ఓ నిత్యాన్వేషి

ఎలాగోలా నడవాలనుకుంటావు
ఎవరి ఆసరా కోసమో ఎదురు చూస్తూ ఉంటావు
దిక్కు తోచని స్థితిలో కుమిలిపోతూ ఉంటావు
కష్టాల్లో కన్నీళ్ళ కావడి మోస్తూ ఉంటావు
పరిహసించే బతుకును ఏమార్చాలని చూస్తూ ఉంటావు
నీతో నీవే ఎడతెగని చర్చలేవో చేస్తుంటావు…
అదిగో అలాంటి సంక్షుభిత సమయంలో
సందిగ్ధ పరిష్వంగంలో
మంచి, చెడు
జ్ఞానం, అజ్ఞానం
సారం, నిస్సారం
తేజం, ఉత్తేజం
స్పష్టం చేసే రగుల్ జెండా
నీ చూపుల దారులలో కనువిందు చేస్తూ ఉంటుంది
ఆకాశానికి నిచ్చెనలేస్తూ
భూమధ్యరేఖ పై కళ్ళు
మిరిమిట్లు గొలిపే మార్గం
ఒకటి నీ జ్ఞాననేత్రాన్ని తెరిపిస్తూ ఉంటుంది

మూడు వేళ్ళ తాకిడి తో
మొదలైన పయనం
కీ బోర్డు పై పది వేళ్ళతో
నర్తనం చేసే స్థితి దాకా
విస్తరిస్తున్న క్రమం
చరిత్ర చెక్కిలి పై నీవు పెట్టిన సంతకం
అన్వేషణా దారుల్లో
పరిశోధనా క్షేత్రాల్లో
సృష్టి ని శోధించిన అద్భుతం
అనుభవాల కాసారం
అక్షరాల ఇటుకలతో నిర్మించిన మహా సౌధం
మనిషి మనీషికోసం ఏర్పరిచిన మాయా మార్గం
వర్తమానం తెరిచిన జ్ఞానం
మహోజ్వల మానవులు
రచించిన ప్రేమ తత్వం
నాగలి తో దున్ని విత్తు నాటిన జీవితం
చెమట చుక్కలతో కళాఖండాలు సృజించిన వైనం
ఎన్నో స్వప్నాల సమాహారం
అపూర్వ మేధస్సుల
సమాగమం
ఎన్ని కోట్ల తేనెటీగల్లాంటి
న్యూరాన్లు వాటిని సమకూర్చాయో
ఎన్ని వేల అడుగులు రక్తసిక్తమయ్యాయో
జలపాతం లాంటి మనుషుల
కలలు అక్కడ నిక్షిప్తం అయ్యాయో
వారు తిరిగిన ప్రాంతం
వారి ఆకారం అస్పష్టం
వారు చేతులు కలిపిన సమూహాలు
వారు ముద్దాడిన కొండ కోనలు
వాళ్ళు మిగిల్చిన అనుభవాలు
అక్షర తూణీరాలై
నిన్నొక మహావిజేతను చేస్తూ
శబ్దవిస్పోటనం చేయటం లేదా
ఓ నిత్యాన్వేషి, ఓ నవతరమా
నిన్ను నీవు ఆవిష్కరించు
నిన్ను నీవు జయించు
ఇక నీ బుల్లి పిట్ట రెక్కలకు
ఎన్ని రంగులు, హంగులు
అద్దుకొని మురిసి పోతావో
నీ ఇష్టం…

కడప జిల్లా. కవయిత్రి, కథా రచయిత. ఎం.ఏ., ఎం.ఏ., ఎంఇడి., ఎల్.ఎల్.బి., పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివారు.
రచనలు : చెదిరిన పిచ్చుక గూడు (కథాసంపుటి), మా తుఝే సలాం (కథా సంపుటి), అనువాదాలు : అమలు కాని హామీల చరిత్ర, తలకిందులలోకం, హలో బస్తర్. కవితలు, పుస్తక పరిచయాలు, అనువాదాలు. కొన్ని వ్యాసాలు.

Leave a Reply