీసాయం చేయ్. నా పర్సుల నీ పోటో పెట్టుకుని రోజు మొక్కుతా’’
‘‘అరె తమ్ముడు. అసెంబ్లీలో మీటింగ్ మొదలైంది. పదపదా లోపలికి పోదం’’ అంటూ లోపలికి దారితీసిండు.
అసెంబ్లీ మీటింగ్ హాల్లో తెలంగాణ కాంగీ ఎమ్మెల్యేలు మొఖాలు విజయ దరహాసంతో వెలిగిపోతున్నయి. ‘‘మా అమ్మ పెట్టిన బిక్షతోనే తెలంగాణ ఒచ్చిందని’’ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సభలో ఊదరగొట్టిండు.
అటు ఇటు గోడలు దునుకంగా మిగిలిన గులాబీలు ఖుషిఖుషిగా ఉన్నరు. కొందరు లీడర్ల మొఖాలు ఎల్‍ఇడి లైటు లెక్క దగదగ మెరుస్తున్నయి.
‘‘తెలంగాణ నినాదాన్ని గడపగడపకు తీసుకపోయినం. ప్రాణాలు పణంగా పెట్టి మా పార్టీ తెలంగాణ సాధించిందని’’ పిడికిలెత్తి పలికిండు ఓ తెరాస నాయకుడు.
తెలుగుదేశం పార్టీ లీడర్లు వాళ్లకు వాళ్లే అలయ్‍బలయ్ చేసుకున్నరు.
‘‘మేం కేంద్రానికి లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చిందని’’ చంద్రబాబు చూపుడు వేలు ఊపుకుంట చెప్పిండు. రాజ్యసభలో ఎంపీ సుష్మ సపోర్టుతోనే తెలంగాణ కల నెరవేరిందని’’ భాజాపా ఎమ్మల్యే కిషన్ చెప్పుకొచ్చిండు.
అధికార కాంగ్రెస్ సీఎం కిరణ్‍ది వచ్చిరాని తెలుగు. ఏం మాట్లాడిండో ఎవరికీ అర్థం కాలేదు. సభలో ఆయన చెప్పె ముచ్చట్లను వినడానికి ఎవరికీ ఆసక్తి లేదు.
ఆయన మాటల్లో ‘‘తెలంగాణకు ముందుముందు కరెంటు కష్టాలు తప్పవని’’ తిక్క జోతిష్కం చెప్పిండు, కాని సభలో స్వపక్షం సభ్యుల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు.
హాల్‍లో అందరూ ఎదురు చూస్తున్న గులాబీ అధినేత శేఖర్‍రావు మైకు అందుకున్నడు. సభ గప్‍చుప్‍గా మారింది.
‘‘నెత్తురు సుక్క రాలకుండ తెలంగాణ తెచ్చినం. పులి నోట్లె తలకాయ పెట్టి స్వరాష్ట్రం తెచ్చిన. తెలంగాణ వచ్చుడో, నేను సచ్చుడోనని పబ్బతిపట్టి సాధించుకున్నం’’ అన్నడు గర్వంగా.
‘‘ఇంటికో ఉద్యోగం. ప్రతీ మడికి సాగునీరు తెద్దాం. ఆకుపచ్చ తెలంగాణ కలను సాధించుకుందం’’ అన్నడు.
‘‘దళితుణ్ణే ముఖ్యమంత్రిని చేస్త. నేను తెలంగాణకు కాపల కుక్కలెక్క ఉంట’’ అన్నడు.
తెలంగాణ ఎమ్మెల్యేలు ఉబ్బిపోయిండ్రు. సభలో సప్పట్ల వర్షం బలబల కురిసింది.
కొద్ది రోజులకు కొత్త రాష్ట్రంలో తొలి అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది.
కప్పల కంటే అధ్వాన్నంగా జంపింగ్. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఎవరు పార్టీలకు పోతున్నరో జనాలకు సమజయితలేదు. ఓట్ల పండుగ శురువు కావడంతో ఊర్లన్ని విందు, మందులతో పొంగిపొర్లుతున్నయి. ఎన్నికల్లో గెలవడానికి లీడర్లు అడ్డుదారుల్లో పడి ఉరుకుతున్నరు. అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు అదేపనిలో ఉన్నరు. అడిగినోనికి ఓటుకు నోటు. తాగెటోకి తాగినంత మందు. తినేటోనికి తిన్నంత బీరు బిర్యానీ. యథేచ్చగా సాగింది.
ఉద్యమంలో మాట్లాడినదాని కంటే ఎక్కువగా తెరాస అధినేత, ఎన్నికల సభల్లో ప్రజలను మాటల గారడీతో ఆకట్టుకున్నడు. బెల్లం ఎయ్యకుండనే బూరెలు పొంగిచ్చిండు. జనం ఎగబడి తమ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చిండ్లు. చేతికి ఎముక లేదన్నట్టు అన్నింటిని అమలు చేస్తామని నమ్మబలికిండు.
ఎట్టకేలకు ఎన్నికల రణరంగంలో గులాబీ పార్టీని ప్రజలు గెలిపించిండ్లు.
హైదరాబాద్ జూబ్లీగుట్టల మీదున్న గులాబీ పార్టీ బంగ్లా దగదగ మెరిసి పోతున్నది. ఎమ్మెల్యేలుగా గెలిచినోళ్లు ఒకరినొకరు అలయ్ బలయ్ చేసుకున్నరు. సీఎం పదవి దళితుల్లో ఎవరిని వరిస్తుందోనని అందరిలో నరాలు తెగే ఉత్కంఠ. తొలుత ఘనపురం ఎమ్మెల్యే పులి రాజు నిలబడి ముఖ్యమంత్రిగా శేఖర్‍రావును ప్రతిపాదించిండు. మిగతా సభ్యులు మద్దతు తెలుపుతూ మొక్కుబడిగా చెయ్యేత్తిండ్లు.
దళితుడైన ఎమ్మెల్యే ఒకరిని డిప్యూటి సీఎంగా శేఖర్ ప్రకటించిండు.
దళితులకిచ్చిన హామీ ఏమిటి ? చివరకు చేసిందేమిటని ? దళిత ఎమ్మెల్యేలు ముక్కుమీద వేలేసుకొని అంతర్మథనంలో పడ్డరు. రంగు మారినా ఫలితం దక్కలేదని కొందరు లీడర్లు మౌనంగా ఉన్నరు.
‘తానే సీనియర్ దళిత నేతనని, సీఎం అవుతానని’ కలలుగన్న మరొకాయన లోలోపల కన్నీరయిండు.
కొత్త రాష్ట్రం అసెంబ్లీ సమావేశాల కోసం ఆవరణను పూలతో ముస్తాబు చేసిండ్రు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అసెంబ్లీ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి తొలుత గన్‍పార్కు చేరుకొని అమరుల స్తూపానికి నివాళి అర్పించిండు.
‘‘అమరుల కలల సాధనకు ప్రతీ నిముషం పనిచేస్తా అన్నడు.
అటు నుంచి నేరుగా అసెంబ్లీ సభా మందిరానికి చేరుకున్నడు. వివిధ పార్టీల సభ్యులు సీఎంను సాదరంగా పూల గుచ్ఛాలతో అభినందించిండ్లు.
సీఎం మొఖంలో విజయగర్వం తొణకిసలాడుతుంది. అధికార పక్షం సీటులో కూసున్నడు. తొలి ప్రసంగాన్ని ఆరంబించే సరికి సభలో సప్పట్లు మోగినవి.
‘‘ముక్కోటి తెలంగాణ ప్రజలకు శతకోటి వందనం. ఉద్యమానికి అండగ నిలిచిన బిడ్డలకు దండాలు. రాష్ట్రం సాధనకు చేయూతనిచ్చిన సానియమ్మకు సభ తరఫున ధన్యవాదాలు. తెలంగాణ ఎప్పటికీ మరువదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తం. రెండు లక్షల ఉద్యోగాలు నింపుతం. కనీవినీ ఎరగని విధంగా రాష్ట్రం అభివృద్ధి చేకుందాం’’ అని ఇచ్చిండు.
సభలో మరోసారి సప్పట్లు మార్మొగినయి.
ఏడాది హానీమూన్ పాలన గడిచింది. చూస్తుండగానే ఐదేళ్ల కాలం గిరగిర తిరిగింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది.
పాలకులు మారినా మన ప్రాంతం వాడే వచ్చినా దక్కని అభివృద్ధి ఫలాలు. సమాజంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది. మనసులో బాధేస్తుంది.
0 0 0
‘‘ఏంపిల్లడోఎల్ద మొస్తవా! ఏంపిల్లో ఎల్దమొస్తవా! శ్రీకాకుళంలో సీమకొండకి ఎల్దా మొస్తవా!’’ అంటూ మొబైల్ ఫోన్ రింగ్ టోన్ మోగింది. సెంట్రల్ డెస్క్ నుంచి రాయుడు చేస్తున్న ఫోన్‍కాల్ లిప్టు చేసిన. ‘‘ఏమైంది’’ అని అడిగిండు. ‘‘యువకుడి సూసైడ్ న్యూస్ ఐటెం రాస్తున్న’’ అన్నాను. ‘‘ఇపుడు మనకు ఆ సూసైడ్ న్యూస్ ముఖ్యం కాదు. తాజాగ సీఎం ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికల్లోకి వెళ్తుండట! థర్టీ మినెట్స్లో నాకు పొలిటికల్ స్టోరీ కావాలి’’ అంటూ ఆర్డర్.
మనసు సంపుకొని అసెంబ్లీకి పరుగు పెట్టాను.
అన్నా చాలా బాగుంది. తెలంగాణా తెలుగు భాష మాటలాగా సాగిన తీరు అద్భుతంగా ఉంది.
thank you very much anna
కామ్రేడ్ కోడం గారి “కలం కల” కథ ప్రస్తుతం తెలంగాణ సమాజం లో నెలకొని వున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టింది. కొలిమి కి ధన్యవాదాలు. కథకులకు అభినందనలు.
-డాక్టర్ మేడబోయిన లింగయ్య యాదవ్
టీచర్, సూర్యాపేట జిల్లా.
9948485001
thank you so much sir…
అన్నగారు అద్భుతమైన కథ
thank you so much anna
తెలంగాణ మాండలికంలో ఎంతో చక్కగా యథార్థ గాథ మాకు అందించిన గురువు గారికి ధన్యవాదాలు చాలా చక్కగా తెలంగాణ మాండలికాన్ని ఈ గాథ లో రుచి చూపించారు
Shukriya Yakub Pasha jee…
తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది కోడం కుమారస్వామి గారి కలం కల కథ.. సామాన్య ప్రజల త్యాగాలని గుర్తించలేని నాటి దుస్థితికి అద్దం పడుతుంది.
చాలా బాగుంది సర్.. నాటి తెలంగాణ ఉద్యమ పరిస్థితులని కళ్లకు కట్టినట్లు చూపిన విధానం బాగుంది,. సామాన్యుడి త్యాగాలను గుర్తించలేని సమాజ దుస్థితిని తెలంగాణ బాష/యాస లో అద్భుతంగా రాసారు..
కథ చాలా బాగుంది సర్.. నాటి తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని మాండలిక భాష/యాసలో.. సామాన్యుడి త్యాగాన్ని గుర్తించలేని సమాజ దౌర్భాగ్యాన్ని ఆలోచింపజేసే రీతిలో… అద్భుతంగా వ్రాసారు సర్.. అభినందనలు..
Thank you so much my Mohanakrishna bhargava.ji..for ur encouragement
Proud of you ji నాటి తెలంగాణ ఉద్యమ పరిస్థితులని కళ్లకు కట్టినట్లు చూపిన విధానం బాగుంది,. సామాన్యుడి త్యాగాలను గుర్తించలేని సమాజ దుస్థితిని తెలంగాణ బాష/యాస లో అద్భుతంగా రాసారు.my dosth
మీ స్పందన కు నాకు కొత్త శక్తిని ఇచ్చింది. మీకు ధన్యవాదాలు రమేష్ గారు
తెలంగాణ ఉద్యమ చరిత్రను రికార్డు చేసిన కథ. అన్నా అభినందనలు.
– సాగర్ల సత్తయ్య నల్లగొండ
E charithta Chadhivinaka naaku live lo chusinantha anuboothi kaligindhi sir… Baagundhi sir…
మీ అపూర్వ స్పదనకు సత్తెన్న సాగర్లకు…
మీ అపూర్వమైన స్పందన కు ధన్యవాదాలు సాగర్ల సత్తయ్య సర్….
E charithta chadhivithe naaku live lo chusinantha anuboothi kaligindhi sir…. Baagundhi sir…
ధన్యవాదాలు ప్రియ మిత్రమా రుషికేష్….
Reminded those days and reflected present situation. Good story sir..
మీ అపూర్వమైన ప్రోత్సాహానికి ధన్యవాదాలు కవిత గారు…
నాటి తెలంగాణ చరిత్రలో సామాన్యుడి త్యాగాలను ,తెలంగాణ పేరు వాడుకుని వారి ఇల్లుని బంగారు మయం చేసుకున్న వారి గురించి చక్కగా వివరించారు
thank you very much..anji garu….
Katha Chala bagundi
Thank you bhaisab
అన్న, చాలా మంచి ప్రయత్నం. చాలా బాగుంది
అన్న మీ స్పందనకు ధన్యవాదాలు…
చాలబాగా రాసారు. తెలంగాణ కోసం పొరటమప్పుడు చేసిన నాయకుల నిజ స్వరూపం సరిగ్గా రాసారు. కధ చెప్పిన విధానం బావుంది.
Thank you very much sir…
కోడం కుమార్ గారు మీ “కలం కల”ప్రతి గుండెని కదిలించేది గా…ఉంది…సగటు తెలంగాణా పౌరుడు చదవాలి….ఏవిధంగా నమ్మక ద్రోహం జరిగింది….ఏ విధంగా దగా చేయబడ్డము… ఇకనైనా కళ్ళు తెరవక పోతే… ఏమవుతోందో…మీ రచనల ద్వారా తెలుస్తుంది.తెలంగాణా సమాజాన్ని జాగృతం చేసే ఎన్నో రచనలు మీ కలం నుంచి వస్తాయి అని ఆశిస్తూ✊✊✊✊
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ప్రదీప్ సర్….
బాగుంది సార్
ధన్యవాదాలు సర్…