ఎప్పటికీనా?

పాలపొడి ద్వారానో, టీకాల ద్వారానో
పిల్లలను, పెద్దలను విషపూరితం చేసిన వారు-
యువత అద్భుత నైపుణ్యాన్ని
పట్టపగలు వీధి దీపాలు చేసిన వారు-
పాత్రికేయుల ముఖాలకు చీకటిని పులిమినవారు-
మైకులను ఉరిదీసి పాటగాళ్లను
కచేరికి ఆహ్వానించిన వారు-
దర్శకులకు అవకాశమిచ్చి
సెన్సార్‌ తోక కత్తిరించిన వారు-
నల్లగౌను వెనుక ధైర్యాన్ని
బోను ఎక్కించినవారు-
వకీళ్ల మెడకి పీనల్ కోడ్‌ని బిగించినవారు-
మంత్రశక్తితో వైద్యశాస్త్రాన్ని వశీకరణ చేసుకున్నవారు-
కాస్మిక్ ఎనర్జీకి పిండిబొమ్మతో చేతబడిచేసినవారు-
హద్దుల్లేని సైనికుల పరాక్రమాన్ని అపహాస్యం చేసినవారు-
ఆవేదనతో పెగిలిన గుండెలపైకి
బుల్డోజర్ నడిపిన వారు-
వందలాది అత్యాచారాల తర్వాత
మాంగళ్యధారణతో పవిత్రతను ఆపాదించేవారు-
సైన్స్ ను గారడీ విద్య చేసి
స్వయంభువులుగా ప్రకటించుకున్నవారు-
వారు, వారేనా, ఎప్పటికీ?

పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం. కవి, జర్నలిస్టు. గీతా విద్యాలయం(శ్రీకాకుళం)లో మొదలు పెట్టి ఎస్ఎమ్‌యుపి స్కూల్లో ప్రాథమిక విద్య. ఏడు రోడ్ల జంక్షన్‌లోని ఎం.హెచ్.స్కూల్లో ఉన్నత విద్య. ఆముదాల వలస, మందసల్లో ఇంటర్ తొలి, మలి సంవత్సరాలు. బారువాలో బి.కాం. డిగ్రీ చదివారు. ఉద్యోగ విరమణ అనంతరం తల్లిదండ్రులు స్థిరపడిన విశాఖలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, పొట్ట చేతబట్టుకుని 1995లో హైదరాబాద్ చేరిక. జర్నలిస్ట్‌ గా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియాల్లో పని. రచనలు: ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’(2000), ‘దుర్గా పురం రోడ్’(2019) కవితా సంకలనాలు వెలువడ్డాయి. ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటికి ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు, పాతూరి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య స్ఫూర్తి పురస్కారం ప్రకటించారు. తరచుగా కవిత్వం, అరుదుగా కథలు, అలవోకగా పుస్తక పరిచయాలు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, అనువాదాలు, వ్యాసాలు రాస్తుంటారు.

Leave a Reply