–సమ్మర్ అవాద్
అనువాదం: మమత కొడిదెల
జీసస్ పాలెస్తీనీయుడు.
జీసస్ దేవుడు (అని వాళ్లు చెబుతారు) కాబట్టి
దేవుడు పాలెస్తీనీయుడు.
దేవుడు పాలెస్తీనీయుడు, అందువల్ల
దేవుడి తల్లి గాజాలో నివసిస్తోంది.
అక్కడ ఎందరో ఆమె లు ఉన్నారు,
ఎంత మందో ఆమె కొడుకులు ఉన్నారు, చెల్లాచెదురుగా
అల్-షిఫా ఆసుపత్రి నేల మీద సిలువ మాదిరి పడిపోయి.
ఆమె ఎత్తుకుంటుంది వేలాడుతున్న జీవంలేని అతని మాంస ఖండాల్ని.
అతని పెదవుల మీద మాయమైన రంగు,
అమ్మపాలు తాపడం మానిపించేముందే
అమ్మకు ముద్దులు పెట్టడం నేర్చుకున్న పెదవులు.
దేవుడి తల్లి ఉద్వేగంతో వెక్కిళ్లు పడుతోంది,
వాళ్ల పేర్లతోనే మనను సంబోధించే అరబ్బు తల్లితండ్రుల ధోరణిలో
ఆమె ఆక్రోశిస్తోంది. యమా, యమా, హబిబి,
ఇబ్ని షహీద్… ఆమె ఏడుస్తుంది… యమా, యమా, ఇబ్ని షహీద్!
దేవుడు తన గర్భకోశంలో పెట్టిన దానిని
ఈ మరియమ్మలు నిరాకరించగలిగేవారా,
చచ్చిపోతాడని ముందే నిర్ణయించబడ్డ పిల్లవాడిని వద్దని అనగలిగేవారా,
కన్ మక్తూబ్ మిన్ అల్-బిదయ
(ఇదంతా ముందే రాసిపెట్టి ఉంది),
అతన్ని పోగొట్టుకునే దుఃఖం ఎప్పుడో రాసిపెట్టి ఉంది.
ఇదంతా మొదలవకముందు,
తాను వరంగా పొందిన వాడిని ఆమె దేవుడికి వెనక్కిచ్చేసి ఉండేదా,
అతన్ని భూమ్మీదకి తీసుకు రావడానికి
తన శరీరాన్ని ఉపయోగించడానికి నిరాకరించి ఉండేదా?
దేవుడి తల్లి తన కొడుకు ముఖం మీద తెల్లగుడ్డను తొలగిస్తుంది
చివరిసారిగా అతని జుత్తు సవరించడానికి.
అతన్ని అల్లాకు తిరిగి అప్పగించేముందు
గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది.
దేవుడు పాలెస్తీనీయుడు,
మనందరం దేవున్ని చంపేశాం,
క్షిపణి తరువాత క్షిపణి తో పొడిచి దేవుడి ఉసురు తీశాం.
కాని, దేవుడి తల్లికి తెలుసు,
మాతృత్వపు పురాదృష్టి ఆమెది,
అతను తిరిగి లేచివస్తాడని ముందే రాసిపెట్టి ఉందని
ఆమెకు తెలుసు.
Painful