కవి అన్నట్లు ఆయనేమీ బాంబులు పంచలేదు. శత్రువు మీదికి గురిచూసి తుపాకి పేల్చలేదు. అతను చేసిందల్లా దోపిడీ, అణిచివేతలకు బలాన్నిచ్చే ఆధిపత్య భావజాలాన్ని ధ్వంసం చేసే కొత్త రాజకీయ, సాంస్కృతిక భావాలను, విలువలను నిర్మాణం చేశాడు. మార్క్సిజం వెలుగులో చరిత్రకు కొత్త భాష్యం చెప్పాడు. అంతటితో ఆగక ఆ చరిత్ర నిర్మాణంలో భాగమయ్యాడు. ప్రజా పోరాటాలలో నాయకుడై ముందు నిలిచాడు. అందుకే దేశంలో “అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాడని” అతణ్ని ఫాసిస్టు ప్రభుత్వం నిర్బంధించింది. అతని మెదడు చాలా ప్రమాదకరమైనదని ఫాసిస్టు కోర్టు ప్రకటించింది. ఇరవై ఏండ్ల జైలు శిక్ష విధించింది. రాజ్యం అతణ్ని భౌతికంగా బంధీ చేయగలిగింది. తాను అమితంగా ప్రేమించే ప్రజలకు దూరం చేయగలిగింది. జైలు హింసతో ఆరోగ్యాన్ని నాశనంచేసి “శాస్త్రీయంగా చంపగలిగింది” (“scientific killing”). కానీ, అతడు సృష్టించిన భావ విస్పోటనాన్ని ఆపలేకపోయింది. అతను ఇటాలియన్ మార్క్సిస్ట్ మేధావి ఆంటోనియో గ్రాంసీ.
గ్రాంసీ తన 46వ ఏట చనిపోయే నాటికి ( 27 ఏప్రిల్, 1937) రాజ్య నిర్బంధంలో పదకొండేళ్లు గడిపాడు. తన చివరి క్షణం వరకు ప్రజాయుద్ధం (విశాల అర్థంలోనే) కోసం జ్ఞానయుద్ధం చేశాడు. జ్ఞానం కేవలం మేధోసంపద పోగేసుకోవడం కోసం కాదు. వ్యక్తి బతుకుదెరువుకు మార్గం మాత్రమే కాదు. భుజకీర్తులు తగిలించుకోవడం కోసం కాదు. అస్తిత్వాన్ని ప్రకటించుకోవడం కోసం కాదు. భజనపరుల మెప్పు కోసం కాదు. జ్ఞానం ఆధిపత్య భావజాల విధ్వంసం కోసం. ఆ క్రమంలో జరిగే సమాజ పరివర్తన కోసం. ఈ ఆచరణ సిద్ధాంతాన్ని(Theory of Praxis) మార్క్సిజం వెలుగులో ముందుకు తీసుకొచ్చాడు. ఆధిపత్య భావాల నిర్మాణంలో దోపిడీ పాలక వర్గాలు విద్య, మీడియా, మతం వంటి వాటిని ఆయుధాలుగా వాడుకుంటాయని విశ్లేషించాడు. ముఖ్యంగా విద్యా విధానం మీద గ్రాంసీ అనేక సూక్ష్మ పరిశీలనలు, ప్రతిపాదనలను చేశాడు. వాటిలో కొన్నింటినైనా అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.
విద్య, బోధనా పద్ధతుల మీద గ్రాంసీ ఆలోచనలు అర్థం కావాలంటే వాటిని అతని మొత్తం రచనలతో కలుపుకోని విశ్లేషించుకుంటే కాని అర్థం కావు. జ్ఞానమంటే ఏమిటి? అసలు మేధావులు ఎవరు? సమాజంలో సంస్కృతి ఎట్లా నిర్మాణమవుతుంది? ఎట్లా ప్రజల జీవితాల్లోకి ఇంకిపోతుంది? ఆధిపత్యం ఏ విధంగా సర్వసాధారణ విషయంగా మారిపోతుంది? ఈ పక్రియల్లో రాజ్యం, పౌర సమాజం ఎలా పనిచేస్తాయి? వీటన్నింటిని అర్థం చేసుకుంటేనే గ్రాంసీ విద్య గురించి చేసిన పరిశీలనలు అర్థమవుతాయి. ఎందుకంటే గ్రాంసీ దృష్టిలో విద్య కేవలం తరగతి గదులకు, పాఠ్యాంశాలకు పరిమితమైనది కాదు.
గ్రాంసీకి విద్య సంస్కృతిలో భాగం. అది తనలోని తనను (inner self) ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా క్రమశిక్షణలో పెట్టుకోవాలో నేర్పుతుంది. ఆ క్రమంలో తన వ్యక్తిత్వం ఏమిటో తనకు తెలిసొచ్చేలా చేస్తుంది (స్వీయ స్పృహ అనేది గ్రాంసీ తనమీద ఉన్న హెగేలియన్ ప్రభావంతో అన్న మాట). దాని ద్వారా సమాజంలో తన స్థానం, విలువ ఏమిటో అర్థమయ్యేలా చేస్తుంది. సంఘజీవిగా బతకడమంటే ఏమిటో తెలియచేస్తుంది. జీవిత ప్రయోజనాన్ని బోధిస్తుంది. అంతేకాదు, తన చుట్టూ సంస్కృతి పేరిట నిర్మితమైన గోడల గురించి తెలుసుకునే పరికరాలను ఇస్తుంది. చివరిగా ఆ గోడలను కూల్చే శాస్త్రీయ, చారిత్రక ఆయుధాలను అందిస్తుంది. మొత్తంగా తన వ్యక్తిగత, సామూహిక జీవిత సారాన్ని అర్థం చేసుకోనే జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ జ్ఞానమే సామాజిక పరివర్తనలో భాగమయ్యే రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తుంది. దోపిడీ, పీడనల సందర్భంలో చైతన్యాన్ని పొందిన ప్రజలే విప్లవ మార్గాన్ని ఎంచుకుంటారని, చివరి వరకు చరిత్ర నిర్మాణంలో నిలబడుతారని గ్రాంసీ అభిప్రాయం.
అయితే జ్ఞానం నుండి ఆచరణలోకి మారే క్రమం ఒక సరళరేఖలో జరుగదు. ఎందుకంటే విద్య అనేది ఒక భావ సంఘర్షనా పక్రియ. మన నిత్య జీవితంలో వివిధ సామాజిక సంస్థల ద్వారా (విద్యా సంస్థలు, మతం, కుటుంబం, రాజ్యం, రాజకీయ పార్టీలు, సామాజిక సమూహాలు/క్లబ్బులు, యూనియన్లు…), అనేక సాంస్కృతిక రూపాలు, వ్యవహారాల ద్వారా మనం పొందే జ్ఞానం, అనుభవమంతా విద్యలో భాగమే. అటువంటి విద్యా పద్ధతుల్లో అనేక రకాల భావాలు కలబడుతాయి. కొన్ని ఓడి గెలుస్తాయి, మరికొన్ని గెలిచి ఓడుతాయి. ఆ గెలుపు ఓటములు ఆయా స్థల, కాలాల పరిధిలో జరుగుతాయి. అవి వాటిని ప్రభావితం చేసే రాజకీయార్థిక అంశాలు, వాటి చుట్టూ నిర్మితమైన సంస్కృతి మీద ఆధారపడుతాయి.
వాస్తవానికి ఏ భావజాలమైనా ఆధిపత్య స్థాయికి చేరడానికి విద్య చాలా ప్రధానమైనది. ఆ విద్యే ఒక విషయం పట్ల సమ్మతినో, వ్యతిరేకతనో కల్గిస్తుంది. ఒక విషయం ప్రశ్నించలేనంత సమ్మతిని కూడగట్టగలిగిందంటే అది ఆధిపత్య స్థాయికి చేరినట్లే. ఈ అర్థంలో గ్రాంసీ దృష్టిలో అన్ని ఆధిపత్య పక్రియలలో విద్య అనివార్యమయినది. “Every relationship of ‘hegemony’ is necessarily an educational relationship” అని అంటాడు గ్రాంసీ.
అందుకే విద్యావిధానం మీద గ్రాంసీ చేసే మొట్టమొదటి ప్రతిపాదనేమంటే విద్య వ్యక్తికి ఒక విషయాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించి, అర్థం చేసుకునే స్థాయిని కలిగించేలా ఉండాలి (“the fundamental power to think”). ప్రశ్నించే తత్వమే సమాజ పురోగతికి ఇంధనమని భావించాడు. అది సైన్స్ అయినా, చరిత్ర అయినా ప్రశ్నల సమ్మెట దెబ్బలు తింటేనే సత్యం బయటపడుతుందని నమ్మాడు. ఏ విషయంలోనైనా అతి కీర్తనలు పనికిరావని చెప్పాడు. చరిత్రను అర్థం చేసుకోవడానికి అందులోని కొన్ని ఘటనలను, కొందరు వ్యక్తులను కీర్తించడం కాకుండా (దీన్నే గ్రాంసీ “fetishistic history” అంటాడు. ఈ భావనను తర్వాత వాల్టర్ బెంజమన్ ఇంకా అభివృద్ధి చేశాడు) ఆ చరిత్ర నడిచిన సంక్లిష్ట సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవాలని అంటాడు.
పాలక వర్గాలు, జాతులు (భారతదేశ సందర్భంలో దోపిడీ కులాలు) విద్యను ఒక సాధనంగా వాడుకుంటాయి. తమ ఆధిపత్యాన్ని విద్య ద్వారా అందరి మెదళ్లలోకి ఎక్కిస్తాయి. పీడిత వర్గాలు, జాతులు, కులాలు ఆ ఆధిపత్య భావాలు మావే అనుకునేటట్లుగా చేస్తాయి. అట్లా ఆధిపత్యాన్ని మామూలు విషయంగా మార్చడానికి దోపిడీ వర్గాలు, కులాలు తమ చేతిలోని రాజ్య యంత్రాంగాన్ని, దాని అజమాయిషీలో నడిచే అన్ని వ్యవస్థలను, సంస్థలను వాడుకుంటాయి. ఇందులో వాటి ముఖ్య ఉద్దేశం సమాజంలోని ఒక పెద్ద భాగాన్ని తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవడం. అందుకోసం అవసరమైన చోట సమ్మతి కోసం ప్రయత్నిస్తారు. అది వీలుకాకపోతే బలాన్ని వాడుతారు. అందుకే గ్రాంసీ చేసిన సూత్రీకరణ ఏమంటే ఆధిపత్యం = సమ్మతి + బలప్రయోగం.
ఈ సూత్రీకరణ మాకియవెల్లి రాసిన “ది ప్రిన్స్” అనే గ్రంథంలో రాజు ఏ విధంగా కపట బుద్ధిని, బలాన్ని ఉపయోగించి ప్రజలను అదుపులో ఉంచాలో రాసిన పద్ధతి నుండి గ్రహించాడన్నది ఒక పరిశీలన. ఈ విషయాన్ని చెప్పడానికి మాకియవెల్లి గ్రీక్ పురాణాల నుండి సగం (పై భాగం) బుద్ధిగల మనిషి, మరో సగం (కింది భాగం) బలం గల గుర్రం రూపంలో ఉండే సెంటూర్ అనే జంతువును ప్రతీకగా వాడాడు. సమ్మతి, బల ప్రయోగాలను విడివిడిగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ, నిజమైన గ్రాంసియన్ స్ఫూర్తిలో (ముఖ్యంగా ఫాసిస్టు సందర్భంలో) అవి కలగలిసే వుంటాయి.
నిజానికి విద్యా వ్యవస్థలో సమ్మతి, బలప్రయోగం కలిసే ఉంటాయి. ప్రధానంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో విద్యను పెట్టుబడికి ఒక అనుబంధంగా (appendage) మార్చిన తరువాత పెట్టుబడి తన అభివృద్ధికి పనికొచ్చే జ్ఞానాన్ని మాత్రమే జ్ఞానంగా పరిగణిస్తుంది. ఈ వాతావరణంలో విద్య అంటే మార్కెట్ లో విలువను క్రియేట్ చేసే ఒక సాధనం అనే ఒక సమ్మతి నిర్మితం అయింది. దానికి అనుకూలంగానే బోధన జరుగుతుంది. ఈ సందర్భంలో విమర్శనాత్మక ఆలోచనలను, సృజనాత్మకను పెంచే బోధనా పద్ధతులను, పాఠ్యాంశాలను తగ్గించడం, తక్కువ చేయడం సర్వసాధారణమైంది. ఒకవైపు ఇలాంటి విద్యా సంస్కృతిని పెంచిపోషిస్తూనే, మరోవైపు పీడిత వర్గాల, జాతుల, కులాల అధ్యాపకుల మీద, విద్యార్థుల మీద అనేక రూపాలలో పెత్తనం కొనసాగుతుంది. వీటికి తోడు అధ్యాపకులు ఏమి బోధించాలో, ఎలా బోధించాలో పెట్టే నిబంధనలు విద్యా వ్యవస్థలో కొనసాగే బల ప్రయోగంలో భాగమే. అంతేకాదు, కోట్లాది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడం కూడా పాలక వర్గాలు అమలుచేసే వ్యవస్థీకృత బల ప్రయోగంలో భాగమే. భూస్వామ్య, అర్థ – భూస్వామ్య సమాజాల్లో ఎవరు ఏం చదువుకోవాలి? ఎట్లా చదువుకోవాలి? అని పెట్టే కట్టుబాట్లలో సమ్మతి, బలం కలిసి దాడి చేస్తాయి.
ఫ్రెంచ్ తత్వవేత్త రూసో ప్రతిపాదించినట్లు విద్యను కేవలం వ్యక్తి అభివృద్ధి కేంద్రంగా కాకుండా, సమాజ రాజకీయార్థిక కోణం నుండి చూడాలంటాడు గ్రాంసీ. రూసో ప్రకారం ప్రతి విద్యార్థికి జ్ఞాన సమపార్జన మీద సహజమైన ఆసక్తి వుంటుంది. కాబట్టి వాళ్ళను సహజ, స్వేచ్ఛా వాతావరణంలో, ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువు నేర్చుకునే విధంగా విద్యావ్యవస్థ ఉండాలని ప్రతిపాదించాడు. గ్రాంసీ రూసోతో కొంత అంగీకరించినప్పటికీ సహజసిద్ధ వాతావరణంలో స్వేచ్ఛగా విద్యార్థులు అభ్యసిస్తారనే విషయంలో గ్రాంసీకి అంగీకారం లేదు. ఎందుకంటే అన్ని వర్గాలకు ఒకే రకమైన వాతావరణం ఉండదు. ఒక వర్గ సమాజంలో అందరూ ఒకే రకమైన స్వేచ్ఛతో పుట్టరు, పెరుగరు. తాము పెరిగే వర్గ వాతావరణం బట్టి వారి ఆశలు, జీవిత ఆశయాలు, వారికొచ్చే అవకాశాలు నిర్ణయించబడుతాయి. ముఖ్యంగా ఫాసిజం విజృంభిస్తున్న సందర్భంలో ఏ వాతావరణం స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉండదు. కాబట్టి విద్య ఎప్పుడైనా అసమానతలను ప్రశ్నించే విధంగా, ఆధిపత్య భావజాలాన్ని బద్ధలుకొట్టే విధంగా ఉండాలంటాడు గ్రాంసీ. ఆ ప్రయత్నం ఉద్దేశపూర్వకంగానే చేయాలంటాడు.
గ్రాంసీకి విద్యంటే సంపూర్ణ జ్ఞాన ప్రక్రియ. అందులో ఒక సంఘ జీవికి కావాల్సిన అన్ని విలువలు ఉండాలి. ఆ ప్రక్రియలో సమత, మానవతావాద దృష్టి ఏర్పడాలి. అటువంటి విద్య అందరికి సమానంగా అందుబాటులో ఉండాలి. అటువంటి యూనిటరీ స్కూల్స్ ఏర్పడాలని కోరుకున్నాడు. తరాలుగా వెనుకబాటుతనానికి గురైన సబాల్టర్న్ విద్యార్థులకు కొంత నిర్బంధంగానైనా ఉన్నత ప్రమాణాలున్న విద్య అందించాలని అంటాడు. ఆ విద్యార్థులు తమ సామాజిక లక్ష్యాల గురించి ఆలోచించగలిగే స్పహ కల్పించాలని, తమపై స్వీయ నియంత్రణ (self-discipline) కలిగివుండే విధంగా వాళ్ళను తయారు చేయాలంటాడు గ్రాంసీ.
“తయారుచేయడం” అనే మాటను సాంప్రదాయ విద్యా పద్ధతిగా విమర్శించేవాళ్ళు కూడా వున్నారు. అయితే గ్రాంసీ తన విద్యా పద్దతులలో ఎక్కడ ఒక ప్రమాణీకరింపబడిన సిలబస్ కాని, ఒక విషయాన్ని ముక్కకు ముక్కలు చేసి ఒక్కో ముక్కలో “నిపుణుడు” అని చెప్పే ఒకేషనల్ విద్యనో ప్రతిపాదించలేదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా పాఠశాలల నుండి కంపెనీలకు నడిచివెళ్ళే సుశిక్షిత గొరిల్లాలను (trained gorillas) తయారు చేస్తామే కానీ ఒక సంపూర్ణ మానవున్ని నిర్మాణం చేయలేమంటాడు. ఆ “ప్రొఫెషినల్” గొరిల్లాలు తమ సమాజంలో జరుగుతున్న సంగతుల, సంఘర్షణల గురించి కాదు కదా తమ గురించి కూడా తెలుసుకునే స్థితిలో ఉండరు. అటువంటి వాళ్ళు తమ మెదళ్లను పాలక వర్గాలకు తాకట్టు పెట్టి ఎలాంటి సామాజిక బాధ్యత లేకుండా బతికేస్తుంటారు. అందుకే విద్యంటే కేవలం learning for work కాదు, అది learning to engage critically with work అంటాడు. మొత్తంగా విద్య పౌరసమాజంలో “engaged citizens” తయారుచేసే విధంగా ఉండాలని కోరుకున్నాడు.
సోక్రటీస్ ఆచరించిన టీచర్-విద్యార్థి సంభాషణా పద్ధతులతో గ్రాంసీ ప్రభావితమయ్యాడు. కార్మికోద్యమంలో రాజకీయ పాఠశాల నడిపినా, జైలులో తోటి ఖైదీలకు పాఠాలు చెప్పినా అదే పద్ధతిని (a pedagogy of the masses) పాటించాడు. ఊకదంపుడుగా సాగే సుదీర్ఘ ఉపాన్యాసాల మీద, ప్రజలకు అర్థంకాని భాషలో రాసే రాతల మీద గ్రాంసీకి ఏ మాత్రం గౌరవం లేదు. అది ఒక ప్రజాస్వామిక పద్ధతి కాదంటాదు. ప్రజలకు అర్థం కానిది ఏదైనా వ్యర్థమే అంటాడు. వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడమంటే వాళ్ళ జీవితాలతో మమేకం కావడం, వాళ్ల భాషను, భావాలను పట్టుకోవడం, వాటి ఆధారంగానే కొత్త జ్ఞాన ప్రక్రియను మొదలుపెట్టడం. అలా చేయడం ద్వారానే వాళ్ళ మీద రుద్దబడే ఆధిపత్య భావజాలాన్ని passiveగా స్వీకరించకుండా దానితో సంఘర్షించగలుగుతారు. ఆ భావ సంఘర్షణ, counter-hegemony లేకుండా ఎన్ని పోరాటాలు చేసినా అవి సమాజంలో ఒక “passive revolution”ను అంటే కొన్ని సంస్కరణలు మాత్రమే తీసుకురాగల ఒక స్థితిని తేగలుగుతాయే తప్ప మొత్తం సమాజంలో మౌలికమైన మార్పులు తేగలిగే నిజమైన, నిలబడగలిగిన విప్లవం రాదని గ్రాంసీ గట్టి అభిప్రాయం.
గ్రాంసీ ఫాసిజాన్ని ఓడించి విప్లవాన్ని విజయవంతం చేయడానికి రెండు గతితార్కిక వ్యూహాలను ప్రతిపాదించాడు. అందులో మొదటిది “War of Position.” గ్రాంసీ దృష్టిలో ఫాసిజం రూపంలో కొనసాగే పెట్టుబడిదారి రాజ్యాన్ని కేవలం సాయుధ తిరుగుబాటుతో కూల్చడం అసాధ్యమైన పని. ఎందుకంటే దోపిడీ రాజ్యం పౌరసమాజాన్ని తన వివిధ సంస్థల ద్వార మభ్యపెట్టి, మాయ చేసి మెజారిటీ ప్రజలను తన కబ్జాలో ఉంచుకుంటుంది. దాని ద్వారా ఎంతో కొంత సాధికారతను కూడగట్టుకుంటుంది. దాని మూలంగా రాజ్యపూజ, రాజ్యాంగపూజ చేసే సందర్భంలో ఒక్కసారిగా తిరుగుబాటుతో రాజ్యాన్ని కూల్చే పని జరిగేది కాదు. కాబట్టి ముందు దోపిడి రాజ్యంపై పౌరసమాజ భ్రమలను ధ్వంసం చేయాలి. అది జరగాలంటే విద్య, సాంస్కృతిక రంగాలలో ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కొనే ప్రతివ్యూహాలను నిర్మాణం చెయ్యాలి. అలా చెయ్యడం ద్వారా ఆధిపత్య భావజాలాన్ని ఓడించడమే కాదు, రేపు అంతిమంగా జరగబోయే సాయుధ తిరుగుబాటుకు పౌరసమాజాన్ని సిద్దం చేయడం. అంతేకాదు భావజాల రంగంలో చేసే జ్ణానయుద్ధం ద్వారా పౌరసమాజంలో ప్రజలలో కలిసిపోయి (దీనినే గ్రాంసీ పౌరసమాజంలో కందకాలు తొవ్వడమని మెటఫారికల్ గా అంటాడు. దానినే “Trench Warfare ” అని గ్రాంసీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తారు) రేపు అంతిమంగా జరగబోయే సాయుధ పోరాటానికి ఉపయోగపడుతుందని అంటాడు. ఇక రెండవది, “War of Maneuver”. విప్లవ ప్రజానీకం సాయుధంగా రాజ్యాన్ని కూలదోయడం.
ఈ సందర్భంలో గ్రాంసీ స్పష్టం చేసిన అంశాలేమంటే కేవలం భావజాల రంగంలో ఆధిపత్యాన్ని కూల్చడం ద్వారా సమసమాజం రాదు. కచ్చితంగా కార్మికవర్గం పెట్టుబడిదారి రాజ్యాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారానే సామ్యవాద సమాజ నిర్మాణానికి అడుగులు పడుతాయని చెప్పాడు. అయితే గ్రాంసీ ప్రతిపాదించిన రెండు విప్లవ వ్యూహాలు ఒకటి విజయవంతం అయిన తర్వాత మరొకటి అమలుచెయ్యాలని తాను భావించలేదు. ఎందుకంటే విప్లవం విజయం కాకుండ భావజాల రంగంలో ఆధిపత్యంపై పూర్తి పట్టు సాధించడం కార్మిక వర్గానికి సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశాడు. దానర్థం ఆ రెండు వ్యూహాలు ఏక కాలంలో ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగొచ్చు అని.
గ్రాంసీ పదే పదే చెప్పిన మాటేమంటే ఒక సత్యాన్ని చెప్పకూడని పరిస్థితి సమాజంలో ఉండకూడదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సత్యం చెప్పదం కూడా విప్లవమే! సత్యాన్ని ఆవిష్కరించడమంటే విప్లవంలో భాగం కావడమే. ఆ క్రమంలో చేసే జ్ఞానయుద్ధం కేవలం స్వీయ జ్ఞానం కోసం కాదు, సమాజ నిచ్చెన మెట్లు ఎక్కించే సాధనం మాత్రమే కాదు. అది మొత్తం సమాజాన్ని అన్ని రకాల పీడనల నుండి విముక్తి చేయగల ప్రజా ఉద్యమాలకు ఇంధనం లాంటిది.
పేట్రేగుతున్న హిందుత్వ ఫాసిజం సందర్భంలో భారతదేశంలో విద్యావిధానాన్ని అర్థం చేసుకోవడానికి గ్రాంసీ ఎంతో ఉపయోగపడుతాడు. సంఘ్ పరివార్ శక్తులు తమ ఆధిపత్య భావజాలంతో దేశంలో అనేక రకాల మందలను తయారుచేస్తున్నది. ఆ తయారీ కోసం భావజాల రంగంతో పాటుగా బల ప్రయోగాన్నీ కూడ వాడుతున్నది. తన లక్ష్యమైన హిందూరాజ్య స్థాపనలో భాగంగా సంఘ్ పరివార్ తన శత్రువులని ప్రకటించుకున్న అన్ని రాజకీయ, సామాజిక సమూహాల మీద దాడి చేస్తున్నది. ఆ దాడులను సమర్థించుకోవడం చరిత్రను వక్రీకరిస్తున్నది. అసత్యాలను ప్రచారం చేస్తున్నది. పుక్కిటి పురాణాలకు శాస్త్రీయతను అంటగడుతున్నది. అశాస్త్రీయతే విశ్వగురువుగా ప్రచారం చేస్తున్నది. ఇవన్నీ సజావుగా జరగాలనే ప్రశ్నించే గొంతుకలను నిర్బంధిస్తున్నది. ఆ ప్రశ్నలను పుట్టించే వ్యవస్థలను (విద్యావ్యవస్థతో సహా) ధ్వంసం చేస్తున్నది.
ఇప్పుడు భావజాల రంగంలో సంస్కృతి, జీవన విధానం పేరిట ప్రజల మెదళ్లను ఆక్రమించిన బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చాల్సిన అవసరం ఎంతో వుంది. ఎందుకంటే పార్లమెంట్ లో ఫాసిస్టు పార్టీలు ఓడిపోవచ్చు. కానీ, సంస్కృతి ముసుగులో సూక్ష్మ ఫాసిస్టులు మన చుట్టూ ఉంటారు. మనలోనూ ఉంటారు. కాబట్టి ఫాసిజాన్ని అన్ని రూపాల్లో ఓడించడానికి జ్ఞానయుద్ధం చేయాల్సిన అవసరం రోజురోజుకు పెరుగుతుంది.
మాట మాట్లాడితే “మనోభావాలు” దెబ్బతిన్నాయని దాడులు చేస్తున్న సందర్భంలో మనోభావాలను ఏ శక్తులు, ఏ భావజాలం నిర్మాణం చేస్తుందో ఆలోచించాలి. అమానవీయ మనువాదాన్ని ఎత్తుపడుతూ మనోభావాలు దెబ్బతిన్నాయని బొబ్బలు పెట్టడం ఆధిపత్య హింసలో భాగమే. కాబట్టి పౌరసమాజంలో దోపిడీ రాజ్యానికి, దాని వెనుకాల ఉండి నడిపించే ఫాసిస్టు శక్తులకు ఉండే సాధికారితను తుడిచేయడానికి భావజాలరంగంలో చేయాల్సిన కృషి ఎంతో ఉంది. ఆ పని ఎంత చిన్నదైనా సరే మన కర్తవ్యంగా చేయాల్సివుంది.
[ఈ వ్యాసాన్ని ముందుగా చదివిన ఒక మిత్రుడు “నీ వ్యాసంలో కొన్ని బ్రాహ్మణీయ పదాలు వచ్చాయి” అని చెప్పాడు. ఆ పదాలను తెలిసో, తెలియకనో వాడాను. ఆ వాడుక నాకు విద్య ద్వారనో, నేను పెరిగిన వాతావరణం ద్వారనో “మామూలు” విషయమయ్యింది. ఒక ఆధిపత్య భావనను మమూలు విషయంగా మార్చడంలోనే దోపిడీ వర్గాలు, కులాలు విజయం సాధిస్తాయి. నా మిత్రుని విమర్షను స్వీకరిస్తూ ఇక మీదట (గ్రాంసీ భాషలో చెప్పాలంటే) సబాల్టర్న్ సోయితో ప్రజల భాషలో రాసే ప్రయత్నం చేస్తాను. బహుశా అలా చెయ్యడమే గ్రాంసీకి ఇచ్చే నిజమైన నివాళి అని భావిస్తాను.]
Very nice article sir
QUESTIONING IS VERY IMPORTANT TO EVERY ONE —but that is missing in our country -reasons
FEAR /MURDERS / NOT CONCERN /SELFISHNESS ——needs reforms in our educational system