ఉప్పొంగే ఆవేశం కాదు, చల్లబడని చైతన్యాన్ని నేను

వివక్షను మోసే ఈ నేలపై
సమానత్వాన్ని నాటే విత్తనం నేను
నేను పుట్టింది అవకాశాలలో కాదు, నిరాకరణ గర్భంలో.
నేను కాగితంపై పుట్టిన కవితను కాదు, నొక్కి పెట్టిన గొంతులనుండి ఎగిసిన శ్వాసను.
నేను అణిచివేత, వివక్షతతో పెరిగిన పద్యాన్ని
చరిత్ర నన్ను చివరి పేజీలో పెట్టాలనుకుంది
కానీ, నేను కొత్త అధ్యాయంగా మొదలయ్యాను
చదవనివ్వని పేజీలో ఒక అక్షరంగా మిగిలిపోయాను
కానీ, కాలం తిప్పిన ప్రతిపుటలో నా నొప్పే పెద్ద శీర్షిక అయింది
నేను ఉప్పొంగే ఆవేశం కాదు, చల్లబడని చైతన్యాన్ని
నేను నినాదం కాదు, నిమిషంలో మాయమయ్యే శబ్దాన్ని కాదు
రోజు నడిచే ఆలోచనను
నా చేతిలో పుస్తకం మాత్రమే కాదు, భవిష్యత్తును తిరగరాసే కలం ఉంది
నా కళ్ళలో కలలు మాత్రమే కాదు, సమానత్వంతో వెలిగే ఉదయాలు కూడా ఉన్నాయి
చీకటి నన్ను కప్పేయలేదు, అది నాలో వెలుగును గర్భంగా మోసింది
నా నిశ్శబ్దాన్ని బంధించలేదు, గర్జనగా పెంచింది
కొందరు అడుగుతున్నారు
“నీ స్వరం ఎంత దూరం వెళుతుంది”? అని
నేను గట్టిగా చెప్పాను వాళ్లకు. “అణిచివేత చివరి గోడ కూలేంతవరకు వెళుతుంది” అని
నా పుట్టుక యాదృచ్చికం కాదు, చరిత్ర ఎదురు చూసిన సమాధానం
నా నడక సాధారణ ప్రయాణం కాదు, మార్పు కోసం మొదలైన మహాప్రస్థానం
నా పద్యాలు పూలదండలు కావు, విప్లవ శక్తులు
నా మాటలు తేనె పలుకులు కావు, అణచివేత గుండెల్ని రగిలించే అగ్నిజ్వాలలు
నా కవిత్వం రక్తపు రంగుతో రాసిన చరిత్ర
శ్రమజీవి ఊపిరిలో పలికిన నినాదం
సమానత్వం కోసం పుట్టిన నిత్యయుద్ధం
నేను కవిని కాదు
నేను కవిని కాదు, కాలుతున్న నిజాన్ని..

కవయిత్రి, రచయిత్రి. పుట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా, బస్వాపురం గ్రామం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (తెలుగు సాహిత్యం) చదివారు. వివిధ సామాజిక సమస్యలు, సంఘర్షణలపై కవిత్వం రాస్తున్నారు.  అట్టడుగు ప్రజల జీవితంలోని శ్రమైక జీవన సౌందర్యాన్ని కవిత్వం చేస్తున్నారు.

Leave a Reply