‘‘అన్ని భాషలవారూ రండి.
మా పుష్పక విమానంలో
ఆనందలోకాలలోకి సంచారం చేయడానికి వెళదాం’’ అని సకల భాషలవారిని ఆనందలోకాలకి వెళదామని ఆహ్వానిస్తున్నాడు దాశరథి. డబ్బు, డాబు అక్కరలేదు. ఆ విమానంలోకి ఎక్కడానికి మంచి హృదయమే అర్హత నిచ్చే టికెట్టు అని ఆహ్వానిస్తున్నాడు. ఏకత్వ మనసనే పెట్రోల్తో ఎగురుతుంది. ఏకత్వ మనసు కలిగి రావాలనీ ఆహ్వానిస్తున్నాడు తన “కవితా పుష్పకం” ద్వారా సమాజాన్ని. దాశరథి సమరకవి. తెలంగాణ ధిక్కారపు కేతనం. రాజ్యం తిరుగుబాటు చేసి సవాలు విసిరిన సాహిత్య సమరభేరి దాశరథి. ఒకవైపు చిత్రహింసలతో ఒళ్లు హూనమవుతున్నా అవనతనం కాని ఆత్మస్థైర్య శరధి. సాయుధ దళాలతో తలపడ్డ అక్షరాలే ఆయుధంగా కలిగిన అంకుటిత దీక్షాపరుడు, ఆచరణాత్మక ప్రబోధమై వెలిగే నిఖార్సుతనానికి నిలువెత్తు రూపమే ప్రజాకవి ధాశరధి. యుక్తవయసులో ఉండే ఆలోచనలను అధిగమించి భవిష్యత్తుకు బాటలు వేసిన దూరదృష్టి గల ద్రష్ట కృష్ణమాచార్య.
దేవులపల్లి రామానుజరావు చెప్పినట్లు “తెలంగాణలో జరిగిన వస్తువుల దోపిడీలు, పడతుల మానాల అపహరణం, ఊళ్ళకు ఊళ్ళు అగ్గిపెట్టి తల్లీ పిల్లల కడుపు కొట్టిన దుర్మార్గమునకు సంఘటనలు దాశరధి హృదయంలో నిప్పుకనికలను చల్లినవి. ఫలితంగా చెలరేగిన ధూమ జ్వాలలు తెలంగాణ సమర సాహిత్యంగా పరిణమించినది అంటూ దౌర్జన్యం అన్యాయం అక్రమాల మీద తిరుగుబాటే దాశరధి కవిత్వం” అని నిర్వచించాడు. స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం ముల్లబాటలో కదం తొక్కుతూ అక్షరమై విత్తుతూ ఎత్తిన పిడికిట్లో వెదజల్లిన చైతన్యమే దాశరథి ఆచరణ.
“దాశరథి కవిత కన్య ఒకప్పుడు ‘అగ్నిచేలము’లను ధరించి నృత్యం చేయును. మరియొకప్పుడు పీడిత ప్రజావాణికి మైకుగా ఏర్పడును. ఇంకొకప్పుడు ప్రకృతి సౌందర్యమును ప్రతిబిమింపజేయును. దాశరథి ప్రతిభా వ్యుత్పత్తులు సరిసమానముగా గల సంస్కారి.” -బెజవాడ గోపాల రెడ్డి అభిప్రాయపడ్డారు.
1966లో ప్రచురించిన ‘కవితాపుష్పకం’ ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిన కావ్యం. ఇందులో మొత్తం 40ఖండికలు పద్యాలు, గీతాలు / గేయాలు, వచన కవితలుగా ఉన్నాయి. ఇవి సమాజంలోని అనేక కోణాలను చిత్రిక పట్టాయి. ఆచరణకు మార్గనిర్ధేశనం చేయడం వలన ఈ కావ్యానికి 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ కవితా పురస్కారం లభించింది. కావ్యాన్ని దాశరథి ఆప్త మిత్రులైన శ్రీ దేవులపల్లి రామానుజ రావుకి అంకితం చేస్తూ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. పద్యమాలికలో మనముందుంచాడు.
దాశరథి సాహిత్య సృజనను వెన్నుతట్టి ప్రోత్సహించిన దేవులపల్లి మొదటి పుస్తకం పులిజాల హనుమంతరావుతో 1949లో ‘అగ్నిధార’ అచ్చు వేయించాడు. ‘దేవులపల్లి గురించి కవుల పాలిట నీవు కల్పవృక్షం’, ‘మిత్రులందు ప్రాణ మిత్రమీవు’ అని కూడా పేర్కొన్నారు. నీకెప్పుడూ నిన్ను గూర్చి తలంపు పుట్టనే లేదు. ఈ తప్పని లోకమందు నీవు తరగని మధుశాలవు మాకు హుషారునిచ్చే ప్రోత్సాహానివని కితాబు ఇచ్చాడు. దేవులపల్లి రామానుజరావు దాశరధిని వివిధ ప్రక్రియలో ఆరితేరాలని అందజేసిన ఆశిస్సులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాసిన అంకితమాలికలో….
కవివై, చక్కని వ్యాసకర్తవయి, ఆంగ్లంబాది భాషాళియం
దు విదగ్ధుండవు నైన ధీనిధివిబీ నీతో స్నేహమే గొప్ప గౌ
రవ మం చెంతు, సుహృన్మణీ! రసికవర్యా! స్నేహచిహ్నమ్ముగా
కవితాపుష్పక మంకితంబు నిడితిన్, గైకోగదే ప్రీతిమై!
రసికవర్యా నీ స్నేహమే నాకు గౌరవం, నీ స్నేహమునకు అంకితమని వివరించాడు. కవితా పుష్పకం గొప్పదనాన్ని తెలియజేసాడు.
ఎందరికైన చోటు నిడు నీ కవితానవపుష్పకమ్ము – మ
ధ్యందినభానుమండలము నైనను, చల్లని పండువెన్నెలల్
చిందెడు చంద్రమండలము చేరుటకున్ సతతమ్ము సిద్ధమే.’మంచి మనసున్న వారికి ఈ పుష్పకవిమానములో టిక్కెట్‌తో పనిలేదు. ఎందరికైనా చోటుందని తెలియజేస్తూ భాను మండలమునైనను, చల్లని పండు వెన్నెలనైనను చేరుటకు ఈ కవితా పుష్పకం సిద్ధమేనని తెలియజేస్తూ అంకితములోని చివరి పద్యం ఎల్లప్పుడూ ఈ కవితా పుష్పకము సిద్ధమేనని అందుకు పాఠకుల సంసిద్ధత కావలని తెలియజేశారు.
కవితా పుష్పకంలో వివిధ విభాగాలుగా విభజిస్తే అధ్యయనం చేయడం సుగమమవుతుంది. 1. ప్రణయము 2. ప్రకృతి 3. దేశభక్తి 4. పండుగలుగా 5. ఇతరములు.
- ప్రణయం: దాశరథి కృష్ణమాచార్య విప్లవంలో నిప్పులై ఎగసినట్టే ప్రణయంలో మంచు ముద్దయి కరిగిపోతాడు. పాటకుల్నీ అట్లే తీర్చిదిద్దుతాడు. దాశరథి ప్రణయం మామూలు ప్రణయం కాదు. విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా తీవ్రత. వీరుడు ప్రియురాలిని ఎంతగా ప్రేమిస్తాడో మరణాన్ని కూడా అంతే ప్రేమిస్తాడని తెలియజేసే ప్రవచనకర్త దాశరథి. శాంతిని సంక్రాంతిని చలిని అనేక అంశాలను ప్రియురాలుగా భావించుకొని పద్యాలు లిఖించాడు. శాంతి పెట్టుకుంటావు. చేయి తాకినంతనే కంటకములు కూడా పూలవుతావని తెలియజేసే పద్యం
‘పూలను ముద్దు పెట్టుకుని ముండ్లను వద్దనబోకు నీవు నీ
కేలటు తాకినంత పులకింపవే కంటకముల్ సుమమ్ములై…’
శాంతీ! పూలను ముల్లను ఒకే తీరుగ స్వీకరించి సమన్యాయం పాటించగలవు. శిశిర మందు వసంతం వస్తుంది అనే ఆశ కల్పిస్తాడు. శాంతిని బాలికగా మార్చి,
జ్వాలవు నీవు నీ హృదయశాలను వెచ్చదనమ్ము పొంగి, హై
మాలయ కందరా శిశిరమందు వసంతము సంతరించు
ఉ ల్లోల పయోధి బాడబ గుళుచ్ఛము నీ కబరీభరమ్మునన్
పూలయి అందగించె నినుబోలిన బాలిక లేదు సృష్టిలో!
శాంతీ! నీవు జ్వాలవే. మనుషుల వెచ్చదనము ఋతువులను మనుషుల స్వభావస్వరూపాలను మార్చి వేయగలవు. అజాతశత్రువులు నిన్ను వరించి స్వాగత సుమాలు చల్లుకొందురు. నీవు ఎక్కడెక్కడ ఉంటావో అక్కడ అభయం, స్వేచ్ఛ, పువ్వుల వాడ, జీవము, నీడ, దుఃఖాశ్రువులు చిందవు. పగ ప్రతీకారము సంభవించదని తెలియజేసే పద్యం.
నీవెటనుందువో అచట నిమ్నగ లింకవు లేళ్లు జంకవున్
పూవులు వాడ వంధతమముల్ భువి నాడవు: … ద్వేషము సంభవింపదున్.
‘మంచి ముత్యము మించిన మంచు చినుకు’ అనే ఖండికలో ఓ హేమంత కాలంలో వినబడే విభావరి మంచు బిందువా వేయి ముక్తహారంలో నిన్ను పోలవని తెలియజేస్తూ ‘మానవ జీవితంలోకి మంచి ప్రతీకవు’ అని వివరిస్తాడు.
‘పద్మపత్రము నా మనస్పద్మమాయె ` ఇందురుక్కులు నా ప్రేమదృక్కులాయె’ అని పద్మ పత్రముతో నా మనసు పద్మమయింది. అందులోని రుక్కులు నా ప్రేమకు నూతన దృక్పథాన్నిచ్చాయి. నీవు నాలోనే ఉన్నావు. ఓ మంచి ముత్యపు మించిన మంచుచినుక నన్ను మంచి పనులు చేయడానికి పురికొల్పుమని వేడుకుంటాడు.
‘హిమకామిని’ ఖండికలో ‘సుందరి నీ వరుదెంచు దారిలో, ఇచ్చిన గుండెతో ప్రణయ వీధి ప్రయాణం చేయు నాకు నీ విచ్చెనవే భయంకర హిమేత బహు యు గోపగూహమున్’ అని మీ వస్తున్న దారిలో ప్రయాణం చేస్తున్న నాకు ప్రణయ వీధివీధిలో బహు భయంకరమైన చలి చుట్టుకున్నది అని బాధపడతాడు. పొగ మంచు ముసుగుతున్న గుర్తించు నీవు సెగల పొగలు ఎక్కడివో చెప్పవే హిమరాగ్ని అని ప్రశ్నిస్తాడు. నీవుంటే చెట్ల ఆకులు రాలవు.
హిమరమణీ! భవదాహృదయమే నవయౌవన వహ్నికీలికా
సముదయమోహనంబయిన చాలు, హిమప్రళయంబులే సమూ
హములయి వచ్చి వచ్చి నను హత్యయొనర్పగ జూచినన్ నఖా
గ్రమున జయింతు నీ కటి కరంబున నుండిన చాలు, పైదలీ!
ఓయ్ హిమ స్త్రీ! నీ హృదయ మోహనంబు, నింపే స్పూర్తి నాకు చాలు. హిమప్రళయాలు సమూహాలై వచ్చి నన్ను చంపేయ చూసిన నీ నడుము నా చేతిలో ఉంటే చాలు నేను గోరు నుండైనా జయిస్తాను ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తారు.
- ప్రకృతి: దాశరథి భావకవి. ప్రకృతి ప్రేమికుడు, ఆరాధకుడు. తన కవిత్వంలో తన పద్యాలలో లలితగీతాలలో ప్రకృతి పొందికగా పొడుగుతాడు. కళ్ళముందు దృశ్యీకరణగా ఆవిష్కరిస్తాడు. అనేక చోట్ల ఉప్పెనల పొంగిపొర్లుతూ నింగినంట చూస్తుంది. సుదీర్ఘ సంస్కృత సమాసాలతో పాటు అలతి అలతి పదాలతో పద్యాలు రాయడం దాశరధి ప్రత్యేకత.
‘శారిక’ అను ఖండకావ్యమును బెంగాలీ భాషలో మణింద్రరాయి రాయగా తెలుగులోకి అనువాదం చేశాడు. అది అనువాదంలా లేదు. అచ్చు పోసిన తెలుగు జీవితంలా ఉంది. కవి ఇంటిలోని మల్లెతీగపై నివాసం ఉంటున్న గోరువంకతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఒక్క రోజున జబ్బు పడింది. ఎక్కడికి తీసుకుపోవాలి అర్థం కాని పరిస్థితి ఎదురయింది. అప్పుడే పక్షుల వైద్యులు ఊర్లోకి ప్రవేశించారు. అతని అర్థించాడు. అతనూ చికిత్స చేస్తానని ఒప్పుకున్నాడు.
అతని చికిత్సకు శారిక
అతి వేగమ రోగముక్తి నందెను దానన్
హితుడయ్యె పిచ్చుకల వాడు,
అతిథిగ నా యింట నుండె నైదారు దినాల్.
తాను ప్రేమించిన పక్షికోసం, దాని రోగమునకు చికిత్స చేసిన పక్షులోడిని అయిదారు దినములు ఇంట యందు అతిధి సత్కారాలు చేసిన మంచి మనిషి దాశరథి స్వేచ్ఛానువాదాన్ని వ్యక్తీకరిస్తాడు. ‘పావురాళ్లు’లో పావురాల గొప్పతనాన్ని వివరిస్తూ వాటి స్వరూప స్వభావాలను, గుణగణాలను కీర్తిస్తూ సందేశాత్మక ప్రబోధ గీతంగా మలిచాడు.
జ్ఞాతివైరము లెరుంగవు,
జాతిభేదము లెరుంగవు,
ప్రీతిగూర్చునే గాని
భీతి గూర్చ వెవ్వరికి.
వాటికి వైరములు లేవు. జాతిభేదాలు లేవు. ప్రేమను మాత్రమే కూర్చుకుంటాయి. భీతి వాటికి తెలియవు. పావురాలనుంచి మానవులు ఎంతో నేర్చుకోవాలి. వాటిని ఆచరణను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ పావురాల జంట యువజాతికి రెండు కన్నుల్లో చూపే శాంతి మార్గము, వాటి ప్రేమ హృదయం నేటి యువతకు శిరోధార్యమని సందేశం ఇస్తాడు.
‘ఆకాశంలో అనుస్వారాలు’ అను ఖండికలో అనుస్వారము అనగా భాషా విరామ చిహ్నాలలో అరసున్నకు పేరు. ఏమీలేనిదే ఆకాశం. ఆ ఆకాశంలో ఉన్నవేమిటో పరిచయం చేసి ఆశావాదాన్ని పురికొలుతాడు.
చంద్రుడూ, సూర్యుడూ ఆకాశంలో అనుస్వారాలు
చుక్కలన్నీ కామాలు, సెమికోలన్లు, కోలన్లు,
ఫుల్స్టాప్‌లు ఇక గ్రహాలే చిత్ర చిత్రాక్షరాలు. ప్రకృతిలోని ఇవన్నీ కూడా మన జీవితంపై ప్రభావం చూపే విరామ చిహ్నాలు లాంటివని దాశరధి ఉద్దేశం. కానీ ఒక అచంచలమైన ఆశతో రాసిన ఆలోచన. అను స్వారాలు లోకాన్ని బతికిస్తాయని తెలియజేస్తాడు. మొత్తంమీద అనుస్వారాలే మన లోకాన్ని బతికిస్తాయి. సూర్యచంద్రులు లేకుండా శూన్యమే కదా ఈ లోకం? అవే మనకు ఆనందాన్నీ, హాయినీ కలిగిస్తాయి.ప్రకృతిని ఆహ్లాదంగా వర్ణిస్తాడు. ప్రియురాలిగా సామ్యంగా భావిస్తాడు. ప్రకృతి నుండి ఎంతో నేర్చుకోవాలని పేర్కొన్నారు.
- దేశభక్తి: నియంత నిజాం రాజును ఎదిరించిన మండేకాగడ దాశరథి. అగ్ని నిప్కల మీద నిలబడి వరంగల్ల్‌లో కవితా గానంతో సాహిత్య ప్రస్థానం మొదలైతే ఆచరణలో అవే పద్యాలు ఇందూరు జైల్లో బంధించాయి. అవే అక్షరాలు తెలంగాణ సమాజాన్ని ఈటెల్లా తీర్చిదిద్దాయి. అతనే ఒక్ పోరాతమై నడిచినవాడు. అక్షరాలను సాయుధం చేయకుండా ఉండగలాడా. చేశాడు. దేశం కోసం, స్వేచ్ఛ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు దాశరథి.
భారతదేశ స్వాతంత్ర సాధన ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఫలితం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతి, అహింస, సత్యం అనే ఆయుధాలతో పోరు సలిపిన మహాత్మా గాంధీ గురించి ‘అమృతమూర్తి’ ఖండికలో వారి సౌశీల్యాన్ని వర్ణించారు.
పాలసముద్రమే నడిచి వచ్చిన రీతి, హిమాచలాగ్ర శృం
గాలు కరాలు సాచి మనకై అరుదెంచినభాతి, శాంతి స
త్యాలు మనుష్య రూపమును దాలిచి నేలకు డిగ్గినట్లు, గాం
ధీ లలితాత్ము డుజ్జ్వలమతన్ భరతావనిపైన కాలిడెన్. అని పాలసముద్రం నడిచి వచ్చిన రీతి, హిమాలయ పర్వత శిఖరాల కొమ్ములు చేతులు సాచి, శాంతి సత్యాలు మనుష్యరూపం దాల్చి నేలకు దిగినట్లు గాంధీని మనోహరమైన ప్రకాశముతో భారతావని స్వాతంత్రం పోరాటంలో కాలు మోపాడని పేర్కొన్నాడు. గాంధీ గుణగణాలు వర్ణిస్తూ ‘భయం ముక్కు ముఖం పరికించి విఖ్యాత వీరుడని’, ‘మంచికి మారుపేరైన మానిసి’, ‘కత్తి లేక దురాత్మ కుత్తుకల్ నరికెడి నీ నేర్పులేవీరునికి లభించు?’ ప్రశ్నిస్తాడు. ‘తాతయ్యను మాకెల్ల నేతవోయి’, ‘దేవుడవో జీవుడవో’ లాంటి అనేక ప్రతీకలు వాడి అస్తిత్వాన్ని ఔచిత్యాన్ని పాఠకుల ముందు ఉంచాడు. అందరివాడుగా కులమతాలకు అతీతంగా కలిగిన మనసు నీదని కీర్తిస్తూ
‘కులములతో, మతములతో కలుషము కాబోని మనసుగలవాడా! దో
ర్బలమును మెచ్చవులే! ధీ బల సంపన్నుడవు, దీనబంధు! మహాత్మా!
గొప్ప బలసంపన్నుడు మహాత్మా అని కీర్తించాడు. గాంధీ తాత అనగానే బోసినోరు కలిగిన ఆ ముసిముసి నవ్వులతో ఎదుటివారి చెడ్డ మనసుల్లో ఉన్న విషాన్ని విరగగొడతావు అని సహజత్వాన్ని వర్ణిస్తూ ‘పసివాడవు నీవేలే, ముసి ముసి నవ్వాలికి దుష్టపురుషుల మదిలో, విసమువిరుగ గొట్టెద, వా కసమున శశివై వెలుంగగలవు, మహాత్మా!’ అని పసితనంలాంటి స్వచ్ఛత, మూసిముసి నవ్వులు, చేదువిషం విరగగొట్టే మనిషివి అని కీర్తిస్తాడు.
ప్రపంచ యవనికపై భారత కీర్తి పంచశీల సూత్రాలతో, తటస్థ వైఖరితో, ప్రజాస్వామ్య విలువలతో ఫరిడవిల్లే విధంగా సామ్యవాదాన్ని బలపరిచిన ప్రథమ ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు దుఖితమతి విలపించిన విషాద గీతికే ‘చిరంజీవి నెహ్రూ’.
చనిపోయావని యెల్లరు, జల జల కన్నీర్ గార్చిరి,
చిరంజీవివే నీవు , మరణం నీ కెక్కడిది?
అరుణవర్ణ రంజితమై అలరారే గులాబిలో,
శ్వేతపట కిరీటధారి, శీతాచల శిఖరంలో,
మా రైతుల పొలాలలో మా కవుల కలాలలో
అంతట నీవేనయ్యా – అన్నిట నీవేనయ్యా
నీకు చావు ఎక్కడిది? అని ప్రశ్నిస్తూ అరుణవర్ణ గులాబీలో మీరు కనబడతారు. తెల్లని టోపీ ధరించే మీరు శాంతి కిరీటధారి, రైతు పొలాలలో, కవుల కలాలలో మీరు శాశ్వత కీర్తిని పొందుతారు. నెహ్రూ టోపిని శ్వేతపట కిరీటధారి అని సంబోధించడం కూడా కొత్తదనమే. నెహ్రూ అంతటా నీవే అన్నిటా నీవేనని కొనియాడతాడు. మరణ మెరగనట్టి నీకు -మా జోహార్ మా జోహార్ అని ఆలపిస్తాడు.
భారతదేశ స్వాతంత్ర అనంతరం అబ్దుల్ హమీద్ వీర మరణం పొందాడు. ‘పరంవీర చక్ర’ ప్రధానం చేసినప్పుడు అతని త్యాగాలను కొనియాడుతూ ‘చక్రధారి’ ఖండిక రాసాడు.
‘పరమవీరచక్రధారి, భాయి అబ్దుల్ హమీద్!
తరుణ వీరు నిన్నుగన్న, భరతభూమి జిందాబాద్’
భరతమాత తల కాశ్మీర్‌ను నరుకుటకు వచ్చిన
పాపులను సంహరించడంలో నీ ప్రాణాన్ని బలి పెట్టావు.
రాకాసుల పీచ మడచి లోకానికి వెలుగు నిచ్చి
నరులను బ్రోచిన శౌరీ! పరమ వీర చక్రధారి!’
రాక్షసుల తల పొగరు దించి లోకానికి వెలుగు అంకితమయ్యావు కొనియాడతాడు.
- పండుగలు: దాశరథి ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రుల ప్రోత్బలంతో అనేక అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించాడు. పోరాట స్ఫూర్తి నింపుకొని కమ్యూనిజం భావనలో కాలు కదిపాడు. అయినప్పటికీ పండుగల గురించి అద్భుతమైన పద్యాలు రచించాడు. తెలుగువారి అతి విశిష్టమైన పండుగ ఉగాది. యుగ ఆది అనగా సంవత్సరం మొదలు అని అర్థం. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. పంచాంగ పఠనం భవిష్యత్ దర్శనం మొదలైనవి అన్నీఆ పండుగ ప్రత్యేకతలు. ఉగాది పండుగ మీద కవితా పుష్పకంలో రెండు ఖండికలు ఉన్నాయి. ‘ఉగాది వెలుగులు’, ‘నవవసంత వైభవం’, ‘చైత్ర గీతం’, నవ వసంత వైభవం’ మొదలైన ఖండికలు రాశారు.
చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే ఉగాది గురించి ‘చైత్ర గీతము’ అనే పాటలో వసంత ఋతువులో “మామిడి పూత కోకిల కూత ఇది చైత్ర నవోదయం రాగసుధామయం ఇది మధునికే జయమని” కీర్తిస్తాడు.
‘విరబూసిన మామిడిపై స్వరమెత్తను కోకిలలు, విరి జోంపము దావులలో వినిపించును కిలకిలలు’
మామిడి పూతలతో స్వరమెత్తడానికి కోకిలలు ఉంటున్నాయి. ప్రజలలో ఒక కొత్త బలం పెంచుకుంటున్నారని తెలియజేస్తాడు.
‘నాకు ఉగాది నాడు నరము నరమ్మున, నవ్య నవాభ్యుదయము నాట్యమాడు
ఈ అశాంత ధరణి ఎన్నడో ఒకనాడు, శాంతి నందుననుట భ్రాంతి గాదు’ అని మధులహరి ఖండికలో ఉగాది ప్రస్తావన తీస్తూ శాంతి ఉగాది అందించే సందేశాన్ని ప్రబోధాన్ని విశ్వసిస్తాడు.
సంక్రాంతి పండుగ గురించి’సంక్రాంతి సుందరి’, ‘సంక్రాంతి రాత్రి’ లను రచించాడు. ఆంధ్రులకు సంక్రాంతి చాలా పెద్ద పండుగ. మూడు రోజులుగా జరుపుకునే పండుగలు మొదటి రోజు బోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమగా వ్యవహరిస్తారు. సంక్రాంతి పండుగ రావడం పల్లెలకు బంతిపూలదండలతో ఊరేగడం. పండుగను పులుముకొని పల్లె ప్రకృతి అంతా నవనవలాడుతుంది.
‘ఏకాకీ న రమేత’’ మంచు ముసుగు వేసి పొంచి చూచెడి తూర్పు పడతి మొగమునుండి పొడిచినాడు. బాలభాస్కరుండు, పచ్చని సంక్రాంతి శుభముహూర్తమందు, నభమునందు తూర్పు పడతి ముఖము నుండి బాలభాస్కరుడు ఆకాశంలో ఉదయించాడని తెలుపుతాడు. ఇది సంక్రాంతి పర్వదినమున తన ప్రియురాలు ముందే సిగ్గున ముడుచుకొనెను అని వ్యక్తీకరిస్తాడు.
చలి అనే పులి చేతులలో ఆ లలన నలుగుతుండగా అతని మదిలో ఏదో మొలిచిందని, ఎవరో పిలిచారని వీరుని వోలే లంఘించాను. శుభసంక్రాంతి నవోదయ సమయంలో ‘ధరాతలమొక్కటే అభయ మీడి మహానందముగా’ మా ఇద్దరి మనములు సంక్రాంతి నాడు పేనవేసుసుకున్నాయని దాశరథి మంగళకరముగా పేర్కొన్నాడు. ‘సంక్రాంతి సుందరి’ గీతంలో
‘బంతి పువ్వుల లేత నవ్వులతో, సంక్రాంతి సుందరి సాగి వచ్చింది
గొబ్బి దేవత అడుగుపెట్టగానే, ఉబ్బి పోయెను లేత హృదయాలు
మిత్రుడే హృదయాన మెరిసేడు’అని సంక్రాంతి పర్వదినంలో గొబ్బెమ్మలు రంగురంగుల రంగవల్లులు, అందచందాలొలుకు జవనులుఅందుకొనే మన్మధ పూలబాణములు లాంటి ప్రణయాన్ని వర్ణించాడు. శత్రుత్వాన్ని మరిచి మిత్రుత్వాన్ని పెంచుకునే పండుగగా దాశరథి కీర్తించాడు.
‘సంక్రాంతి రాత్రి’ గేయంలో ‘ఒంటరిగా వింటర్లో వెళ్ళబోకు బాయీ! కంటపడిన దోయి వెంటపడినదోయి’అని హెచ్చరిక జారీ ఇస్తాడు.
- ఇతరములు: కవితా పుష్పకంలో ‘‘కవితా పుష్పకం’’ అనే శీర్షికతో మానవత్వం, భాషా ఏకత్వం, మతసామరస్యం వంటి విలువల్ని చాటి చెప్పే గంభీరమైన భావ కవిత. ఇందులో రచయిత భావప్రపంచం విశాలంగా, లోతుగా దర్శనమిస్తుంది. ఇది కేవలం ఒక కవిత కాదు, ఒక ఆత్మమాట, ఒక జాతిప్రజ్ఞా సందేశం. గగనంలో చుక్కలు ` తోటలోని పూవులు
కలహించక కలిసుందును,
మనుషు లేల కలహించుట?
సూర్యునితో చంద్రుడు పోట్లాడడు,
ఒక మతస్థునితో ఇంకొక మతస్థు డేల పోట్లాడుట?
తోటలోని పూవులు యుద్ధం చేస్తే…. తోట పాడవుతుంది.
మనుషుల మధ్య పోట్లాటలు తగాదాలు వద్దనీ వారిస్తాడు. ప్రకృతిలో ఉండే తోటలోని పూవులు కలసి ఉన్నాయి. పరమత సహనం పాటించాలి. తోటలోని పూవులు యుద్ధం చేస్తే తోట పాడవుతుందని ఉపదేశమిస్తాడు. మనదేశంలోని అన్ని భాషలు నావి. నా నా కర్థమయినా, నావి కాకున్నా నావిగా స్వీకరిస్తాను. మంచుకొండలకు దూరంగా, అవుతల వున్నా అవీ నావే. సముద్రానికి దూరాన వున్నా, ఖండాంతరానికి ఉన్నా ఆ భాష నాదే. ఆ భాష నాదైనప్పుడు ఆ ప్రాంతం నాది. చరిత్ర పరిణామక్రమాన్ని భవిష్యత్తుకు విప్పిచెప్పేది భాష. భాషనాదని సగర్వంగా ప్రకటిస్తాడు. భాషలలోని మిత్రులగురించి సవివరంగా చెప్పాడో చూడండి.
నా పాతమిత్రు లెవరో తెలుసా?
గాలిబూ – కాళిదాసు,
మరి కొత్త మిత్రులు? నజ్రులిస్లాం – టాగోర్.
ఒక కాలంలో గాలీబు, కాళిదాసు, ఆధునిక కాలంలో నజ్రులిస్లాం, రవీంద్రనాథ్ టాగూర్‌లు ఆయాకాలలో సాహిత్య యుగపురుషులు. వారు ప్రవచించిన సాహిత్యం మానవ మనుగడకు చైతన్యం తొడిగింది. అందుకే నిజమైన నాగరికునికి భాషాభేదాలుండవు. భేదాలకు, వాదాలకు అతీతుడే నిజమైన మనిషిగా దాశరథి భావిస్తాడు.
మంచి కవిత్వం ఏ భాషలో వుంటే అది నా భాష
మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు-నాకు ఉరుదూ, తెలుగూ రెండు కళ్ళు.
ఈ రెండు కళ్ళతో అన్ని భాషలనీ చదవగల్ను.
హృదయం ఒకటైతే లోకమంతా ఒకటి. అని స్పష్టంగా మంచి కవిత్వాన్ని అధ్యయనం చేసాడు. తెలుగు నుడికారంతో అనువాదం చేసాడు. అనువాదంలోనూ అనేక ప్రయోగాలతో నూతనతను ఆవిష్కరించాడు. సజీవతను చిత్రించాడు. మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడని పేర్కొనడం అతని ఉత్తమ స్వభావానికి తార్కాణం. అన్ని భాషల్ని చదవగలనని ఆత్మగౌరవం ప్రకటించాడు. పాత కొత్తల మేలు కలయిక దాశరథి మనస్తత్వం. పాతలోని మంచిని కొత్తలోని మంచిని స్వీకరిస్తారు. కాని ఇదే గొప్పదని పిడివాదం చేయడు. ‘నీ మిత్రుల్ని బట్టి నీ స్వభావం చేప్తాను’ అని చెప్పిన విలియం షేక్స్‌స్ఫియర్ మాటల్ని బట్టి వ్యక్తిత్వం అంచాన వేయవచ్చు.కాళిదాసు నుచి టాగోరే దాకా విశ్లేషించడం ప్రతిభకు పరాకాష్ట. దాశరథి తన మిత్రుల గురించి తెలుపుతూ కవితాపుష్పకంలో కవిసమ్మేళనం జరుగుతుంది. ఇందులో హిందూ ముస్లింలు కవితాగానం చేస్తారు.
ఈ రంగస్థలంమీద కంబరూ, కబీరూ కలిసి కవిత్వం చదువుతారు.
ప్రతి హృదయంలో రోజూ అఖిల భారత కవి సమ్మేళనం జరగాలి.
మనిషి మనిషిని విడగొట్టే రాజకీయాలు మరచిపొండి!
మనిషిని మనిషి పడగొట్టే మతాన్ని వదిలేయండి!
మనిషినీ మనిషినీ కలిపే కవితాసౌధంవైపు రండి!
ఈ కవితాసౌధం పుష్పకవిమానం వంటిది
ఇందులో ఎందరు ప్రయాణించినా ఇంకా చోటుంటుంది.
ఈ కవితా పంక్తులు దాశరథిని విశ్వమానవ స్వభావానికి దర్పణం పట్టాయి. ప్రతి మనసులో అఖిల భారత కవిసమ్మేళనం జరగాలని కలలు కన్నాడు. మనుషుల్ని విడగొట్టే రాజకీయాల్ని, మతాల్ని వదిలేయాలని పిలుపునిచ్చాడు. కవిత్వం మనిషిని మనీషిగా తీర్చిదిద్దాలి. ఆ కవితా సౌధం వైపు రండి అని ఆహ్వానిస్తాడు.
అనుబంధాలు ‘మనసులో ద్వీపాలు’ అనే ఖండికలో ‘స్వాంతంలో ద్వాంతములను పరిమార్చగలది దీపం ఒకటి చూపవే వెలది’ అంటూ పాడుతాడు.
కుటిలులైన మిత్రులవలె నటించు నీ కనుబొమ్మలు
నల్లవయ్యు నీ అందము నలుసంతయు చెరపలేవు.
స్నేహంతో వెలుగొందే చిన్నదీపమొక్కటే
మనసులోని చీకట్లను మాపేనని పలికేవా?
ప్రాణానికి ప్రాణమని బీరాలు పలికే స్నేహాలు రంగు నశిస్తున్న అందాన్ని, ఔచిత్యాన్ని చెరపగలేవు. మంచి మారుపేరుగా నిలిచే, నిలిపే మంచి స్నేహమే ఇద్దరి మధ్య దీపంలా వెలుగులు వెదజల్లాలని వివరిస్తాడు.
‘మీర్ కవితా మాధుర్యం’అను ఖండికలో గజల్ చెప్పడంలో ‘మీర్’ కవికి మీర్ కవే సాటి. మీరు తక్మీర్ పూర్తి పేరు గల ఈ కవి సూపి వేదాంతతత్వం కరుణవేదనలు, వియోగ సంయోగాల గుబాలింపు ఉక్తి చమకృతి కవణధార భావగంభీరత ఈయన కవిత లతలలో కనిపిస్తాయి. వారి గజల్ను అనువదిస్తూ…
‘విరహాగ్ని తీక్షణతకు కరిగిపోయితిని,
విలపించు దివ్య మలిగిపోయితిని’ అని విరహవేదనను స్వచ్ఛంగా స్వభావక్తంగా తెలుగు నుడికారంతో అనువదించాడు.
‘జఫర్ మధు తరంగాలు’అనే ఖండికలో భారతీయ మొగల్ రాజకవిబహుదూర్ షా ఉపనామమే ‘జఫర్’ ఉర్దూ కవితా ప్రపంచంలో జఫర్ సర్వదా కవి చక్రవర్తి. అతని కవిత్వాన్ని అనువాదం చేస్తాడు.
‘ఇంపుగా వచ్చెను వసంతం, నింపవే మధు పాత్రము,
పచ్చ పచ్చగా వెలుగనీ, నీ, పాఠశాల సత్రం’అని వసంతాన్ని ఆలపించాడు.
‘రవికవి’ అనే ఖండికలో కవి యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తాడు. మృతి ఏనాడు నిన్ను ముట్టబోదు నాశనమే లేని నీ కృతిని నిన్ను కాపాడుతుంది అని పేర్కొంటాడు.
ఉర్వర కూర్వశిన్ దిగిచితోయి మహాకవి! నిన్ను చూడగా
ఖర్వములౌను పర్వతశిఖల్‌బీ గగనమ్ములు వంగివంగి ని
ర్గర్వముగా నమస్సు లిడుగాదె! భవత్కర మందుకోని దీ
ఉర్వరగాదు, సృష్టి నెట నున్నదె దివ్విటి పట్టి చూచినన్?
మహాకవి నిన్ను చూడగా పర్వత శిఖరాలు ఆకాశం మహాకాశంలో వంగి గర్వహితంగా నీకు నమస్సులు ఉంటాయి సృష్టి అంతా ఏ విధంగా చూసినా కవిని కొనియాడుతూనే ఉందని పేర్కొంటారు. కవితా పుష్పకం సమాజ మేలతలుపు. ఆలోచనవాదుల పుష్పకం దాశరథి ‘కవితా పుష్పకం’.
‘చచ్చిపోయిన జాతి నోర్విచ్చి ప్రాణ
ధారలను చిమ్మ చేతనత్వ మిడినావు,
భారతీదేవి నీవయి వచ్చెనేమొ!
నీవె భారతివై పోయినావొ యేమొ!’ చైతన్యం చచ్చిపోయిన జాతికి నోరు ఇచ్చి ప్రాణదారులను తెరచాడు. చైతన్యమిచ్చు ఓ మహాకవి భారత దేవి నీవే అయి వచ్చావేమో నీవే భారతివై పోయినావేమో అని కవిని కీర్తిస్తాడు. అలాంటి కీర్తిని భారతి దేవి పంపగా వచ్చిన సరస్వతీ పుత్రుడు దాశరథే కావచ్చు. ఏకత్వాన్ని కాంక్షించిన కవి భారతిలో కలిసిపోయాడేమో కానీ ఎప్పటికైనా నిలిచి ఉండేది అతని కవిత్వమే తెలంగాణ ఆత్మగౌరవం. ధిక్కార భావుటా. తెలుగు ప్రజల చైతన్యానికి దశ`దిశ. అక్షర ఋషి, తెలుగు సాహిత్య చిరంజీవి.
ఆధార గ్రంథాలు:
- కవితా పుష్పకం
- దాశరథి కవితా పుష్పకంలో ఉగాది – శ్రీ టి. ఉడయర్లు
- కవితా పుష్పకంలో వైమానికుడు – శ్రీ నండూరి రామ్మోహన్ రావు