మట్టి ముఖంపై
రెండు కళ్లు మొలిచాయి
అక్కడ
ఒక యుద్ధమే జరిగిందో ?
ఓ నాగరికత విలసిల్లి గతించిందో ?
ఒక ప్రేమ కుటీరం చరిత్రగతిలో మాయమైందో ?
ఆ గాయపడి
గట్టిపడ్డ భూమిపై ఇప్పుడు
రెండు కళ్లు మొలిచాయి
కళ్లను అక్కడ ఎవరు నాటుంటారు ?
ఆకాశమా ?
మేఘమా ?
లేదూ
రక్తమోడుతూ నడిచెళ్లిన పాదాలా ?
పళ్లతో ఇనుపకంచెని కొరికే భూమికి
ఆ రెండు కళ్లు ఆరో ప్రాణాలు
భూమిపై మొక్కలకన్నా
గ్రానైట్ స్తంభాలే పెరుగుతున్నప్పుడు
కన్నీళ్ల సంగతేంటి
ఇంతకీ
ఇనుప కంచెలు
రక్షణ కోసమా ?
రాజ్యం సరిహద్దులు చెప్పడం కోసమా ?
ఆంక్షల జీవనాన్ని తెలియజేయడం కోసమా ?
ఏమో ?
పసిప్రాయపు చేతుల్ని చుట్టుకుని
చీకటిని మింగిన భూమికి
తన దేహం బంధించబడ్డ
మరబొమ్మలాగే అనిపిస్తుంది
శ్వేత పత్రాల్లా
మబ్బు లేఖల్లా
ఆకాశ ప్రతినిధుల్లా కనబడే కళ్లు
మట్టిగోళ్ల నుండి పైకెగసె దుమ్ము పట్టిన అక్షరాలు
ప్రతి రోజు ఆ దారిన వెళ్లే మనిషిని అభ్యర్థిస్తుంటాయి
-” ఈమెని విడుదల చేయండి
ఈమెకి స్వేచ్ఛనియ్యండని “
భూమి తన కడుపున పంటని కని
ఎన్నేళ్ళయిందోనని వగస్తూ
కళ్ల నుంచి మళ్లీ కన్నీటినితోడి
బయటికి కుమ్మరిస్తుంది
ఈ సారి
పక్కాగా వెళ్లిన మనిషి
ఇంకో ఇనుప కంచెని
భుజంపై నించి కిందకు దించాడు.
భూమి గుండెపై ఇప్పుడు మరో గాయం…
Chala bavundi