సాహిత్యంలో ఎన్నో ఇతివృత్తాలతో నవలలు వస్తాయి. అసలు నవల అనే ప్రక్రియలోనే ఎంతో స్వేచ్ఛ ఉంటుంది రచయితకు. కథ, కథనం, తమ భావాలు, ఆదర్శాలు, ఆలోచనలు, కొన్ని వర్ణనలు, ఇవన్నీ చాలా విస్తృతంగా చూపించే సౌకర్యం నవలలో ఉంటుంది. అందుకే కథల కన్నా నేను ఎక్కువగా నవలలు ఇష్టపడతాను. కాని నేను గమనించినంత వరకు ఇతర భాషలలోని నవలలలో ఉండే వైవిధ్యం తెలుగులో తక్కువ. వడ్డెర చండీదాస్, గోపీచంద్, బుచ్చిబాబులను పక్కన పెడితే, మన భాషలో నవలా రచనలో అతి తక్కువ ప్రయోగాలు జరిగాయి. రచనా స్రవంతి పద్ధతి కొన్ని వచ్చాయి. మనిషి ఆలోచనను, జీవితం పట్ల గొప్ప పరిశీలన, అవగాహనతో జరిపే తాత్విక చర్చలతో నవలలు తెలుగులో తక్కువ. ఆధునిక సాహిత్యంలో మరీ తక్కువ. ప్రస్తుత ఆ శైలి నాకు చంద్రశేఖర్ ఆజాద్ గారి నవలలలో కనిపిస్తుంది. వారు చాలా గొప్ప నవలలు రాస్తారు లాంటి మాటలు చెప్పను. కాని మనిషి జీవితాన్ని లోతుగా పరిశిలించి తన తాత్విక ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కునే ప్రయత్నంలో రచనలు చేస్తారని నాకు అనిపిస్తూ ఉంటుంది. జీవితం అంటే ఏంటి? మనిషి జీవనంలో తనను తాను తెలుసుకునే ప్రయత్నం అతను ఎంత వరకు చేస్తున్నాడు. అసలు మానవ జీవితం లక్ష్యం ఏమయి ఉండాలి? మనం నిర్మించుకున్న ఈ సమాజంలో మనం బందీలమై పోతున్నామా? మన మనసు ఏ జీవనాన్ని కోరుతుంది. అసలు అర్ధవంతమైన జీవితం వైపు మనం ప్రయాణం చేస్తున్నామా? చేయగలమా? చేయాలంటే మనలో ఎటువంటి దృష్టి పెరగాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సంబంధించిన కొంత చర్చ వీరి రచనలలో కనిపిస్తుంది.
“ఆదీ – అంతం” నవల రచయిత పి. చంద్రశేఖర ఆజాద్. దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పోటీలో బహుమతి లభించింది. ఆజాద్ గారి నవలలలో హీరో హీరోయిన్లు, ప్రేమలు, ఆదర్శాలు లాంటి రొటీన్ కథనం ఉండదు. వీరి రచనలలో ఒక తార్కికత ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కనిపిస్తుంది. తనలోకి తను తొంగి చూసుకునే ప్రయత్నంలో వీరు రాసుకుంటారేమో అనిపిస్తుంది. మృత్యువును అతి చేరువగా చూసిన అనుభవంలోనుంచి ఈ నవలలోని తాత్వికత వచ్చిందంటూ తన స్వీయానుభవం, తనను ప్రేరేపించిన ఆలోచన దిశగా పాఠకులకు తీసుకువెళ్ళడానికి రచయిత చాలా సాహసం చేసారు. ఇందులో వీరి కృషి కనిపిస్తుంది.
మనలో జరిగే మేధోమథనాన్ని అక్షర రూపంలోకి తీసుకురావడానికి చాలా శ్రమ అవసరం. అనుభవం నుండి జనియించిన ఆలోచనల సారం రాయడం కష్టం కాదు కాని ఆ ఆలోచన క్రమాన్ని రికార్డు చేసే ప్రయత్నం చాలా సాహసోపేతమైనది. ఎందుకంటే ఆ ఆలోచనల ప్రయాణం ఎటో స్వయంగా రచయితకే అర్ధం కాదు. కాని వాటిని వ్యక్తీకరిస్తూ ఒక పుస్తక రూపం తేవడంలో గందరగోళం లేకుండా ఒక కంటిన్యుటీ తీసుకురావడం కొంత కష్టమైన పనే. దాన్ని రచయిత చాలా చక్కగా నిర్వహించారని అర్థం అవుతుంది ఈ నవల చదివితే. తెలుగులో ఇలాంటి నవలలు చాలా అరుదు. వీటిని ఎన్నుకుని చదివే పాఠకులు కూడా అరుదే. నవల చదివి పుస్తకం బావుంది అనో బాలేదు అనో చెప్పడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి తనను తాను వెతుక్కోవడానికి చేసే ప్రయత్నంలో అతని మనసు వేసే ప్రశ్నల స్థాయిని అర్ధం చేసుకునే స్థాయి ప్రతి పాఠకునికి ఉండదు. ఉన్నా ఆ ప్రశ్నలు అర్థం అవవు. అయినా వాటికై జరుగుతున్న మేధో మథనం ప్రతి ఒక్కరిలో ఒకేలా సాగదు. ఇన్నిటి మధ్య ఒక తాత్విక నవల రావడం అది బహుమతి స్థాయికి వెళ్ళడం మెచ్చుకోదగిన పరిణామం. సాహిత్యాన్ని నిజంగా చదివే పాఠకుల సంఖ్య పెరుగుతుంది అని అనిపిస్తుంది ఇలాంటి పుస్తకాలు చదువుతున్నంత సేపూ.
వివేకానంద్ అనే ఒక యువకుడు కాలేజీ రోజుల్లో జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతో అన్వేషిస్తూ ఇల్ల్లు వదిలి ప్రపంచంలోకి ప్రయాణం చేస్తాడు. ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తూ ప్రపంచాన్ని తన రీతిలో అర్థం చేసుకునే ప్రయత్న చేస్తూ సన్యాసుల మధ్య కొంత కాలం గడుపుతాడు. ముప్పై సంవత్సరాల తరువాత తల్లిని చూడాలనే కోరికతోమళ్ళీ ఇంటికి వెళతాడు. తల్లిదండ్రులు అప్పటికే వృద్ధులు. ఇద్దరూ డాక్టర్లే. అతనికో తమ్ముడు చెల్లెలు. వీరి వివాహాలు అయిపోయి విదేశాలలో జీవిస్తూ ఉంటారు. తల్లి తండ్రి ధనవంతులుగానే జీవిస్తూ ఉంటారు. వివేకానంద్ ను చూసి తల్లి చాలా సంతోషపడుతుంది. అతని రాకను ఎలా స్వీకరించాలో ముందు కొంత అర్థం కాని అయోమయంలో పడ్డా తరువాత మనస్ఫూర్తిగా బిడ్డను ఇద్దరూ ఆహ్వానిస్తారు. తల్లి కేన్సెర్ లాస్ట్ స్టేజీ లో ఉందని వివేకానంద్ కు తెలుస్తుంది.
ఈ లౌకిక ప్రపంచంలోకి వచ్చాక అతనికి తన మిత్రులు గుర్తుకు వస్తారు. ముందుగా తన గురువైన మురారి గారిని కలుసుకోవాలని వివేకానంద్ ప్రయత్నం చేస్తాడు. మురారి గారు లేరని ఎక్కడికెళ్ళారో తెలీదని ఒక మిత్రుని ద్వారా తెలుస్తుంది. మురారి గారి గతం తెలుసుకుని బాధ పడతాడు. తన మనస్తత్వంతో ఏ మాత్రం పొసగని భార్య పిల్లల మధ్య ఆయన పడిన బాధ, ఆయనను వెతుక్కుని వచ్చిన ఒక సాహితీ మిత్రురాలితో వారికి ఏర్పడ్డ అనుబంధం. దాన్ని అర్థం చేసుకోలేని ఆమె తండ్రి ప్రవర్తనా, ఆమె భర్త ఎంత సహకరించినా మురారి గారి తో సఖ్యంగా ఉండలేక బాధపడి ఆమె ఆత్మహత్య చేసుకోవడం. అది భరించలేక మురారి ఎటో వెళ్ళిపోవడం గురించి విని చాలా బాధపడతాడు వివేకానంద్. చిన్నతనంలో ఉద్యమంలోకి వెళ్లిపోయిన తన మిత్రుడు జాన్ కూడా మరణించి చాలా కాలమయిందని వివేకానంద్ కు తెలుస్తుంది. అతనికి దగ్గరగా వచ్చిన ఒక మరో మిత్రుడు సుధీర్. ఇతని తండ్రి పూజారి, తల్లి ఎవరితోనో వెళ్ళిపోయాక సుధీర్ తండ్రి అశాంతికి గురి అయి కూతురితో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. సుధీర్ తండ్రితో వెళ్ళడానికి ఇష్టపడడు. ఎప్పటికయినా తన తల్లి తిరిగి రావచ్చని అదే ఇంట్లో గుడి పూజారిగా ఉండిపోతాడు. అతన్ని వివేకానంద్ కలుసుకుంటాడు. జీవితంలోని ప్రశ్నలకు జవాబులు వెతుక్కునే క్రమంలో యోగిలా మారిన తన మిత్రుని అశాంతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.
తల్లిదండ్రుల స్నేహితుడు చలం గారి ద్వారా వివేకానంద్ తన తల్లి ఆమె స్నేహితురాలి ప్రేమ వృత్తాంతాలను వింటాడు. రెండు వివాహాలు చలం గారి ప్రోద్బలంతోనే జరిగాయని అతనికి తెలుస్తుంది. తల్లి స్నేహితురాలు ప్రతిభ భర్తను పది సంవత్సరాల క్రితం పోగొట్టుకుని ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. వివేకానంద్ తల్లి మరణం తట్టుకోలేక ఆ ఒంటరితనాన్నిస్వీకరించలేక ప్రతిభను వివాహం చేసుకోవాలని అతని తండ్రి అనుకోవడంతో కుటుంబంలో దుమారం లేస్తుంది. చివరకు వారిద్ధరూ స్నేహితులుగా జీవించాలని నిశ్చయించుకుంటారు. వివేకానంద్ పిన్ని అతనికి ఆద్యా అన్ అమ్మాయిని పరిచయం చేస్తుంది. ఆమె మీద యవ్వనంలో జరిగిన అత్యాచారం కారణంగా విరక్తితో వివాహం చేసుకోకుండా మిగిలిపోయిన ఆద్యా, వివేకానంద్ కలిసి జీవించాలని నిర్ణయించుకోవడంతో నవల ముగుస్తుంది.
నవల లో కథ ఎక్కడో మొదలయి ఎటో ప్రయాణించడం కనిపిస్తుంది. కాని ప్రతి పాత్రలో ఒక అన్వేషణ కనబడుతుంది. జీవితంలోని ఏవో మూలాలలోకి చేరాలని, మానవ చర్యలను, జనన మరణాలను అర్థం చేసుకోవాలనే తపన కనిపిస్తుంది. తమకు కావల్సినవి పొందినా అందని తృప్తి, తీరని కాంక్ష, జీవితంలోని సుఖ దుఖాల పట్ల ఎలా స్పందించాలో అర్థం చేసుకోవాలని ప్రయత్నించే వారి తాపత్రయం నవల అంతట్లోనూ కనిపిస్తుంది. ఉద్యమ కారుడైనా, సన్యాసి అయినా వారి జీవన పరిణామాలన్నీ ఒక చట్రంలో తిరుగుతూ కనిపిస్తాయి. ఆఖరికి గురువుగా భావించిన ఆదిత్య కూడా అన్ని సంవత్సరాల విరాగి జీవితం తరువాత తిరిగి తన భార్యను చేరడం కనిపిస్తుంది. అన్ని బంధాలను తెంచుకుని వెళ్ళినా మళ్లీ ఆ బంధాల పట్ల మానవ బాధ్యత వారిని సమాజంలోకి నెట్టివేయడం చూస్తాం. మనిషి ఎలాంటి సత్యాన్వేషణలోనయినా తోడును కోరుకోవడం కనిపిస్తుంది. ఆ తోడు నుంచే తన జీవితానికి కావల్సిన శక్తిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడేమో మానవుడు.
అన్నీ తెలిసిన మురారి గారు గాయత్రి ద్వారా శాంతి పొందాలనుకోవడం. వారి స్నేహం ఆమె భర్త జయంత్ ఆమోదించినా ఆమె తండ్రి అడ్డు చెప్పడం వల్ల గాయత్రి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఇదే అన్వేషణ కనిపిస్తుంది. జీవితానికి కావలసినవన్నీ ఉన్నా మనిషిలోని అన్వేషణ నిరంతరం సాగుతూనే ఉంటుంది. దానికి కావలసిన వనరుల కోసం అది వెతుక్కుంటూనే ఉంటుంది. దానిలో కోపం ఉంటే ఆ వ్యక్తి జాన్ లా ఉద్యమకారుడవుతాడు. అంతకు మించిన నిర్వికార భావం ఉంటే వివేకానంద్ లాగా ప్రపంచ యాత్రలోకి వెళతాడు. సుధీర్ ది కూడా ఒక అన్వేషణే. తల్లి జీవితం నడిచిన దారికి కారణాలను కనుక్కువి తన భాద్యతను నిర్వహించాలని జీవితం ఒక మనిషి తెలిసీ తెలియక చేసే చర్యల వల్ల దారి మళ్లీ అల్లకల్లోలానికి గురి అవుతున్నప్పుడు అంతటి దుస్థితికి, పతనానికి ఇవ్వవలసిన ప్రాధాన్యం పట్ల అతని ఆలోచన అతన్ని మరో రకమైన అన్వేషణకు పురికొల్పుతాయి. జీవితాన్ని అర్థం చేసుకోవాలని, తోడు కావాలని తిరిగి తిరిగి మళ్ళీ అదే చోటుకు మానవుడు రావలసి వస్తుందనే భావం ఈ నవల చదువుతున్నంత సేపూ కలుగుతూనే ఉంది.
ఒక చోట రచయిత అంటారు “అందరివీ ఫెయిల్యూర్ స్టోరీలే. ఫెయిల్ అవనున్న కథలే. ఎవరు విజయ గాథలు చెప్పుకున్నా అవన్నీ నడుస్తున్న జీవితానికి చెందినవి”… ఇది నిజంగా నిజం. పూర్తిగా విజయం సాధించిన మనిషి జీవితంలో కన్పిస్తారా…? అందరివీ అన్వేషణలే. అందుకే వివేకానందే అనుకుంటాడు “ ఇన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత మాత్రం ఏం తెలుసుకోగలిగాను మరిన్ని ప్రశ్నల్ని తప్ప” అని.. అందరికీ ఒకే రకమైన ఆలోచనలు రావు. ఎవరి ఆలోచనలనిబట్టి వారికి సంకేతాలు అందుతుంటాయి. వాటికి చుట్టూ ఉన్న సమాజం, పరిస్థితులు కూడా తోడు అవుతాయి. ఎవరికయినా తమ బతుకు పట్ల తమకి తృప్తి కలగటాన్ని మించింది ఏదీ లేదు. మన జీవితాలు ఎంతగా పబ్లిక్లోకి వెళ్తాయో అంతగా మనం కీర్తిని, అపకీర్తిని మనం చేసే ప్రతి పనిలోనూ విమర్శని, షేర్ చేసుకోవాల్సి వుంటుంది.. ఈ రోజు బతుకేమిటీ ? ఈ రోజు ఆనందాలు ఏమిటి? ఇంతకి మించి ఆలోచన రాకపోవడం అదృష్టమా? దాహం వేసినప్పుడు నూతిని తవ్వుకోవటంలోనూ ఒక సుఖం వుండి వుండాలి.
కొందరిలో ప్రతి చిన్న అంశాన్ని అన్ని పొరలు విప్పి చూడాలని వుంటుంది. ఏమీ మిగలదని తెలిసి కూడా. వివేకానంద్ ఆ కోవకు చెందినవాడే. అతని తల్లి మరణానికి చేరువలో కూడా చెప్పగలిగిన సత్యాలు అతనిలోని సంచార అన్వేషిని సైతం ఆశ్చర్యపడేలా చేస్తాయి. ఒక సందర్భంలో ఆమె అంటుంది “నాకు సంబంధం లేకుండా పుట్టాను. తర్వాత నేను కూడా ముగ్గురికి జన్మనిచ్చాను. అందుకే ఈ బతుకు కోసం చివరి వరకు ప్రయత్నం చేయాలి. ఇందులో బాధ వుంటుంది. సంతోషంగా వున్నంత వరకు బతికి బాధ వచ్చించని వదిలేసుకుంటామా???” అందరినీ పరిశిలీంచిన వివేకానంద్ చివరకు తెలుసుకున్నది. “అంతిమంగా మనిషికి ఏదీ సంతృప్తిని ఇవ్వదు. అందుకే ముందు నుండి వెనక్కి, మళ్ళీ ముందుకి ప్రయాణం చేస్తుంటారు. ఏ ఆలోచనలూ లేకపోవటం – ఏ ప్రశ్నా వేయకపోవటం – ఏ తిరుగుబాటూ చేయకపోవటం – నలుగురితో నేనూ, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా నేను ఒక్కడ్నే కాదు అనుకోవటంలోని తృప్తి ! సామాన్యుడిగా బతకటాన్ని మించిన పరమార్థం ఏముంటుంది?” అందుకే మానవ మేధోపరమైన అన్వేషణలన్నీ మళ్ళీ మొదలయిన చోటకే చేరడం. వివేకానంద్ జీవితం ఇలా మళ్లీ ఆది నుండి అంతానికి చేరుకునే ప్రయత్నంలో ఒక పూర్తి వృత్తాకారాన్ని చేధించి మళ్లీ మొదలయిన చోటుకే చేరడం కనిపిస్తుంది.
ఇది నవల అంటూ కథ కోసం కథనం కోసం చదవితే కష్టం. రచయిత చూపే మానవ జీవన పరిణామాన్ని, ప్రయాణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప చాలా వాక్యాలు అర్థం కావు. ఈ పుస్తకం చదవడం మాత్రం ఒక వింత అనుభవం.