బిడ్డల సదువుకు
వొంటి బట్టకూ
అల్లాడిన ఇంటిల్లీ
కడుపుకు చాలని
జీతపురాళ్లతో
కుస్తీపడుతూ
అప్పులవాళ్ళ
ముప్పులు కాస్తూ
ధరల కాటులు
పన్నుపోటులు
జేబుకు పడిన
చిల్లులు మరిచి
హోలీ సంబర
వేడుకలంటూ
శుభాకాంక్షలూ
శూర మెసేజ్లో
వరదెత్తిన
ఉల్లాసంలో
మునిగితేలే
ఓ నడ్మి తర్గతీ
జార్ఖండ్ బస్తర్
ఛత్తీస్ఘర్ అంతట
అడివడివంతా
కాల్పులమోతలు
పగలూ రాత్రీ
నెత్తుటి హోలీ
ఆడుతున్నది
అదిగో సర్కార్
చేయని తప్పుకు
తనువులు తూట్లై
అడవి బిడ్డలు
రాలుతు ఉంటే
పట్టదు మీకు
బుద్ధిమంతులూ !!
దేశ సంపదెల్లా
కార్పొరెట్ల పాలెట్లా !?
గిరిపుత్రుల పోరుకు
బాసట చాటుతూ
ఎత్తిన బడిసెకు
సత్తువ కావోయ్..
రక్షణ పేరిట
లూటీ జేసే
ద్రోహపు చట్టం
ధ్వంసం ఔనోయ్
పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)