ఇక్కడ అన్నీ ఉన్నాయి

చుట్టూ అన్నీ ఉన్నాయి
ఎత్తైన గుండెగోడలు
కఠినమైన కిటికీ కళ్ళు
నా నిస్సహాయతను వినిపించుకోని
ఇనుప చెవులతలుపులు…

నాచుట్టూ అన్నీ ఉన్నాయి…
పగలంతా మిడిమేలపు ఎండా
రాత్రంతా ఉక్కపోత చీకటి
వయసుడుగిపోయినా 
బిడ్డను కళ్ళలో పెట్టి చూసుకోవాలని
ఆరాటపడే తల్లిలా
నన్ను మోసుకుతిరుగుతున్న వీల్‌చైర్…

గజగజ వణికే చలికి దుప్పటికాలేని
భగ భగ మండే ఎండకు ఊరట కాలేని
సగం సగం మానవత్వంతోపాటే
ఈ అండా లో…
కదలలేని నా దేహంతోడుగా
కలల్ని కదిలించే ఆలోచనా కణికలు
కుంగిపోకుండా నిలపెట్టే నీగ్రోకవిపుస్తకం
అన్నీ ఉన్నాయి…

గోడలకావల ప్రపంచాన్ని చూడాలని
గోడుమంటున్న ఆదివాసీ గుండెల్ని వినాలని
ఒక తపనాగీతమై కొట్టుకొంటున్న 
నా మనసుతోపాటుగా
చెరసాల కొలిమిలో కాలుతున్న
చెరిగిపోనిసత్యంతో పాటుగా
ఇక్కడ అన్నీ ఉన్నాయి…

(నాగ్‌పూర్ జైలు అండాసెల్ లో రాజకీయ ఖైదీగా ఉన్న ప్రొ. జి‌.ఎన్. సాయిబాబా కోసం)

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

5 thoughts on “ఇక్కడ అన్నీ ఉన్నాయి

  1. మంచి కవిత పల్లెపట్టు గారు
    అభినందనలు

  2. చాలా బాగా రాశావు పల్లిపట్టు. కదిలించావు.

  3. చాలా బాగుంది పల్లిపట్టు గారు

Leave a Reply