సంతోషంగా వుండే కుటుంబాలన్నీ ఒకేలా ఉంటాయి. సంతోషంగాలేని కుటుంబాల కథలువేటికవే — అంటాడు టాల్ స్టాయ్.
ఇది ఏ సందర్భంలో అన్నాడో తెలీదు కానీ ఒక చోట పనిచేసే కథలన్నీ ఒకేలా ఉంటాయి. వాళ్ళు కొంచెం దిగువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నట్టయితే వీళ్ళ కథలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటాయి.
వీళ్ళ కథలు బయటకు రావు. ఎందుకంటే ఎవరూ రాయరు. మధ్యతరగతి జీవితాల్లోని రకరకాల కోణాలు రకరకాల లేయర్ల గురించి వస్తున్నంతగా సమాజంలోని దిగువ పొరల్లోని ప్రజల జీవితాల గురించి, వాళ్ళ వ్యథల గురించి, వాళ్ళ దైనందిన యుద్ధాల గురించి, వాళ్ళ చిన్న చిన్న సంతోషాల గురించి, వాళ్ళు ఎదుర్కొన్న అడ్డంకుల గురించి ప్రధాన స్రవంతి సాహిత్యంలో మనకి ఎక్కువగా కనిపించదు.
బతకడానికి ప్రతిరోజూ చేసే పోరాటంలో వాళ్ళు సాధించే చిన్నచిన్న విజయాలు, ఓటములు, నేర్చుకున్న పాఠాలు, పెరిగిన వాళ్ళ ఆలోచన స్థాయి, పనిచేసే చోట జరిగే వ్యవస్థీకృత హింస, అవమానాలు — ఇవి ప్రధాన స్రవంతి సాహిత్యంలోకి రావాల్సినంత రాలేదు.
ఇవి రికార్డు కాకపోతే వాళ్ళ జీవితాలు, సంఘర్షణ చరిత్రలోకి ఎక్కవు. వీళ్ళు ఎక్కడో ‘ఫ్రింజ్’లో వున్నవారు కాదు. మన చుట్టూ వున్నమెజారిటీ ప్రజలు వాళ్ళు. వీళ్ల శ్రమలోని అదనపు విలువ పునాదుల మీద నిర్మితమవుతున్న అభివృద్ధి హర్మ్యాలకు వీళ్ళ చరిత్ర గురించిన ఆసక్తి ఏమి ఉంటుంది?
వీళ్ళ చరిత్రని నిక్షిప్తపరిచే ప్రయత్నం జరగలేదని కాదు. ఆ మనుషుల మీద, ఆ చరిత్ర మీద ఆసక్తి వున్న వాళ్ళు రాస్తునే వున్నారు. ‘ఒంటరిగా లేం మనం’ అని ఒకరికొకరు చెప్పుకోడానికి, ధైర్యం చెప్పుకోడానికి, కష్టాలు కలబోసుకోడానికి, విజయాలను, పోరాటాలను కొందరు సాహిత్యంలోకి తీసుకువస్తూనే వున్నారు.
అలా చరిత్ర రికార్డయిన కథ ‘ఒంటరిగా లేం మనం’. ఈకథ రాసింది బి. అనురాధ. ఈ కథానేపథ్యం ఇరవై ఏళ్ల నాటిది. హైదరాబాద్ లో జెనెరిక్ మందుల కంపెనీలు కుక్కగొడుగుల్లా మొలుస్తున్నరోజులు. అలాటి ఒకానొక కంపెనీలో పనిచేసే మహిళా కార్మికుల కథ ఇది. కనీస సౌకర్యాలు లేకుండా, ఎలాటి రక్షణా లేకుండా, ఎలాటి ఉద్యోగభద్రతా లేకుండా వున్న చోట పనిచేస్తున్న కోట్లమంది కార్మికులకు ప్రాతినిధ్యం వహించే పాత్రలు — లక్ష్మి, వసంత, సుజాత, జ్యోతి, కమల, సీత, ఇంకా అలాటి కొన్ని వందలమంది కార్మికులు.
వ్యక్తిగతంగా ఒక్కొక్కరూ సెక్యూరిటీ వాళ్ళ, పెర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళ, వాళ్ళ కింద గూండాల వల్ల ఇబ్బందులు పడుతున్నవాళ్ళే, అవమానాలు పడుతున్నవాళ్ళే, ఉద్యోగాలు కోల్పోతున్నవాళ్ళే. బాత్ రూముల దగ్గర అవమానాలు పడితే, తక్కువ రకం రసాయనాల వల్ల ప్రమాదాల పాలైతే, ప్రశ్నించినందుకు ఉద్యోగాలు కోల్పేతే — మౌనంగా తలవంచుకు వెళ్లిపోయేవాళ్లే.
— కానీ వీళ్ళందరూ ఎలా కలుస్తారు? ఎక్కడెక్కడో పుట్టిన వీళ్ళని కలిపి నిలపగలిగే సూత్రమేమిటి?
ఇన్నివందలమంది ఇక్కడ కలవడం కాకతాళీయమా?
విప్లవకవి జ్వాలాముఖి అన్నారొకసారి — “మనుషులు అనుకోకుండా కలుసుకోవడం ఉండదు ఒకానొక రాజకీయ, ఆర్ధిక, సామాజిక సందర్భంలో కలుసుకుంటారు మనుషులు,” అని.
కలుసుకున్నారు, సరే.
ఒకేలాంటి జీవితాలు, ఒకేలాంటి ఉద్యోగాలు, ఒకేలాంటి వెతలు పడుతున్న వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరికి వారు మాత్రమే. ఒకరి బాధలకి, ఒకరి కష్టాలకి మరొకరు సహానుభూతి పొందడం, ఓదార్చుకోవడం, ప్రశ్నించడం కూడా ఒక్కొక్కరూ తప్ప — కలిసి ప్రశ్నించడమన్న ఆలోచన రాలేదు వాళ్ళకి. అలాటి ఆలోచనకు అవసరమైన చైతన్యం లేకపోవడం వల్ల వాళ్లకి అంతకంటే దారి తెలియలేదు.
జ్యోతికి ఆ దారి తెలిసిన నారాయణ తెలుసు.
నారాయణకు తెలుసు పరిష్కారం వాళ్ళ చేతుల్లోనే ఉందని. వాళ్ళు పూనుకుంటేనే తప్ప జరగదని.
అందుకే వాళ్లకి చెప్తాడు యూనియన్ పెట్టమని. అది అంత సులభమైన పని కాదని వాళ్లకి తొందర్లోనే తెలుస్తుంది. కానీ ప్రయత్నం ఆపకుండా యూనియన్ పెడతారు. హింసని ఎదుర్కుంటారు. ఉద్యమాన్ని అమ్ముకునే నాయకుల కుట్రల్ని తెలుసుకుంటారు. లాఠీ చార్జీలు, కేసులనెదుర్కుంటారు.
కానీ మళ్ళీ పోరాటాన్ని కొనసాగిద్దామనే నిర్ణయించుకుంటారు.
ఫ్యాక్టరీ దగ్గరకు వస్తుంటే, వాళ్లకి దగ్గర్లోనే వున్న బిస్కట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు చేసిన నినాదాలు వినిపిస్తాయి.
ఆ ప్రాంతంలో జరిగిన మొట్టమొదటి సమ్మె రగిలించిన స్ఫూర్తితో మొదలైన మరో పోరాటాన్ని చూసి వాళ్ళు సంతోషిస్తారు.
ఇదీ ‘ఒంటరిగా లేం మనం’ కథ.
బహుశా అక్కడి మహిళా కార్మికులు చెప్పినది విని అను రాసి ఉంటుంది. తను రాసి ఉండకపోతే ఎక్కడో మారుమూల పారిశ్రామిక వాడలో జరిగిన ఈ పోరాటం, చరిత్ర గాలిలో కలిసిపోయి ఉంటుంది.
కథనం కూడా సాదాగా, సరళంగా, కళ్ళముందు జరుగుతున్నట్టుగా, ఒక దృశ్యం నుంచి మరో దృశ్యంలోకి లాజికల్ గా evolve అవుతుంది. అవసరంలేని విశేషణాలు, అలవాటైపోయిన సంభాషణలతో నింపెయ్యకుండా రాసింది.
ఇది ఇరవై ఏళ్ల క్రితంనాటి పోరాటాన్ని పట్టుకున్న కథ.
ఇరవై ఏళ్ల తర్వాత ఫ్యాక్టరీల్లో జరుగుతున్న ఘర్షణల గురించి, పోరాటాల గురించి, అవి సాధించిన జయాపజయాల గురించి — జరుగుతున్న చరిత్రల గురించి రాసుకోవాల్సిన అవసరం వుంది.
విశ్లేషణ బావుంది. “ఇరవై ఏళ్ల తర్వాత ఫ్యాక్టరీల్లో జరుగుతున్న ఘర్షణల గురించి, పోరాటాల గురించి, అవి సాధించిన జయాపజయాల గురించి — జరుగుతున్న చరిత్రల గురించి రాసుకోవాల్సిన అవసరం వుంది.” నిజమే
కొలిమిలో ఒక వ్యాసం కోసం వెతుక్కుంటుంటే అనుకోకుండా ఇది కనిపించింది. ఒక ప్లెజెంట్ షాక్. ఎందుకంటే ఇది నా మొదటి కథ. ఇది ఇలా 20 యేళ్ళ తరవాత….. కాదు కాదు (కూర్మనాథ్ గారు రాసే నాటికి) అక్షరాలా 27 యేళ్ళ నాటి కథ గురించి ఇలా చదువుకోడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. నేను ఎలా మిస్ అయ్యాను అని ఆలోచిస్తూ తేదీ చూసాకా గుర్తుకొచ్చింది. ఆ సమయానికి నేను నామీద మోపబడిన మూడు అక్రమ కేసుల వల్ల చంచలగూడా మహిళా జైలులో ఉన్నాను. ఒక యేడాది కాలంలో వచ్చిన ఎన్నో రచనలతో పాటు ఇది కూడా మిస్ అయ్యాను. జైలుకి వెళ్లడానికి పెద్ద కారణం ఏం లేదు. బుర్రలో ఉన్న కొన్ని ఆలోచనలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలనుకోవడం. మేము మాట్లాడి ఏం చెప్పాలనుకుంటున్నామో వినే ఓపిక కూడా లేదు పాపం వాళ్ళకి.
ఆ కథ నిజంగా అరిస్టో కార్మిక మహిళలను కలిసి వాళ్ళతో పాటు సమ్మెకు మద్ధతుగా ఆ శిబిరంలో కూర్చుని వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఒక వ్యాసం రాసి “కార్మిక పథం” పత్రికకి పంపేసాకా “మహిళా మార్గం పత్రిక సంపాదక వర్గం నేను ఆ పత్రికలో కూడా (మహిళా పత్రిక అయినందుకు కూడా) వాళ్ళ పోరాటాన్ని ఏదో విధంగా రికార్డు చేయకపోతే చరిత్ర మమ్మల్ని క్షమించదు” అని గట్టిగా చెప్తే అలా రికార్డు చేయడం తప్ప మరేమీ చేయలేకపోతున్నందుకు బోలెడంత వ్యథతో తో కథ రాసే ప్రయత్నం చేశాను. అందులోని ఏ పాత్రా కల్పన కాదు. ఆ పోరాటాన్ని, వాళ్ళ జీవితాల్ని దృశ్యాలుగా చిత్రీకరించడమే నేను చేసిన పని. ఆ రకంగా నన్ను రచయితను చేసింది ఆ మహిళా కార్మికులు, మహిళామార్గం పత్రిక. మరోసారి అలా గుర్తుచేసుకొనే అవకాశం ఇచ్చినందుకు కూర్మనాథ్ గారికి ఒక ఆత్మీయ కరచాలనం.
అనూరాధ.