ఒంటరి

ఏడుపు.

ఒక్కటేపనిగా. ఏకధాటిగా. ఆపకుండా. ఆగకుండా. మనసులో ఉన్న కసినంతటినీ బయటపెట్టేవిధంగా. చెవులను తూట్లు పొడిచేలాగా. ‘ఎందుకిలా? ఏమైయుంటుంది?’ ఆలోచిస్తూనే ఫ్రిడ్జులోంచి పాలు తీసి కప్పులో పోసి మైక్రోవేవ్లో ముప్పైసెకండ్లపాటు వేడిచేసింది.

లివింగ్ రూంలోంచి కిచెన్లోకి భీకరంగా వినిపిస్తోందా ఏడుపు. ఒక్కసారిగా కళ్లముందున్నవన్నీ అస్పష్టంగా కనిపించాయి. గుండెల్లో గాబరా. సంజు ఇలా ఎప్పుడూ ఏడవలేదు. తనముందు బాగానే ఉంటున్నాడు. తను ఎదురుగా లేని మరునిముషంలో ఏడ్చేస్తున్నాడు. తల్లి కడుపుతో వుంటే పిల్లలు పెంకిగా మారతారట ఎక్కడో విన్నట్టు గుర్తు. అది వీడు నిజమని నిరూపిస్తున్నాడులా ఉంది. అనుకోకుండా ఆమె చేయి నిండుకుండలాంటి పొట్టమీదకెళ్లింది.

గోరువెచ్చటి పాలలో ప్రోటీనెక్స్ కలిపి మరో కప్పులోకి ఫిల్టర్ చేసింది. జాగ్రత్తగా నడుస్తూ లివింగ్ రూముకి వచ్చింది. అమ్మని చూడగానే మరింత గింజుకుంటున్నాడు. సంజుని అతి కష్టంమీద ఆపుతోంది యాభైఏళ్ల రంగమ్మ. ‘ఆగుబిడ్డా… అమ్మదగ్గరకు ఉరకకు…’ సముదాయిస్తోంది.

“పుట్టింటోళ్లను పిల్వకుంటివా తల్లి. బాబును జర చూస్కుంటరు గదమ్మా. మీరు గింత రెస్టుదీసుకోవచ్చు. నెలలు నిండవట్టె. బాబును జూస్తె మొండికి తిరిగిండు. ఏడ్చి ఏడ్చి గుండెబగుల్తదమ్మా. మనుషులకు పట్టువిడుపులుండాలె.” యాభైఏళ్ల రంగమ్మ కావాల్సినంత లిబర్టీ తీసుకుని ఫ్రీగా సలహా పారేసింది.

మాట్లాడలేకపోయింది గాయిత్రి. ఏం చెప్పుకుంటుంది పనిమనిషితో. ఆమెకు చెప్తే మొత్తం అపార్ట్మెంట్కు చెప్పినట్టే. ఏంచేయాలో తెలియట్లేదు. కొద్ది రోజుల్లో తన డెలివరీ. ఆడుతూపాడుతూ చలాకీగా ఉండేవాడు. ఏమైందో ఏంటో ఈ మధ్య మరీ పెంకిగా మారాడు. తను కళ్లముందు కనబడకపోతే చాలు గుక్కతిప్పుకోనంతగా ఏడుపు.

ఆలోచనల్లో మునిగిపోయిన గాయిత్రిని చూసి మళ్లీ అందుకుంది “అయినా మీ డబ్బున్నోళ్ల తీరు ఖతర్నాక్ ఉంటదమ్మా. అత్తలేదు అమ్మలేదు. నెలలు నిండుతున్న బిడ్డను పనోళ్లకొదిలేసి కురసత్ గూర్చుంటరు. కట్టుకున్నోడుగూడ నోట్లకట్టలు సంపాయించనీకే జూస్తడు. పెండ్లాం కడుపుతోటుందో, సిన్నబిడ్డతల్లో అనిగూడా సూడరు. మావోళ్లకు ఈ నాయం తెల్దు తల్లీ. తిడతారో కొడతారో గానీ సూస్కుంటరు. గిట్ల వదిలేయరమ్మా ఆడబిడ్డలను” తనకుతోచినట్టు కంక్లూడ్ చేసి పనిలో పడింది.

మౌనంగా సంజును దగ్గరికి తీసుకుంది గాయిత్రి. అమ్మ దగ్గర గువ్వలా ఒదిగిపోయాడు సంజు. మెల్లిగా పాలు తాగిస్తోంది. పనిమనిషి మాటలు మెదడుపై డ్రగ్లా పనిచేస్తున్నాయి. అసంకల్పితంగా ఫోన్ కలిపింది.

“అమ్మా… నా డెలివరీ డేట్ దగ్గరపడుతోంది. నువ్వు ఇంటికి రాగలవా? నువ్వు ఏ పనీ చేయనక్కర్లేదు. హాస్పిటల్కి కూడా రానక్కర్లేదు. ఇంట్లో ఉండు చాలు. రెండో డెలివరీ కదా. నా దిగులంతా సంజూ మీదే. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యేదాకా ఉండమ్మా. ప్లీజ్” గడగడా అప్పజెప్పినట్టుగా మాట్లాడేసి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఆగింది గాయిత్రి.

“నాకెక్కడ కుదురుతుందే ఈ పురుళ్లూ పుణ్యాలూ. నన్ను కాదని కట్టుకున్నావు కదా. ఇక నీ ఇంటికి నేనెలా వస్తాను. మన ఆచారాలూ సంప్రదాయాలూ కాదని ఎప్పుడైతే వాడిని… ఇప్పుడవన్నీ ఎందుకులేమ్మా. నువ్వు సంతోషంగా పండుగలూ పబ్బాలూ జరుపుకో. సంబరంగా ఉండు.” సాధ్యమైనంత నిదానంగా స్థిరంగా అంది గాయిత్రి తల్లి.

“సరే నువ్వు రాకపోతే నాన్ననైనా పంపొచ్చు కదమ్మా” తల్లి సమాధానాన్ని ముందే ఊహించిన గాయిత్రి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించింది.

“మీ నాన్నా, ఆయనకేం తెలుసు తల్లీ మంచీచెడ్డలు. పిచ్చిమాలోకం. మమ్మల్నిలా వదిలేయమ్మా. మీ తాహతుకు తగ్గ పెట్టుపోతలూ పెట్టలేం. మీ దగ్గరకొచ్చి చిన్నబుచ్చుకోలేం” ఉంటాను.

బీప్…. బీప్… బీప్….

ఫోన్ కట్ చేసిన శబ్దం

గాయిత్రి కనువంపుల్లో నీరు వెచ్చగా బుగ్గలను తాకింది. వాళ్లు రారు. తనకు తెలుసు. మొదటి కాన్పుకూ రాలేదు. తెలిసికూడా ఎందుకు బతిమిలాడింది. నిజాన్ని గ్రహించలేకపోతోంది ఎందుకు. బాధతోమెదడు అచేతనంగా మారిపోయింది గాయిత్రికి.


** ** ** **

“గాయిత్రీ, కొంచెం పర్సనల్ విషయం మాట్లాడుతున్తాను. ఏమీ అనుకోవుకదా” ఏదో రహస్యం చెబుతున్నట్టుగా దగ్గరగా వచ్చి మాట్లాడుతోంది పక్కింటి బామ్మ.

మొహమాటంగా నవ్వింది గాయిత్రి.

“నీకేమో నెలలు నిండుతున్నాయి. ఒంటరిగా ఉన్నావు. ఎవరూలేరా నీకు.” ప్రశ్నించింది.

“లేదాంటీ మాది లవ్ మ్యారేజీ. అది మా వాళ్లకు ఇష్టం లేదు. అందుకే ఎవరూ రారు”

“అలా చెప్పకమ్మాయ్. నాకైతే చెప్పావ్ కానీ ఇంకెవ్వరి దగ్గరా ఆ ఊసే ఎత్తకు. చిన్నచూపు చూస్తారు. ఎవ్వరూ లేనమ్మ అంటే మొగుడికి కూడా అలుసే. నేను చూడు ఏకాకిని. అయినా ప్రతి పండగకూ పనిమనిషినీ డ్రైవరునూ వెంటబెట్టుకుని తెలిసిన వాళ్లందరికీ స్వీట్లు పంచుతా. వేసవిలో బుట్టలకొద్దీ మామిడి పండ్లు పంచుతా. వాళ్లు మాట్లాడకపోయినా సరే నేనే వాళ్లింటికి వెళ్లి ఓ అరగంట కబుర్లాడి వస్తాను. ఎందుకనుకున్నావ్. నేను ఒంటరిని కాదని అందరికీ తెలియడానికి. నాకూ ఓ బలగం ఉందని సమాజానికి చెప్పడానికి. అదే మనకు రక్ష.లేకపోతే పనివాళ్లకు కూడా మనం లోకువైపోతాం. సంబంధాలు ఊరికే రావు గాయిత్రీ మనమే ఏర్పరచుకోవాలి. ఇష్టం లేకపోయినా అలవాటు చేసుకో. తప్పదు. పెద్దదాన్ని కదా చూస్తూ ఉండలేక చెప్పానమ్మా. ఆలోచించు నువ్వే. ఇక ఉంటాను. నువ్వు రెస్టు తీసుకో.” నెమ్మదిగా అక్కడినుంచి బయలుదేరింది బామ్మ.

గాయిత్రి మౌనంగా తలూపింది. బలగం కోసం నటించాలా? నటించకపోతే బతకలేమా? అసలు ఎవ్వరూ లేకపోతే బతుకేలేదా? ఎందుకీ నటన? ఎవరి మెప్పుకోసం చుక్కల్లా పుట్టుకొస్తున్నాయి ప్రశ్నలు?

గాయిత్రి దృష్టి ఎదురుగా టీపాయ్ పై ఉన్న ఫ్లవర్వేజ్ పై నిలిచిపోయింది. పక్కనే ఉన్న కిటికీలోంచి వస్తున్న గాలికి నెమ్మదిగా ఊగుతున్నాయి అందులోని రంగురంగుల పూలు. అవి సహజమైనవి కాదు. ఆ విషయం వాటిని తాకితేగానీ తెలుసుకోలేరు. ఇంటికొచ్చే ప్రతిఒక్కరూ ఆ పూలని తాకుతూ వాటి సహజత్వాన్ని పరిశీలించడానికి చూపించే ఉత్సుకత తనమీద అస్సలు చూపించరు. తను ఆనందంగా ఉందో లేదో అని ఎవ్వరూ ఆలోచించరు. కనీసం ఎలా ఉన్నావనికూడా అడగరు. అసలు ఈ ఆనందాన్ని ఎలా కొలుస్తారు? కళ్లలోకి చూస్తే తెలుస్తుందా? లేదు. కళ్లలోతుల్లోకి తొంగిచూడగలగాలి. అప్పుడే కదా గుండెల్లో బాధ తెలిసేది. అందరూ తన ఐశ్వర్యం చూసి ఆనందాన్ని లెక్కకట్టేవారే కానీ ఎవరైనా కనుకొలనుల్లో దాచిన తడిని చూసే ప్రయత్నం చేశారా. మనీ ప్లాంట్లా అల్లుకుపోతున్న ఆలోచనలు భువిక్ రాకతో తాత్కాలికంగా సర్ధుకుపోయాయి.

“నేను రేపు సాయంత్రం సింగపూర్ బయల్దేరుతున్నాను. రావడానికి టూవీక్స్ పట్టొచ్చు” సోఫామీద కూర్చుని షూలేసు లూజ్ చేస్తూ చాలా క్యాజువల్ గా అన్నాడు ఏ ఉపోద్ఘాతమూ లేకుండా.

“నాకు ఎనిమిదో నెల కదా. ఇప్పుడెందుకు ఫారెన్ ట్రిప్స్. డెలివరీ తర్వాత వెళ్లొచ్చు కదా.”

గాయిత్రి అలా ఎదురుచెప్పడం, ఉచిత సలహా ఇవ్వడం భువిక్ కు నచ్చలేదు.

“వెళ్లక నీ చుట్టూ తిరగమంటావా. సెన్సుందా నీకు. నాకో బిజినెస్ ఉంది తల్లీ, నా పని నేను చేసుకోవాలి. అన్నీ మానుకుని ఇంట్లో ఉండి నీకు కాపలా ఉండాలా ఏంటి.” పనివాళ్లున్నారన్న ఆలోచనకూడా లేకుండా పెద్ద గొంతుకలో భర్త అలా మాట్లాడే సరికి అవమానంగా అనిపించింది గాయిత్రికి.

స్వతహాగా సున్నిత మనస్కురాలైన గాయిత్రికి కన్నీరు ఉబికి వచ్చేసింది. పనిమనుషులు గుసగుస మాట్లాడుకోవడం ఆమె మసకబారుతున్న చూపును దాటిపోలేదు.

“ఒకవేళ నాకేదైనా యమర్జెన్సీ అయితే…” గొంతులో జీర.

“డ్రైవర్ ఇరవైనాలుగ్గంటలూ ఇక్కడే ఉంటాడు. తీసుకెళ్తాడు. అయినా ఇది మనకో డిఫరెంట్ ఎక్పీరియన్స్. జీవితమన్న తర్వాత అన్నింటినీ ఫేస్ చేయగలిగి ఉండాలి.”

ఏం మాట్లాడాలో అర్థంకాక అలా చూస్తుండిపోయింది గాయిత్రి. చకచకా నడుస్తూ వెళ్లిపోయాడు భువిక్. తను భోజనం ముగించి బెడ్రూంకి వచ్చేసరికి భువిక్ ఘాడ నిద్రలో ఉన్నట్టుగా అతని గురక ఆమె చెవులకు తాకింది. ఇవేమీ తెలియని నాలుగేళ్ల సంజు అమాయకంగా నిద్రపోతున్నాడు. అప్రయత్నంగా ఓ వేడి నిట్టూర్పు. దానిలోని సన్నటిసెగ బడబాగ్నిలా మారి ఆమెను దహిస్తోంది.

నిద్రపట్టేలా లేదు. బాబు పక్కనే కూర్చుని నిస్సహాయంగా భర్తవైపు చూస్తుండిపోయింది గాయిత్రి.

నిస్సహాయత. భర్తకు నచ్చదు. తనలా చీటికీమాటికీ ఏడ్చే ఆడాళ్లంటే అతనికి అసహ్యం. కంపరం. అందికే గాయిత్రి కన్నీరు చూసి కరిగిపోడు. కనీసం ఓదార్చాలనికూడా అనిపించదు. ఒకప్పుడు గాయిత్రి చలాకీతనానికి అబ్బురపడి పెళ్లిపీటలపైకి నడిపించిన మగాడు ఇప్పుడు ఆమెను ప్రతి ఒక్క కోణం నుంచీ తనకన్నా తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

భువిక్ కోసం చేస్తున్న ఉద్యోగం వదిలి ఇంటిపట్టునే ఉంటోంది గాయిత్రి. మొదట్లో ఆకాశానికెత్తినా నెమ్మదిగా గాయిత్రి అంటే చులకనభావం పెరిగిపోయింది. ఇంట్లోనే ఉండే ఆడాళ్లకు పెద్దగా చెప్పుకోవడానికేమీ ఉండవనీ అవి అంత వినాల్సిన పెద్ద విషయాలు అయివుండవనీ అతని నమ్మకం. అందుకే గాయిత్రికి మాట్లాడే చాన్సే ఇవ్వడు.

ఎవరికి చెప్పుకోవాలి.

మొదట్లో అమ్మకి ఫోన్ చేసేది. ఆవిడ విన్నంత విని ‘ఇలాంటివన్నీ నీవు చెబితేనే తెలుస్తాయే. లేచిపోయినవాళ్ల గురించి టీవీల్లో చూస్తాం. ఆ అన్నట్టు చెప్పడం మరిచా నిన్న ఒక సినిమా వచ్చిందే. దాంట్లో కూడా ఆ పిల్ల లేచిపోయి పెళ్లి చేసుకుంటది. నువ్వే గుర్తిచ్చినావు. ప్రతి సీన్లో ఓహో నా బిడ్డకూడా ఇలాగే ఆలోచించి ఉంటదా అనుకుంటూ కూర్చున్నానమ్మా. నాకు తెలీవు కదా ఇవన్నీ. నీతోనే అనుభవం నాకు. ఇప్పుడు చెప్పు. ఏమంటాడు అతను. మేమేదో గుట్టుగా బతినోళ్లంమమ్మా ఏం సలహా ఇవ్వాలో కూడా నాకు తెలీదు. నువ్వు చెప్తే వింటా. నువ్వు చెప్తా ఉంటు. కనీసం నీకు చెప్పుకునే దిక్కయినా ఉండాలి కదా.’ అనేది.

నెమ్మదిగా తల్లితో మాటలు తగ్గిపోయాయి. కాలం గడిచే కొద్దీ స్నేహితులు తగ్గిపోయారు.మాట్లాడేవారే కరువయ్యారు. పనిమనుషులు నాలుగుగోడలు ఇదే గాయిత్రి జీవితం. అదేవిషయం ఓ సారి భర్తతో చెప్పింది. ఏ మూడ్ లో ఉన్నాడో గానీ వెంటనే స్పందించాడు భువిక్.

“దీనికే ఇంతగా ఆలోచిస్తావెందుకు. నేనున్నాను కదా. అన్ని విషయాలూ నాతో చెప్పు” భరోసా ఇవ్వనైతే ఇచ్చాడుగానీ నిలుపుకోలేకపోయాడు.

భయాలు బయటపెట్టింది. బలహీనురాలివి అన్నాడు. అనుమానాలు వ్యక్తం చేసింది. అస్థిత్వాన్ని ప్రశ్నించాడు. ఎందుకిలా అనడిగింది. పరిధులు దాటావన్నాడు. వద్దనుకుంటూనే కొన్నిసార్లు తన మనసు విప్పేది. మెల్లగా అతనికి చిరాకు మొదలైంది. గాయిత్రిని చూస్తేనే విసుగొచ్చేది. ఎంత విసుగంటే ఇక ఇంటికి వస్తే అసలు గాయిత్రి ముఖంకూడా చూడకుండా చకచకా పనులు ముగించి బెడ్రూంలో దూరి వెంటనే గురకపెట్టేంత విసుగు.

కొన్ని రోజుల తర్వాత

“గాయిత్రీ కొంచెం డబ్బు కావాలి సర్ధుబాటు చేస్తావా” అడుగుతున్నాడు నాన్న.

మౌనంగా ఉండిపోయింది గాయిత్రి. గతం కళ్లముందు కొచ్చినట్టుగా అనిపించింది.

“ఉన్నావామ్మా. హలో…హలో…”

“సరే నాన్న పంపిస్తాను”

“సరేమ్మా మళ్లీ ఫోన్ చేస్తాను”

ఫోన్ పెట్టేయబోయింది గాయిత్రి ఏవో మాటలు వినిపించినట్టుగా అనిపించి ఆగిపోయింది.

“దాన్ని వెలివేసినట్టుగా చూస్తావు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడగాలే. నువ్వే అడుక్కో నన్ను చంపకు” విసుగ్గా అంటున్నాడు నాన్న బహుశా ఫోన్ కట్ చేయడం మర్చిపోయినట్టున్నాడు.

“అది కాదనదు. ఇవ్వాల్సిందే. ఇవ్వక ఏం చేస్తుంది. మనం థూ అన్నా ఛీదరించుకున్నా మనదగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే దానికి మనమే గతి. బాధను పంచుకునే దిక్కుకూడా లేదు దానికి” హితభోద చేస్తోంది అమ్మ.

గుండెల్లో సూదిలాంటి ముల్లేదో గుచ్చుకున్నట్టనిపించింది గాయిత్రికి. ఇనుపతీగను వేలాడదీసి, ఒకవైపు బరువు పెంచుతూపోతే ఏదో సమయంలో అది మెత్తగా సాగి శబ్ధం లేకుండా తెగిపోతుందిట. ఎప్పుడో నేర్చుకున్న ఫిజిక్సు పాఠం గుర్తొచ్చింది. ఫోన్ పక్కనపడేసింది. ఆ రాత్రి ఎంతో ప్రశాంతంగా నిద్రపోయింది గాయిత్రి.

ఉదయాన్నే ఇంటికి ఫోను కలిపింది.

“నాన్నా మీరగిన మొత్తం బ్యాంక్ అకౌంటుకు పంపాను. మీరే దిక్కనీ మీరు మాట్లాడకపోతే నాకు ఉనికే లేదని మాత్రం కాదు. నాలో మంచితనం ఇంకా బతికుందని నిరూపించడానికి. సెలవ్.”

తర్వాత,

భర్తకు కావల్సిన పదార్థాలన్నీ వంటమనిషితో దగ్గరుండి చేయించింది. ఎప్పటిలాగే అతను చకచకా భోజనం చేస్తున్నాడు. గాయిత్రి వడ్డిస్తోంది.

“నేను రేపు మార్నింగ్…” ఏదో చెప్పబోయాడు భువిక్

“భువిక్… పెళ్లికిముందు నువ్విలాగే నాతో ప్రవర్తించి ఉంటే ప్రేమించడం కాదు కదా కనీసం నీ వంకైనా చూసేదాన్ని కాదు. పెళ్లైన తర్వాత నీ బాధ్యతలు రెట్టింపయి ఉండొచ్చు. అంగీకరిస్తాను. నీ సమయం నాకు ఇవ్వలేకపోవచ్చు. అర్థం చేసుకుంటాను. బాబును పట్టించుకోకపోవచ్చు. సర్ధుకుపోతాను. కానీ ప్రతిసారీ అధికారిక ప్రకటనలు ఇస్తూ నా ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా మన కాపురంలో హెచ్చుతగ్గలు సృష్టించకు. నీ మాటల్లో డామినేషన్ భరించలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను.” సాధ్యమైనంత మృదువుగా చెప్పి అక్కడినుంచి కదిలింది.

ఆమె నడకలో స్థిరత్వం భువిక్ కి కొత్తగా అనిపించింది. వెన్నులో పుట్టిన అలజడి అపనమ్మకంగా తోచింది.

కథా రచయిత, జర్నలిస్టు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో జర్నలిజం పాఠాలు చదివాను. ఇరవయ్యేళ్ల వయసులో ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో చేరి, ఆ పత్రిక ఫీచర్స్ డెస్కులో సబెడిటర్ గా కెరీర్ ప్రారంభించారు. సండే మ్యాగజైన్ ‘స్నేహ’ లో క్యాంపస్ ఛాట్ శీర్షిక నిర్వహించారు. టీవీ9లో కొంతకాలం పనిచేశారు. పెళ్లయ్యాక సాప్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టారు. మళ్లీ సాహిత్యాభిలాషతో కథలురాయడం ప్రారంభించారు. మొదటి కథ ‘గాజుబొమ్మ’ విహంగ పత్రికలో ప్రచురితమైంది. పెళ్లి పేరుతో స్త్రీలపై జరిగే హింసను వివరించే ‘విముక్తి’, ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొనే వివక్షను చూపే ‘ఓ శిరీష్ కథ’ విహంగలోనే పబ్లిషయ్యాయి. స్త్రీలపై, హిజ్రాలపై జరుగుతున్న హింస, వివక్షలపై సమాజంలో అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

Leave a Reply