పల్లవి:
ఎవరో ఒకరు
ఎపుడో అపుడు
పుడతారులే
మళ్ళీ మళ్ళీ
జగతి వేదనే
తన బాధగా
లిఖిస్తారు అక్షరాల తారలనల్లి
చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ | ఎవరో |
1) చలనమే జీవంగా
జీవమే పరిణామంగా
వృక్ష జాతి జంతు జాతి
పర్పస్పరాధారంగా
చెట్టుమీది వానరం
నేలచేరె తరుణం
శ్రమతోనే నరవానర
మానవ పరిణామం
తొలి మానవుల జీవితం
సమష్టిగానే ఆరంభం | ఎవరో |
2) సంతానమే ఉత్పత్తిగా
మాతృస్వామ్య యుగంగా
ఆడ మొగలు సమానమనే
ఆదిమ సమాజంగా
వర్ధిల్లిన సమాజం
స్వంత ఆస్తితో సమాప్తం
వర్గాలతో కులాలతో
స్వర్గ నరక భయాలతో
ఆధిపత్య యుద్ధాలతో
అంతిమ దశకే చేరగ | ఎవరో|
3) స్వంత ఆస్తి కత్తులతో
కట్టుకున్న రాజ్యమయ్యి
మృగాలుగా మారికొంత
యుగాలుగా దాస్యమంత
తిరుగబడ్డ బానిసగా
మార్పు కోరె మనిషిగా
గ్రామమైన దేశమైన
ధ్వంసమయ్యే క్షణంలోన
సంకల్పం చేబూనిన
అంకురాల వృక్షాలలో | ఎవరో |
4) తనదంటూ లేనిదిగా
ఒక తరుణం వస్తుంది
మనదంటూ పిలిచేదే
శాశ్వతమవుతుంది
సంఘమేర జీవనం
సమతయేర శాశ్వతం
పంచభూతాలు పంచి
పెంచేదిర ప్రకృతి
ఆ ప్రకృతే మనిషికి
శాశ్వతమయ్యే ఉనికి.
ఎవరో ఒకరు
ఎపుడో అపుడు
పుడతారులే
మళ్ళీ మళ్ళీ
చరిత్రకే కూర్పుగా
నవయుగాన మార్పుగా
లిఖిస్తారు అక్షరాల తారలనల్లి
సమిష్టికే విజయమంటూ మళ్ళీ మళ్ళీ
-17 మే, 2024
(‘ఆపరేషన్ కగార్’ ను నిలిపివేయాలంటూ 18 మే, 2024న హైదరాబాద్ లో C.L.C.; C.D.R.O. సంస్థలు నిర్వహిస్తున్న సభ సందర్భంగా…)
ReplyForwardAdd reaction |