చెట్టునుండి పువ్వును తెంపి
నీళ్లగ్లాసులో వేసి మురిసిపోయినట్టు
మహావృక్షం కొమ్మలు ఖండించి
కుండీలో మరుగుజ్జు వృక్షంగా మార్చి
గొప్పలు పోయినట్టు
సీతాకోకచిలుక రెక్కలు కత్తిరించి
గొప్ప కళాకృతిని సృజించానని భ్రమసినట్టు
నువ్వు విదిలించిన ఆ కాస్త స్వేచ్ఛలోనే
నువ్వు నిర్దేశించిన ఆ పరిమితుల్లోనే
నేనెప్పుడూ వెలగాలనుకుంటావు
నాలోంచి గెలన్లకొద్దీ నీళ్లను తోడి
నేనే చెట్లను పెంచుతాను
తొడిమ వీడనంతవరకే నాది
తర్వాత ఫలం మీద అధికారాలన్నీ
నువ్వే లాగేసుకుంటావు
నా ఉదయాలనన్నిటినీ పోగేసి
ఒక ప్రమిదను చేస్తాను
నువ్వు నా వెలుగంతా చేదుకుని
చీకట్లను కానుకిస్తావు
బోర్లించిన ఖాళీ పాత్రగానే మిగిలిపోతాన్నేను
నా ప్రశాంత తీరంలో
ప్రతిసారీ రాళ్ళేసిపోతావు
నేను నదిని తెంపుకోలేక
ఒడ్డుతో యుద్ధంచేయలేక
నిశ్శబ్దాన్ని కప్పుకుని
అక్కడక్కడే సుడులు తిరుగుతుంటాను
నా అనుమతితో నిమిత్తంలేని
హక్కులపత్రాన్ని
జేబులో పెట్టుకు తిరుగుతుంటావు
నా సంతకంతో నీకేం పని?
నేనెప్పుడూ నీకో సైన్డ్ కాపీనేగా!
నా ఉత్సాహ వసంతాలన్నీ నీవి
నీ దిగులు శిశిరాలన్నీ నావి
నువ్వు ఒక ఉదయాన్ని
వేయి వెలుగులుగా మలుచుకుంటావు
నేను ఒక రాత్రిని
వేయి చీకట్లుగా అనువదించుకుంటున్నాను
ఈ సమస్తాన్నీ
సృష్టి నాచేతికిచ్చింది
నువ్వూ నేనూ ఒకటేననుకున్నాన్నేను
నువ్వు నా సర్వస్వాన్నీ గుంజుకున్నావు
నేన్నీ సింహాసనం పక్కన విసురుతూ
నిల్చున్నాను
నువ్వు శిఖరంమీద
నిల్చున్నాననే భ్రమలో ఉన్నావు
అభద్రతగా అనుమానంగా
ఒంటరిగా భయం భయంగా
నిర్లజ్జగా నిలబడ్డావనడానికి
వణుకుతున్న నీ కాళ్ళే సాక్ష్యం!