దినపు దేహం మ్మీద నెత్తురు చిమ్ముతున్న
పుండులా, సలపరిస్తోంది సూర్యరశ్మి!
కిరణాల బాణాలతో,
ఒళ్ళు తూట్లు పొడుస్తున్నాడు భానుడు!
అయినా భరిస్తూనే ఉంది భువి!
గాయంమీది ఈగలను తోలుకుంటున్న
పురాబిక్షువులా ఉంది
తారు రోడ్డు..
క్షతగాత్రం ప్రతి మనిషి ప్రాయం..
అని పాడుకుంటూ వెళుతున్నాడు ఫకీరు..
అక్కడక్కడా గాయాల విలువ గురించి
గొడవ పడుతున్నారెవరో,
ఒకడంటున్నాడు “నా హృదయం ఓ గాయమనీ!”
ఇంకోకడేమో చూపుని చూపిస్తున్నాడు “ఇంత లోతైన గాయమెక్కడన్న ఉన్నదా?! “అని
లోతూ – బరువూ,
గాయం కూడా ఇక్కడ ఓ సరుకు!
గాయం చేసేవాడు షావుకారు
నొప్పి భరించేవాడిది బీదరికం
రెప్పల మధ్య శూన్యం కదలాడుతోంది
కళ్ళ బదులు కొందరికి,
చూపుది దృశ్యంతో అనాధ మైత్రి,
అధరాలు నవ్వడానికి భయపడుతున్న
దీర్ఘాకలితో బాధపడుతున్న
పసిపాప ఆక్రందనలా ఉంది కాలం
వైద్యుడి మెడలోని స్టెతస్కోపులో,
మృత్యువాత పడ్డ రోగి కలల కలవరింతలు,
డబ్ డబ్ మని సవ్వడి చేస్తున్నాయి
అది గాయాలను లెక్కిస్తోంది
వడ్డీ వ్యాపారి నోటు కట్టలా!
ఈ క్షణం ప్రాణం
తర్వాత మరణ వికాసం
నిర్జీవ పదార్థాలే నయం
వాటికేబాధ ఉండదు!
విషాద గాయాలను భరిస్తున్న
జీవపదార్థాలతోనే బెడదంతా!
ఎవడిగాయం వాడికి బరువు
ఒకడికి మించిన నొప్పి ఒకడిది
ఇంకోకడి గాయం గురించి
చర్చ అప్రస్తుతమైన వేళ
నా గాయాల గురించి
నేనెంత పెద్ద కవిత రాసినా చదివేదెవరు?