తెలుగు నేల మరో నిబద్ధ రాజకీయ, ఉద్యమ నేతను కోల్పోయింది. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండట మే కాదు, ప్రజా, ప్రజాస్వామిక ఉద్యమాలకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన సురవరం సుధాకరరెడ్డి గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత అయిన సురవరం కనుమూయటం ప్రజా, ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు. తనకు నిశ్చిత రాజకీయాభిప్రాయాలున్నా. అన్ని రాజకీయ పార్టీల నేతలతో, ఉద్యమకారులతో స్నేహపూర్వక సంబంధ అనుబంధాలు కొనసాగించిన సురవరం గొప్ప మానవీయ వ్యక్తి. ఆయన స్నేహశీలతనే ఆయనను ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, జాతీయంగా కూడా గొప్ప నేతగా నిలిపింది. ఒక రాజకీయ పార్టీ ప్రతి నిధిగా ముఖ్య జాతీయ నాయకుడిగా ఉండి కూడా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న నేత సురవరం సుధాకరరెడ్డి. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సురవరం వ్యక్తిత్వాన్ని అందరూ గౌరవించేవిధంగా అందరితో సంబంధ, అనుబంధా లు కొనసాగించిన విశిష్ట వ్యక్తి సురవరం.
కరువు సీమ మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయోద్యమ కాలంనుంచీ రాజకీయాల్లో ఉన్న కుటుంబంలో జన్మించారు. అరవై యవ దశకంలో విద్యార్థి ఉద్యమ నేతగా తన ఉద్యమ ప్రస్థానం కొనసాగించిన సురవరం ఆయన విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడారు. ఆ క్రమంలోనే ఆయన అడుగు పెట్టినచోటల్లా కాలేజీ, యూనివర్సిటీల్లో విద్యార్థి నేతగా కాలేజీ ఎన్నికల్లో ఎన్నికై విద్యార్థులు ఆదరాభిమానాలు చూరగొన్నాడు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనుబంధ సంస్థ ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర, జాతీయ నాయకునిగా, ఆతర్వాత యువజన విభాగం ఎఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా అనేక విద్యార్థి, యువజన ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ఆ క్రమంలోనే… సిపిఐ నేతగా రాజకీయ ప్రస్థానం కొనసాగించి జాతీయ కర్యదర్శిగా రెండు మార్లు ఎంపికై దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు. ఆ నేపథ్యంలోంచే ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికై ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజానేతగా పేరుగాంచారు. రెండు మార్లు 1998 ఒకసారి, 2004 లో మరొకసారి ఉమ్మడి నల్లగొండజిల్లా నుంచి ఎంపిగా ఎన్నికైన సురవరం జిల్లా ప్రజలతో విడదీయలేని అనుబంధం.
సురవరం రాజకీయ సిద్ధాంత రాజకీయాలు ఏవైనా.. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం ఎలా సుసాధ్యమవుతున్న దన్న సామాజిక స్థితిపై అవగాహనతో ప్రజా ఉద్యమాలకు తన మద్దతు తెలిపేవాడు. అంతమాత్రమే కాదు ప్రజాసమ స్యల పరిష్కారం కోసం, సామాజిక మార్పుకోసం సాగుతున్న ప్రజా ఉద్యమాలను సంపూర్ణంగా ఆహ్వానించేవాడు. సాగుతున్న ఉద్యమాలకు తన నైతిక మద్దతు తెలిపేవాడు. అవసరమైన సందర్భాల్లో ఎలాంటి బేషజాలకు పోకుండా కొనసాగుతున్న ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచేవాడు.
సురవరం గారి వ్యక్తిత్వం, ఆయన ప్రజాపక్షపాత రాజకీయాలకు ప్రతీకగా ఒక ఉదంతాన్ని చెప్పుకోవాలి. మీది తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఉన్న పార్టీ. ప్రజా స్వామిక వాదిగా మీరు ఎంపీగా గెలుపొందారు కదా, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో మీ పార్టీ ఉద్యమాలను నిర్మిస్తుందా, మీరనుకుంటున్న మార్పు వస్తుందా అని ఓ విలేకరి సురవరం గారిని అడిగాడు. ఆ క్రమంలోనే విప్లవోద్యమం ఈ సమాజానికి అవసరం ఉందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన అనుభవంలోకి వచ్చిన ఓ ఘటనను స్వయంగా సురవరం గారే తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. సురవరం గారు… విప్లవ ఉద్యమం ఈ సమాజానికి అవసరమా అనవసరమా అనే దానిమీద నాకు స్పష్టత ఉన్నది. నా వ్యక్తిగత నిర్ణయం, నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఓ సామాజిక స్థితినే ఉద్యమాల రూపురేఖలను నిర్ణయిస్తుంది. దాన్ని ఎవరూ కాదనలేరు, తప్పుపట్టలేరు. ఆ క్రమంలో నాకు తెలిసిన ఓ వాస్తవ ఘటన ఒకటి మీకు వివరిస్తాను. అది అవసరమా అనవసరమా అనేది మీరే చెప్పాలి. దేవరకొండ దగ్గర ఒక గ్రామంలో ఒక రైతు నాలుగెకారాల పొలం కాగితాలు ఆ ఊరి దొర దగ్గర తనకా (కుదువ) పెట్టి అప్పు తీసుకొని, ఆ తర్వాత దొరకు అప్పు తీర్చిన తర్వాత కూడా ఆ ఊరి దొర కాగితాలు రైతుకు ఇవ్వలేదు. భూమి కాగితాలు రైతుకు ఇవ్వకపోగా భూమి సాగు చేయనీయకుండా అడ్డుపడుతూ ఆ రైతును ఇబ్బంది పెడుతూ ఉంటే మా పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు పెడదామంటే ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు కేసు రిజిస్టరు చేయలేదు. మా పార్టీ మండల శాఖ ఎమ్మార్వో గారికి పలుమార్లు ఫిర్యాదులు చేసింది. ధర్నాలు రాస్తా రోకోలు రేలే నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేదు. చివరకు నా దృష్టికి తీసుకువచ్చారు. నేను కూడా ఎంపీగా ఎస్పీ గారికి కలెక్టర్ కు ఫోన్ చేసి వినతిపత్రం అందించినా ఏ ఫలితమూ లేదు. పోలీస్, రెవెన్యూ వ్యవస్థలేవీ దొరకు వ్యతిరేకంగా న్యాయం వైపు నిలిచి రైతుకు న్యాయం చేయటంలో విఫలమయ్యాయి. వ్యవస్థ అంతా ధనవంతులకే మద్దతుగా నిలిచింది. ఒక పార్టీగా, ఎంపీగా కూడా సామాన్య రైతుకు నేను న్యాయం అందించలేక పోయాను. రైతు రోదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది.
సరిగ్గా రెండు సంవత్సరాలకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో పీపుల్స్ వార్‌కు చెందిన వారు ఇద్దరు ఎదురు కాల్పుల్లో అమరులయ్యారు. దానికి నిరసనగా ఆ పార్టీ ప్రజాసంఘాల వారు, సానుభూతిపరులు ధోనియాల గ్రామంలో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ ను పేల్చేయాలని రాత్రి సమయంలో ఆ ఊరికి వచ్చారు. వారికి ఎక్స్చేంజ్ ఎక్కడ ఉందో తెలియక ఆ ఊరి చివరన ఉన్న గుడిసె దగ్గరికి వెళ్లి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉన్నదని అడిగారు. చీకట్లో వచ్చిన వారు ఎవరో ఆ గుడిసెలో ఉన్న రైతుకు తెలియదు. అడిగిన వారికి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ని చూపించి, తిరిగి వచ్చి పడుకున్నడు. తెల్లవారే సరికి ఊరంతా అతలాకుతలం. ఎవరో టెలిఫోన్ ఎక్స్చేంజ్ పేల్చివేశారన్న వార్త. ఎన్నడు చూడని విధంగా పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఎంక్వయిరీ మొదలు పెట్టారు. చివరికి రైతు దగ్గరి దాకా వచ్చింది. పోలీసులు వచ్చి నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పమని పోలీసులు రైతును గద్దించారు. రాత్రి పది మంది దాకా వచ్చి టెలిఫోన్ ఎక్స్చేంజ్ గురించి అడిగిన విషయం చెప్పి అంతకన్నా తనకేమీ తెలియదని అని చెప్పి రైతు ఊర్కొన్నాడు. రాత్రి వచ్చిన వాళ్లు నక్సలైట్లనీ, పీపుల్స్‌వార్ పార్టీ వాళ్లనీ ఊరంతా తెలిసిపోయింది. ఆ వార్త దావానలంలా ఆ ప్రాంతమంతా పాకిపోయిం
ది. అంతే కాదు హైదరాబాద్‌లో ఉంటున్న ఊరు దొర చెవికి చేరింది. అంతే… ఊరి దొర మరుసటి రోజు ఊరుకు వచ్చి ఊరందరి ముందర.. రైతును పిలిచి భూమి కాగితాలు రైతు చేతిల పెట్టి దండం పెట్టి వెళ్లిపోయాడు. జరిగిందంతా మర్చిపొమ్మని రైతును బతిమిలాడాడు. ఇప్పుడు చెప్పండి.. విప్లవం, ఉద్యమం ప్రజలకు అవసరమా కాదా..? అని సురవరం విలేకర్లను అడిగాడు.
ఈ ఘటన ఒకటే కాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాదు, మహబూబ్‌నగర్ జిల్లాలోనూ సాగుతు న్న ప్రజా ఉద్యమాల పట్ల సురవరం ఎంతో సానుకూలంగా ఉండేవాడు. ఆ నాడున్న పరిస్థితుల్లో పోలీసుల వేధింపులతో ప్రజలు ఎప్పుడు సురవరం సాయం కోసం వెళ్లినా వారి పట్ల సానుభూతి, సహానుభూతితో వ్యవహరించేవాడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టపరిధిలో తన వంతు కర్తవ్యంగా తాను కృషి చేస్తూనే, క్షేత్ర స్థాయిలో సాగుతున్న ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలిచాడు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తూ.., ఉద్యమాల పక్షపాతిగా కొనసాగిన సురవరం నిజమైన ఉద్యమకారుడు. ప్రజాపక్షపాతి సురవరంకి ప్రజల వినమ్రనివాళి.