చేతులాడే యుద్ధం చూశాం
ముడుచుకునే యుద్ధం
ఎప్పుడన్నా చేశామా
ఇది యుద్ధం కన్నా ఘోరమైంది
రథాలు ఎక్కేది లేదు
క్షిపణులు మోసేది లేదు
నిఘా కన్నుల కారం చల్లి
పారిపోతున్నది
చర్య ప్రతిచర్యల మధ్య ప్రపంచాన్ని
విచిత్ర యుద్ధశాల చేసింది
క్యాలెండర్ ముందు
వికటంగా గంతులేస్తున్నది
కాలం కన్నా వేగం అయింది
వర్ణాంతర కుటిలాన్ని
ఊదర ప్రవచనాలను
ఏక ధృవీకరణనూ
జెండర్ వివక్షతలనూ
ఏలుబాటు కాదన్నది
తప్పిపోయిన యెరుక
పట్టి ఇచ్చింది
దీన్ని కరోనా శకం అనాలి
మనిషి నిండుగ రూపొందనందుకూ
విషాలకు తలొగ్గినందుకూ అనాలి
మెదడును మైలురాయిగ
నడి తొవ్వల పాతి నందుకు అనాలి
తీరు మార్చుకొమ్మన్నందుకు అనాలి
కాలాంతకులు కలిసి పోయేదాకా అనాలి
ఔనిప్పుడు
పరిశోధనల పుటల నించి
సార్వకాలీన వాక్సిన్
ఆమోదించవలసి ఉన్నది
ఎల్లలన్నీ
చెదిరిపోతయి
మనిషి మూలం
మట్టి ఒక్కటే
మిగిలి ఉంటది
పొడగొట్టుకున్నది ఏదో
దొరి కించుకునే గుర్తు కోసం
దీన్ని కరోనా శకం అనాలి