అప్పటికింకా
ఎవరూ నిద్ర నుంచి లేవరు
ఆమె ఒక్కతే లేచి
రెండు చేతుల్లో రెండు ఖాళీబిందెలు
పట్టుకుని
వీధి కొళాయి పంపు వద్దకు
వెళ్తుంది
అప్పటికే అక్కడ మరి కొంతమంది
నీళ్ల కోసం
ఎవరి వంతు కోసం వాళ్లు
నిల్చొని వుంటారు
ఆమె వంతు రాగానే
రెండు బిందెల నిండా నీళ్లుపట్టి
తలపైన ఒకటి
నడుంకి ఆనించి ఒకటి
ఇంటికి వెళ్లే దారిలో
నడుస్తూ
వంటగదిలో కింద
ఒడుపుగా దించుకుంటుంది
అప్పటికింకా
నిద్ర నుంచి ఎవరూ లేవరు
చీపురుతో ఇల్లంతా వూడ్చి
తడిగుడ్డతో ఒత్తి
చీపురును ఒక మూలకు పెడుతుంది
తడిగుడ్డని పిండి
గోడ మీదో దండెం మీదో
ఆరేస్తుంది
పొయ్యిలో బొగ్గులు వేసి
కూటికుండని పైకెక్కించి
నిప్పు రాజేస్తుంది
అన్నం ఉడుకుతుంది
అప్పటికీ
ఎవరూ నిద్ర నుంచి లేవరు
పనంతా అయిపోతుంది
ఆమె ఇంకో పనిలోకి ప్రవేశిస్తుంది
అప్పటికే బారెడు పొద్దెక్కి
గాలి ఆకలితో నకనకలాడుతుంది
ఎవరూ ఎప్పటికీ
నిద్ర నుంచి లేచినట్టు లేదు
ఆమె ఒక్కతే
ఇల్లంతా భూమంతా