ఇది కత

ఫిల్మ్ తీసినట్టు కండ్ల ముంగటనె కనపడుతున్నా
ఎరుకలేదంటవు
నీదయితే లోకానికే గొప్పది
కడమోల్లది కడకు పెట్టేదా?

మంచి ఉద్దార్కం నీది
చెడమడ తిరిగి, తువ్వాల పిండి
చెమటధారవోస్తే ఏం చేసినట్లు
దున్నెజాగ ఎరుకుండాలె,
నాగలికి ఎలుగో సలుగో ఎరుకుండాలె
చల్లినవి తాలో, పొల్లో తెలవకుంటనె గంపలలెక్కతోని ఎక్కువనా?
రుమాలు చుట్టుకుంటె నీడల పన్నట్టా
చల్లటిదో, కాలుతున్నదో బురదల తిరుగుతున్నది సోకులకా

రైతంటే ఎంత పల్చన?
కార్తె తెలిసినోడు,
కాలం తెలిసినోడు,
పంటకాలం తెలిసినోడు
పదిమందికి బువ్వపెట్టుడు ఎరికైనోడు
కొండడు తిప్పర్తికి పోయినట్టు ఊక తిరిగితే యవ్వారమైతదా
ఆడిందే ఆడి, పాడిందే పాడతానికి బాగోతం కాదు
దున్నిందే దున్నినా పంటకొత్తది, పలం గొప్పది

గొప్పలు చెప్పుకుంటానికి
పిల్లిపెసరకాయ పిక్కదొడ్డు, తేపోరా అంటే దర్వాజల పట్టదు
కొందరు గంతె, మాటలకె, శేతలకు కాదు
కొందరు మనుషులల్ల షరీకైతరు
మనుషుల కోసం కొట్లాడ్తరు, పానం పెడ్తరు
కొందరు మనుషులమని మరుస్తరు
గుంతలుతీసుడు నక్కల్లెక్క దాగుండుడు
ఆఖరికి వాళ్ళవంతే ఆ గుంతల్ల పడిపోతరు

ఇగనన్న మాట్లాడుడు ఒక రీతిగ నేర్చుకో
ఎట్లబడ్తె అట్ల అవమానిస్తే ఊరుకోరు జనాలు
మర్లపడ్తె తెలుస్తది…
అరె మనుషులం కాకపోతిమని

-25. 02. 2022

ఆలేరు, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా. విశ్రాంత ఉపాధ్యాయుడు, చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు. పుస్తకాలు: మట్టి పొత్తిళ్ళు, మూలకం, రెండు దోసిళ్ళ కాలం(కవితా సంకలనాలు), పాడాలని(పాటలు), ఆలేటి కంపణం, ఠాకూర్ రాజారాం సింగ్ (చరిత్ర రచనలు), సాహిత్య వ్యాసాలు, కథలు, నాటికలు.

Leave a Reply