నేనక్కడే ఉన్నాను
నిండా మునిగి
సముద్రం లోతెంతో ఇంకా తెలిసే రాలేదు
దుఃఖాన్ని పొరలుపొరలుగా కప్పుకుని
తీరమొక్కటే అక్కడ ఒంటరిగా!
అప్పుడెప్పుడో పెనవేసుకున్న మనసైన క్షణాలు
ఇప్పుడవి నమ్మకం పునాదులపై చితిలా పేరుకున్నాయి
కార్చిర్చు రేపాయిగా
సమయమేం పెద్దగా పట్టదు కానీ
ఊపిరి బిగబట్టి
జీవితాక్షాంశ రేఖాంశాలకు మధ్య
అడ్డుగోడ కట్టేద్దాం పద
కాసింత ఆత్మీయత కూడా ఆలోచించి చిగురించే చోట
ఇంత చిన్న జీవితమదేం పాపం చేసిందనీ
ముళ్ళ పొదల్లో పరిమళాన్ని వెతుక్కుంటూ బతకాలి!?
ఏ వొక్క జ్ఞాపకమూ ఊరడించనప్పుడు
చెయ్యి అందించేంత దగ్గరితనం చేజారిపోయినప్పుడు
వెయ్యి లంగర్లేసి తోడినా
ఇంకిపోని ఊటబావి లాంటిదే కదా ఈ దేహం కూడా
ఇది కూడా వో సామూహిక దుఃఖమే!
ఎన్నో అసంపూర్ణ రాత్రుల్ని కాగడాలా వెలిగించిన
నక్షత్ర దీపాల్లాంటి కళ్ళ నిండా
వెయ్యి వోల్టులకు తగ్గని నిట్టూర్పు చీకట్లు
ఎర్రెర్రని చారలుగా
కంచెలు కంచెలుగా
నమ్మకం సడలిపోయి,
ఉన్న చోటునే చతికిలబడిపోయి
చుట్టూ ఓ అసమాంతర దుఃఖం!
ఇప్పుడిక చేతులు చాచి
లేని ప్రేమను నటించలేను
సాగిలపడి పొర్లు దండాలూ పెట్టలేను
ఆర్ధ్రత నిండని గుండె చప్పుడని నిందించనూ లేను !
మరిక ఈ రాత్రి తెల్లారే లోపు
చిన్న కథొకటి చెబుతాను! కాస్త వోపిగ్గా వినూ!
ఏడు చేపల కథ కాదు..
కుందేలూ, తాబేలూ కథ కాదు
పేదరాసి పెద్దమ్మ కథసలే కాదు
ఒక ఒరలో ఇమడలేని
పదునైన కత్తుల్లాంటి నమ్మకమూ ద్రోహమూ కథ
ఒక్కటిగా కనిపించే విడి విడి దేహాల కథ
ఇనుప పంజరాల్ని దాటుకుని రాలేని
నెత్తుటి పావురాయి కథ
నిత్యం హత్య చెయ్యబడుతున్న
తురాయి పువ్వుల కథ
ఒక నీ కథ , నా కథ
సముద్రం నిద్ర పోయాక
నిశ్శబ్దం శబ్దాన్ని మోస్తున్న
కంచికి చేరలేని ఓ తీరం కథ!!
బావుంది
ధన్యవాదాలు సర్
థాంక్యూ సర్
గుడ్ పొయెం
Thank you Sir
అక్క…కవిత చదువుతుంటే కన్నీళ్లు ఉబుకుతున్నాయి.
ధన్యవాదాలు తమ్ముడు
చాలా బాగుందడి ా
ధన్యవాదాలు సర్
చాలా బాగుంది మేడమ్ గారు.
చాలా బాగుంది మేడమ్ గారు
ధన్యవాదాలు సర్