ఉన్మాదం

ఉన్మాదం
పండుగ ముసుగేసుకొని
వేయిపడగలనాగై
బుసలుగొట్టింది

వీధులు మతి తప్పి
పరాయి సంస్కృతిమీద
నగ్న తాండవంజేశాయి

అది వాటరుబెలూనై
నిస్సహాయ ముస్లిం మహిళ
వీపు మీద పగిలింది
కొడుకుకు మందుకోసం
బయలెల్లిన యువకునికి
నల్లరంగును పూసింది
మారణాయుధాలు
యధేచ్ఛగా గాల్లోలేసి
భీభత్స గానంజేశాయి

ముస్లింలమీద
రంగుల్ని గుమ్మరిస్తుంటే
చెప్పొద్దూ
వాల్లకే గాదు
చూసే వాల్లకు సైతం
తేల్లూ జెర్రెలు పాకినట్టయింది

పండుగ అంటే
ఎదురుచూసే సంబరం
భిన్న సంస్కృతులు
అలాయ్ బలాయ్ జేసుకునే ఆనంద అర్ణవం

మాఇంటికి బిర్యానీ వొస్తే
వాళ్లింటికి భక్ష్యాలు పోయేవి

మధ్యన జొచ్చిందెవడు
చిచ్చు ను బెట్టిందెవడు
పండుగల్నిజూసి
భయపడే రోజుల్ని దెచ్చిందెవడు

ఏమై పోతున్నాం

అంతులేని అగాధాల్లో
శవాలుగా కూరుకుపోవడానికే
ఇంత బతుకునూ బతికేస్తున్నామా

అక్కడెవరో వొస్తున్నారు
జై శ్రీరామ్…

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

One thought on “ఉన్మాదం

  1. మారదు లోకం

Leave a Reply