వాడు
పూవులన్నిటిని చిదిమి
వసంతాల్ని రాల్చేశానంటాడు..
వాడు
దారులన్నింటిని మూసి
గాలిని బంధించానంటాడు..
వాడు
వేలాది వీరుల గుండెల్ని
తూట్లు పొడిచిన
తుపాకుల్ని తూర్పుకు లోడుచేసి
సూర్యోదయాల్ని పాతరేశానంటాడు..
వాడు
అడవి గుండెలపై
ఆయుధ గిడ్డంగులు డంపుజేసి
చెట్టు పుట్టా పురుగూ పుట్రానెల్లా
చెడుగాడానంటాడు..
వాడు
ముచ్చెమటలు పట్టిస్తున్న
విల్లంబుల ధృతికి జడిసి
కరోనాలు కడుపు దాచిన
డ్రోన్ల దొంగ దాడులు
తన విజయమని బుకాయిస్తాడు..
తోకలేని గాలిపటాల
అర్థంలేని శతకాల
పిలుపు మేలుకొలుపులు
మీడియా మెసేజులై
పలాయన కూనిరాగాలాలపిస్తుంటే..
ఆపరేషన్ సమాధాన్
కోరలు పదునెక్కించి
ప్రగతికి మార్గాలు
సుగమమైనాయంటాడు..
అభివృధ్ధికి ధ్వారాలు తెరుచుకున్నాయంటాడు..
పాశవిక ప్రహార్ల
పదఘట్టనల కింద నలిగి
కనురెప్పలపై
కాళరాత్రుల్ని మోస్తున్న కన్నతల్లుల
పచ్చినెత్తుటి పొత్తిళ్ళ శపథాలు వినగలడా వాడు..!!
సవర గూడాల్ని
శవాల గుండాలు జేసి
బతుకో గండం జేసినా
తూటాల వానయ్యీ
వెదురు పాకల నెగడు నిప్పుల్ల
ఊపిర్లు బిగబట్టి
పాలుదాగుతున్న పసిబిడ్డల
బిగుపిడికిళ్ళు పురుడు పొసే
ఉఛ్వాస నిశ్వాస ఉప్పెనల్ని
ఆపగలడా వాడు…??
విల్లంబుల ధృతి కి జడిసి