ఏమప్పా

ఏమప్పా
ఎవరో విదేశీయుడు ప్రాణం పోసి
ఊరేగిస్తేగానీ
నిన్ను గుర్తించలేకపోయాం

మా గడప ముందు నిత్యం
పచ్చతోరణమై వేలాడినవాడివి
నా రూపు చూడండి
నాలోని కళాత్మక ప్రాణం చూడండీ
అని నువ్వెంత మొత్తుకున్నా
నీ మాటెపుడైనా వినిపించుకున్నామా
నీ ఇంటిదాకా పరుగెత్తుకొచ్చామా
నీ హృదయ సౌందర్యాన్ని తెలివిగా
ఆస్వాదించగలిగామా
నువ్వు ప్రేమగా కుట్టించుకున్న
రాతి బొమ్మల చొక్కాను
తదేకంగా చూడగలిగామా
నీ వొళ్లంతా ప్రేమగా తడమగలిగామా

నీలో ఏ దైవం కొలువున్నా లేకపోయినా
శ్రమకారుడి చెమట‌నెత్తురూ
ప్రతిభా వ్యుత్పత్తుల ప్రాణ చమురే
నీకు ప్రాణం పోసి నిలబెట్టాయని
ఈ దేశ కళాత్మక వారసత్వ సంపదగా
ప్రపంచం గర్వించే స్థాయికి నువ్వెదిగి
ఆకాశం సిగలో కీర్తి గోపురమై
సగర్వంగా నిలబడగలిగావనీ
ఇన్నాళ్లకు గ్రహించాము

నువ్వు నీటి మీద తేలే ఇటుకల దేహానివై
ఇవాళ ప్రపంచం‌ నోటి మీద పూసిన
కీర్తి పుష్పానివై పరిమళిస్తున్నావు చూడూ
అది కదా మమ్మల్ని గర్వంగా నిలబెట్టి
ఆకాశదీపంలా‌ రెప రెప లాడిస్తున్నది

ఏదేమైనా రామప్పా
నివురు గప్పిన నిప్పులా
నా దేశమంతా పరుచుకున్న
సకల కళాత్మక సంపదలన్నిటినీ
నాదేశమే గుర్తించి గుండెలకత్తుకుని
ప్రపంచం దృష్డిని మళ్లించి
కన్నీటిపై తేలుతున్న విడివిడి ఇటుకల్లాంటి
కళలనూ కళాకారులనూ సమీకరించి
అందరూ మెచ్చే ఒక బతుకు నిర్మాణం చేపట్టి
గుండె గుడిలో దైవంగా నిలుపుకోగలిగే విశాలత్వం గుడిమీద పావురాల్లా ఎగరాలి

ఎవరో గుర్తించేదాకా ఎందుకు
జీవం ఉట్టిపడే ఒక కళనీ, కళాకారుణ్ని
ప్రపంచానికి పరిచయం చేసే
విశాల కళాత్మక హృదయమొకటి
నా దేశమంతా
వారసత్వ సంపదగా మొలకెత్తాలి
ఇంకా వెలుగులోకి రాని ఎందరో
రామప్పలూ రాళ్లూ రప్పలూ
ఎన్నటికీ వాడని కీర్తి పుష్పాలై
ప్రపంచమంతా విరబూయాలి!

పూర్వపు నల్లగొండ జిల్లా. కవి, కథకుడు, విమర్శకుడు. అధ్యాపకుడు. రచనలు: మా నాయిన (2006), నల్ల చామంతి (2017), వెలుతురు మొలకలు(2019) కవితా సంకలనాలు ప్రచురించారు.

Leave a Reply