ఎక్కడికి వెళ్ళగలను నేను

జాము రాత్రైనా కంటి మీద కునుకు వాలదు
రూపాలు రూపాలుగా కంటి పాపలపైన
విస్తరించిన అల్ల కల్లోల అరణ్యాలు
చెవుల్లో రొదపెడుతున్న
పోలీసు బలగాల పదఘట్టనలు
సాగుతున్న మారణహోమంలో
ఆవిర్లవుతున్న ఆదివాసుల ప్రాణాలు
ఈ నేల విడిచి ఎక్కడికి మేము వెళ్ళమని అన్నందుకు
ప్రాణాధికమైన ఈ అడవి విడిచి
ఎక్కడికీ మేము వెళ్ళమని తెగేసి చెప్పినందుకు
కళ్ళముందర రాజ్యం పారిస్తున్న రక్తపుటేరులు

వానికి అడివంటే
వనరులు సంపద పెట్టుబడి లాబాలు
మాకు అడివంటే
మా జీవితం మా చరిత్ర మా సంస్కృతి
అడవిని ఖాలీ చేయడమంటే
మేము మా జీవితాల్ని ఖాలీ చేయడమే
మా చరిత్రా సంస్కృతుల్ని తుడిచిపెట్టుకోవడమే
అడవిని విడిచి
అడవిని కాదని
ఎక్కడికని వెళ్ళగలం మేము
ఎలా బ్రతకగలం
మా కన్నీళ్ళ సాక్షిగా
నెత్తురోడుతున్న మా జాతి జనం సాక్షిగా
ఈ అడవి కల్లోలమైన
పాలస్తీనా యుద్ధభూమి ఇప్పుడు
నేలను దక్కించుకోవడం కోసం
అడవిని కాపాడుకోవడం కోసం
కొట్లాడటం తప్ప మరో మార్గం ఏముంది మా ముందర
కొందరికి అనిపిస్తుండవచ్చు
కొంత కాలం యుద్ధం ఆపి
ప్రాణ రక్షణ చేసుకోవచ్చు కదా అని
నిజమే కానీ
వానికి కావలసింది మా ఉనికే లేని అడవి
మేము విల్లంబులు దించినా
వాడు ఎక్కుపెట్టిన తుపాకీని దించడు
ఈ దేశంలో మేమున్న ప్రతీ చోటూ వానికి కావలసిందే
సంపద కలిగిన అరణ్యాలన్నీ వాడికి కావలసినవే
అలాంటప్పుడు చెతులు ముడుచుకొని
ఎక్కడికని వెళ్ళగలం మేము
వానితో తలపడటం తప్ప
వాన్ని ఎదిరించి నిలబడటం తప్ప
మా ముందు మరో మార్గం ఏముంది
వాడు ఇప్పుడు చేసేది
అంతిమ యుద్ధమని ప్రకటించాడు
కానీ ఇది మాకు ఆఖరి యుద్ధం కాదు
అనంతంగా మా జీవితాల పొడుగునా సాగే యుద్ధం

దేశ రాజకీయాలకు
ఇప్పుడు మేం కేంద్రబిందువులం
కార్పోరేట్ రాజ్యానికి
ఇప్పుడు మేం బద్ధ శతృవులం

వాడు లాబాల కోసం అడవిపై దాడి మొదలుపెట్టాడు
వాడు అడవిలోకి అడుగు పెడుతున్నంత కాలం
మేం యుద్ధం చేయవలసిందే
గాలి పీలుస్తున్నట్లు
ఆహారం తీసుకుంటున్నట్లు
రాత్రీ పగళ్ళు ఏర్పడుతున్నట్లు
యుద్ధం కూడా మా జీవితాల్లో భాగమైపోయిందిప్పుడు
లేదా యుద్ధమే జీవితమైంది

పుట్టిన నేల కోసం
ఆయుధం పట్టినవాడెవ్వడూ ఓడిపోడు
గెలుస్తూ ఓడుతూ గెలుస్తూ
ఈ నేల సాక్షిగా ఈ అడవి సాక్షిగా
రేపటి చరిత్రలో మా విజయం
కచ్చితంగా నమోదవుతుంది.

పుట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముత్తారం గ్రామంలో. పెరిగిందీ విద్యాబుద్ధులు నేర్చిందీ హన్మకొండ పట్టణంలోని కుమార్ పల్లి వీదుల్లో.
అప్పుడప్పుడూ కవిత్వం రాస్తుంటాను. ప్రగతిశీల విప్లవ సాహిత్యాలంటే వల్లమాలిన ప్రేమ.

One thought on “ఎక్కడికి వెళ్ళగలను నేను

Leave a Reply