“నా ముఖంమ్మీద మీ చూపులు తేళ్ళలా తాకుతున్నాయి
నా కదలికల మీద మీ మాటలు ఈగల్లా ముసురుతున్నాయి
ఊపిరి మీద నిఘా
ఊహల మీద నిఘా
మాటల మీద నిఘా
కదిలితే అనుమానం
మెదిలితే అపనమ్మకం ( యాకూబ్ కవిత “సోవాట్” )
ఈ దర్ద్ ముస్లిం మూలవాసులది. ఈ సంకలనం అక్షరం అక్షరంలో నొప్పి పలుకుతుంది. ఈ దేశం మట్టితో రక్త సంబంధం ఉన్న ముస్లింలు తమ అస్తిత్వ హననమే లక్ష్యంగా రాజకీయాలు జరిపి అధికారంలోకి వచ్చిన బిజెపి చేస్తున్న కుట్రలను భరించలేకపోతున్నారు. ముస్లింల పేర్ల దగ్గర నుంచి మొదలుకొని ముస్లీం ల సాంస్కృతిక, ఆర్థిక ఆనవాళ్ళను పూర్తిగా తుడిచి వేసే పనులు ఈ దేశంలో ఇప్పుడు యధేచ్ఛగా జరుగుతున్నాయి. ఇవి రాజ్యం నాయకత్వంలోనే జరుగుతున్నాయి. జనం సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా అధికారంలో ఉండే ఒక రాజ్యం ఆ దేశం ఉనికిలో అంతర్భాగం అయిన ఒక సమూహాన్ని లక్ష్యం చేసుకోవడం వారి జీవితాన్ని నరకప్రాయం చేయడం అరుదులో అరుదు.
ఈ దేశ ముస్లింల పై ఏ క్షణం ఏటువంటి ఉపద్రవం వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితి. ఆ ఉపద్రవం హిందువులకు పవిత్రమైన ఆవు రూపంలో రావొచ్చు లేదా లేదా మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి పేరు ఉఛ్ఛరిస్తూ చేతిలో కట్టెలు బరిసెలు పెట్టుకున్న ఒక గుంపు రూపంలో రావొచ్చు లేదా ఈ దేశంలో కోట్ల మంది పాడుకునే వందేమాతరం గేయం విషయంలోనైనా రావొచ్చు. వాళ్ళు ఉపయోగిస్తున్న ప్రతీకలకు ద్వేషం విషం పూసి మరీ వాడుకుంటున్నారు. అందుకే ” జై శ్రీరాం అనిపించగలరు వేల గొంతుకలతో ఒక్క శరీరంలో ప్రాణం పోయగలరా” అంటున్నాడు కవి అఫ్సర్.
నిజానికి ఈ ప్రతీకలన్నీముస్లింల ఇండ్లతో సహా ప్రతి భారతీయ పౌరుల కు అత్యంత ఆత్మీయమైనవి. వీటిని ఆయుధాలుగా ఉపయోగించుకుంటూ, గుంపు సంస్కృతి కనుగొని ముస్లీంల పై ఎగదోసి వారి మానప్రాణాలకు రక్షణ లేకుండా చేశారు. ఈ దేశ సంస్కృతిలో మతసామరస్యం, లౌకికవాదం అంతర్భాగం అని ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర్యంలో గర్వంగా చెప్పుకుంటూ వస్తున్నాం చాలా వరకూ ఇది వాస్తవం కూడా!
అయితే కేవలం “మూఢ జాతీయవాదం”, “మూఢ దేశభక్తి” తప్ప ఇంకే సైద్ధాంతిక బలం లేని, ఇంకే అభివృధ్ధి ప్రణాళిక తెలియని, ఒక పార్టీ దాని మాతృ సంస్థ స్వార్థం వల్ల ఇంత గొప్ప బహుళ సాంస్కృతిక జీవన విధానానికి తూట్లు పొడిచి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దిగజారి పోతూ ఉంది. ఇప్పటికే అనేక సార్లు అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రభుత్వ సాగిస్తున్న మైనారిటీ ల దమనకాండని అనేక వేదికల మీద వేలెత్తి చూపాయి. అనేక అభివృద్ధి సూచికలలో, అధమ స్థాయిలో నిలబెట్టాయి. మనం అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ కంటే ఈ సూచికలలో దిగజారిపోయాం.
బిజెపి దాని మాతృసంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ ఈ దేశంలో ముస్లింలను రెండో స్థాయి పౌరులుగా భావించడం వారి తాత్వికత. ఆ తాత్వికతలో ముఖ్యమైన భాగం లౌకికవాద వ్యతిరేకత కూడా. ఈ తాత్త్వికతను పూర్వపక్షం చేస్తూ అన్వర్ ఇలా అంటున్నాడు… ” హిందూ ముస్లీం భాయి భాయిగా బతికిన మనుషులు మధ్య హిందూ ఇక్కడ ముస్లిం అక్కడ అని విషాన్ని చిమ్ముతున్నారు”
భౌతికంగా హింసనీ, ఆర్థికంగా బహిష్కరణనీ, సాంస్కృతికంగా చరిత్ర వక్రీకరణ – మత చిహ్నాల విధ్వంసీకరణ అనే మూడు సూత్రాలు ఆధారంగా బిజెపి ముస్లింల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేసింది.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తుల పాత్రని పోషిస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే రాజ్యాంగ, చట్టవిరుద్ధంగా ముస్లింలను అణచివేసే కార్యక్రమం ఏ దాపరికం లేకుండా అమలుపరుస్తున్నాయి. కోర్టులు ఈ కార్యక్రమాలు చట్టబధధ్తని ప్రశ్నిస్తున్నా వాళ్ళు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. అస్సాం, దానికై వీరెత్తుకున్న కొత్త వ్యూహం ముస్లీం ల ఇండ్లపై బుల్డోజర్ నడపడం. ఒకే ఫాసిస్టు రాజ్యం మాత్రమే తన దేశప్రజల పట్ల ఇలా వ్యవహరిస్తుంది. “భక్తి రంగు పూసుకున్న బుల్డోజరై నా బతుకు కూలుస్తున్నవేందే మతవిద్వేషమా?” అంటున్నాడు రహీమొద్దీన్ ఇలా మెజారిటీ మతాన్ని మైనారిటీ మతానికి ఎదురుగా శత్రువుగా నిలబెట్టడం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా బిజెపి ఈ పని చేస్తోంది. తను నిత్యం అధికారంలో ఉండాలంటే తన అనుయాయ క్రోనీ కెపటలిస్టుల అండదండలు ఆర్థికంగా, హార్థికంగా ఉండాలి దానికి ప్రతి ఫలంగా జాతి సంపద ని దోచుకోవాలనే లైసెన్స్ వారికి ఇచ్చేశారు. క్రోనీ కెపిటలిస్టుల దోపిడీ నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చడం కోసం ముస్లిం వ్యతిరేకతను ఒక ఆయుధంగా మార్చుకుంది బిజెపి. ఈ వ్యతిరేకతని టీవి ఛానళ్ళలోనూ, సోషల్ మీడియాలోనూ అను నిత్యం ప్రచారంలో ఉంచడంతో మొత్తం దేశ బౌద్ధిక వనరుల ఏకాగ్రత అంతా హిందూ ముస్లీం వైరం మీదనే ఉండేలా చూసుకోవడం దాని పని. హిట్లర్ యూదులను జర్మన్ లు ముందు శత్రువులుగా నిలబెట్టినట్టు మోడీ ముస్లింల ను హిందువుల ముందు నిలపెడుతున్నాడు.
మత వ్యవహారాలు తప్ప మిగతా అన్నింటిలో ఒకేరకమైన జీవనవిధానం ఉన్న హిందూ ముస్లింలను విడగొట్టటం బ్రిటీషు వారు అవలంబించిన నీతి. అదే వలసవాద నీతికి ప్రతినిధిగా మారిపోయింది బిజెపి. బహుశా ఆ పార్టీ నాయకులెవ్వరూ బ్రిటీషు ప్రభుత్వంతో నేరుగా తలపడే లేదు. అంతే కాక దేశ ప్రకృతి వనరుల దోపిడీల అడవులను నరికివేసి మైనింగ్, రోడ్ల వెడల్పు కోసం హిమాలయాలను సైతం సమతలం చేస్తున్నారు. ఇంకోవైపు నిరుద్యోగం పెరిగిపోయి దేశంలో సగం మంది పట్టాదారులు ఉద్యోగం దొరికే దారుల కోసం అన్వేషిస్తున్నారు. పైగా బిజెపి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయంగా శాంతి నీ కోరుకునే దేశంలో ఇలాంటి వాతావరణం మేధో వర్గంలో గందరగోళాన్నీ ( ఏది నిజం ఏది అబద్దం అని తేల్చుకోలేని పరిస్థితి ) ముస్లీంలలో అభద్రతని పెంచుతున్నది. ఈ అభద్రత దుఃఖంగా, బాధగా, నొప్పిగా ఒక్క మాటలో చెప్పాలంటే దర్ద్ గా మారింది. “ఇప్పటికిప్పుడు దర్ద్ పొడి ఒక్క పద్యమైనా కనమంటావ్ కనడానికి మధుర స్వప్నమైతే బాగుండేది కానీ ఇది మతం పేరుతో వెలివేతల గాయం కదా, ఎన్నిరకాల పడమంటావ్ దర్ద్ ని” ( ఇబ్రహీం నిర్గుణ్)
** **
బిజెపి ప్రభుత్వం ప్రయోగిస్తున్న హింసనూ, అవమానాలనూ, అది తమపై చేస్తున్న అసత్య ప్రచారాలనూ, తమను లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్న చరిత్ర వక్రీకరణలనూ, బాధ నిండిన గుండెతో రాసుకున్న 32 మంది కవుల నెత్తుటి సంతకాలీ పుస్తకంలోని కవితలు.
“దర్ద్” అనే ఉర్దూ పదానికి ( ఫక్తు హిందుస్తానీ భాష అయిన ఉర్దూ కూడా వివక్షకు గురౌతున్నది) నొప్పి,బాధ,దుఃఖం అని తెలుగుకి తర్జుమా చేయవచ్చు. నిజానికి ఈ సంకలనంలో దర్ద్ ఒక్కటే పలకలేదు. ఇంకా అనేకానేక మానవ సహజ ఉద్వేగాలు పలికాయి,ఆవేశకావేశాలు పలికాయి. స్నేహితులూ, ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళ మధ్యే నిరాదరణకు గురౌతూ, వాళ్ళకెదురుగా నిలబెట్ట బడుతున్న అనుమానపు గోడలనూ, వాళ్ళ ఉనికికి సంబంధించి ఆ ప్రశ్నలు వేయడానికి ఏ నైతిక అర్హత లేని వాళ్ళు దేశం ముందు ఏ జవాబుదారీతనం ప్రదర్శించాలని వాళ్ళు వేస్తున్న అపసవ్య, అసత్య, అనిర్ధారిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దయనీయ పరిస్థితిలోకి నెట్టివేయబడడం కన్నా నొప్పి సందర్భం ఉంటుందా? ఈ దేశం మూలవాసుల గాయాల రుధిర ధార తడిని తాకి వారికి భరోసా ఇవ్వగల శక్తులు కనుచూపు మేరలో కానరాకపోవడం కంటే నొప్పి కలిగించే సందర్భం ఉంటుందా? “ఓ ప్రియ మిత్రుడా! జాన్ జిగర్ స్నేహితుడా వాళ్ళంటే అనాది నుండి నా ఉనికిని చిదిమేసినా ఊసును చెరిపేయాలని చూస్తున్నారో తాను, నీకేమైంది? నన్ను చూస్తే కొత్తగా నీ కన్ను ఎందుకు ఎరుపెక్కుతోంది?” (జాబేర్ పాషా)
ఒక రాజకీయ పార్టీ మనుగడ ముస్లింలను దేశం ద్రోహులుగా, పరాయివారుగా చిత్రించడం లోనే ఉంది అంటే ఒక ప్రజాస్వామ్య దేశానికీ, దాన్ని ఐదేళ్ళకోసారి ఉత్సవంలా జరుపుకునే దేశ ప్రజలకు ఇంతకంటే ఘోర అవమానం ఉండదు. మతం ఆధారంగా ఒక పార్టీ రాజకీయాలు చేస్తూ ఉంటే మతం చీడ అంటకూడనీ రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిదుర నటిస్తూ ఉంటే, ఆ పార్టీకి అధికారంలోకి రావడానికి అవసరమైన ఓటు బ్యాంకు ఉంది అంటేనే రెండొందల సంవత్సరాల త్యాగాలతో నడిపిన స్వాతంత్ర్య పోరాట చరిత్ర సిగ్గుపడదా?
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వలిసొచ్చిన ఆర్యులకు కలిసొచ్చిన కాలమానంలో అది కాస్తా బ్రాహ్మణ్యంగా మారి దేశం మొత్తాన్నీ తన ఆధినంలోకి తెచ్చుకుంది. ఇప్పటికీ మన దేశం నరనరంలో నేరమయం తిష్ట వేసుకొని కూర్చుంది. రాజ్యాంగం పుటల మధ్య అక్షరాల్లో ప్రజాస్వామ్యం విలువలు అడుగడునా కనబడి మేమున్నాం అని ఘోషించే చోట ఇంకా బ్రాహ్మణ భావజాలం రాజ్యాధికారం వెలగబెడుతున్న దేశంలో బి.సిగా పుట్టిన ప్రధాని ఆ భావజాలానికి ప్రధినిధిగా వ్యవహరిస్తున్న ఐరనీలో ముస్లింలు మేము మూలవాసులం అని ప్రకటించుకునే స్థితిలో పడిపోయిన చారిత్రక దశలో ముస్లిం కవుల దర్ద్ ను పట్టించుకొని తీరాలి. ఇది ముస్లిమేతరుల తొలి కర్తవ్యం కావాలి. భిన్న సంస్కృతుల సంగమం అయిన ఈ దేశ చరిత్రని ఎత్తి పట్టాలి. హిందూ ముస్లింల ఐక్యతను కాపాడుకోవాలి.