ఆస్కార్ అవార్డ్ గురించి రాయడానికైనా ఆస్కారముందా?

ఒకరి బాధ మన బాధ కాకపోవడం
చాలా బాధాకరమైన విషయం
ఒకరి సమస్య మనకొక సమస్య కాకపోవడం
చాలా సమస్యాత్మకమైన సమస్య
మనిషి గురించి మనిషి కాకుండా ఎవరు పట్టించుకోవాలి –
నేనేమీ ఇప్పుడు కాల్పుల విరమణ
ఆగిపోయిన గాజాలో మళ్ళీ ఇజ్రాయిల్
మారణకాండ గురించి రాయడం లేదు
మనం క్రికెట్ అంత ఆసక్తిగా
ఏభైవేలు మృతులు – ఇజ్రాయిల్ నాట్ అవుట్ –
స్కోర్ పెరగడానికి అలవాటు పడ్డాం
అందులో సగం పసిపిల్లలే అని
మీ మానవత్వాన్ని ఎక్కడో సున్నితంగా
స్పృశించడానికి ప్రయత్నించడం లేదు
మరి ఎక్కడో ఒకచోట ఉండి,
ఉండడానికి ఇల్లు ఉండి,
చదవడానికి సౌకర్యం ఉండి
ఇది చదువుతున్నారు గదా –
అతడు ‘నో అదర్ ల్యాండ్’ అంటున్నాడు –
ఏ నేల మీదా ఇంత మనుషుల రక్తం పారలేదని –
మాకే నేలా మిగలలేదని –
ఇది ఆక్రమణ యుద్ధం కొనసాగుతున్న
గాజా గాధ కూడ కాదు –
కానీ ఇది సెటిలర్స్ ఆక్రమించుకున్న
ఇజ్రాయిల్ సైన్యం వాళ్ళకండగా ఉన్న
పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లో జరిగింది
తెలుగు శబ్ద సౌందర్యమే మీరిష్టపడితే
ఆక్రమిత పశ్చిమ తీరాన జరిగింది –
అక్కడ ఆయనకొక ఇల్లు ఉంది –
“ఆ ఇంట్లో ఇపుడు నేను
బల్లాల్ హమ్దాన్ ఏడేళ్ళ కొడుకు పక్కన
నిలబడి మాట్లాడుతున్నాను
అతని ఇంట్లోనే హమ్దాన్ నెత్తురుతో
అలికిన ఇంట్లో.”
లించింగ్ అనే మాట ఇప్పుడు
మనకు కూడ తెలుగుమాటయింది కదా
బుల్డోజర్ వలెనే – ఏరియల్ బాంబు వలెనే
ఎన్‌కౌంటర్ల వలెనే –
‘ఇక్కడి సెటిలర్స్ అతణ్ణి
చితక్కొట్టి ఎత్తుకుపోయారు –
ఇపుడు అక్కడ ఇంకా అతని తడిఆరని రక్తం –
అతని కొడుకు కళ్ళల్లో ఉబికి వచ్చే రక్తాశ్రువులు –
చెప్తున్నవాడు యువాల్ అబ్రహం –
అనుమానమొద్దు – అతడు పాలస్తీనియన్ కాదు ఇజ్రాయిలీ
హమ్దాన్‌తో కలిసి నో అదర్ ల్యాండ్ డాక్యుమెంటరీ తీసినవాడు –
ఇపుడు వింటారా – అతడు కళాకారుడు
ఆ డాక్యుమెంటరీ కోసం
ఆస్కార్ అవార్డ్ తీసుకోవడం కోసం
ఆయనకు పొరుగుదేశంలో స్థలం ఉంది
కానీ, ఆయన తిరిగిరావడానికి
ఆయన ఊరు సుసియాలో ఆయనకు
తలదాచుకోడానికి చోటు లేదు –
ముందే చెప్పాను కదా
నేనేమీ మామూలు మనుషుల గురించి చెప్పడం లేదని –
పసిపిల్లల గురించి, గాజా గురించి కూడ చెప్పడం లేదు.
తరువాత అబ్రహం చెప్పినట్లు
ఇదిగో ఇట్లా మసాఫర్ హట్టాను
వాళ్ళు తుడిచిపెట్టారు –
నో అదర్ ల్యాండ్ – అని చెప్తున్నాము –
నేనేమీ నేల కోల్పోతున్న వాళ్ళ గురించి
మిమ్మల్ని ఆలోచించమనడం లేదు
తప్పకుండా మనం ఆస్కార్ అవార్డు గురించి చెప్తే వినే ఆస్కారం ఉంది గదా
అదుగో అతడు – ఇపుడు కిడ్నాపు అయి
గాయాలతో ఇజ్రాయిల్ మిలటరీ క్యాంపులో ఉన్నాడంటున్నారు –
ఎంత నిజమో –
అల్‌జజీరా వీడియో తప్ప, అర్నాబ్ గోస్వామి చెప్పడు
మనకీ విషయం బిబిసి చెప్పదు –
“దేశభక్తి” మీడియా ఎవరూ చెప్పరు
మీరు వినే ఉంటారు – ట్రంప్ వంటి అమెరికన్లు
నెతన్యాహు‌ వంటి ఇజ్రాయిలీలు
ఇద్దరూ సెటిలర్లే – ఆయా దేశాల్లో
కూడ పొంచిన టెర్రరిస్టులు –
లేదా అమెరికాలో మెకార్థే కాలం నుంచీ
పెంచి పోషిస్తున్న సాయుధ ముఠా సెటిలర్స్ వాళ్ళు,
కెకెకె(కు క్లక్స్ క్లాన్) ను మించినవాళ్లు
వాళ్ళు ఎత్తుకపోయారని చెప్తుంది
డాష్ కాం వీడియో –
సెంటర్ ఫర్ జూయిష్ నాన్ వాయిలెన్స్
అహింసను కోరుతున్న యూదుల కేంద్రం
నిర్వహిస్తున్న వీడియో
మనుషుల కోసం మనుషుల ఆరాటం ఉంది
కాదనను – కానీ అది చాలదు –
ఒక పాలస్తీనియన్ ఒక ఇజ్రాయిలీ
కలిసి డాక్యుమెంటరీ చేశారు –
అదే విశేషం – దాన్ని ఆస్కార్ అవార్డ్ గుర్తించింది –
కానీ గ్రౌండ్ మీది రియాలిటీ అంటారే –
నేల మీద ఆకాశం నుంచి జరుగుతున్న ఆక్రమణ యుద్ధం
ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి ఇది నా ఇల్లే అంటున్నవానితో యుధ్ధం –
బల్లాల్ హమ్దాజ్ ఇల్లు చొచ్చుకుపోయిన యుద్ధం –
అది నిన్ను నా కోసం ‘నో అదర్ ల్యాండ్’ అనొద్దంటున్నది –
స్వేచ్ఛకెక్కడా చోటు లేదు అనొద్దంటున్నది
మీకిప్పటికీ అవార్డుల కోసం రాసే స్వేచ్ఛ ఉంది కదూ –
దేని గురించి రాస్తారు మరి –
నేల ఆక్రమించబడుతున్న వీళ్ళ కోసమా
అట్లన్నందుకు అపహరించబడిన వాళ్ళకోసమా
ఆలోచించండి –
మన పక్కన ఉన్న బస్తర్ గురించో, ఆదివాసుల నిర్మూలనకు గడువు పెట్టిన కగార్ గురించో కాకపోయినా
గాజా, పాలస్తీనియన్ల గురించి కాకపోయినా
బలాల్ హమ్దాజ్ గురించీ
నో అదర్ ల్యాండ్ గురించి కాకపోయినా
ఆస్కార్ అవార్డు గురించయినా రాయడానికేమయినా ఆస్కారముందేమో?

2 thoughts on “ఆస్కార్ అవార్డ్ గురించి రాయడానికైనా ఆస్కారముందా?

  1. ఎంత దుఖాన్ని గూడూకట్టిన కవిత సర్. ఎక్కడా ప్రశ్నించే వాళ్ళకి నేల మీద చోటులేకుండా చేస్తున్న దోపిడీదారుల దురహంకారుల పాలనలో వున్నాం.

  2. NICE ONE —ISRAEL CONTROLS AMERICAN POLITICS
    US SUPPORT —-NO ONE SAYS NOTHING ????

Leave a Reply