“ఎవ్వరు దొరకనట్లు వాడు వీల్లెంట పడ్డడేందిర. కోట్లు కొల్లగొడుతోళ్ళని వదిలిపెట్టి, కూటికెల్లనోల్ల మీద పగపట్టిండు. వాని బలం చూపనీక ఈ బక్కోల్లే దొరికిండ్ర? మేలు చేస్తడని గద్దె మీద కూసోబెడితె కొంపలు కూల్చబట్టిండు. ఏం పాపం చేసిండ్రని ఇంత కచ్చకట్టిండు. ఎంత బతుకులు వీళ్ళవి. మీ నాయన పొద్దుగాల ఇంత తిని పచ్చడన్నం, పెరుగు టిఫిన్ కట్టుకోని ఎర్రటెండలల్ల కంభాలపల్లి, పొగుల్ల నైట్ డ్యూటీకి పోయి రాత్రికి తిందామంటె అన్నం వాసనొచ్చి, పెరుగు పులిసిపోయి ఎన్నిసార్లు నీళ్లు తాగి పండుకుండో. కడుపుకింత తిండికూడ సక్కగ తినకపోయేది. ఆ పాడుబడ్డ బండ్లు నడిపితె ఇంజన్ కాకకు ఒల్లంత శగలెత్తేది. రాళ్ళరప్పల రోడ్ల మీద నడిపి, స్టీరింగ్ తిప్పీతిప్పీ కడుపుల పట్టుకుంటె నొప్పితోటి కంటికింత నిద్రకూడ పోకపోయేది. ఈయెత్తున వొళ్ళు గుల్ల చేసుకుంటె ఇప్పుడు ఈ మొనగాడొచ్చి ‘మీకు ఉద్యోగాలు లేవ్ పో’ అంటే ఎంతమంది ఎట్ల ఆగమవుతరో తెలియదా? తెలంగాణొస్తె అదొస్తది, ఇదొస్తది అని ఆయెత్తున అరిశిరి. ఏమొచ్చింది ఇప్పుడు. ముక్కు చెవులు కోశినా మునుపటి మొగడే నయమన్నట్లు వుంది. వాన్ని ఎవ్వరన్న గట్టిగ ఎదిరిస్తలేరాయె. వీళ్ళ తరుపున ఎవరన్న గట్టిగ కొట్లాడుతలేరాయె. ఏంబుట్టింది తెలంగాణకి? ఇట్లయితె ఎట్ల నాశనమై పొద్దూకుతదో, తెల్లారుతదో.”
మొన్న ఇంటికి ఫోన్ చేస్తే ఆర్ టీ సీ కార్మికుల సమ్మె గురుంచి మా అమ్మ అన్న మాటలివి. మా నాయన దాదాపు ఇరవై ఐదేండ్లు డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయ్యిండు. అందుకే ఆమె తన కార్మికవర్గ స్పృహను, ఆగ్రహాన్ని ప్రకటించింది. బహుశా మా అమ్మలాంటి తల్లులు లక్షల్లో వుండే వుంటరు. కాని వాళ్ళకు గొంతుక ఇవ్వడంలో తెలంగాణ మేధో సమాజం పూర్తిగా విఫలమయ్యింది. నిజమే మా అమ్మ అన్నట్లు ఇన్ని గొప్పలు చెప్పుకునే ‘తెలంగాణకు ఏంబుట్టింది’ ఇప్పుడు. ఎందుకు ఇంత అచేతనంగ మారింది. ఇవి నిజాయితీగా ప్రజల పక్షంగా వేసుకోవాల్సిన ప్రశ్నలే.
“ఇక మీదట నావి ఫక్తు రాజకీయాలే” అని కేసీఆర్ అనడమంటేనే “ఇక మీదట నేను పాలకవర్గ రాజకీయాలనే అమలుచేస్త” అని ప్రకటించుకోవడం. ఆయనకు తనేమిటో, తన రాజకీయాలేమిటో చాలా స్పష్టత వుంది. తన కుల, వర్గ స్వభావాన్ని అనేక సందర్భాలలో సగర్వంగ మీడియా సాక్షిగా చూపించుకున్నాడు. మొన్నటికి మొన్న పొద్దున జర్నలిస్టుల మీద, కార్మికుల మీద నిప్పులు, విషం చిమ్మిన ఆయన పొద్దుగూకేటప్పటికి చిన్నజీయర్ పాదసేవలో చల్లని వెన్నెల కురిపిస్తూ కరుణామయున్ని మైమరిపిస్తూ అదే మీడియాలో కనిపించిండు. ఈ రెండు విభిన్న పార్శాలు తానేమిటో స్పష్టంగా చెబుతున్నా చూసి చూడనట్లు పోవడం తెలంగాణాంతర సమాజం (Post-Telangana) వెనుకబాటుతనానికి ఒక ఉదాహరణ. చరిత్ర పొడువునా ఉజ్వల చైతన్యాన్ని కనబర్చిన తెలంగాణ ఇలా మారిపోవడం చాలా విషాదకరం.
కేసీఆర్ పాలనను కేవలం దొరతనంగా కొట్టిపారేయడం చాలా తేలికైన పని. వాస్తవానికి ఆయన అంతకు మించిన పనే చేస్తున్నాడు. ‘దొరతనం’ చాలా మొరటైన పద్ధతి. దానికి లౌకికమైన అంశాల పట్ల అవగాహన వుండదు. అవసరం కూడా వుండదు. ఎందుకంటె తనకు తానుగా ఒక ‘సామ్రాజ్యాన్ని’ కట్టుకొని అందులో నియంతలా బతికేస్తుంది. కాని కేసీఆర్ అనే నయాదొరకు బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమై అందులో తన అనుకూలమైన సమూహాలను నిరంతరం పరవశింపచేస్తూ, ప్రతికూలంగ వుండేవాళ్ళని నిర్ధాక్షిణ్యంగా అణిచివేయడం చాలా సహజంగా అబ్బిన విద్య. చరిత్రలో ఇదేమి కొత్త విషయం కాదు. ఇది మాకియవెల్లి రాజకీయాల తీరు. Power and charm మరియు courage and cunning మేలవించి అధికారం కోసం ఎంతటి అనైతికతకైన దిగజారడం, ఎంతటి హింసనైనా ప్రయోగించడం ఈ రాజకీయాల నమూన. తన పెత్తనాన్ని ధిక్కరించే వాళ్ళు గతంలో తనకు అనుకూలంగా వున్నా, సహచరులుగా వున్నా వాళ్ళ మీద ఎలాంటి దయ చూపాల్సిన పనిలేదని మాకియవెల్లియనిజం భోదిస్తుంది. సింహం గాండ్రింపులతో, నక్కజిత్తులతో పాలన చేయాలని చెప్పిన మాకియవెల్లి “ది ప్రిన్స్” గ్రంధం మన నయాదొరగారు “చదివిన” వేల పుస్తకాలలో వుండేవుంటది. అందుకే తనని ఎదిరించే వాళ్ళమీద క్రూర చట్టాలను ప్రయోగిస్తూ, అవేవి సమాజం దృష్టికి రాకుండా వుండేందుకు మంత్రముగ్ధ ఎత్తుగడులను చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు. తాను ఎంత సౌమ్యుడో, ప్రేమపాత్రుడో చెప్పడానికి కొన్ని పనులుచేస్తే, తాను ఎంత బలవంతుడో, నిర్దయగా వ్యవహరించగలడో చెప్పడానికి మరికొన్ని పనులు. ప్రతిదానికి ఒక లెక్క వుంటది. కార్మికుల్లో భయం కలిపించిన రోజే, చిన్నజీయర్ మీద ప్రేమను కురిపిస్తడు. చట్టాలను, మతాన్ని ఒంటిచేత్తో ఆధిపత్య రాజకీయాలకు వాడుకుంటడు. ఫక్తు రాజకీయమంటె ఇదే.
ఆయన తన రాజకీయాలను బహిరంగంగా ప్రకటించుకొనే పనిచేస్తుండు. మరి ఆయన పల్లకి మోసే “బుద్ధిజీవుల” సంగతేమిటి? ఇంకా ఉద్యమ మాటల, పాటల చాటున దాక్కోని అభ్యుదయాన్ని వల్లిస్తూనే తమని తాము మోసం చేసుకుంటూ ప్రజలను వంచిస్తుంటారా? ఇది కొత్తగా అడుగుతున్న ప్రశ్న ఏమి కాదు. కాని ఇంతవరకు ఆ “ఫక్తు మేధావి వర్గం” నుండి ఎలాంటి చలనం కనబడకపోవడంతో మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుంది.
ఎందుకంటె ఈ దొరగారిని ప్రశ్నించే వాళ్ళు కరువైతె తెలంగాణ అస్తిత్వ ఉద్యమమే మరో తప్పిదంగ ప్రజల చరిత్రలో నిలబడుతుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇదొక సాంస్కృతిక పునర్జీవనం అని గొప్పలు చెప్పుకున్నం కదా. చరిత్రలో పునర్జీవనం ఎప్పుడు ఒక ఎపిసోడ్ గా మిగిలిపోలేదు. అది కొన్ని విలువలను ఉత్పత్తి చేసి సమాజానికి అందించింది. ఆ విలువలు ముందుతరాల నడకకు అభ్యుదయ బాటలు వేశాయి. మరి తెలంగాణ పునర్జీవనంలో వెల్లుబుకిన ధిక్కార సంస్కృతిని, విలువలను ఎందుకు కాపాడుకోలేకపోయాము. ఆ పునర్జీవనం అంతా ఎందుకు పాలక వర్గాల పాదాలకింద నలపబడుతుంది. ఆ ధిక్కార సంస్కృతిని ప్రజల తరుపున నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అన్ని ప్రజాసంఘాల మీద, ప్రగతిశీల శక్తుల, వ్యక్తుల మీద ఎందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఇదేనా కోట్ల మంది ప్రజలు కోరుకున్న తెలంగాణ గమనం, గమ్యం.
“తానే మావోయిస్ట్ అజెండాను అమలుచేస్తానని” కేసీఆర్ ఒక అర్థంలేని మాట అన్నప్పుడే ఆయన నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సివుండె. “అసలు నీకు మావోయిస్టు అజెండా అంటే ఏంటిదో అర్థమయ్యిందా” అని ప్రశ్నిస్తూ వరవరరావు ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు. ఆయనకు అర్థంకాక కాదు. అప్పటి పరిస్థితులకు ఆ మాట ఆయనకు ఒక ఆయుధం. ఎందుకంటె తెలంగాణలో ఆ పార్టీకి ప్రజల్లో వున్న సాధికారిత, మద్దతు ఆయనకు బాగా తెలుసు. అంతేకాదు ఆ విప్లవపార్టీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పుట్టక ముందే తెలంగాణ ఉద్యమ ఆచరణను మొదలుపెట్టివుంది. ఎంతో మంది బుద్ధిజీవులను పోరాటానికి సమాయత్తం చేసివున్నది. దానిని మొత్తం తన బూర్జువా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలంటె తాను ఒక “నకిలీ” మావోయిస్టు అవతారం ఎత్తక తప్పలేదు. వాస్తవానికి మొదటి నుండి ఆయన చేసింది ఫక్తు రాజకీయమే!
ఇప్పుడు అధికారం మరింత పదిలం చేసుకోవడం కోసం తనను ప్రశ్నించే గొంతుకులను మావోయిస్టు ముద్రవేసి అక్రమ కేసులు పెడుతుండు. అరెస్టులు చేస్తుండు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగక పనిచేసిన బుద్ధిజీవులు, కవులు, రచయితలు, పత్రికా సంపాదకులు వేణుగోపాల్, కాశీం, నలుమాస కృష్ణ, జగన్, మద్దిలేటి, చైతన్య మహిళా సంఘం కార్యకర్తలు, మరియు ఇతర ప్రజా సంఘాల కార్యకర్తల మీద ‘ఉపా’ లాంటి అనాగరికమైన చట్టాలను ప్రయోగిస్తూ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాడు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఒక బూర్జువా చట్ట పరిధిలో జరిగేదని తెలిసినప్పటికి ఆ నినాదంలో వున్న న్యాయమైన అంశాలను, ప్రజల ఆకాంక్షలను అన్ని బూర్జువా పార్టీల కంటే ముందే గ్రహించి తన మేధో బలగాన్ని, ప్రజా సంఘాలను రాష్ట్ర సాధనకు ముందు వరసలో పెట్టింది మావోయిస్టు పార్టి. అప్పటి పాలకులు తెలంగాణ వస్తె అది మావోయిస్టుల పరమవుతదని ప్రచారం చేసిండ్రు. అప్పుడే కేసీఆర్ మావోయిస్టు పాలన తెస్త అనే బూటకపు నినాదం ఎత్తుకుండు. అదే కేసీఆర్ ఇప్పుడు మావోయిస్టుల పేరిట ప్రజాపక్షాన్ని అణిచివేస్తుండు. అప్పటి పాలకులకు, ఇప్పటి పాలకులకు తేడా ఏమి లేదు. హింసను ప్రయోగించడంలో అప్పటి పాలకులను మించిపోయిండు. అందుకే మా అమ్మలాంటి అమ్మలు అంటుండ్రు “ముక్కు చెవులు కోసిన మునుపటి మొగుడే నయమని.” వాళ్ళు సాపేక్షికంగా మాట్లాడినప్పటికి, వాస్తవానికి ఆ తల్లులు అడగాల్సింది అసలు ఈ మగ పెత్తనం, హింస ఏంది? ముక్కూ, చెవులు కోసే మొగుడు నయమెట్లవుతడని.
ఉద్యమ కాలంలో చైతన్యంలో ఒక అడుగు ముందుకేసిన తెలంగాణ, ఇప్పుడు రెండు అడుగులు వెనక్కి వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితె బూర్జువా రాజ్య వ్యవస్థలో తెలంగాణ ఒక విఫల ప్రయోగమే కాని విప్లవ ప్రయోగంగా నిలబడదు. ఎందుకంటే పాలకులకు కొంత పాలనా పరమైన వెసులుబాటు (దానితో వచ్చే ఎక్కువ ఆధిపత్యం) దొరికింది కాని, తెలంగాణ కొత్తగా తెచ్చిన రాజకీయ విలువలు, సంస్కృతులు ఏవి సమాజ పరివర్తనకు పనికొచ్చేవిగా కనబడటంలేదు. ఇప్పటికైనా నయాదొరగారి కొలువులో వున్న బుద్ధిజీవులు, రచయితలు, కవులు, కళాకారులు ప్రజల తరుపున గొంతువిప్పుతారని, నిరాశలో ఉన్న కార్మికుల, రైతుల, నిరుద్యోగుల, విద్యార్థుల పక్షాన నిలబడుతారని ఆశిద్దాం. లేదంటే దొరతో పాటుగా వాళ్ళను కూడ ప్రజలు దోషులుగా నిలబెడుతరు. ఇదే చరిత్ర చెబుతున్నది.
Very touching opening Ashok. We have to see that we, the critics, are also part of the problem because we were complicit with these leaders coming into power, we supported the movement knowledgly that it was led by mainstream politicians.