ఎందుకో ఇయ్యాల జెర గుబులైతాంది…!

అయ్యా… సార్… చిత్తం…
అవునవును… అదే నిజం…
మీరు చెప్పిందే వేదం…
మీకంటే తెలిసినవారింకెవరున్నారు?
మీ అనుభవమూ మీ జ్ఞానమూ మీ తెలివీ…
అబ్బో ఇంకెవరికీ అవి సాధ్యం కావు
తెలంగాణ అదృష్టం చేసుకుంది సార్
మీ అసొంటోళ్ళను నెత్తికెత్తుకుని!
ఈ రాజ్యానికి మీరే దిక్కు… మాలి… అయినరు!!

మీమీద కోట్ల మందిమి ఆధారపడి ఉన్నం
మీ తాతల తండ్రుల సొమ్మంతా ధారవోసి
మమ్మెంతో పొడుగు చేస్తరని అనుకోలేదు గానీ
మా కోసం అనుకుని మీ కోసం ఉర్కిన కోట్ల మందిమి మేం…
మాకు బాగా తెలుసు
మమ్ములను మహబాగా ఉద్ధరించగలిగేది మీరొక్కరేనని!
అందుకే గదా
మీ నిలువెత్తు ఫోటోకు దండేసి
తలవంచి నమస్కరించి మరీ ఓట్లేస్తున్నం!!

అవును దొరా…
ఈ కోట్లమందికెట్లా న్యాయం చెయ్యాలో అని
మీరెప్పటినుంచో లెక్కలేసుకొని కాసుకుని ఉంటిరి గద…
తమరు తమ కుటుంబంతో కూడా
మాకే సేవ చేయిస్తరు…
పాపం, పెద్ద పెద్ద బాధ్యతలల్ల వాళ్ళను కట్టేసి
కష్టాలు కట్టబెడుతరు వాళ్ళకు…
ఇంతకంటే ఎక్కువ ఇంకేం చేయగలరు ఇంకెవరైనా!
మీరు, మీ కుటుంబం ఏమైపోయినా
మా పేదోళ్ళం బతికుండాలి అనేదే మీ బాధంతా!!

సత్యం చెప్పిండ్రు సార్…
ఏ వర్గాన్ని మీరు పక్కన పెట్టలేదు
ప్రతి కులం నుండి
పనికిరానోళ్ళను పనికొచ్చేటట్లు చేసిండ్రు!
మీదెంతో జాలి గుండె
ఎన్నో పురుగులను మెరుగులుగా నిలబెట్టిండ్రు!!

ఆ… ఆ… వాళ్ళంతా మీకు ఋణపడి ఉండాల్సిందే
ఉంటారు… నీ బాంచెన్ కాల్మొక్తా అంటూ
ఇప్పటంతల వాళ్ళకింకో గతి ఏదీ లేదు సార్
మీరే దిక్కు… మీరే దైవం… మీరే సర్వస్వం…
వాళ్లు మంచోళ్ళే సార్ మీ లెక్కనే!
మీకు ఎన్ని మూటలన్నా మోస్తరు
పేదోళ్లకు చిల్లరా ఇస్తరు
కష్టపడి కాలువలు మలుపుకుంటరు
కన్నీళ్ళతో మీ పాదాలు తడుపుతుంటరు!!

మీరెంత గొప్పవారు సార్…
పుట్టిన కాంచి ఎప్పుడు చూడలే దునియాల
ఏ ఏషమంటే ఆ ఏషం కట్టే తెగువ
మీ కంటే ఎక్కువ ఇంకెవర్లోనూ లేదు!
ఒక్కటా రెండా ఎన్ని గొప్పతనాలున్నయ్ మీలో…!!
దేవుళ్ళంటే ఎంత భక్తి…
కానుకలతో వాళ్ళను మస్తు ఖుషీ చేస్తరు
భక్తులందరికీ మీరు దేవుడైపోతరు
భూమిని ‘రియల్’ స్వర్గం జేస్తరు…!
సన్యాసులంటే ఎంత శ్రద్ధ…
ఇయ్యవలసినదానికంటే ఎక్కువే గౌరవమిస్తరు…
వాళ్ళతో బంగారు బట్టల్ని కాలబెట్టించి మరీ
వంగబడి వాళ్ళ కాళ్లు మొక్కుతరు…
మీ ప్రేమను తట్టుకోలేక
సగం పనులు మీకు వాళ్ళే చేసి పెడ్తరు దీవెనార్తులతో!!

మనుషులను ముంచెటోళ్ళంటే
ఎంత మంట సార్ మీకు…
గింత కాలం వాళ్ళే ముంచిండ్రని
నాల్కె పల్సవడేదాకా తిడుతరు
మా జనమంతా మీ తిట్లను విని భలే సంబరపడతరు…
పాపం మావాళ్ళు పొద్దంతా కాయకష్టం జేసి
ఏదో గింతంత సంతోషం కోరుకుంటరు గద…
వాళ్ళకియ్యవలసిందేదో మీ లెక్క ఇంకెవరికీ ఎర్కలేదు!
వాళ్ళకు మీ లెక్క ఇంకొకరెవరూ దొర్కలేదు!!

మీదెంత దయగల మనసు సార్…
బతుకమ్మ పువ్వులు, చీరెల కాడి నుండి బర్లు గొర్ల దాకా
పిలకలకు మొలకలకు మర్రిమానులకు చెక్కుల నుండి
ఆటకు పాటకు జీతాల దాకా…
ఏదంటే అది ఇస్తరు!
ఎన్ని పైసలు నీళ్ళల్ల పొయ్యమన్నా పోస్తరు
పెద్ద చేతులు…!!

ఆ చేతులెత్తి ఇంకెంతో మంచిగ దండం పెడుతరు
కాల్మొక్త అని గూడ అంటరు
మీ లెక్క ఇంకెవరన్న జేస్తరా సార్…
మీ గురించి చెప్పాలంటే అది వొడువని కథ…
కాదు కాదు ‘వొడువని ముచ్చట’!
అవును మరి…
ఆ బుర్రను కట్టుకునే గద సార్
ఉద్యమంల మీరు మీద మీద తేలింది…!!

అన్నీ మీకు కలిసొచ్చినయి
మంచోళ్ళకంతే సార్… ఏడికి పోయినా సావుండదు!
ఊరూరి నుంచి మీరు ఏరేరి నిలబెట్టుకున్న
మీ వందిమాగధులు గింత గూడ ఇమానం తప్పుతలేరు సార్…
మీరే ఈ కాలపు అవతార పురుషుడని
డప్పు కొట్టీ కొట్టీ అలసిపోతున్నరు…
అనొద్దు గానీ
సావుకాడ అదేపాట, సమర్త కాడా అదేపాట!
పాపం జనం ముందే వాళ్ల ఎచ్చులు గానీ
ఎన్నడూ మీకు ఎదురు పడి మాట్లాడి ఎరుగరు సార్
ఏడ్సినా లోలోపలే ఏడ్సి మీ ముందట నవ్వుతరు…
మీరేమన్న తక్కువనా మరి?
మాంచి బుద్ధిమంతుల్నే ఎంచుకున్నరు!
వాళ్ళ ఆయుధాలన్నీ మీ ఒరలనే దాసుకునే నీతిమంతులను చూసి!!

ఆ… అన్నట్టు మా పోరగాండ్లు సదువనీకి
మీ గురించి పుస్తకాలు రాస్తరంట గద…
ఎంత అదృష్టం సార్ మాది, మా పోరగాల్లది…
కొలువుల్లేకుంటే లేకపాయె గానీ
మీ కొలుపు ఇన నోసుకుంటున్నం…!
మీరేదనుకుంటే అదే సార్
కానీయిండ్రి…
ఎప్పటిలెక్కనే మేం సప్పట్లు కొడుతం
పులిహోర పొట్లాలు తిని!!

ఎందుకో సార్
మీరు బద్మాష్ అని తిట్టినా
తలకాయ లేదా అని మొట్టినా
మాకూ మా రేషం లేని చిట్టి పొట్టి నాయకులకూ
ఎంతో పావురంగనే ఉంటది సార్…
మీ బడితెలన్నీ మా సుట్టూ కావలి పెట్టిన
కరుణామయుడు మీరేనని
మాకు తెల్వదా ఏంది?!
బడితెల్నే సంక్షేమమంటూ పాడుకోవడం
అలవాటు చేసిన ఆత్మీయులు మీరు!!

అయినా ఎప్పుడూ మేం ధైర్యం చేసి
సక్కగ కండ్లు తెరిసి మిమ్మల్ని సూడలేదు
అంత నమ్మకం మాకు…
మీ ఆసరా మీద ఉన్నం గదా సార్ మరి?
మీరు మా ఆసరా మీదున్నరని అస్సలనుకోం…
అసొంటియి యాది జేసుకోం గానీ
మీరెప్పడూ సల్లగుండాలె!!

మేమిలాగే బతుకుతుండాలె మీ నీడలో…
ఈ చీకటంతా ఎంతో బాగుంది సార్
అచ్చం మీ కావలింత లెక్కనే…
మీరుంటే సాలు సార్ మాకు
ఇంకే వెలుతురు అక్కెరలేదు…
ఆరేండ్ల సంది అలవాటైపోయింది!
ఈ పండుగను మీరెప్పటికీ తెల్లారనీయరని తెల్సు!!

కానీ ఎందుకో జెరంత అనుమానమొస్తాంది…
ఏమో సార్…!
మాలో ఏ నీడన్నా, ఏ పిచ్చోడన్నా నిటారుగ లేసి నిలబడితే
పుటుక్కున లైటేస్తే
మీరెట్లా కనబడుతారో…
మిమ్ముల్నెలా సూడవలసి వస్తుందోనని
ఆలోచన పడి
ఎందుకో ఇయ్యాల జెర గుబులైతాంది…!!

పుట్టింది జనగామ జిల్లా లింగాల ఘన్పూర్‌ మండలం నెల్లుట్ల. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఎం.ఎస్సీ., ఎం. ఏ. బి.ఎడ్. చదివారు. పిహెచ్‌డి చేస్తూనే (భౌతిక శాస్త్రం) స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇరవయేళ్లుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ లో పని చేస్తున్నారు. కవిత్వం చదవడం, రాయడం అభిరుచి. సమాజంలో ప్రగతిశీల భావజాల వ్యాప్తికి కృషి. పీడన లేని నూతన సమాజం ఆవిర్భవించాలని ఆకాంక్ష. బాలికలు, స్త్రీల సమస్యల పట్ల అవగాహకు కృషి చేస్తున్నారు. మానవీయత, స్నేహపూర్వకమైన మానవ సంబంధాలు నెలకొనాలనే అభిలాష.

4 thoughts on “ఎందుకో ఇయ్యాల జెర గుబులైతాంది…!

  1. సోదరీ, కళ్ళకు కట్టినట్టు చూపినావు,
    ఎవడో ఒకడు
    నిటారుగా నిలబడెటోడు కావాలి
    నిటారుగా నిలబడి లైటేసెటోడు కావాలి

    అదే చిన్న ఆశ

  2. DORA KU YEHHULU YEKKUVA —RULING STATE AS A DICTATOR —PEOPLE R WATCHING —U R RIGHT MADAM

Leave a Reply