రాళ్ళు కరుగవు
తాన్ సేన్ పాడడు
బాటచీలదు
బడబాగ్ని వర్షించదు
కాలం స్తంభించదు
కత్తుల వంతెన కూలదు
నాయకుడు రాడు
అధికారి కన్నెత్తి చూడడు
కుట్రల కాలంలో
ముఖాలు కన్పించవు
చాపకింద గత్తరలా
నొప్పిదెలువని క్యాన్సర్ లా
ఇథనాల్ కంపెనీ పైకిలేస్తుంది
*
కాలువకింద
మోసులెత్తే పల్లెల్ని
వలసనుండి వాపసొచ్చి
కుదుట పడ్తున్న పల్లెల్ని
రంగు రంగుల కలలగూళ్ళను
శతాబ్ధాల జన జీవన సంరంభాల్ని
జింకల, నెమళ్ళ అలరారు
అందమైన ప్రకృతిని
అమాంతం మింగయ్యనీకె
కొండ చిలువ నోరుతెరుస్తుంది
దాని ఉచ్చ్వాస నిశ్వాసల్లో
ఇథనాల్ వాసన గుప్పు మంటది
*
బాటలుండవు
బాటలెంబడి వికసించే
మాటలపూలుండవు
వాకిలుండదు
అందమైన ఊహల్ని
ప్రతి బింబించే ముగ్గులుండవు
ఆటోల చప్పుడుండదు
కలుపుకోతల కూలిల పాటలుండవు
చెరువును వెతుక్కుంటూ వొచ్చిన వెన్నెల
నిట్టూరుస్తూ వాపసెల్లి పోతుంది
జంతువును
కాళ్ళకింద నొక్కి పట్టిన డేగలా
పల్లెల్ని తొక్కి పట్టిన ఫ్యాక్టరీ
జేజేలుగ పైకిలేస్తున్నది
*
ఊళ్ళిప్పుడు ఊళ్ళలా లేవు
నివురుగప్పిన నిప్పుల్లా ఉన్నాయ్
మనుషులిప్పుడు మనుషుల్లా లేరు
మండుతున్న కొలిమిల్లాగ ఉన్నారు…