ఎన్కౌంటర్

ఒంటికన్నుతో తుపాకీ గురి చూసి, చూసి
వాడి చూపు సగమైంది
రెండోపక్క కనపడదు
ఏ ఫైల్ చదివినా
ఒక దిక్కే తెలుస్తది
మొత్తం చదివితే కదా దేశం అర్థమయేది

బావిలో నీళ్ళు చేదినా
రక్తదాహమేననుకుంటడు
వాడలో నడిచినా
ఎవణ్ణి చంపడానికంటడు
చంపమని బతిమిలాడుకునేటట్టు
కానిబాధలు పెడ్తడు, గోసతీపిస్తడు
నిన్ను నువ్వే చంపుకో
ఆత్మబలిదానం అంటడు
సూసైడ్ బాంబర్ వంటడు
దేశం కోసం అంటడొకడు
దేవునికోసం అంటడొకడు
చంపుడే కదా ఇద్దరి కోరిక

బతకనియ్యరాదా
బానిసకొకబానిసకొకబానిసలెక్క
దేనికి ఇన్సానియత్ లేకుంట
తీసిన ప్రాణం పొయ్యలేనోనికి
ఎంత దైవశక్తి రా
మాయమాటలు, ఝూటాకోరు, బటాచోరు
ధర్మమంటే ఏంది?

నేలపొడుగునా
రక్త సంతర్పణే
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నదిరా గర్వకారణం
నరజాతి……………?
ఇదా మనుషుల రీతి???
శ్మశానం కాని స్థలమేలేదు
భూస్థలమంతా వెతికిన…

పేరుకు మనుషులు
మనుషుల్లో మనిషిగా పుట్టినందుకు
చావాలనే అనిపిస్తుంది…
వాడి పద్మవ్యూహం అదేకదా

*

అహింసో పరమోధర్మః అన్న సూక్తి
తెగించమని కూడా చెప్పింది నీతి

ఆలేరు, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా. విశ్రాంత ఉపాధ్యాయుడు, చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు. పుస్తకాలు: మట్టి పొత్తిళ్ళు, మూలకం, రెండు దోసిళ్ళ కాలం(కవితా సంకలనాలు), పాడాలని(పాటలు), ఆలేటి కంపణం, ఠాకూర్ రాజారాం సింగ్ (చరిత్ర రచనలు), సాహిత్య వ్యాసాలు, కథలు, నాటికలు.

One thought on “ఎన్కౌంటర్

Leave a Reply