చానెల్స్ యందు న్యూస్ చానెల్స్ వేరయా అనుకునేవారం ఒకప్పుడు. అడల్ట్స్ కాకున్నా, మనల్ని మనం అడల్ట్స్ అనుకున్నా అనుకోకపోయినా పర్వాలేదు, అది పిల్లా పాపలతో చూసే ఫ్యామిలీ వ్యూయర్స్ కోసం కదా అనుకునేవాళ్లం. కాలం మారింది. ఏ చానెల్ అనేం లేదు. న్యూస్ అనేది పేరుకే. ఎంటర్టెయిన్మెంట్తో పోటీపడుతున్నాయి. ఎంటర్ టెయిన్మెంట్ అని పేరు పెట్టుకున్న ఎంటర్టెయిన్మెంట్తో పేచీ తక్కువ. అది బుగ్గన గాటు, ఫ్యాంటు ఓ వైపు మడిచిన రౌడీ గెటప్ వేసుకున్న క్రిష్ణ లాంటిది. మనం పొరబాడడానికి అవకాశం లేదు. ఎంటర్టెయిన్ మెంట్ అంటే ఏ తరహా వుంటుందో తెలీకుండా పోయే అవకాశం లేదు. జబర్దస్త్‌కు కొంచెం అటూ ఇటే ఏదైనా. నువ్వూ నీ సంసిద్ధత… అంతే. న్యూస్ చానెల్స్ అలా కాదే. అది దొంగదెబ్బ. న్యూస్ కదా అని ఇటొచ్చామా, ఫటా ఫటా అని పడిపోతా ఉంటాయి. ఎందుకొచ్చాంరా బాబూ ఇటువైపు అనిపిస్తుంది. రూపం న్యూస్ లాగానే ఉండాలి. సారం ఎంటర్టైన్ మెంట్‌తో పోటీ పడాలి. వికృత సమాసం. మాటలా మరి.
యాంకర్స్, గెస్టులనబడు శాల్తీలు కూడబలుక్కుని ఇవ్వాళ ఈ మోతాదులో అరుద్దాం, ఈ స్థాయి బూతులతో రక్తి కట్టిద్దాం అని లెక్కలేసుకుంటారేమో అని అనుమానం. ఎపుడైనా ఎవరైనా కాస్త విషయముండి అరవకకుండా మాట్లాడే గెస్టును చూస్తే ముచ్చట బదులు జాలేస్తుంది. సౌండ్ పార్టీ లాగే లేడే అన్నట్టు మనకే అనిపిస్తుంది. నాలుగు రోజులు వరుసగా చూశామంటే అట్లా ట్యూన్ చేస్తాయి మనల్ని చానెళ్లు. సౌండ్ లేకుండా ఒట్టి సబ్స్టాన్సే అనే వాళ్లని చానెళ్లు కూడా రెండోమారు పిలవ్వనుకోండి అది వేరే విషయం. విషయం ఎవడిక్కావాలయ్యా, సౌండ్ ఉందా లేదా నీ దగ్గర. ఒక్కసారీ ప్రత్యర్థిని కరవకుండా కనీసం మైకు పగిలిపోయేలా గట్టిగా అరవకుండా ఒక్క బూతు మాటా తెలీకుండా యాడనుంచొస్తారయ్యా ఎర్రబస్సెక్కి అని టీవీల వాళ్లు గట్టిగానే అంటుండొచ్చు.
ఈ పండితుల్లో వారూ వీరనీ, చిన్నా పెద్దా అనీ, రాజకీయ నాయకులా… సినిమా నటులా అని తేడా లేదు. అందరూ అదే బాపతు. కాకపోతే చిన్న వాళ్ళు మాట్లాడితే టీవీలకెక్కదు. VIP లకి మాత్రం లైవ్ లో యథేచ్ఛగా తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. అందులోనూ సౌండ్ పార్టీలకు. ఈ మధ్యే చూసాం కదా ఒక పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు, దానికి జవాబుగా మరో పార్టీ చేసిన రచ్చ… అంతకంటే కొన్ని రోజులముందే ఒక పెద్ద హీరో అభిమానులు తన భార్య గురించి నానా మాటలూ అంటున్నారని, ఆ హీరో భార్య క్యారెక్టర్ మీద మచ్చపడేలా అత్యంత దారుణంగా మాట్లాడిన మరో సినీ నటుడి ఉన్మాదం.
విలేఖరుల సమావేశాల్లోనో, టీవీ డిబేట్స్ లోనో తాము మాట్లాడే ప్రతి చిన్న మాట, ప్రతి ఇంటి డ్రాయింగ్ హాల్లో ఉన్న టీవీ లో టెలికాస్ట్ అవుతుందనీ… వాటిని చిన్న పిల్లలు వింటారనీ తెలియనంత అమాయకులా వీళ్లు. ఒకర్ని చూసి ఒకరు. ఒక చానెల్ ను చూసి మరొకరు. చిన్న సభను చూసి పెద్దల సభ. ఈజీ మనీ లాగే ఈజీ పేమ్. ఏదైనా ఇన్ స్టాన్స్. ఇదిగో ఈ సిపిఐ సిపిఎం పాత కాలపు పెద్దమనుషులు ఇంకా డైనో సార్స్ లాగా అక్కడక్కడా ఉంటారు. వాళ్లలాగా ఉంటే ఏం లాభం, వాళ్ళ పార్టీల్లాగే కనిపించకుండా పోతాం అని కూడా అనుకుంటారనుకుంటా లోలోపల. ఏం పోటీ ఏం పోటీ. గోరంట్లను చూసి బాబుకు మురిపెం. ఆయన భాషా చాతుర్యం చూసి మురిపెం. నానిని చూసి జగనన్న మురిపెం. అందరిదీ ఒకటే రూటు. ఏయ్, అమ్మా, అక్క ఆలి…, ఆడదాని ప్రస్తావన లేకుండా మీకు ఆనందమూ లేదు, ఆగ్రహమూ లేదు ఏం ఖర్మరా మీకు అనాలని ఉంటుంది కానీ ఔచిత్యం కాదని ఊరుకోవడమే. తాగి తందనాలాడే దగ్గర ఆనందపు మత్తులో ఆడవాళ్ల చర్చలే. ఒకరిమీద ఒకరు రంకెలేసుకునే చోటా ఆడవాళ్లే. పైకి వాళ్లు వాళ్లు తిట్టుకున్నట్టే ఉంటుంది. ఒకరిమీద ఒకరు బురద మట్టి పెంట చల్లుకున్నట్టే ఉంటుంది. కానీ దాన్ని తల్లి గర్బాలకంటించాలని చూస్తారు. అమ్మతనాల్ని బోనులో నిలబెడతారు. అమ్మకే పుట్టారని గుర్తుంటుందంటావా అసలు వీళ్లకి.
భార్యను జూదంలో పణంగా పెట్టినవాడిని ధర్మరాజు అని పిల్చుకునే జాతి కదా ఇది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే మహాకవులుగా పేరు పొందిన వారు సైతం “దొంగలంజకొడుకు లసలే మెసలే ఈ ధూర్తలోకంలో” అంటూ మగవారిని తిట్టడానికి ఆడవారినే కించపరిచారు. గౌరవ సభలో గౌరవ సభ్యులు కాట్లాడుకుంటున్నపుడు అపుడెపుడో నాగిరెడ్డి గారు చెప్పిన సూక్తి పదే పదే గుర్తుకు వస్తే తప్పెవరిది?
మగవారి చేత మగవారి కొరకు మగవారు ఏర్పరచుకున్న సమాజంలో బతుకుతున్నాం మనం. వారి ప్రభావం మనమీద ఎంతగా ఉందంటే ఆడవారిని ఆడవారు తిట్టాలన్నా ఆడవారి వ్యక్తిత్వాలనే కించపరిచేంతగా!
ఎంతవరకూ ఇలా?
రాళ్లు విసిరేదెవరైనా అవి తగిలేది మనకే అన్న సంగతిని చాలా బాధ్యత గా పక్కన పెట్టి మనదైన పక్షాన్ని మరింతగా ఎగదోసే పనిలో చాలా బిజీగా ఉంటున్నాం. దీని మార్చ గలిగేది ఎవరు? మార్చాల్సింది ఎవరు? మనకోసం ఎవరూ రారు. మనమే మార్చాలి… మనమే మారాలి. ఆడవారిని కించపరిచే ఏ వ్యక్తినైనా సమాజంలోని ప్రతి మహిళా సోషల్ బాయ్ కాట్ చెయ్యాలి.
తాము మాట్లాడే ప్రతి మాట మీద తాము అదుపు తెచ్చుకునేలా చెయ్యాలి. అదుపులేని మాటలకి పర్యవసానాలు ఎంత చేదుగా ఉంటాయో చూపించాలి. అది చెయ్యాలంటే నువ్వు ఆ కులమూ నాది ఈ కులమూ అని గిరిగీసుకుని తమకులంలోని పందులను తాము సమర్థించే దోరణి పోవాలి. మదమెక్కిన ఎనుబోతులను ఎనుబోతులనే అనాలి. కులాలను పక్కనబెట్టి. ఏ కులమైనా ఏ అడ్డగాడిదైనా అమ్మకడుపులోంచే వస్తాడని గుర్తుచేయాలి.
చాలా బావుంది. అర్ణబ్ గోస్వామి ఇంకా ఘోరం