ఆ సాయంత్రం

చాలా మాట్లాడుకున్నాం మేమిద్దరమూ
చాలా రోజులకి ఆ సాయంత్రాన
యుద్ధం గురించీ ఇంకా జైలు గురించీ
జైలులో ఉండే సెంట్రీల అయోమయ ప్రవర్తన గురించీ
నల్లకోటు వేసుకుని అటూ ఇటూ తిరిగే లాయర్ల గురించి

ఒక్కొక్కరుగా జైలునిండా నిండే నేరస్తులు కాని నిందితుల గురించి కూడా
మేము మాట్లాడుకున్నాం
నిజానికి
ఆ చెట్టుకిందే మాతోపాటు ఉన్న ఆవు, పక్కన టీ దుకాణంలోని చాయ్ వాలా
మమ్మల్ని అస్సలు పట్టించుకోనట్టే ఉండిపోయారు
మేము మాత్రమే అక్కడ మాట్లాడుతూ ఉండిపోయాం…

ఇక్కడికి రాక పూర్వం నేను తనతో మాట్లాడాలనుకున్న ఏ విషయమూ
అక్కడ గుర్తుకే రాలేదు కాబట్టి
మేము సంకెళ్ళ గురించీ, ములాఖాత్ చిట్టీ రాసిచ్చే జైలు ఉద్యోగి గురించీ
గడ్డకట్టే చలిలో జైలు కవిత రాసుకునే రాజకీయ ఖైదీల గురించీ మాట్లాడుకున్నాం అవును ఆ సాయంత్రమంతా మాట్లాడుతూనే ఉన్నాం

మా వలెనే అవసరమైన చోట తప్పించి
రహస్యంగా ఇవన్నీ చర్చించుకునే ఈ దేశ పౌరులలాగే
నిస్సహాయంగా…
నిరాశా వదనాలతో మేము “రాజ్య హింస” గురించి లో గొంతుకలతో మాట్లాడుకున్నాం…

ఇక తను వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు
తన చేతికి ఉన్న గొలుసుని పట్టుకున్న పోలీసులని చూస్తూ
“ఇంక్విలాబ్ జిందాబాద్..!”
కోర్టు ఆవరణంతా ఉలిక్కి పడేంత బిగ్గరగా అరిచింది

ఆ తరువాత ఆమెని జైలుకు తరలించే దాకా అక్కడే నిలబడిపోయాను నేను…
నాపక్కనే ఉన్న ఆవు నెమరు వేస్తూ కోర్టు ద్వారాన్నే చూస్తోంది

పుట్టింది మంగ‌లి ప‌ల్లె, గోదావ‌రి ఖ‌ని. ఫ్రీలాన్స్ రైట‌ర్‌. 2012నుంచి క‌విత్వం, కథ‌, విమ‌ర్శ రాస్తున్నారు.

9 thoughts on “ఆ సాయంత్రం

  1. Excellent poem. I love the narrative style of the poem. Very touching

  2. బహిరంగంగా నిషేధించిన చాలా విషయాలు సరళపు లోతుతో మాట్లాడుకున్నారు మీరిద్దరూ, మేమూ….

  3. బాగుంది, నరేష్.
    సామూహిక సంభాషణ ఇది – జైళ్లలో, కోర్టు ఆవరణల్లో, బయటా.

  4. Baagundi Anna baaga raashaaru …iddaru prakkaney kuurchoni maatlaadinattuga ….

  5. స్ఫూర్తి దాయకమైన సంభాషణ.

  6. నరేష్… ఇలా నువ్వే రాయగలవు. చివరి కంక్లూజన్ చాలా బాగుంది

  7. అలా వెళ్ళిపోయాక ఏమేం మాట్లాడాలనుకొని మరచిపోయామో గుర్తొస్తుంది. మాట్లాడినవీ, మాట్లాడనివీ కలిసి మనసులో సంభాషణ కొనసాగిస్తాయి. మరుక్షణమే తర్వాతి కలయిక కోసం ఎదురుచూపు మొదలవుతుంది.

  8. మాటలు ప్రవాహాలు…ముంచేస్తాయి…ముంచెత్తుతాయి కూడా. మాటలు చేతలుగా మారాల్సిన సమయం…మార్చే తరం మీది. గుడ్ వన్ నరేష్ కుమార్.

Leave a Reply