ఎప్పుడు పడాలీ వాన!

నీకైనా నాక్కూడా, అది రైల్వేస్టేషనే
కొందరిక్కాదు

ప్లాట్ఫామ్ లను కలిపే వంతెన కింద
కాస్త వెలుగూ బోలెడు చీకటీ
అచ్చం దేశంలో లాగే

అక్కడ –
అక్కడో పాప నిద్రపోతోంది
పాప నిద్రపోతోంది కదా అని
అమ్మ కూడా,

మగత నిద్రలో చిన్నారి ఏడుపు
కలలోకి వెళ్ళి మరీ
పాపను ఏడిపించింది ఎవరు?

చిన్ని నోటితో చప్పుడు చేస్తూ
పాప
అమ్మ గుండెల్ని చీకుతోంది
మరి అమ్మ?

కళ్ళలోంచి
రాలిపడలేకా అక్కడే ఉండలేకా
ఒక నీటిబొట్టు

రైల్వేస్టేషన్ బయట ఆకాశం
మూడు రంగుల్లో ఉరుముతోంది
ఎప్పుడు పడాలీ వాన!
79 ఏళ్ళుగా లేనిది.

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

4 thoughts on “ఎప్పుడు పడాలీ వాన!

Leave a Reply