ఏది దిగులు? ఏదిదుఃఖం?

తెగనరికిన అమెజాన్ లో
సీతాకోక రెక్కల చప్పుడు
ఇక వినపడక
భీతిల్లిన కోకిల కీచు అరుపు

గడ్డకట్టించే చలికాలం మధ్యలో
ఓ రెండు రోజులు వసంతాన్ని
ఎర చూపింది గ్లోబల్ వార్మింగ్
అకాలంగా వచ్చేసిన వెచ్చని ఉదయాన
నిద్రతీరక తడబడు అడుగులతో రోడ్డెక్కి
కళేబరమైంది ఎలుగుపిల్ల

మోసపోయి పూలు చివురించిన చెట్లను
కొరుక్కుతిన్నది
ఆరాత్రే ముంచుకొచ్చిన శిశిరదేవర

దేని గురించి పలవరింత?

నడి ఎడారిలో ఇసుక జారిన సవ్వడి
ఝల్లున కురిసిన ఎర్రని చినుకులకు జడిసి
జరజరా పాకిపోయిందొక పాము
ఒక పిడికిట్లో ఓ లేత కలను
మరో పిడికిట్లో లేవెలుగు కిరణాలను బిగించి
ఓటమికి బదులుగా శాంతినిచ్చేస్తూ
ఒరిగిపోయిందొక పద్యం
దాని కుత్తుకలో అపాస్టసీ పిడిబాకు

ఎవరి గురించి పలవరింత?

ఒక ఆకాశం పిగిలిపోయాక
ఒక అడవీ కుంగిపోయాక
కళ్లల్లోంచి రాలిన నల్లని పదాలు
ఖాళీ చేతుల్లోకి ఇంకిపోతున్నప్పుడు
విచ్చుకోవాలో, ముడుచుకోవాలో తేల్చుకోలేక
మనసు విరుచుకు పడిపోతునప్పుడు
సరిగ్గా అప్పుడే, మారుమూల ద్వీపంలో
అవ్వాతాతల సమాధుల సాక్షిగా పేర్చుకున్న తన కలలన్నీ
ఇంకా మన ఇళ్లకు రాని ప్రళయానికి ఇచ్చి
కొన్ని గ్నాపకాలను మూటగట్టుకుంటూ, ఒక అమ్మాయి
మనల్ని చూసి పకాలున నవ్వుతుంది
అంతలోనే, ఉప్పగా ఏడుస్తూ నిలదీస్తుంది:
దేనికోసం మీ పలవరింత?
ఏది విరహం? ఏది ప్రేమ?
ఏది దిగులు? ఏది దుఃఖం?

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply