ఉజ్మా

“అమ్మీ! అబ్బా ఔర్ నానీ కో బోలో హమ్ బుర్ఖా నహీ పెహేంతై” (అమ్మీ అబ్బాకి చెప్పు నేను బురఖా వేసుకోనని) ఉజ్మా బట్టలు ఇస్త్రీ చేస్తున్న షాజియా బేగం తో అంటున్నది. “బురఖా వేసుకోవడం మన ముస్లిం స్త్రీల ధర్మం అంటున్నాడు బేటీ! అబ్బా నహీ మాంతే, చెప్పి చూసా ఒకవేళ అబ్బా ఒప్పుకున్నా మీ నానీ ఒప్పుకోదు నేను వేసుకోనంటే నన్ను రాచి రంపాన పెట్టింది. నేను ఒకసారి బురఖా వేసుకోకుండా మీ చాచీ ఇంటికి పోతే మీ మామూని పిలిపించి మా అమ్మీ దగ్గరికి పంపించేసింది. ఇంక పెద్ద పంచాయితీ అయ్యింది ఇక జన్మలో బురఖా వేసుకోకుండా బయటకు వెళ్లనని ఖురాను మీద ఒట్టు వేయించుకొన్నాకే మీ నానీ నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది ఇంక అబ్బా కూడా ఏమీ చేయ లేని పరిస్థితి. నీకు తెలుసు కదా నానీ మనం నమాజు చేస్తున్నామో లేదో, బురఖా వేస్కుంటున్నామో లేదో ఎట్లా చూస్తుందో, ఆమెని కాదని అబ్బా ఒక్క పనీ చేయడు తెలుసు కదా” సాజియా నిదానంగా ఇస్త్రీ చేస్తూ అన్నది యుద్ధంలో ఓడిపోయిన మనిషి బానిస పని అలవాటైనట్లు. “ఖురాన్ లో ఎక్కడ ఆడవాళ్లు బురఖా వేసుకోవాలని లేదు, హిజాబ్ వేస్కోవచ్చని ఉంది. అది కొంచెం నయం తల ఒక్కటి కప్పుతుంది. నా వల్ల కాదు ఈ బురఖా వేసుకోవడం నువ్వు నానీ కి చెప్పు” కళ్ళనీళ్లతో ఉజ్మా అన్నది. సాజియా,ఉజ్మా వైపు చూడకుండా దీక్షగా తన పని చేసుకుంటూ, “నాకు మాత్రం ఇష్టమా కానీ ఆయన, మీ నానీ ఒప్పుకోకే కదా” అని గొణిగింది. తర్వాత “నానీ ఇంటికి వచ్చాము. అల్లరి చేయకు. ఇంకో రెండు రోజుల్లో మన ఇంటికెళ్లి పోతాం కదా “అంది లాలనగా. “అక్కడ అబ్బా ఉండడా నావెనక బురఖా పట్టుకొని తిరగడానికి” అంది ఉజ్మా గొంతు దుఃఖం తో రుధ్ధమవుతుంటే. సాజియా ఉజ్మా బురఖా ఇస్త్రీ చేస్తున్నది. పక్కన సాజియా, నానీ బురఖాలు కూడా ఉన్నాయి. ఉజ్మా కి మొన్న దుబాయ్ నించి అష్రఫ్ మామూ తోఫా గా తెచ్చింది ఆ బురఖా.

తన చదువు కోసం లాప్‌టాప్ తెమ్మంటే, మెరుపులు, రంగు రాళ్ళూ నిండిపోయిన బురఖా తెచ్చి తన నెత్తి మీద కుమ్మరించాడు మామూ. ఉజ్మా కోపంగా వెళ్లి బురఖా లాక్కుని దాన్ని నలిపి నలిపి నేల మీద పడేసింది. ఈ లోపల అక్కడికి నానీ వచ్చింది, నానీ తో పాటు ఉజ్మా అబ్బా ఆమీర్ వచ్చాడు. “బాహర్ దునియా బురా హై బేటీ బురఖా పెహన్నా హీ బెహతర్ హై! బడొంకా బాత్ మాన్ లో” (బయట లోకం చాలా దుర్మార్గంగా ఉంది బేటీ. బురఖా వేస్కోవడమే మంచిది. పెధ్ధవాళ్ళ మాట విను) అన్నాడు లాలనగా. “బురఖా వేసుకోని ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటం లేదా అబ్బా? తప్పు వేసుకునే బట్టల్లో కాదు అబ్బా, చూసే తప్పుడు దృష్టిలో ఉంది. అబ్బా జాన్, నన్ను నేను అందరిలాంటి ఒక మనిషిగా అనుకుంటాను రూప్ కౌర్, సంగీత లాగా. కానీ నన్ను నిలువెల్లా కప్పేసే ఈ బురఖా నన్నొక జంతువులాగా కనిపించేలా చేస్తుంది. అందర్నించి నన్ను విడిగా నిలబెడుతుంది. నేను స్వేచ్ఛగా ఉండలేను. ఎండాకాలం క్లాసులో బుర్ఖాలో వేడికి, ఉక్కకి ఉడికి పోతున్నాను. చమటలు ధారగా కారుతూనే ఉంటాయి, దురదలతో పిచెక్కుతున్నది అబ్బా! సాయంత్రం దాకా ఈ బురఖాని భరించలేను. నా దోస్తుల్లాగా హాయిగా కుర్తీ, పైజామా వేసుకోవాలని ఉంటుంది. నా ఒంటికి చల్లని గాలి కావాలి, గోరువెచ్చటి ఎండ తగలాలి. అబ్బా బురఖాలో ఉంటే నాకొక చీకటి జైలు గదిలో ఉంటూ లోకాన్ని చూస్తున్నట్లు ఉంటుంది అబ్బా. వూపిరి ఆడట్లేదు అబ్బా” అంటూ ఉజ్మా ఏడ్చేసింది. మళ్ళీ తనను తాను సంభాళించుకొని, “టెన్నిస్ ఆట అంటే ప్రాణం నాకు. బుర్ఖాలో ప్రాక్టీస్ చేయద్దని, బురఖా తీసి వస్తేనే పెర్మిషన్ ఇస్తామని స్పోర్ట్స్ మాస్టర్ అన్నాడు. నువ్వు ఒప్పుకోలేదు అబ్బా. టెన్నిస్ టీం లోనించి నన్ను తీసేసారు అబ్బా” ఉజ్మా మళ్ళీ భోరుమంది. “చుప్ కర్ ఏ రోనా ధోనా” అంటూ నానీ నేల మీద పడి ఉన్న బురఖాని, ఉజ్మాని కోపంగా చూసింది. గబ గబా వెళ్లి బురఖా అందుకొని ఉజ్మా వైపు కి నడిచి, బురఖాను ఉజ్మా వైపుకు చాచి, “పెహేన్” అన్నది కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ. ఉజ్మా “నహీ పెహేంతుం” అని గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. “బురఖా నహీ పెహెన్నా హై తో కాలేజ్ జానా భీ బంద్” (బురఖా వేసుకోక పోతే, కాలేజీ వెళ్లడం కూడా మానేయ్యాలి) నానీ అరుస్తూనే ఉంది.

** ** **

ఉజ్మాకి దుఃఖం వస్తున్నది. కాలేజీకి వస్తుంటే, పోతుంటే దారిలో పోకిరీలు “రుఖ్ సే జరా నఖాబ్ ఉతారో మేరేహుజూర్” (మొఖం మీద నించి ముసుగు తీసెయ్యి ప్రియురాలా) అంటూ వేధిస్తున్నారు. బుర్ఖాలు వేసుకునే తమ ముస్లిం అమ్మాయిలని కాలేజీలో కూడా ఇదే వేధింపు. ఇక్కడా, అక్కడా వాళ్ళే. స్టూడెంట్స్ లాగా ఉండనే ఉండరు. మణికట్లకు కాషాయ రిబ్బన్లు, రుద్రాక్ష జపమాలలు బ్రేస్లెట్స్ లాగా చుట్టుకొని, నుదుటి మీద పావలా కాసంత కాషాయ తిలకం పెట్టుకొని, అధికారం, దర్పం నిండిన చూపులతో, చదువుతో, కాలేజీ తో సంబంధం లేని వాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. తమ ముస్లిమ్స్ మీద, అమ్మాయిలు, అబ్బాయిలు అని కాదు, అందరి మీదా పెత్తనం చేస్తుంటారు. ఒక్క ముస్లిం అమ్మాయిల మీదే కాదు, హిందూ అమ్మాయిల మీద కూడా అంతే జులుం చేస్తుంటారు. వారం కిందే మేరీ ని బొట్టు పెట్టుకొమ్మని, చర్చికి కాకుండా రాముడి గుడికి వెళ్లాలని లేక పోతే, ఊరుకోమని ఇంటికొచ్చి దాడి చేస్తామని చెప్పడమే కాదు మేరీకి బలవంతంగా కుంకుమ బొట్టు పెట్టారు. మేరీ ఏడ్చుకొంటూ అలానే నుదుటి మీది బొట్టుతో ప్రిన్సిపాల్ విశ్వనాథ శాస్రికి చెప్పింది. ఆయన నవ్వు దాచుకొంటూ, “ఆ బడుద్దాయిలతో మాట్లాడతా కానీ, నాకు తేలీక అడుగుతా అమ్మాయి, మరి మీరు కిరస్తానీ మతం లోకి ఎందుకు మారాలి చెప్పు? మీది మాదిగ కులమైనా, మనం మనం హిందువులమే కాదూ? ఒకసారి మీ నాన్నని వచ్చి కలవమని చెప్పు నేను మాట్లాడుతాను. మీరు మళ్ళీ మన హిందువులలో కలిసేదాకా, ఈ పిల్లలు ఇట్ఠానే సతాయిస్తారు మరి” అని అన్నాడట ఆ పోకిరీలని వదిలేసి. మేరీకి వొళ్ళు మండి పోయిందంట. “హిందువులలో ఏ కులం లో కలవమంటారు సర్, మీ బాపన కులంలో కలవ మంటారా చెప్పండి ఇప్పుడే మారిపోతాం. మీరు ఇట్లా సతాయించబట్టే కాదూ, మా తాతల కాలం నుంచీ మేము కిరస్టానీ, ముస్లిం మతాల్లోకి మారిపోతున్నది” అందట ప్రిన్సిపాల్ మొఖంలో నెత్తుటి చుక్క లేకుండా పాలిపోతుంటే. ప్రతి ఏడాది ఫస్ట్ క్లాసులో పాసయ్యే మేరీ ఆ ఏడాది రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. మేరీని అట్లా ఏడ్పించినందుకు కాలేజీలో డీ.ఎస్.యూ వాళ్ళు పెద్ద ధర్నా చేసారు.

ఇక తమ ముస్లిం అమ్మాయిలతో అయితే మరీ ఘోరంగా ప్రవర్తిస్తారు “మీకు కాలేజీ చదువులెందుకు ఏ అరబ్ షేక్ నో పెళ్లి చేసుకొని కుప్పలు కుప్పలుగా పిల్లల్ని కంటూ జనాభా పెంచుకొంటూ, ఏ దుబాయో, పాకిస్తానో వెళ్లిపోక అట్లా అయినా మీ పీడ వదులుతుంది” అంటారు. బుర్ఖాల మీద కామెంట్లు చేస్తుంటారు. అసలే తల మీద నించి నల్లటి సిల్కు బురఖాలు దేహాన్నంతటినీ కాలుస్తుంటే, ఉక్కపోతా, చమటలు, దురదలతో తమ బాధేదో తాము పడుతుంటే, “అరేయ్ సైతాను వస్తుంది చూడరా, నల్ల దెయ్యం” అని ఈల వేస్తూ అరుస్తుంటారు. తనే కాదు బురఖా వేసుకొని వచ్చే ప్రతి ముస్లిం స్టూడెంట్ నల్ల దెయ్యమే, సైతానే వాళ్ళకి. గడ్డం పెంచుకొని, శల్వార్, టోపీ తో వచ్చే ముస్లిం అబ్బాయిల్నీ వేధిస్తుంటారు. టోపీ తీసి జేబులో పెట్టుకొనేదాకా. లేదా వాళ్లే టోపీ తీసేసి నేలమీద పడేసి వాటి మీద మన్ను పోస్తారు. జీన్స్ లో వచ్చే హిందూ అమ్మాయిలను చూస్తూ “వీళ్లకు కూడా బురఖా దిగేయ్యాలిరా, అప్పడుగానీ వీటికి తెలియదు. రేపులు చేస్తారు, వేధిస్తారు అంటారు మరి ఇట్లాంటి టైట్ ఫిట్టింగ్ డ్రెస్సులేసుకొని కవ్విస్తుంటే, రేపులు చెయ్యక ఏంచేస్తారని వయసులో ఉండే అబ్బాయిలు?” అంటూ నవ్వుకుంటూంటారు. ఆడవాళ్ళందరి మీదా బురఖాలు వేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారో, నానీమా చిన్నప్పటినుంచీ తనకి నఖాబ్, బురఖా అలవాటు చేసింది. పన్నెండేళ్ల దాకా తలని కప్పే నఖాబ్ వేసింది. తర్వాత నించి నిలువెల్లా బుర్ఖా లో ముంచేసింది. రంగు రంగుల బట్టలు వేసుకొని, దాని పైన బురఖా వేస్కోనని ఏడ్చేది తను. “బురఖా అల్లా ఆజ్ఞ తప్పకూడదు పాపం చుట్టుకొంటుంది, బురఖా ఆడవాళ్ళని మగవాళ్ల బురీ నజర్ నుంచి కాపాడుతుంది” అనేది నానీ. బురఖా వేసుకోని ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు ఎంత ఏడిపిస్తారో నానీ కి తెలియక కాదు. ఉజ్మాకి కోపం ఎక్కువ అవుతున్నది.

ఈ లోపల ఫోన్ మోగింది. రూప్ కౌర్ అవతల నించి మాట్లాడుతున్నది. “హాస్టల్లో నోటీసు పెట్టారు. ఆడపిల్లలు జీన్స్, షర్ట్, హాఫ్ స్కర్ట్స్ వేస్కోకూడదట” రూప్ కౌర్ చెపుతూనే ఉంది. కౌర్ నుంచి ఫోన్ అందుకున్నట్లున్నది సంగీత “అరె పంజాబీ డ్రెస్, అది కూడా నిండుగా చున్నీ వేస్కోవాలట, ఫోన్స్ కూడా పేరెంట్స్ దగ్గర ఉన్నదే వాడాలంట. లేకపోతే బాయ్ ఫ్రండ్స్ తో మాట్లాడతామంట. ఇక్కడ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ధర్నా మొదలు పెట్టేసారు,” ఆవేశంగా చెబుతున్నది సంగీత. “నువ్వు వూర్లో ఉన్నది చాలు కానీ జెండర్ స్టడీస్ క్లాస్సెస్ మొదలైనాయి వచ్చేయి” అంది సంగీత. ఉజ్మా కోపంతో ఉడికి పోయింది. ఏమిటీ ఇంత నిర్బంధం. ఎందుకు తీసుకుంటారు తమ మీద ఇంత అధికారం? అబ్బా జాన్ కి వూర్లో ఇంకా నాలుగు రోజులు పని ఉంది. తను ఈ రోజే వెళ్లి పోవాలి, రేపట్నుంచి క్లాస్సెస్ మొదలు.

** ** **

“తమ్ముడితో గొడవ పడకు పనులు పూర్తవగానే నేనూ అబ్బా వచ్చేస్తాం” చెపుతూ సాజియా బేగం ఉజ్మాని సాగనంపింది. ఆమీర్, ఉజ్మా అబ్బాజాన్ ఇంట్లో లేడు. నానీ కూడా బయటకు వెళ్ళింది. ఉజ్మా తలకి మాత్రమే చుట్టుకునే నఖాబ్ వేసుకుంది. “జల్దీ చలో అబ్బా, నానీ ఆగయే తో బురఖా పెహెన్నా పడేగా” అంది. వాళ్ళక్కడ లేక పోయినా అటూ ఇటూ భయంగా చూస్తూ గుస గుస గా. మామూ ఇచ్చిన బురఖా మాత్రం మర్చిపోకుండా ఉజ్మా బాగ్ లో సర్దింది. “నికల్‌నే సే పహలే ఫోన్ కరుంగి, అగర్ తూ కాలేజ్ మే హై తో బురఖా పెహన్ కే ఘర్కో ఆనా” అంది నవ్వుతూ. (బయలుదేరే ముందు ఫోన్ చేస్తా, కాలేజీ లో ఉంటే బురఖా వేసుకొని ఇంటికి రా) ఉజ్మా నవ్వుతూ తల్లికి ముద్దు పెట్టి బయలుదేరింది.

** ** **

ఉజ్మాకి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. తనకి ఇష్టమైన తెల్లని కుర్తీ పైజామా వేసుకుంది. వేస్కునేటప్పుడు గమనించింది. తొడల మీదా, నడుము మీదా ఎర్రని దద్దుర్లు ఎర్రగా మెరుస్తున్నాయి. ఎండలతో బురఖా వేసుకొని దాని కింద ఉడికిపోతుంటే, చర్మం ఇట్లా దద్దుర్లు తేలుతున్నది. అబ్బాకి ఎట్లా అర్థం అవుతుంది? అబ్బా తన లాగా, అమ్మీలాగా అసలు ఆడ దాని లాగా మారితే తప్ప? అమ్మీకి చూపించాలి. తనకేనా? తన క్లాస్మేట్ తన్వీర్ కి కూడా ఇదే సమస్య. ఈ బుర్ఖా కనిపెట్టిన వాడు ఎవడో కానీ ముందు వాడి నెత్తిన బురఖా వెయ్యాలి. అసలు అబ్బా జాన్ కే వెయ్యాలి. ఈ మండే ఎండల్లో గంటల తరబడి ఉండి చూడమనాలి అప్పుడు గానీ తెలియదు. దెబ్బకి తనే “ఉజ్మా బేటీ మత్ పెహేనో ఏ బురఖా” అంటూ దాన్ని మంటల్లో కాల్చేయ్యడూ? అసలు లాప్‌టాప్ తెమ్మంటే బురఖా తోఫా గా తెచ్చిన మామూకీ కూడా ఈ బురఖా వెయ్యాలి. అసలు లోకంలో ఉన్న అందరు మగాళ్ళకీ బురఖాలు వేసేయ్యాలి అప్పుడు గానీ ఈ ఉక్కబోత తెలియదు వాళ్ళకి. ఉజ్మాకి ఒక్క సారి అబ్బా జాన్, మామూ బుర్ఖాల్లో కనపడ్డారు. నవ్వొచ్చింది. గోడ మీది కొక్కానికి ఉన్న కొండచిలువల్లా నిగ నిగ లాడుతున్న నల్లటి బురఖాలను తిరస్కారంగా చూస్తూ, తన బురఖాని అబ్బా కుర్తా మీద తగిలించి, దాన్ని చూస్తూ నవ్వుకొంది. బ్యాగ్ భుజానికి తగిలించుకుని బయలుదేరింది. “అరె ఆపా బుర్ఖాతో పెహేన్ లో, భూల్ గయే క్యా,” అన్నాడు ఉజ్మా తమ్ముడు రాషీద్ (అరే అక్కా బురఖా వేస్కో మరిచిపోయావా ఏంటి). “అబ్బాజాన్ బదులు నువ్వు తయారయ్యావా నేను వేసుకోను పో, ఏం చేస్తావ్ చేస్కో, నువ్వే వేస్కో” అంటూ ఉజ్మా కోపంగా గడప దాటింది. అబ్బాజాన్ కో మాలుమ్ హువా తో కాట్ దేంగే మాలూమ్ నై క్యా తెరేకు?” (అబ్బా జాన్ కి తెలిసిందంటే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తారు తెలుసు కదా) గాలిలో వెంటాడుతున్న రషీద్ హెచ్చరికను పట్టించుకోకుండా నడవ సాగింది ఉజ్మా. రషీద్ అలా అనడం అవమానంగా అనిపించింది. కోపంతో మొఖంలోకి ఆవిర్లు వచ్చాయి. దానితో పాటు తను డిగ్రీలో మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అబ్బా జాన్ ఊరెల్లి నాలుగు రోజులకి గాని రాడనుకుని దోస్తు నిఖా కి బురఖా లేకుండానే వెళ్ళింది. తన డ్రెస్ చూసి అందరూ బాగుందంటే మురిసిపోయింది. బురఖా ఉంటె డ్రెస్ అందం ఎక్కడ కనపడుతుందని? తనకెంత కోరికో బురఖా లేకుండా అందమైన డ్రెస్సులో అందరిలాగా తిరగాలని ఉహూ, బురఖా ఎప్పుడూ అడ్డమే అబ్బా లాగా.

సంతోషంగా ఇంటికి వచ్చింది. అబ్బా జాన్ ని చూసి వణికి పోయింది. బెల్ట్ తీసుకొని రక్తాలు కారేలా కొట్టాడు. “అబ్బా మారో నక్కో బినా బుర్ఖాసే బాహర్ నహీ జాతుమ్” అని దెబ్బలు భరించ లేక విల విల లాడుతూ, అబ్బా కాళ్ళ మీద పడి పోయింది. అమ్మీ తనని లోపలికి తీస్కెళ్ళి పోయింది. అమ్మీ వొళ్ళు కూడా తట్లు తేలింది. అంటే తను రాక ముందే అమ్మీని కొట్టాడు అబ్బా. తనవల్ల అమ్మీ దెబ్బలు తిన్నది. “మాఫ్ కరో అమ్మీ” అని తను అమ్మీని పట్టుకొని ఏడ్చింది. ఇక అప్పటినించి బుర్ఖా మరవలేదు అమ్మీ కోసం. కానీ బురఖాని ఎప్పటికైనా తన జీవితం లోనించి తరిమేయ్యాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు తమ్ముడు అవే, ఆ దెబ్బలనే వెక్కిరింతగా గుర్తుకు చేస్తున్నాడు. ఆడవాళ్లంటే చిన్న చిన్న మగ పిల్లలకి కూడా చులకనే, ఒకసారి ఇంటి ముందు కూర్చుంది అమ్మీ పక్కింటి ఆంటీ తో మాట్లాడుతూ. ఇంతలో స్టీల్ సామాన్లు అమ్మే అబ్బాయి వచ్చాడు అమ్మీ చీరలోనే ఉంది. అక్కడే గోలీ లాడుతున్న రషీద్ “అమ్మీ అందర్ జాకర్ కమ్ సే కమ్ నకాబ్ తో పెహేనో” అని హుకుం చేసాడు. (అమ్మీ లోపలి వెళ్లి కనీసం నఖాబ్ అన్నా వేసుకో. నఖాబ్ = తలని, చెవులని చుట్టే పెద్ద గుడ్డ.) పదేళ్ల పిల్లాడు, అమ్మీ కడుపున పుట్టిన వాడు, అమ్మీ మీదే పెత్తనం చేస్తున్నాడు. చిన్నోడైతే ఏమిటి, కొడుకైతే ఏమిటి, మగాడు, వాడు అట్లానే ఉంటాడు. ఉజ్మా పక్కనే హారన్ మోగడంతో తృళ్లి పడి ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చింది. ఉహు, ఈ రోజు బురఖా వేసుకోలేదు సంతోషంగా ఉండాలి, హాయిగా గడపాలి. పాతవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధ పడకూడదు. ఉజ్మా తనని తాను ఉత్సాహ పరుచుకుంది. ఒక్కసారిగా ఒంటికి చల్లని గాలి, వెచ్చటి ఎండా తాకి ఉజ్మా ఒక వింత పులకింతకి లోనయ్యింది. తనది కాని ఒక అందమైన లోకంలోకి వచ్చి పడ్డట్లు అనిపించింది. ఒక బెరుకు లాంటిది కూడా కలిగింది. తన దేహ స్పందనలు కూడా ఉజ్మాకి కొత్తగా అనిపించాయి. బురఖా లేని తన వొంటిని గుచ్చి గుచ్చి చూస్తున్నారేమో అని ఒక రకమైన భయం కూడా ఒక క్షణం కలిగింది. ఒక్కసారి కంగారుగా చుట్టూ చూసింది. “ఆహా ఏం షేపులురా” అని సంగీత, రూప్ కౌర్ వెళ్తుంటే పోకిరీలు అనే మాటలూ గుర్తుకు వచ్చాయి. ఒక్క క్షణం తన దేహం ముడుచుకు పోయినట్లు అనిపించింది. మళ్ళీ తనను తాను సంభాళించుకుంది. నిటారుగా, ఆత్మవిస్వాసంతో శరీరాన్ని నిలువుగా నిలబెట్టి ముందుకు నడవ సాగింది. బురఖా లేకుండా ఇంటి డాబా పైనా, ఎండలో, చల్లటి గాలిలో చాలా సార్లు తిరిగింది. ఇంటి ముందు కూడా అబ్బా తిరగనివ్వడు. కానీ డాబా పైన బురఖా లేకుండా తిరగడం కూడా ఒక వూపిరాడని తనం లోనించే. డాబా కింద ఇంట్లో అబ్బా నిఘాలో, “జల్దీ చలే ఆవ్, ఉత్రో ఉత్రో” అంటూ దిగమని అరుస్తూ ఉంటాడు. అప్పుడు బురఖా తీసినా, అనంతమైన ఆకాశం కింద చల్లటి గాలి వీస్తున్నా, వూపిరాడేది కాదు. కానీ ఇక్కడ తొలిసారిగా బురఖా లేకుండా వీధుల్లో అదీ ఒంటరిగా అబ్బా, రషీద్, అప్పుడప్పుడు మామూ తోడు లేకుండా నడుస్తోంది. తన భుజాల మీద నుంచి బరువేదో దిగి పోయినట్లు అనిపించింది. తనకు తానే కొత్తగా అనిపించింది. ఎండ, ఎండ, ఎంత బాగుంది, వెచ్చటి ఎండ ఎంత సుఖంగా ఉంది? అసలీ ఎండలో ఉండే అదృష్టం ఎక్కడిదీ? తన్వీర్ ను వాళ్ళ అమ్మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి తనకు వచ్చినట్లే వచ్చిన మచ్చలను, దద్దుర్లని చూపించింది. “బురఖా తీసేయ్యండి మంచి గాలి తగలాలి. ముఖ్యంగా ఎండ తగలాలి. గాలి, ఎండా తగలక పోతే చెమటతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. చర్మానికి ఎండ తగలక పోతే విటమిన్ డి తయారు కాకుండా ఎముకలు బలహీనమవుతాయి. కాల్షియమ్ పరీక్షలు చేయించుకోండి” అని చెప్పిందట. రోజూ ఎండలో బురఖా లేకుండా ఒక రెండు గంటలైనా ఉండమని చెప్పిందట. బుర్ఖా వల్ల ఆడిపిల్లల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం తగ్గిపోతాయి అని కూడా చెప్పి, ఏవో క్రీములు, విటమిన్ డి టాబ్లెట్స్ రాసిందంట. తను కూడా అమ్మీకి చూపించాలి తనకి వచ్చిన దద్దుర్లని.

ఇన్నాళ్లూ బుర్ఖా దోచుకున్న ఆనందాన్ని తనివి తీరా అనుభవిస్తూ కాలేజీకి చేరుకుంది ఉజ్మా. కాలేజీ లోపల పోస్టర్లు, బానర్లు ఉన్నాయి. అమ్మాయిల డ్రెస్ కోడ్ ని నియంత్రించే పురుషుల హక్కు అధికారాలను ఖండిస్తున్న నినాదాలు ఆ బ్యానర్ల మీద రాసి ఉన్నాయి. కంగారుగా హాస్టల్ వైపుకి వెళ్ళింది ఉజ్మా. నోటీసు బోర్డు మీద రూప్ కౌర్, సంగీత చెప్పినట్లు విద్యార్థినులు ఎటువంటి బట్టలు వేసుకోవాలో, ఎలాంటివి వేసుకోవద్దో, టైట్ జీన్స్ ప్యాంటు, షర్ట్స్ తో అబ్బాయిల్ని రెచ్చగొట్టే డ్రెస్సులు వేయద్దని, అలాగే పేరెంట్స్ దగ్గర ఉన్న నంబర్ల లోనే ఫోన్లు మాట్లాడాలన్న నిబంధనలతో పాటుగా, కారిడార్లలో నిల్చొని అబ్బాయిలతో మాట్లాడకూడదని, రెస్టరెంట్స్ కి, సినిమాలకి వెళ్ళకూడదని, లైబ్రరీలో అబ్బాయిలు ఉంటే, అమ్మాయిలు అటువైపు వెళ్లకూడదని రాసి ఉన్నాయి. ఆ రాతల కింద ప్రిన్సిపాల్ విశ్వనాథ శాస్త్రి సంతకం ఉంది. అది చదివి ఉజ్మా ఉడికి పోయింది కోపంతో. అక్కడ గుమి కూడిన చాలా మంది అమ్మాయిలు కూడా కోపంగా చర్చించుకుంటున్నారు. “ముందు ఆ పిలక బాపనాయన పని పట్టాలి” అనుకుంటున్నారు. “మనం ఏ రకం బట్టలు వేసుకోవాలో చెప్పటానికి ఈయన ఎవరసలు? ఇది టూ మచ్! పదండి ధర్నా మొదలవుతుంది పోదాం” అనుకుంటున్నారు. ఈ లోపల అక్కడికి రూప్ కౌర్, సంగీత వచ్చారు. ఇద్దరూ కుర్తీ పైజామా వేసుకొని చున్నీ నిండుగా కప్పుకొని ఉన్నారు. ఇద్దరి మొఖాలు ఏదో బెదురుతో పాలిపోయి ఉన్నాయి. “నిన్న బలవంతగా మేము వేసుకున్న జీన్స్ మార్పించి ఇవి వేయించారు. మార్చమంటే మీది మీదికి వచ్చారు. మార్చక తప్పలేదు.” సంగీత బలహీనంగా కళ తప్పిన కళ్ళతో అంది ఉజ్మాతో.

“ఏయ్ చున్నీ వెయ్యాలని తెలీదా ఫో, పోయి చున్నీ వేస్కో! అరే అది చూడ్రా ఇంకా జీన్స్ మీదే ఉందిరా. మనమంటే బొత్తిగా భయం లేదు. పోయి దాని పని చూడండిరా, ఏయ్ సైతాన్ నీ బుర్ఖా ఏది? ఏంటీ వేషం? బురఖా లేకుండా రోడ్డు మీదకి ఎట్లా పంపాడే నీ అబ్బా,” అంటూ మీది మీదకు వస్తున్నారు చింత నిపుల్లాంటి కళ్ళతో ఉదయ్, రావీష్, విజయ్ లు. “నీ ఇంటికొచ్చి నీ అబ్బా తో బురఖా తొడిగిస్తాం ఉండు” అని బయట నించి అరుస్తున్నారు. “అక్కడ లైబ్రరీ లో అబ్బాయిలున్నారు, అటువైపు పోవద్దని చెప్పలేదా? మీకు సిగ్గు లేదా? నడవండి, నడవండి” బయట విజయ్ గొంతు వినిపిస్తున్నది. రూంలో అమ్మాయిలు భయంతో, అవమానంతో, ఆందోళనతో మాట్లాడుకొంటున్నారు. “వాళ్ళు వెళ్లి పోయాక ప్రొటెస్టులో పాల్గొందాము. భయపడకండి. మనకిష్టమైన బట్టలు, మనకు సౌకర్యంగా ఉండే బట్టలు మనం వేసుకోవాలి. అది మన హక్కు. మనల్ని నియంత్రించే అధికారం వీళ్ళకి లేదు” ఆవేశంగా అంటున్నది భవ్య.

** ** **

టీవీ లో అన్సారీ ని చేతికి కాషాయ రంగు తాళ్ళు కట్టుకున్న యువకులు క్రూరంగా కొడుతుంటే, అన్సారీ ప్రాణభయంతో రక్షించమని, కొట్టద్దు అని తన రెండు చేతులు జోడించి ఏడుస్తూ, ఆ మూకని ప్రాధేయ పడుతున్న దృశ్యాన్ని ఆందోళనతో మొఖాలు పాలిపోతుంటే భయంగా చూస్తున్నారు ఆమిర్, రషీద్, సాజియా బేగం. ఆ మూకలని ప్రాధేయ పడుతున్న అన్సారీ మొఖం లో మృత్యు భయం అత్యంత దీనంగా కదులుతున్నది. “యా అల్లా! క్యో మార్‌తే హై ఏ లోగ్ హమ్ కో” (యా అల్లా! వీళ్ళు ఎందుకు మనల్ని చంపుతారు?) అంటూ సాజియా బేగం కళ్ళ నీళ్లు తుడుచుకొంటున్నది.

ఇంతలో తలుపులు దడ దడ బాదడం వినిపించింది. దానితో పాటుగా “దర్వాజా ఖోలో” అని కేకలు వినిపించాయి. సాజియా బేగం గుండెలు దడ దడ లాడాయి. ఆమీర్ ఆందోళనతో లేచి నిలబడ్డాడు. రషీద్ కిటికీ రెక్క కొద్దిగా పక్కకు చేసి బయటకు తొంగి చూసి, మళ్ళీ మూసేసి “అబ్బా వో లోగ్ ఆయే హై, పుకార్తే హై, మార్దేంగే క్యా హమ్ కో, హమ్ క్యా భీ నై కరేనా అబ్బా” అంటూ భయంగా అమ్మీ దగ్గరికి వచ్చాడు. (అబ్బా వాళ్ళొచ్చారు, అరుస్తున్నారు. మనం ఏమీ చేయలేదు కదా చంపేస్తారా మనల్ని?) ఆమీర్ ధైర్యం తెచ్చుకొని “డరో నక్కో మై దేక్తా హూ” (భయపడకండి, నేను చూస్తాను) అంటూ మెల్లగా తలుపు తెరిచాడు. వెంటనే పది మంది యువకులు ఇంట్లోకి దూరి పోయారు . గుండాల్లా ఉన్నారు. ఒక్కొక్కరి నుదుటి పైన కాషాయ బొట్లున్నాయి. మెడలో రుద్రాక్ష మాలలున్నాయి. “ఉజ్మా కా బాప్ హైనా తూ?” (ఉజ్మా తండ్రివా నువ్వు ?) “లో ఖాలో! రామ్ జీ కా ప్రసాద్ హై! లో ఖాలో ఖాలో!” (తీసుకో రాముల వారి ప్రసాదం తిను, తిను) అంటూ బలవంతంగా ఆమిర్ చేతిలో ప్రసాదం కుక్కాడు విజయ్. “ఆప్ లోగ్ కౌన్ హై” (మీరెవరు) అని భయంగా అడిగాడు ఆమిర్. “పహలే ప్రషాద్ ఖావ్ బోలానా” (ముందు ప్రసాదం తినమని చెప్పానా) అంటూ విజయ్ ఆమిర్ చేతిలోని ప్రసాదాన్ని అతని నోటిలోకి బలవంతంగా కుక్కాడు. ఆమిర్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. “ఆప్ గలత్ కర్రె” (మీరు తప్పు చేస్తున్నారు) ఆమిర్ ఆక్రోశంగా, కోపంగా అన్నాడు. “ప్రసాద్ తూక్నా నహీ! నింగలో, చల్ నింగలో!” (ప్రసాదం ఉమ్మద్దు, మింగు, చల్ మింగు) అంటూ రవీష్ ఆమిర్ తల వెంట్రుకలు పట్టుకొని, ఆమిర్ ప్రసాదం మింగే దాకా వెంట్రుకలు గట్టిగా గుంజుతూనే ఉన్నాడు. ఆమిర్ ప్రసాదం మింగలేక కక్కలేక సతమతమవుతూన్నాడు. “ఖాలో అజీ ఖాలో కుచ్ భీ నై హోతా రామ్ యా అల్లా సబ్ ఏకీ హై ఖాలో మియా ఖాలో” (తినేయి, ఏమీ కాదు రాముడైనా, అల్లా అయినా అంతా ఒకరే తినేయి) అంటూ వల వలా ఏడుస్తూ సాజియా బేగం ఆమిర్ దగ్గరకొచ్చి బ్రతిమిలాడింది. ఆమిర్ ప్రసాదాన్ని మింగేసాడు, కళ్ళ నిండా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. తనకు ఇష్టం లేని పని బలవంతంగా, దౌర్జన్యంగా చేయించడంతో అవమానంతో ఆమిర్ లో ఆగ్రహం ఉప్పొంగింది. కానీ అనువణువూ క్రూరత్వం నిండిపోయి పశువుల్లాగా ప్రవర్తిస్తున్న వీళ్ళు ఏమైనా చేయ గలరు. “గలత్ కిస్కా హై అబ్ బొలెంగే సునో,” (తప్పు ఎవరిదో ఇప్పుడు చెబుతాం విను) అన్నాడు విజయ్. ఉజ్మా ఏం చేసిందో చెప్పుకొచ్చాడు. “జాగ్రత్త! బురఖా లేకుండా కాలేజీకి పంపిస్తే, ఆ ఉన్న బట్టలు కూడా వూడ దీస్తాం. ఏం పెంచుతున్నారు మీ అమ్మాయిని? బయటకు వెళ్లే ముందు బుర్ఖా వేసుకుందో లేదో చెక్ చేయరా ఏం తల్లిదండ్రులు మీరు? ఇంకోసారి బురఖా లేకుండా వచ్చిందో,” చూపుడు వేలితో బెదిరిస్తూ, “కాట్ కే గాడ్ దేంగే” (నరికి పాతరేస్తాం) క్రూరంగా చూస్తూ బెదిరించాడు విజయ్. ఆమిర్ చేష్టలుడిగి చూస్తున్నాడు. “అర్థం కాలే? ఏం మాట్లాడవేంటిరా” అంటూ రవీష్ ఆమీర్ చెంప మీద చెళ్లుమని కొట్టాడు. ఎంత గట్టిగా కొట్టాడంటే ఆమిర్ కింద పడి పోయాడు. కొట్టిన దెబ్బకి ముక్కులోనించి రక్తం కారసాగింది. సాజియా వల వలా ఏడుస్తూ “కొట్టకండి, బాబూ కొట్టకండి, మేము ఇంట్లో లేము ఉజ్మా కాలేజీకి వెళ్ళినప్పుడు, తప్పైపోయింది మాఫ్ చెయ్యండి ” అంటూ సాజియా రెండు చేతులూ జోడించి ఆమిర్ ని రెండు చేతులతో కమ్ముకొంది వాళ్ళు మళ్ళీ కొట్టకుండా. “బురఖా లేకుండా పంపిస్తే ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తాం,” రవీష్ వేళ్ళతో అసభ్యంగా సైగ చేస్తూ, ఏదో బూతు మాట అన్నాడు. అక్కడున్న టేబుల్ ని కాళ్లతో తన్ని, కుర్చీలని ఎత్తి నేల మీద పడేసి, గోడ మీద ఉన్న మక్కా మస్జీద్ పటాన్ని తీసి నేలకేసి విసిరి కొట్టి వెనక్కి, వెనక్కి తిరిగి, తిరిగి చూస్తూ చూపుడు వేళ్ళతో బెదిరిస్తూ వెళ్లి పోయారు. “యా అల్లా” అనుకుంటూ, ఏడుస్తూ సాజియా ముక్కలైపోయిన మక్కా పటాన్ని తీసి గుండెలకు అదుముకుంది. ఆమిర్ మెల్లిగా లేచి నిలబడ్డాడు. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దంతో నిండి పోయింది. ముక్కలైన అద్దం ముక్కల్ని ఏరసాగింది సాజియా. రషీద్ తండ్రికి తగిలిన దెబ్బలకి మందు రాయసాగాడు. టీవీ లో అన్సారీని కొడుతుంటే, అన్సారీ ప్రాణ భయం తో ఏడుస్తూ రక్షించమని ఏడుస్తున్న దృశ్యాన్ని స్క్రోల్ చేస్తూనే ఉన్నారు.

ఇంతలో ఉజ్మా వచ్చింది. సాజియా కి భయంతో ఊపిరాగిపోయింది. వెంటనే వెళ్లి ఉజ్మాని పట్టుకుంది ఆమిర్ నించి రక్షించుకోవాలన్నట్లుగా. ఆమిర్ కూతురి వైపు చూసాడు. తెల్లటి కుర్తీ పైజామా లో స్వచ్ఛమైన మల్లె పూవులా, ఫరిస్తా (దేవత) లాగ కనిపించింది. అప్పుడే తొలిసారి చూస్తున్నట్లుగా ఉజ్మాని చూస్తున్నాడు ఆమిర్. మెల్లిగా ఉజ్మా వైపు నడిచాడు. “మారో నక్కొ, మారో నక్కొ” (కొట్టద్దు కొట్టద్దు) అంటూ సాజియా వణికి పోతూ ఉజ్మాని గుండెలకు గట్టిగా హత్తుకొంది. ఆమిర్ కి వెంటనే, గూండాలు తనని కొడుతుంటే, సాజియా వచ్చి తనని ఇలాగే కమ్ముకొని రక్షించిన దృశ్యం కళ్ళముందు మెరుపులా ప్రత్యక్షమై మాయమైంది. ఆమిర్ ఉజ్మా దగ్గరకి వచ్చి, రెండు అరచేతుల మధ్య ఉజ్మా మొఖాన్ని తీసుకొని “ఆప్ బుర్ఖా నహీ పేహెన్నా చాహతే హై నా, మత్ పెహేనో” (నీకు బురఖా వేసుకోవడం ఇష్టం లేదు కదా, వేసుకోకు) అంటూ ఉజ్మా నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు కళ్ళ నీళ్లు కారుతుంటే. ఉజ్మా, సాజియా, రషీద్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఆమిర్ మెల్లిగా బయటకు వెళ్లి పోయాడు. తల్లి ద్వారా జరిగింది తెలుసుకొన్న ఉజ్మా కోపంతో ఉడికి పోయింది.

ఆ రాత్రి ఆరు బయట నవారు మంచం పైన పడుకున్న ఆమిర్ ఆకాశంలో చుక్కల్ని, చందమామని చూస్తున్నాడు. ఆందోళనతో ఆమిర్ హృదయం అతలాకుతలమై ఉంది. గొంతు, జుట్టు పట్టి చెంపలు పగల గొడుతూ తనతో బలవంతంగా రాముడి ప్రసాదాన్ని తినిపించినప్పుడు, వూపిరాడక ఉక్కిరిబిక్కిరైన తన ఊపిరితిత్తులు, దడ, దడలాడిన తన గుండె చప్పుడు గుర్తుకు వస్తూ మళ్ళీ ఊపిరాడనితనంలోకి వెళ్లిపోతున్నాడు ఆమిర్. అచ్చం తను ఇలాగే కదూ, “అబ్బా జాన్ బురఖా నాకు ఇష్టం లేదు. ఊపిరి ఆడటం లేదు, దద్దుర్లు వస్తున్నాయి, వద్దు” అని ఉజ్మా ఏడుస్తూ ప్రాధేయ పడినా, కర్కోటకుడిలాగా చెంపలు వాయించి బలవంతంగా బురఖా వేయించి ఉజ్మా ప్రపంచాన్ని చీకటి చేసింది? ఇంత చదువుకొని కూడా? ఆమిర్ కళ్ళలో ధారగా కన్నీళ్లు కారుతూ దిండుని తడిపేస్తున్నాయి.

** ** **

“ఏయ్ నీ అబ్బాని చితక్కొట్టినా నీకు బుద్ధి రాలేదా, మళ్ళీ బురఖా లేకుండా వచ్చావేమే నీ అబ్బా లాగా నీకూ కావాలా దెబ్బలు?” అంటూ మీద మీదకి వస్తున్న గుంపుని తప్పించుకుంటూ ధర్నా టెంటులో భవ్య పక్కన కూర్చుని ప్లకార్డు పట్టుకుంది ఉజ్మా.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

3 thoughts on “ఉజ్మా

Leave a Reply