ఎం.ఎస్.ఆర్ కవితలు రెండు…

పిలుపు

యుద్ధవార్తలు నిద్రపోనివ్వడం లేదా?
రా! యుద్ధాలు ఉండని ప్రపంచానికై
అవిశ్రాంతంగా శ్రమిద్దాం!
ఇరాక్ భూభాగంపైన వున్న శవాలగుట్టలన్నీ
నీ బంధువులవేనా?
రా! సామ్రాజ్యవాదాన్ని కసిగా హతమార్చుదాం!
నువ్వు పేట్రియాట్లనీ స్కడ్లనీ అణ్వాయుధాలనీ
విపరీతంగా ద్వేషిస్తున్నావా?
రా! ప్రపంచశాంతికై యుద్ధనిపుణుల మవుదాం!

(యుద్ధ నిపుణుడు కామేడ్ స్టాలిన్ స్మృతికై)
(ఫిబ్రవరి – మార్చి 1991 ఆరుణతార)

మనుష్యులకు ఒక మనవి

ఒకనాడు మాదగ్గరికి ఈ జాతిలేని దళారిగాడు వచ్చి
మమ్మల్ని వాడి యుద్ధట్యాంకర్లలో నుండి గురిచూస్తూ
మీరిక “స్వతంత్ర భారతపౌరులు” అని ప్రకటించాడు
వాడు గీసిన దేశ సరిహద్దుల మధ్య
మాకాళ్ళకు మేకులు దిగ్గొట్టి
మాచేతులకు పనిముట్లు బిగించి
మా తలలమీద వాడి త్రివర్ణపతాకాన్ని పాతి
మీరిక “స్వేచ్ఛ”గా జీవించండి అన్నాడు
మా చమట చుక్కల్లో ప్రతిఫలించిన మా కాశ్మీరును
వాడు “ఈ ఉద్యానవనం నాదే” అని గర్వంగా మీసం మెలేసాడు
మా శ్రమలో పండిన మా పంజాబ్ ను
వాడు “ఈ తరగని గోదాము” నాదే అని విర్రవీగాడు
మా చేతుల్లో పుష్పించిన మా అస్సాంను
వాడు ఇక్కడి రక్తమంతా నాకు టీనీళ్ళుగా చమురుగా మారాలని ఆజ్ఞాపించాడు
మా జాతులేవైనా
మా నేలమీద మేం గర్వంగా నడిచినా
మా భూమ్మీద ప్రవహించే నీళ్ళలో మా ప్రతిబింబాలు చూసుకున్నా
మా ఊళ్ళల్లో మేమే ఉద్యోగాలు చేస్తామన్నా
వాడి రాజసంస్కృతినీ రాజమతాన్నీ రాజభాషనీ తిరస్కరించినా
మేం దరఖాస్తులమైనా సభలమైనా ఊరేగింపులమైనా
వాడు తుపాకి నోరుతోనే జవాబు చెప్పాడు
వాడు మా అభివృద్ధికోసం “మా” రక్తనదులు సృష్టించాడు
వాడు మా అభివృద్దికోసం తూటాల ఫ్యాక్టరీలు నెలకొల్పాడు
మా చర్మాలపై ముళ్ళతీగల ఫెన్సింగ్ పెట్టాడు
మా గుండెల్లోపల ఫ్లడ్ లైట్ల నిఘాపెట్టాడు
మా పంటలు వాడికి భోగిమంటలు అవుతాయి
మా ఇళ్ళన్నీ మాకు కాన్సంట్రేషన్ క్యాంపులు చేసాడు
పురుషులతోపాటు దేశద్రోహులవుతున్నారని
మా స్త్రీలందరి మర్మావయాల్లో వాడి దేశభక్తసైన్యాన్ని బిగిస్తున్నాడు
“మనిషి జీవితం” జీవించేందుకు వీల్లేని రాజ్యంలో
యుద్ధభూమిలో మరణంతో మా ఉనికిని ప్రకటిస్తున్నాం
ఇది మానవత్వం పరిమళించే నేల గనుకనే
ఢిల్లీ సింహాసన విధ్వంసమే ఈనేల జీవితాచరణ అయ్యింది
మా గుండెలపై ఇనుపపాదాలపై వాడు తొక్కి తొక్కి
మేం ఎంత కడుకున్నా ఇంకా “తుప్పు” మిగిలితే అందుకు బాధ్యత వాడిదే
వాడు ఈ నేలనంతా స్మశానం చెయ్యడానికి తెగించినా సరే
మా శవాలతోనైనా
మేం కలలుకన్న మాదేశాల చిత్రపటాలు గీసి
మా జాతుల విముక్తి ఆకాంక్ష ఈ ప్రపంచానికి ప్రకటిస్తాం
సమస్తమానవాలిలో నిజంగా ఏవైనా శక్తులు మనలో
మనందరిది అయిన ఈ ప్రపంచాన్ని
వసుధైక కుటుంబంగా మలచగలవని
మాకు నమ్మకం కలిగిననాడు
మేం అందులో భాగస్తులం కాకపోవడానికి
మేం మానవజాతి విద్రోహులం కాదు

జననం: కరీంనగర్ జిల్లా గోదావరి లోయ ప్రాంతం. అసలు పేరు ఎం. శ్రీనివాసరావు. ఎంఎస్ఆర్, కరుణాకర్, ప్రభాకర్ అనే కలం పేర్లతో రచనలు చేశాడు. ఇంజనీరింగ్ చదివేటపుడు విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికి చేరువయ్యాడు. హైదరాబాద్ లోని వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.ఇ ఎలక్ట్రానిక్స్ రెండో సంవత్సరంలో విప్లవోద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్లాడు. పటాన్ చెరు పారిశ్రామిక వాడల్లో విప్లవకారుడిగా కార్మికోద్యమ నిర్మాణం చేశాడు. 3 సెప్టెంబర్, 1992న పోలీసులు పట్టుకొని కాల్చిచంపారు. తాను డైరీలో రాసుకున్న కవితలు, సినిమా రివ్యూలు, జ్ఞాపకాలను విరసం 'కాగడాగా వెలిగిన క్షణం' పేరుతో పుస్తకం ప్రచురించింది.

Leave a Reply