ఎవరి బాధ్యత ఎంత?

భారతదేశంలో ఏ ఎన్నికలైనా హడావిడి మామూలుగా ఉండదు. స్థానిక ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ హడావిడి వివిద రూపాల్లో మనకి కనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని విషయాలు తెరమీదకు వస్తుంటాయి. వాటి చుట్టూ అనేక చర్చలు జరుగుతుంటాయి. అయితే ఈ చర్చల్లో మహిళలు పోషించాల్సిన బాధ్యత ఉన్నా, మహిళల ప్రమేయం లేకుండా ఆ పనులు జరగే అవకాశం లేకపోయినా కూడా సరే, మహిళల అభిప్రాయం తీసుకోవాలనో, మహిళల నిర్ణయం ముఖ్యమనే విషయాన్ని అసలు పట్టించుకోరు.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సారి తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అభ్యర్థుల అర్హతకు సంబంధించిన ఒక నిబంధన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉండకూడదనేది కూడా ఇప్పటివరకూ ఉన్న ఒక నిబంధన. అయితే ఈసారి కూడా ఈ నిబంధనను అమలు చేస్తారా? లేదా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు సంబంధించి సంతానం పరిమితి నిబంధనను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి, ఇప్పటివరకైతే ఎలాటి సడలింపు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఈ నిబంధన ప్రకారం స్థానిక సంస్థల్లో పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉంటే, వారు పోటీకి అనర్హులు.

రాజకీయ పార్టీలు తమ విధానాలు, తమ ఎజెండాకి అనుగుణంగా అనేక నిర్ణయాలు చేసేస్తుంటాయి. అవి పాలనకు సంబంధించి కావొచ్చు, లేదా చట్టాలకు సంబంధించిన మార్పులూ కావొచ్చు. ఇదిగో ఆ నిర్ణయాధికారంలో భాగంగానే, ఆంధ్రప్రదేశ్ లో ఈ నిబంధనను ఎత్తేశారు. ఎంత మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయోచ్చని గతంలోనే చెప్పేశారు.

పైగా ఒకానొక సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అమరావతిలో యువకుల సంఖ్య తగ్గుతోందని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని రాష్ట్రానికి అదొక సమస్యగా మారనుందని అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మంది పిల్లల్ని కంటే వాళ్ల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని వేదిక మీదే ప్రకటించారు.

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పార్లమెంటులో సీట్ల ప్రాతినిధ్యం మీద జనాభా నియంత్రణ చూపించే ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, జనాభాను పెంచుకోవాలని చెప్తూ, వీలైతే ఒక్కో జంట 16 మంది పిల్లల్ని కనండని కూడా పిలుపిచ్చారు.

చంద్రబాబు నాయుడు గారు, స్టాలిన్ గారు వేరు వేరు కారణాలతో ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పిన విషయాన్ని కాసేపు పాజిటివ్ గానే ఆలోచిద్దాం.

ఒకప్పుడు ప్రభుత్వాలు పనిగట్టుకుని, ఒకరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ముగ్గురైతే వద్దు అని, చిన్న కుటుంబం- చింతలు లేని కుటుంబం అని విపరీతంగా ప్రచారం చేసాయి. ఇప్పుడేమో చాలామంది పిల్లల్ని కనేయండి. మీ కుటుంబాల బాధ్యత మేము తీసుకుంటామని మాట్లాడుతున్నాయి. మంచిదే, అలా కుటుంబాల బాధ్యత మీరే తీసుకుంటే మంచిదే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పాలకులుగా ఆ కుటుంబాల బాధ్యత మీరే తీసుకోవాలి. కానీ అలా జరగట్లేదే?
మీరు చెప్పినట్టుగా రేపటి నుండి ఎక్కువమంది పిల్లల్ని ఎవరు కనాలి? నిజంగా అధిక సంతానాన్ని కనడం అంతసులువైన పనా?

డబ్బులుండి, అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, పిల్లల్ని కనే స్థోమత ఉన్న వాళ్లు ప్రభుత్వాల మాట విని రేపటి నుండి ఎక్కువమంది పిల్లల్ని కంటారా? కననే కనరు. పోనీ, ఈ రూల్ ముందు ప్రభుత్వంలో ఉన్న కుటుంబాల్లోనో,, పాలన సాగిస్తున్న కుటుంబాల్లోనో అమలు చేస్తారా? చేయనే చేయరు.

ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడి గారి కుమారుడు లోకేష్- బ్రాహ్మణి జంట కూడా ఒక్క సంతానమే కలిగి ఉన్నారు కదా? ఇన్ని సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు, ముందు చూపుతో, ఎక్కువ మంది పిల్లని కనమని తమ పిల్లలకు ఎందుకు చెప్పలేదు. పోనీ ఇప్పుడైనా ఆయన మాట విని భవిష్యత్ లోనైన ఆ జంట మరింత మంది పిల్లల్నికంటారా? చంద్రబాబు గారు తమ పిల్లల చేత ఆ పని చేయించగలరా? ముమ్మాటికీ ఆయన చేయించలేరు. వాళ్లు చేయరు.

వీళ్లు చెప్పే ఎక్కువ సంతానం ఎవరు కనాలి అంటే? పేద ప్రజలు, బడుగు, బలహీన వర్గాల వాళ్లు మాత్రమే. వాళ్లు అనివార్యంగా ఎక్కువమంది పిల్లల్ని కనేలా చేస్తారేమో కూడా. ఎందుకంటే, ఇప్పటివరకూ ఖర్చులకు దడిసి, ప్రభుత్వ హాస్పిటల్స్ లోనో, లేదా అప్పుడప్పుడూ పెట్టే క్యాంపుల్లోనో, చాలా మంది పేద మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. ఇక రేపటి నుండి ఆ అవకాశాలు లేకుండా చేసినా చేస్తారు.
ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకుల మీద, ఉచిత ప్రయాణాల మీద, పెన్షన్ మొత్తాల మీద ఆధారపడుతున్న జనం లక్షల్లో ఉన్నారు. అదనంగా కనే బిడ్డకు మీరు ప్రకటించే, 10, 15 వేల రూపాయలు వాళ్ల రోజూ వారీ జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడతాయి?

ఇప్పటికే ఒకరిద్దరు పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ లో చదివించలేక, అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూల్స్ లో చేరుస్తున్నారు. అయినా వాళ్ల చదువుల స్థాయి ఏ రీతిలో ఉందో లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందక, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకోలేక తల్లడిల్లి పోతున్నారు. ఉన్న ఊర్లో ఉపాధులు లేక వలసలు పోతున్నారు. మహానగరాల్లో, కిరాయిలు కట్టలేక, మురికివాడల్లో బతుకుతున్నారు.
పైగా భార్యా భర్తలిద్దరూ పనిచేసుకుంటే తప్ప, కుటుంబాలు గడవని స్థితిలో, మహిళలు ఇలా పిల్లల్ని కంటూ ఇంటికే పరిమితమై పోతే, ఆ కుటుంబాలు ఏమై పోతాయి? ఆ మహిళల ఆరోగ్య, మానసిక పరిస్థితి గురించి ఈ పెద్దలు ఎప్పుడైనా ఆలోచించారా?

చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే మహిళలకు, అంతెందుకు అన్ని వార్తల్ని కవర్ చేసే మీడియాలో పనిచేసే మహిళా జర్నలిస్టులకు కూడా వేతనాలతో కూడిన మెటర్నిటీ లీవ్స్ లేవు. పైగా మెటర్నిటీ లీవ్స్ మొత్తం వాడుకుని, ఉద్యోగాలకు వెళ్తే, తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడిపోతాయో కూడా తెలియని పరిస్థితి చాలా కంపెనీల్లో, మహిళా ఉద్యోగులది.

పిల్లలు, పెంపకం అంటూ మహిళలు అనేక లీవ్స్ తీసుకుంటారనే చులకన భావం అనేక చోట్ల ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.అందుకే మగవాళ్లతో ఎంత సమానంగా పనిచేసినా, జీతాల పెంపు విషయంలో, ప్రమోషన్స్ విషయంలో మహిళలు వివక్షకి గురవుతూనే ఉన్నారు.

అలాంటిది ఇక పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకుంటే, అసలు ఈ మాత్రం ఉద్యోగ అవకాశాలైనా మహిళలకుంటాయా? ఒకరిద్దరు పిల్లల్ని పెంచడానికే నానా కష్టాలు పడుతున్నారు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేక ఇబ్బంది పడుతున్నారు. పనిచేసే చోట కనీసం బేబీ కేర్ సెంటర్సే కూడా ఉండవు. ఇక రేపు వీళ్లు చెప్పే అధిక సంతానాన్ని ఎక్కడ ఎలా ఎవరు పెంచాలో మరి.

అంతేనా పిల్లల పెంపకం బాధ్యత ఇప్పటికీ మహిళలే మోస్తున్నారు. రేపు మీరు చెప్పే అధిక సంతానంతో ఈ మహిళలు ఎలాంటి మానసిక స్థితిలోకి నెట్టబడతారో కూడా ఆలోచించాలి కదా?

మహారాష్ట్ర లాంటి చోట, చెరుకు తోటల్లో పనిచేసే మహిళలకు, నెలసరి కారణంగా వారిని కూలీ పనులకు దూరంగా పెడుతుంటే, ఏకంగా వందలాది మంది మహిళా కూలీలు తమ గర్భసంచులనే తీయించుకున్నారు ఆ కూలీ డబ్బుల కోసం. అంత దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఆయా కుటుంబాలవి.

సరే, ఈ పెద్దలు చెప్పినట్టే, వృద్దుల సంఖ్య పెరుగుతోంది. సమాజ అభివృద్దికి యువత కావాలి. మరి ఈ యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామిని ఏ పార్టీలైనా నిలబెట్టుకుంటున్నాయా? ఎంత మంది యువతకి ఎలాంటి పని కల్పిస్తున్నారో లెక్కలున్నాయి కదా?

గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి కంపెనీలు పెడుతున్నారు? అక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నారో కూడా మనం చూస్తున్నాం. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా మెషీన్స్ తోనో, భవిష్యత్ లో Artificial Intelligence అన్ని చోట్లకూ విస్తరించాక ఈ మాత్రం ఉద్యోగ అవకాశాలు కూడా పిల్లలకి దక్కవు. ఇప్పటికీ ఉన్నత చదువులు చదువుకుని, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులను కూడా కంపెనీలు తమ ఉద్యోగులను ఒక్క నిర్ణయంతో ఉద్యోగాలనుండి తీసేస్తున్నాయి.

పార్లమెంట్ స్థానాలు పెంచుకోవడం కోసం జనాభా పెరగాలని కోరుకోవడం కూడా సరైన అభిప్రాయం కాదు. ఆయా రాష్ట్రాలకు ఉండే సహజవనరుల్ని ధ్వంసం చేసుకుంటూ, వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేస్తూ, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతూ నిధులకోసం, కేంద్రం ఇచ్చే వనరులకోసం నియోజనవర్గాలు పెంచుకోవాలనుకోవాలని కోరుకోవడం కూడా సరైంది కాదు. లేదా ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలు కేంద్రం నుండి దక్కాల్సిన నిధుల కోసం పోరాడాలి.
తమ తమ విధానాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్తున్న పెద్దలు, తమ లిక్కర్ విధానాల వల్ల ఆదాయం పొందుతూ, కుటుంబాలు విధ్వంసమవుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు ఒక్కసారి మహిళలతో మాట్లాడండి. వాళ్ల సమస్యలేంటో తెలుసుకోండి. లిక్కర్ విధానాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయో కళ్లు తెరిచి చూస్తే కనిపిస్తాయి. మాకు ఏ సాయమూ వద్దు, లిక్కర్ షాపులు మూసేస్తే చాలు అని ఎంతమంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో చూడండి. ఎంతమంది మహిళలు ఒంటరిగా మారుతున్నారో లెక్కలు చూడండి.

రాష్ట్రమేదైనా అన్ని చోట్లా శ్రామిక వర్గ ప్రజల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఇలాగే ఉన్నాయి.ఇన్ని రకాల సమస్యలను దాటుకుని మహిళలు తమని తాము నిలబెట్టుకున్న ఇలాంటి నేపథ్యంలో, పాలకులు చెప్పే ఈ మాటలు ఎవరి ప్రయోజనాల కోసమో కూడా ఆలోచించాలి.

పిల్లల్ని కనాలా వద్దా నిర్ణయం మహిళలకి కూడా ఉండాలి. గట్టిగా చెప్పాలంటే, మహిళలకే ఉండాలి. ఒక్కసారి మీ అభిప్రాయాన్ని ముఖాముఖి మహిళల్ని అడిగి చూడండి, అవసరమైతే ఈ విషయం మహిళల అభిప్రాయాల సేకరణ చేయండి. వాళ్లు చెప్పే సమాధానం విన్నాక మీ విధాన ప్రకటనలు చేయండి.

అనేక అభివృద్ది చెందిన దేశాల్లో కూడా జననాల రేటు తగ్గుతోందని లెక్కలు చెప్తున్నాయి. దక్షిణ కొరియాలో ఈ జననాల రేటు మరింత తగ్గుతోంది. జననాల రేటు పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు, మన ప్రభుత్వాల కన్నా అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. భారీగా నిధులు కూడా కేటాయిస్తున్నాయట. అయినా అక్కడి మహిళలు సానుకూలంగా స్పందించడంలేదు. పైగా అసలు మహిళలకు ఏం కావాలో పాలకులు తెలుసుకోవడం లేదని బిబిసి లాంటి మీడియా సంస్థలు చేసిన సర్వేలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం. అందుకే మన తెలుగు రాష్ట్రాలైనా, అభివృద్ధి చెందిన దేశాల్లోనైనా మహిళలు ఏమనుకుంటున్నారో పాలకులు తెలుసుకోరనేది వాస్తవం.

సామాజిక కార్యకర్త. గాయని. బుర్రకథ కళాకారిణి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఎం.ఏ (ఆర్థిక శాస్త్రం), ఎల్.ఎల్. బీ. చదివారు. ఆకాశవాణిలో పదేళ్ల పాటు casual announcer గా పని చేశారు. TV 9, Vanitha TV, 10TV ల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. యూనిసెఫ్, లాడ్లీ మీడియా అవార్డులతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఉత్తమ జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ అవార్డు అందుకున్నారు. Center for Sustainable Agriculture లో Krishi TV (వ్యవసాయ) యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ప్రసుతం Voice of the People పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆరేళ్లుగా పిల్లల కోసం ' కథల ప్రపంచం ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.

Leave a Reply