ఏదినిజం…

అడవిలోకి
రోడ్డు చొచ్చుకు వచ్చినప్పుడు
అది నిర్మాణం కాదని
నిర్మాణం పేరిట
కాబోయే విధ్వంసం అని
మాకు అర్థం కాలేదు
అది..ఆదివాసికి అర్థమైంది

అడుగడుగున
క్యాంపులు పెట్టినప్పుడు
అది పునరావాసం అనుకున్నాం కానీ
అది ఆదివాసీల మూలాల్ని పెకిలించడం అని
మాకు అర్థం కాలేదు
అది.. ఆదివాసికి అర్థం అయింది

విత్తనాల పండుగ మీద
తుపాకీ మొరిగినప్పుడు
అదేదో తీవ్రవాదం మీద
యుద్ధం అనుకున్నాం గానీ
అది.. పసిపిల్లల రక్తంలో చేతులద్దడమని
మాకు అర్థం కాలేదు
అది.. ఆదివాసికి అర్థమైంది

సత్యాన్వేషకులారా
ఇటు చూడండి

అడవిలో ఇప్పుడు
ప్రతి ఆకు, ప్రతి రాయి
గాలి నీరు నిప్పు బూడిద
చెట్లను చీల్చిన బుల్లెటూ
శవాల్ని కప్పిన టార్పాలిన్ కవరూ
చెక్కుకుపోయిన ముఖమూ
ఉబ్బి పోయిన శవమూ
ఏదో ఏదో చెప్పాలని చూస్తున్నాయి

అడవి గుండెలో
రాజ్యమొక వెలగ పండు అయిన చోట
కత్తుల పహరాల మధ్య
సత్యాన్వేషణ
ఒక దేశ ద్రోహం అయింది…

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply