(గుల్జార్
స్వేచ్చానువాదం-గీతాంజలి)
మీరే చెప్పండి! ఇదెక్కడి మోహబ్బత్ నాకు ఉర్దూ అంటే?
నోట్లో కమ్మగా ఊరుతూ… కరిగిపోయే పాన్ మధుర రసంలా ఉంటాయి కదా మరి ఈ ఉర్దూ పదాలు!
అసలు ఈ మోహం ఏంటి నాకు ఉర్దూ అంటే….?
మైకం కమ్ముకుంటుందెందుకు ఉర్దూ మాట్లాడేటప్పుడు?
చిక్కనైన కశ్మీరీ ఖిమాం పాన్ గాఢత లాగా
నోట్లో కలుస్తూ కలుస్తూ ఉండగానే భిన్నమైన భావాల అర్థాలను మనోహరంగా విరజిమ్ముతుంది.
అంతెందుకు? ఉర్దూ మాట పెదవులని తాకిన వెంటనే…
తీయని ద్రాక్షారసం …. గొంతులోకి గుక్కిళ్ళు దిగుతున్నట్లే ఉంటుంది!
నిజం చెప్పాలంటే.,
ఏదో ఉత్క్రుష్టమైన గుణం ఉందీ ఉర్దూలో…
మాట్లాడే మనిషికి, ఫకీరుతనంలో కూడా నవాబీ దర్పాన్నిస్తుంది!
అరుదుగా పదాల అర్థం దొరక్కపోవచ్చేమో కానీ…
బలమైన గొంతుతో మాట్లాడామనుకోండి, ఇక చూసుకోండి…
పుష్కలమైన., గంభీరమైన పదాల వొరవడితో ఉరకలెత్తుతుంది ఉర్దూ!
ఎక్కడో దూరాల నుంచి…. గాలిలో ఒక ఉర్దూ గజల్., పోనీ ఒక షాయరీ వినిపిస్తూ ఉందనుకోండి.,
అప్పుడిక ఎలా ఉంటుందనుకుంటున్నారు?
శీతాకాలపు చలిలో వారగా తెరుచుకున్న కిటికీలోకి., వెచ్చని సూర్యకాంతి వొలికిపోతున్నట్లే ఉంటుంది!
ఎంత ఆశ్చర్యచకితమైనదీ… అద్భుతమైనదీ ఉర్దూ అంటే…
అలా నెమ్మదిగా …పరధ్యానంగా
గల్లీలో నడిచిపోతున్న ఒక ఊరూ, పేరూ తెలియని బాటసారి…
అదాటున ఒక మీర్జా గాలిబ్ షేర్ అందుకుని., మత్తులో ఉన్నట్లు మైమరచి పాడేస్తుంటాడు!
అప్పుడతగాడు… అపరిచితుడే అయినప్పటికీ ఈ దేశానికి పరాయివాడు ఎట్లా అవుతాడు… చెప్పండసలు!
నా మాతృభూమికి చెందినవాడే అవుతాడు కదా!
సౌందర్యవంతమైన అల్ఫాజ్లతో, షేర్, షాయరీలు… టుంరీలు, గజళ్ళతో
సభ్యమైన… వినమ్రమైన పదాలతో…
సంపద్వంతమై పరిమళించి పోయే ఉర్దూ వింటూంటే…
ఈ దేశ సంస్కృతీ… నాగరికతల్ని మోస్తున్న
ఒక హిందూస్థానీ భాషా వారధి ఈ ఉర్దూ అనిపించక… ఉర్దూ కాక., మరి ఇంకేమనిపిస్తుంది…?
అపురూపంగా హృదయానికి హత్తుకోవాలనిపించక ఇంకోలా ఎలా అనిపిస్తుంది ?
ఇక ఉర్దూతో మోహబ్బత్ కాక ఇంకేమవుతుంది??