రంగు రంగుల పడవరెక్కలున్న సరస్సులు
రుతువుకోమారు నీళ్లోసుకునే చీనార్ చెట్లు
మబ్బుల గూటికి వేసిన నిచ్చెనలా
ఓ కుర్ర పర్వతం
నేలపైన అన్నీ ఉన్నాయి
ఇక్కడ మనుషులు భూమి కింద బతుకుతారు
ఈ లోయ
భూమి అందాలను చూపే కనుగుడ్డు
నది పీతపిల్లల్ని మోసే అలల గర్భసంచి
రాలిన మంచుపువ్వుల మధ్య కుంకుమ పిట్ట
ఒక దేశపు సిగ మీద కిరీటం
ఐనా ఇక్కడ మనుషులు భూమి కింద బతుకుతారు
ఇక్కడ ఎవరూ
పుడమికి పుట్టినవాళ్ళుకాదు
అంతా అందమైన నక్షత్రలోకాల్లోంచి దిగొచ్చినవాళ్ళే
రాళ్ళకు పూసిన ఆకులకోసం
గొర్రెల మందలవెంట సాగే ఆకలి పాదాలు
ముసలి రూపంలో వచ్చి
కవచకుండలాలను అడగడం వెనుక
యుద్ధానికి ముందే శత్రువును ఓడించే కుట్రను గుర్తించలేని
ఇక్కడ మనుషులు, భూమి కింద బతుకుతారు
ఇది మళ్ళీ మళ్ళీ వంచింపబడుతున్న నేల
చరిత్రను ఒంపుకున్న పుట
పురుషాంగమై మీదపడ్డాక
మోకాళ్ళ మధ్య ముఖం దాచుకుని నెత్తురయ్యే అక్షరం
రెండురంగుల కరవాలాల మధ్య నలుగుతున్న ఆత్మ
ఇక్కడ మనుషులు భూమి కింద బతుకుతారు
సరిహద్దుపొర చిట్లినపుడల్లా
ఆకాశం డ్రోన్లను పొదిగి బాంబుల్ని కంటుంది
అర్ధరాత్రి తుపాకులు
తలల్ని లెక్కపెట్టడానికొస్తాయి
ఏ తల్లికో
హఠాత్తుగా పేగు తెగుతుంది
మార్కెట్లో తప్పిపోయిన కుర్రాడు
ఏ నిషేధిత పేరో ఒంటి మీద చెక్కుకుని శవమై తేలుతాడు
బారెల్ మొనలు చేసే లీగల్ అత్యాచారాలకు
కేసులుండవు కోర్టులుండవు
ఇక్కడ మనుషులు భూమి కిందకాక మరెక్కడ బతుకుతారు?