సమస్తాన్నీ నాకప్పగించి
నిశ్చింతగా నిద్రపొండి
మీ ఆకలీ ఆశల గురించీ
మీ స్వేదం మీ రెక్కల సంగతీ
మరచిపోండి
కేవలం ఐదేళ్లకోసారి
చూపుడువేలుపై వాత పెట్టుకోండి
నేను మీకోసం
స్వర్గంలాంటి గుడికడతాను
మీ కోసం కొన్ని యుద్ధాలు చేస్తాను
దేశాన్నొక పావురాన్ని చేసి
ఎగరేయాలని తపిస్తూ నేలకొరిగిన
వీరుల ముసుగులు ధరించి
ప్రతిసారీ మీ ముందుకొస్తాను
ఒకే దేశం!
ఒకే రంగు ఆకాశం నా స్వప్నం
మీ రుధిరాన్ని నాకివ్వండి
నా కలల ఆకాశాన్ని చిత్రించుకుంటాను
మీ గుండెల్ని పెకళించి ఇవ్వండి
నా కోటకు తోరణాలుగా కట్టుకుంటాను
రైతుల్లారా!కార్మికుల్లారా!
ఈ దేశపు పవిత్ర మట్టిలో
ఏ పోరాటాల్నీ విత్తకండి
ఈ దేశపు బంగారు గోడల మీద
ఏ నినాదాల్నీ రాయకండి
తలా పిడికెడు బానిసత్వాన్నిస్తాను
తృప్తిగా నిద్రపొండి!