కథ కథనం కవిత్వం పూర్వగాధల పట్ల అభిరుచి కుతూహలం కలిగినవాళ్ళంతా రామాయణం, భారతం లాంటి ఇతిహాసాలను; భాగవతం లాంటి పురాణాలను వింటాము. ఇప్పుడు అక్షరాస్యత బాగా పెరిగింది కాబట్టి మనలో చాలామంది స్వయంగా చదువుకుంటాము. ఆ కథనాల్లో అసాధ్యాలు అద్భుతాల కథనాలు విని ఆహా ఓహో అనుకుంటాము. ఒక మనిషి వెయ్యేళ్ళు బతికాడంటే ఆహాహా అంటాము. ఒక రాజు వేలయేండ్లు రాజాన్ని పాలించాడంటే ఓహోహో అంటాము. పశుప్రాయుడు ఆటవికుడైన మనిషి నాగరికుడై, మానవ నాగరికతలు ప్రారంభమై ఇంకా పట్టుమని ఆరువేలయేళ్ళు కూడా కానప్పుడు ఒక నాగరిక మానవుడు వేలయ్యేళ్ళు బతికాడని, ఒక రాజు వేనవేలయేండ్లు రాజాన్ని పాలించాడని అని అంటే నమ్మడం ఎలా అన్న ఆలోచన మనలో ఎవరికీ రాదు. కథనాన్ని రక్తికట్టించడం కోసం కవులు కల్పనలు, అతిశయోక్తులు, అద్భుతకథనాలు చేస్తారని మనకు స్ఫురించదు. కవులు రచయితలు స్వార్థపరులై గాడితప్పినప్పుడు తమవైన కులం వర్ణం జాతి మతాల ప్రయోజనాల కోసం కల్లబొల్లి కథనాలు అల్లుతారని మనకు స్ఫురించదు. ఎవరైనా తెలిసినవాళ్లు చెప్పినా సహించేస్థితిలో మనం లేము.
చరిత్ర పొడుగునా స్త్రీలు, శూద్రులు, పంచమవర్ణాలు విపరీతమైన వివక్షకు, అమానవీయమైన దోపిడీకి గురైనారని ఆ మాటకు వస్తే నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థలో పైనుండి కిందికి అణచివేత ఎప్పుడూ కొనసాగిందని, వర్ణాల మధ్య ముఖ్యంగా బ్రాహ్మణ-క్షత్రియవర్ణాల మధ్య ఆధిపత్యపోరు (ఇవి ఇప్పుడు మనం విశ్లేషించుకుంటున్న నవల్లో చాలా స్పష్టమైన అవగాహన తోటి విపులంగా వర్ణించబడ్డాయి) ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రచ్ఛన్నంగానో ఎప్పుడూ రగులుతూనే వచ్చిందని దాన్నే మన చరిత్ర, సాహిత్యాలు ఎంత దాచిపెట్టాలని ప్రయత్నించినా అనివార్యంగా నమోదు చేశాయని, చరిత్ర వాస్తవాలు చెబుతున్నపుడు దాన్ని జీర్ణంచేసుకునే స్థితిలో మనం లేము. పైపెచ్చు అది తమ జాతిని అపఖ్యాతిపాలు చెయ్యడానికి ఎవరో పరదేశీయులు పన్నిన ఒకానొక కుట్ర అంటూ ఎవరో చెప్పిన అసత్యాలను అర్దసత్యాలను నమ్మడానికి, అదే వాదంతో సత్యం చెప్పినవాళ్ళ నోళ్ళు మూయించడానికి మనం సర్వదా సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే అంతలా మనం శ్రుతించబడ్డాము.
మరసం… అంటే మదనపల్లె రచయితల సంఘం వరకూ వస్తే ఇక్కడ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు నిఖార్సయిన అభ్యుదయవాది. ఆ తరంలో ఆయన తర్వాత అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కరణం బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారు మాత్రమే. పిళ్ళె గారు ఇతరుల్లా గుడ్డిగా కాకుండా చూపుండి సాహిత్యాధ్యయనం చేశారు. మన పూర్వసాహిత్యంలో స్త్రీలు పంచమవర్ణాల పట్ల చూపిన వివక్షలు, దోపిడీలు పచ్చిగా కనబడుతూ ఉండి కూడా ఎవరూ గుర్తించకుండా వేలెత్తి చూపకుండా అంతా ధర్మబద్ధమే అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కరు మాత్రమే వాటిని గుర్తించారు. అవి అతన్ని కలచివేశాయి. అందుకే ఆయన కలం నుండి విషాదమాధవి, చరిత్రకెక్కని మారణహోమం, చండాలుడు లాంటి రచనలు వెలువడ్డాయి.
కరణం బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారు ప్రాచీన సంప్రదాయ సాహిత్యాన్ని బాగా చదువుకున్నారు. లోతుగా అధ్యయనం చేశారు. అందులో స్త్రీలకు పంచమవర్ణాలకు జరిగిన అన్యాయాలను చూసి మానవ సహజంగా జాలిపడి, కలతచెందారు. అంతేకాక వర్ణవ్యవస్థలో రాజ్యాధికారం రీత్యా శాసనాధికారం, నిగ్రహానుగ్రహశక్తులు ఉన్న క్షత్రియులు కూడా బాధితులేనన్న గ్రహింపుకు ఆయన వచ్చారు. తనని కలచివేసిన అలాంటి వస్తువుల్ని తీసుకుని అభ్యుదయ దృక్పథంతో గొప్ప సృజనలు చేశారు. అయినప్పటికీ ఆయన అభ్యుదయ భావజాలానికి కొన్ని పరిమితులున్నాయి. ఈ దేశంలో దళితులు గిరిజనులు మూలవాసులని, ఆదివాసీలని ఒకప్పుడు ఈ నేల ఈ నీరు వారిదేనని తర్వాత వచ్చిన ఆర్యులు వాటిని వారినుండి కాజేసి, వారిని వారిదైన నేలనుండి, నీటినుండి దూరం చేశారని పురావస్తుశాస్త్రం మానవశాస్త్రం జన్యుశాస్త్రాల ఆధారంతో రాయబడ్డ చరిత్ర స్పష్టంగా చెబుతున్నది. ద్రవిడవేదం లాంటి లిఖితాధారాలను, జాంబవంతుడు మతంగమహర్షి లాంటి పురాణపురుషుల్ని, ఆదిమూలపు ఆదియాంధ్ర లాంటి ఇళ్ళపేర్లని, ఆయా భూస్వరూపాలకు మాన్యాలకు ఉన్న పేర్లని వారసత్వాన్ని సాక్ష్యాలుగా చూపిస్తూ తాము మూలవాసులమని, ఆర్యులు వలస వచ్చిన పరదేశీయులని దళితబహుజనవాదులు నిశ్చయంగా ఉన్నారు. (వసిష్ఠుడి భార్య, భారతీయ సంప్రదాయంలో పెద్ద ముత్తైదువ అయిన అరుంధతి చండాల కన్య అని వాళ్ళు వాదిస్తున్నారు. చండాలుడు నవల కూడా ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నది) అదంతా కాదని ఆర్యులు స్థానికులని కొంతమంది ఆర్యస్థానికవాదం చేస్తున్నారు. కరణం బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారు ఇంచుమించు ఆర్యస్థానికవాదంతో ఏకీభవిస్తూ ఆర్యానార్యభేదం ఆధారంగా అస్పృశ్యత ఏర్పడలేదని, చండాలురు మొదలైన పంచమ వర్ణాలను ఇక్కడి స్థానికులలో ఇమడలేని విజాతీయ కాందిశీకులని, వర్ణసాంకర్యం వల్ల పుట్టిన సంకరజాతులని, సమాజపు కట్టుబాట్లు అర్థం కాని అనాగరికులని, విదేశాల నుండి చెరపట్టి తెచ్చి తాత్కాలిక శారీరక వాంఛలకు వాడుకున్న దాసినులకు పుట్టిన సంతతి అని, వైదికధర్మాన్ని చాతుర్వర్ణ్య వ్యవస్థని ఎదిరించి సాంఘిక కట్టుబాట్లకు కట్టుబడక ఋషులచేత శపించబడ్డవాళ్ళని, ద్విజులకు అసహ్యకరమైన పనులు చేసిపెట్టినవాళ్ళని ఆయన సూత్రీకరణలు చేశారు. ఈ సూత్రీకరణలకు సృజనరూపం ఇస్తూ ఆయన చండాలుడు నవలని రాశారు. ఇది ‘పూర్వాలోకనం’ పేరుతో చండాలుడు నవలకి ఆయన రాసుకున్న ముందుమాటలో స్పష్టంగా ఉంది. పిళ్ళె గారి ఈ సూత్రీకరణలు ఇప్పటి దళితవాదులను పూర్తిస్థాయిలో తృప్తిపరచలేవు. ఎందుకంటే దళితవాదం ఆ పొలిమేరల్ని దాటి ఇంకా చాలా దూరమే ప్రయాణం చేసింది. పైపెచ్చు పిళ్ళె గారి ఈ సూత్రీకరణల ద్వారా తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని దళితవాదులు అభియోగాలు మోపే అవకాశం కూడా ఉన్నది. అదెలాగో మనం కూడా విశ్లేషించుకోవచ్చు గాని ఈ వ్యాసోద్దేశం అది కాదు. ఆర్యుల యొక్క స్థానిక స్థానికేతరవాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఎవరిలోనైనా ఈ విషయంలో అభిప్రాయ సంక్లిష్టత ఉన్నమాట నిజమే. ఆ మాటకు వస్తే ఈ విషయంలో మనువు కూడా పరమప్రామాణికం ఏమీ కాదు. అప్పుడున్న సమాజాన్ని మనువు తన అవగాహనలోంచి మాత్రమే వర్ణించి చెప్పాడు. అది వర్ణించడమే గాని వర్గీకరించి చెప్పడం కాదు. ఇలాంటి స్పష్టాస్పష్ట అభిప్రాయాలు ఉన్నప్పటకీ స్త్రీలు పంచముల పట్లా, అలాగే వాళ్ళు ఏ వర్ణస్తులైనా వర్ణవ్యవస్థలో అన్యాయానికి గురైనవారి పట్లా బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారికి ఉన్న కన్సర్నుని శంకించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.
బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారి చండాలుడు నవలలోని ఆ చండాలుడు రఘువంశ ప్రభువైన త్రిశంకుడు. ఆయన తను బొందితో స్వర్గానికి పోవాలని ఆశపడడం, యజ్ఞం చేసి తనని సశరీరంగా స్వర్గానికి పంపమని తమ కులగురువైన వసిష్ఠుని అభ్యర్థించడం, వసిష్ఠుడు అది సాధ్యం కాదని చెప్పడం, అయినా మొండిపట్టు వీడని త్రిశంకుని “నీవు చండాలుడివైపోదువు గాక” అని శపించడం, తర్వాత త్రిశంకుడి కోరిక మేరకు విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేసి తనని బొందితో స్వర్గానికి పంపడం, అక్కడ ఇంద్రుడు చండాలుడికి స్వర్గప్రవేశం లేదని త్రిశంకుడిని కిందికి తోసెయ్యడం, కిందికి పడిపోతున్న త్రిశంకుడిని విశ్వామిత్రుడు అక్కడే నిలిపి అంతరిక్షంలో ఒక సరికొత్త స్వర్గాన్ని సృష్టించి అందులో నిలపడం, అది త్రిశంకుస్వర్గంగా ప్రసిద్ధికి ఎక్కడం అనేది ఆయన కథ. పిళ్ళె గారికి ఈ కథలోని ఏ అంశమూ వాస్తవంగా గాని, సమంజసంగా గాని అనిపించలేదు. ఆయనకు అనేకమైన సందేహాలు వచ్చాయి.
బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారు త్రిశంకుడి కథలోని ప్రతి అంశాన్ని వాస్తవంగా అనువర్తించుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. అప్పుడు ఆయన త్రిశంకుడి కాలంలోకి ప్రవేశించారు. అప్పటి స్థలాల్లోకి అప్పటి స్థానికతలోకి ప్రవేశించారు. అప్పటి ఋషులు రాజులు రాణులు మంత్రులు రాకుమారులు రాజబంధువుల మనస్సుల్లోకి వారి మానసిక సహజాతాల్లోకి పరకాయప్రవేశం చేశారు. అప్పటి రాజభటులు సైనికులు పరివారజనాల ప్రవర్తనల్లోకి చూపు సారించారు. అప్పటి రాజసభల్లోకి అప్పటి అంతఃపురాల్లోకి అప్పటి రాణివాసాల్లోకి, అక్కడి వంటశాలల్లోకి, అప్పటి విలాసవంతమైన ఋషుల ఆశ్రమాల్లోకి వాటి నిర్వహణల్లోకి, అప్పటి శాస్త్రవిజ్ఞానంలోకి తొంగిచూశారు. అప్పటి చండాలవాటికలలో సంచరించారు. ఇంతకీ స్వర్గం అంటే ఏమిటి? నరకం అంటే ఏమిటి? వాస్తవంలో అవి ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? కులం అంటే ఏమిటి? వర్ణం అంటే ఏమిటి? వాటి స్వభావం ఏమిటి? ఆయా కులస్థుల ఆహారం ఆహార్యం స్వభాలు ఆలోచనాతీర్లు ఎలా ఉంటాయి? అని ఆలోచించారు. వర్ణధర్మాలు వాటి కట్టుబాట్లు ఎలా ఉంటాయి? ఎలా అమలవుతాయి? శాపాలు అంటే వాస్తవంలో ఏమిటి? అని తీవ్రంగా ఆలోచించారు. అన్నాళ్ళూ అంతఃపురాల్లో పుట్టిపెరిగి రాజభోగాలు అనుభవించిన త్రిశంకుడు చండాలత్వాన్ని ఎలా భరించాడు? ఎలాంటి కష్టాలు పడ్డాడు? వర్ణవ్యవస్థ మూలాలు ఏమిటి? అన్నవాటి వాస్తవ రూపాలను, పరిణామాలను ఊహించాడు. పంచమవర్ణాల పుట్టుక వెనుక ఉన్న ఉన్నతవర్ణస్థుల అమానవీయతని, వాళ్ళపట్ల సమాజం చూపించిన కర్కశత్వాన్ని దర్శించారు. దాని ఫలితమే మన చేతుల్లో ఉన్న చండాలుడు నవల. అది అనితరసాధ్యం. ఆయన వర్ణాలు ముఖ్యంగా పంచమవర్ణాలు ఏర్పడ్డ తీరు పాఠకుడికి సులభంగా అర్థం కావడానికి చక్రుడు శబలుడు గండడు ధని కోటి కాళి గంగడు దాముడు లాంటి పాత్రల్ని సృష్టించి, వాటికి కథలు అల్లి విపులమైన కథనాత్మకమైన చర్చ చేసారు.
నిజానికి రామాయణంలోని బాలకాండలో వచ్చే త్రిశంకుడి కథ అంత ప్రాధాన్యత ఉన్న కథ కాదు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని సీతాస్వయంవరానికి మిథిలానగరానికి పోయినప్పుడు గౌతమ మహర్షి – అహల్యల కుమారుడు, జనకుడి పురోహితుడు అయిన శతానందుడు విశ్వామిత్ర మహర్షి గొప్పతనాన్ని చెబుతూ అతని గతాన్ని గూర్చి రామునికి చెబుతాడు. అందులో విశ్వామిత్రుడు కామధేనువు విషయంలో వసిష్ఠుడితో ఘర్షణకు దిగడం, అతని చేతిలో ఓడిపోయి శివున్ని గూర్చి తప్పస్సు చేసి పొందిన అస్త్రశస్త్రాల సాయంతో కూడా వసిష్ఠుని జయించలేకపోవడం, అప్పుడు బ్రహ్మదండం ముందు క్షత్రియదండం దిగదుడుపేనని గ్రహించి తను కూడా బ్రహ్మర్షిత్వం పొందాలని తపస్సు చెయ్యడం, బ్రహ్మ ప్రత్యక్షమైనా తనని రాజర్షిగా మాత్రమే గుర్తించడం, దానిని అవమానంగా భావించిన విశ్వామిత్రుడు మరింత కఠినమైన తపస్సు చేసి బ్రహ్మర్షిత్వం పొందడం అనేది ప్రధానకథ. అంటే విశ్వామిత్రుడి కథే ఒక ఉపకథ అయితే మళ్ళీ అందులో ఒక పిట్టకథ త్రిశంకుడి కథ. ఈ ఉపకథ పిట్టకథ రెండూ కూడా ప్రక్షిప్తాలే కావచ్చు.
విశ్వామిత్రునికి వసిష్ఠుడికి జరిగిన యుద్ధం కామధేనువు కోసం అని అనడం కేవలం ప్రతీకాత్మకం. ఆ కామధేనువు గోవు కాదు. అది భూవనరులతో కూడిన రాజ్యమే. శ్రమశక్తితో కూడిన భూవనరులు మాత్రమే మానవుడి కోరికలు తీర్చగలవు. గోవులు పాలు, తద్వారా పాల ఉత్పత్తుల్ని మాత్రమే ఇవ్వగలవు. అంతే గాని విశ్వామ్మిత్రుడి కథలో చెప్పినట్టు పంచభక్ష్యపరమాన్నాలను ఇవ్వలేవు. చతురంగబలాలను సృష్టించలేవు. అందువల్ల విశ్వామిత్రుడికి వసిష్ఠుడికి మధ్య జరిగిన యుద్ధం నూటికి నూరుపాళ్ళూ రాజ్యం కోసం, రాజ్యాధికారం కోసం, ఆధిపత్యం కోసం జరిగిణ యుద్ధమే. చండాలుడు నవలలో కామధేనువు అంటే వసిష్ఠుడు తన ఆశ్రమానికి సమీపంలోని గిరిజనుల వద్దగల నాటి ఆవులతో తన ఆశ్రమంలోని గోవులను సంయోగం చెందించి సృష్టించిన సంకరజాతిగోవు అని, అందుకే దాన్ని శబల అంటారని వాస్తవీకరించి చెప్పబడింది. ఇంకా చండాలుడు నవలలో క్షత్రియులపై బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, వసిష్ఠుని అతని పుత్రుల బ్రాహ్మణ్యపు ఔద్ధత్యాన్నీ భరించలేక విశ్వామిత్రుడు బ్రాహ్మణులపై క్షత్రియుల ఔన్నత్యాన్ని చాటడానికి తాను ఇదివరకే లోకానికి అందించిన గాయత్రీమంత్రానికి తోడు క్షత్రియుల్లో ఒక అవతారపురుషున్ని సృష్టించి, అతన్ని ఋషులే కాక లోకమంతా ఆరాధించేలా, అతని నామస్మరణే భవతారకమంత్రం అయ్యేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ అవతారపురుషుడు శ్రీరాముడని, ఆ మంత్రం రామనామ తారకమంత్రం అని వేరే చెప్పనక్కరలేదు. ఈ రహస్యాలను బద్దలుకొట్టిన రచన బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారి చండాలుడు.
పురాణాల్లో చిన్నచిన్న ఘటనల్ని తీసుకుని పెద్ద గాధలుగా వర్ణించి చెప్పడం మనకు అల్లసాని పెద్దనతోనే ప్రారంభమైంది కానీ అవన్నీ వాస్తవదూరాలు. కులీన పాఠకుల్ని అలరించడానికి అల్లిన అల్లిబిల్లి అభూతకల్పనలు. కానీ బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారి కల్పన ఆ అల్లిబిల్లిగాధలు ఒకవేళ నిజంగా జరిగిన ఘటనలే అయితే వాస్తవంలో వాటికి సంభవనీయత ఎలా ఉండి ఉంటుంది? అన్న దానిని పాఠకుడి ఊహకు అందించడానికి, ప్రతీకలమయమైన మన పురాణాలలోని కల్లబొల్లి కథల డొల్లతనాన్ని బద్దలుకొడుతూ ఊహించి చేసిన కల్పితసత్యాలు. ఈ వస్తువుని ఆలంబనగా చేసుకుని రచయిత ఈ దేశంలో కులాలు వర్ణాలు పుట్టుకొచ్చిన వైనాలను, వర్ణధర్మం పేరుతో అది వేళ్ళూనుకున్న క్రమాన్ని, వర్ణవ్యవస్థలో పెద్దన్నలుగా బ్రాహ్మణులు ఇతర వర్ణాలవాళ్ళని పెట్టిన ఇబ్బందులను, రాజ్యాధికారంపై బ్రాహ్మణ క్షత్రియులమధ్య జరిగిన ఆధిపత్యపోరాటాలను కళ్ళకుకట్టారు. త్రిశంకుస్వర్గం అంటే ఎక్కడో అంతరిక్షంలో నెలకొల్పిన అభూతకల్పన కాదని అది త్రిశంకుడికోసం అయోధ్యాపురానికి సమీపంలో విశ్వామిత్రుడు నిర్మింపజేసిన ఒక పరిపాలనాకేంద్రం అని వాస్తవీకరించి ముక్తాయించారు. ఈ వ్యాసంలో ఇదివరకే చెప్పుకున్నట్లు చండాలుడు నవలంతా మన పురాణాల్లో చెప్పిన అభూతకల్పనల వాస్తవీకరణల సముదాయమే. అవాస్తవాలను వాస్తవాలుగా పునర్నిర్మించిన ఆ కల్పనా చాతుర్యం, దానికి ఆయన చేసిన కృషి మెచ్చుకోదగ్గవి. ఆయన రాసిన ‘విషాదమాధవి’, ‘చరిత్రకెక్కని మారణహోమం’ కూడా ఈ కోవకి చెందిన వాస్తవ క్కల్పనలే. ఇవి ఒక ఎత్తైతే ‘బోయకొట్టములు పండ్రెండు’లో ఆయన చేసిన చారిత్రిక వాస్తవికత మరో ఎత్తు.
ఒక నిజాన్ని మాత్రం ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలి. చండాలుడు నవలలో చివరనుండి రెండవదైన 24 భాగంలో శబలుని ఆలంబనగా చేసుకొని వర్ణవ్యవస్థపై త్రిశంకుడు అడిగిన సందేహాలకు విశ్వామిత్రుడు ఇచ్చిన వివరణలు ప్రగతిశీలవాదులను మెప్పించలేవు. దాన్ని త్రిశంకుడు వసిష్ఠుడి వద్ద జరిగిన అనుభవం దృష్ట్యా విశ్వామిత్రుడికీ భయపడి అంగీకరించి అక్కడ లాగే ఇక్కడా పాఠం ఒప్పజెప్పాడే తప్ప మనస్పూర్తిగా ఒప్పుకోలేదు. అది పిళ్ళె గారు ముందుగా చేసుకున్న సూత్రీకరణల ఫలితం. అందులో ఇంకా కొంత పూర్వధర్మప్రియత్వం, వర్ణవ్యవస్థపట్ల మొగ్గు కనబడుతూనే ఉన్నాయి. అది త్రిశంకుడు, విశ్వామిత్రుడితో బాటు రచయితకు కూడా ఇష్టం లేదు. కానీ “మనువు నిర్ణయాలను తలదాల్చి నడవడమే కర్తవ్యం” అన్న కట్టుబాటుని అధిగమించలేని అశక్తత ముగ్గురిలోనూ ఎంతోకొంత ఉన్నది. దాన్ని కూడా అధిగమించి పురోగమించడానికి కాలగమనం ఇంకా అవసరం అన్న అవగాహన కూడా త్రిశంకునిలో కాకపోయినా మితగా ఇద్దరిలో స్పష్టంగానే ఉన్నట్లుంది. ఆ విషయాన్ని ఈ నవలని చదివినవాళ్ళు గుర్తించగలరు. చివరలో రచయిత త్రిశంకుడికి జరిగిన న్యాయాన్ని, శబలునికి జరిగిన అన్యాయాన్ని పోలుస్తూ “అగ్రవర్ణస్థుడు ఎన్ని తప్పులు చేసినా అగ్రవర్ణస్తుడే అయిపోయాడు. చండాలుడు చండాలుడుగానే మిగిలిపోయాడు. తాను చేయని నేరానికి, ఒక శూద్రుడూ ఒక బ్రాహ్మణీ చేసిన నేరానికి – ఫలితం తాను అనుభవిస్తున్నాడు. – పాపం – చండాలుడు” అని ఒక నిట్టూర్పు విడిచాడు. గతించిన వాస్తవాన్ని కాదని ఆయన మాత్రం అంతకంటే ఏమి చెయ్యగలడు? ఏది ఏమైనా ముందు ముందు అస్తిత్వవాద సాహిత్యాలను అధ్యయనం చేయబోతున్నవాళ్ళకి ఇలాంటి తొలిమెట్లు ఎక్కి ఆ తీవ్రతని జీర్ణించుకొని ముందుకుపోవడం ఎంతో అవసరం. ఆ అధ్యయనానికి అవసరమైన సంస్కారాన్ని ఈ చండాలుడు నవల అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారి రచనలు ముఖ్యంగా ‘చండాలుడు’ నవలని చదివితే ఆయన బ్రాహ్మణ వ్యతిరేకి అనిపిస్తుంది. కానీ నిజానికి ఆయన వ్యతిరేకించింది బ్రాహ్మణుల్ని కాదు. అసమ్మతమైన, అశాస్త్రీయమైన బ్రాహ్మణ భావజాలాన్ని మాత్రమే. ఆయనకి బ్రాహ్మణుల పట్లా, ఋషుల పట్లా ఈ దేశ విజ్ఞానప్రదాతలు అనే గౌరవభావం మెండుగా ఉండేది. అది చండాలుడు నవల పొడుగునా కూడా అంతర్లీనగా కనబడుతుంది. చండాలుడు నవలలో బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారు తను ముందుగానే సిద్ధం చేసుకున్న సూత్రీకరణలకు ఎలా సృజనరూపం ఇచ్చారో, ఎలా అమలుపరచారో చిన్నచిన్న వ్యాసాల్లో, ఒకటో రెండో పేరాల్లో విశ్లేషించి చెప్పడం అన్నది అంత సులభం కాదు. ఒకవేళ ఓపిక చేసుకొని చెప్పగలిగినా `అందులో ఆయన చేత అమేయంగా పోషింపబడ్డ ఉత్కంఠ అంతా పోయే ప్రమాదముంది. అందువల్ల ఆయన యొక్క ఆ ప్రతిభావ్యుత్పత్తులను చవిచూడాలంటే మనం చెయ్యాల్సిన పని ఒక్కటే. అది వారి చండాలుడు నవలని శ్రద్ధగా చదవడం. బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారి చండాలుడు నవల చదివాక మన వ్యక్తిత్వం నిస్సందేహంగా మరోమెట్టు పైకి చేరుకుంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలకు చెందిన కొంత మెరుగైన సమాచారం మనలోకి వచ్చి చేరుతుంది. వర్ణవ్యవస్థా… నిమ్నవర్ణాలపై అది చేసిన ఆగడాలు మన రక్తమాంసాల్లోని కణజాలాల్లోకి ఇంకిపోతాయి. బాలసుబ్రహ్మణ్యంపిళ్ళె గారు చేసిన ఆ చర్చా క్రమాన్ని అంతా అవగాహన చేసుకున్నప్పుడు, నేడు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఋషిగోత్ర సంప్రదాయంలోని బ్రాహ్మణ భావజాలం వల్లా, దానితో ప్రభావితులైన ఇతర ఉన్నతవర్ణాల వల్లా నిమ్నవర్ణాలవాళ్ళు ఎదుర్కొన్న వివక్షని, వాళ్ళు పడ్డ అగచాట్లని తలచుకొని సహృదయంతో ఒక కన్నీటిచుక్క కార్చగలిగినప్పుడు మనం మానవత్వం మూర్తీభవించిన మనుషులం కాగలుగుతాం.