ఒక వైపు అమెరికా ప్రపంచ పోలీసు గా మారి బడుగు దేశాల వనరులపై ఆధిపత్యాన్ని, బహిరంగ సైనిక విధానాన్ని పాటిస్తోంది. నూతన ప్రపంచ వ్యవస్థ కు తహ తహతహ లాడుతోంది.మరో వంక భారత్ బహుళ జాతి సంస్థల పెట్టుబడిదారీ విధానానికి దేశీయ వనరులు దోచి పెట్టే ధోరణికి పూనుకుంటుంది.దీని కోసం సనాతన సాంస్కృతిక ఆధిపత్యానికి, మతోన్మాదానికి, తమ అభివృద్ధి ఆర్థిక విధాన విమర్శక పక్షాలపై బల ప్రయోగానికి సైతం సిద్ధమవుతోంది. ఈ పరిస్థితిని ప్రజలు ఎందుకు చూస్తూ ఉన్నారని, ప్రగతి వ్యతిరేక పార్టీలకే పట్టం ఎందుకు కడుతున్నారని ప్రజాస్వామ్య ప్రియులు కలవర పడుతున్నారు.ఈ తరుణంలో గ్రాంసీ రాజ్యం, ఐడియాలజీ, ఆధిపత్యం, ఆధిపత్య రాజకీయాల పైన వెల్లడించిన భావాలు నేటి కాలానికి సరిపోయేవి
గ్రాంషీ ఒక ఇటాలియన్ మార్క్సిస్టు మేధావి. తాను సార్డినియాలో జన్మించాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టురిన్ , ఉత్తర ఇటలీ ప్రాంతాల్లో సోషలిస్టు పాత్రికేయుడిగా, సమరశీల కార్యకర్తగా పని చేశాడు. తొలి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రావాల్సిన విప్లవాలు ఆగిపోవటం లేదా విఫలమవటం గమనించి కొన్ని కొత్త ప్రతిపాదనలు చేశాడు. ఫాసిస్టు జైలులో ఎన్నో బాధలు అనుభవించాడు. అతని ప్రఖ్యాత రచన “ప్రిజన్ నోట్ బుక్స్.”
స్టువర్ట్ హాల్ అనే విమర్శకుడు తన ఉపన్యాసం ‘ప్రాబల్యం మరియు ఆధిపత్యం’ ( సాంస్కృతిక అధ్యయనాలు 1983 : ఒక సైద్ధాంతిక చరిత్ర) లో గ్రాంషీ భావాల్ని విపులీకరించారు. పశ్చిమ దేశాల్లోని ప్రజాస్వామ్యాల్లో వాస్తవికత, రాజ్యం యొక్క సంక్లిష్టత, పౌర సమాజం, ఐడియాలజీ, వ్యవస్థ పునాది – ఉపరితలం, పెట్టుబడిదారీ విధానం ఫాసిజంగా మారినపుడు దాన్ని ఎదుర్కొనడం గురించిన గ్రాంషీ సిద్ధాంతాలు నిజమైన రాజకీయ పోరాటాల నుంచి పుట్టాయి.
గ్రాంషీ దృష్టిలోవస్తు గత ఆర్థిక సంక్షోభాలు రాజ్యం మరియు సమాజాలలో ఎలా వాస్తవంగా పెరుగుతాయో, భిన్న వర్గాల బలాబలాలు మారే తీరు గురించి ఎరుక ఉండాలి. జాతి , రాజకీయ, సైద్ధాంతిక పోరాటాలు ప్రజల భావాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోకుండా పునాది -ఉపరితలం గురించి చేసే విశ్లేషణ సరైనది కాదు.
వర్గ ఐక్యత అనేది సంక్లిష్టమైనది. అది దానంతటదే రాదు. నిర్దిష్ట ఆర్థిక రాజకీయ సైధాంతిక ఆచరణ ఫలితంగా వర్గ ఐక్యతను నిర్మించాలి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగ పోరాటం, ఆదివాసుల పోరాటం, కార్మిక వర్గ సమ్మె పోరాటాల మధ్య సాలిడారిటీ అంతగా లేకపోవడం వల్ల అవి విడి పోరాటాలుగా మిగిలాయి. పాలక పార్టీకి వాటితో వ్యవహరించడం తేలిక అయింది.
ఈ పోరులో జయాపజయాలు సైనిక , రాజకీయ సైనిక సంబంధాల నిర్ణయాత్మక ఫలితం పై ఆధారపడి ఉంటాయి. సమూలంగా వ్యవస్థ మార్చటానికి కేవలం సైనిక ఎత్తుగడలకే ప్రాధాన్యమిచ్చి , సాంస్కృతిక రాజకీయ పోరాట రంగాల్ని వదిలివేయడం వల్ల ప్రత్యామ్నాయ రాజకీయాలకు అవకాశం లేకుండా పోతుంది.
రాజ్యం ప్రజాభిప్రాయాన్ని మలచడంలో పత్రికలు, మాస్ మీడియా , విద్యాసంస్థలు, మత సంస్థల గురించి , టెక్నాలజీ ప్రజల అస్థిత్వాలు రూపొంద టంలో సాంస్కృతికంగా నియంత్రిస్తుంది.
రాజ్యానికి కేవలం బల ప్రయోగ పాత్ర కాక విద్యాపర, నియంత్రణపర పాత్ర ఉంది
ఎన్ డీ టీవీ లాంటి ఎలెక్ట్రానిక్ మీడియా సంస్థలను కొనివేయడం, చరిత్ర సిలబస్ లో మొగల్ చరిత్ర తీసివేయడం, నగరాల , రహదారుల పేర్లు మార్చడం, మసీదులు మార్చి తిరిగి మందిరాలు కట్టాలి అనడం, జాతీయ పాట గా వందే మాతరం అన్ని చరణాలు తప్పని సరిగా పాడాలి అనడం ఇవన్నీ పాలక వర్గాల పార్టీలు తమ ఆధిపత్యం నిలుపుకోవడం, విస్తరించడం లో భాగమే .
ఐడియాలజీ అంటే మామూలు అర్థంలో ప్రాపంచిక దృక్పథం ,సాంస్కృతిక ఉద్యమంగా మారిన ఫిలాసఫీ మతం నమ్మకం . అది నిత్యజీవిత చైతన్యంలో ప్రవేశించి దానిని మారుస్తుంది. ఇదే కామన్ సెన్స్ గా పిలువబడుతుంది . ప్రాచీన విజ్ఞానంగా చలామణి అవుతుంది .కానీ కామన్ సెన్స్ కూడా చరిత్ర ఫలితమే. ప్రజల మనసుల్లో తరాలుగా నిద్రపోతున్న మత ఉన్మాద భుజంగాలను తట్టి లేపడం వల్ల బ్రిటీష్ వారి తరహాలో దేశ వాసుల మానసిక విభజన తేలిక అవుతోంది.
ఆధిపత్యం అనేది కేవలం ఆర్థిక వర్గ పాలన కాదు. రాజ్యానికి బలప్రయోగం ద్వారా ఉండే అధికారం కాదు. అది ప్రాబల్య వర్గంలోని ఒక నాయక విభాగాన్ని , ఇతర సబల్ట్రన్, సబార్డినేట్ తరగతుల్ని మధ్యతరగతులు, పెట్టి బూర్జువా, ఇతర ప్రజా తరగతులను తన అధికార అమరిక లో వచ్చినవారిని సంయుక్తం చేస్తుంది.
ఒక ప్రత్యేకమైన చారిత్రక కూటమి తన ప్రయోజనాలకు ప్రజల గుర్తింపును ప్రజాంగీకారాన్ని కలిగిస్తుంది. ఆధిపత్యం అంటే నాయక కూటమి తనతో ఉన్న రాజకీయ శక్తులు సమాజం ముందు ఉంచిన తమ చారిత్రక కర్తవ్యాలకు ప్రజా బాహుళ్య మద్దతును గెలుచుకోవడం లేదా సమీకరించటం . అది కేవలం ప్రాబల్యం సంపాదించడం మాత్రమే కాక నాయకత్వం వహించడం అవుతుంది.
“ఆధిపత్య క్షణం” అనేది తాను అనుకున్న ఉత్పత్తి విధానానికి సమాజాన్ని తీసుకువెళ్లేందుకు లేదా ప్రత్యేక సంక్షోభ పరిష్కారానికి సాంస్కృతిక, ఆర్థిక ,నైతిక రాజకీయ రంగాల్లో తగు పరిస్థితులు సృష్టించేందుకు పనిచేస్తుంది. ఈ నాడు మన దేశంలో సనాతన సంస్కృతి అందరికీ సమ్మతం కావాలనే యత్నాల వెనుక కూడా ఈ పెట్టుబడిదారీ సమాజం మరింత బలపడాలనే ఆకాంక్ష, సమ సమాజ భావజాలం పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నాయి. సెయింట్ వేలంటిన్ దినం నాడు ప్రేమికులపై దాడులు, భాషల మధ్య సమానత్వం కాదని వాడుకలో లేని సంస్కృతం భాష గొప్పదనం గురించి అతిశయోక్తులు ,హిందీ భాషను బలవంతంగా దక్షణాదిపై రుద్దాలి అను కోవడం లాంటి చర్యల పరమ లక్ష్యం ఆధిపత్య సంస్కృతి పరిరక్షణ మాత్రమే.
గ్రాంషీ చెప్పిన ఆధిపత్య భావనలో కదలిక యుద్ధం, అజ్ఞాత యుద్ధం, స్థాన యుద్ధం అనే మూడు ఉన్నాయి మొదటిది అణచివేత దారులు, అణిచివేయబడిన వారు వర్గాలుగా చీలినప్పుడు ప్రజలు అధికార పాలక కూటమికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా పోరాడటం. రెండవది రాజకీయ ఆర్థిక పోరాట రంగాల్లో ప్రత్యేక వర్గం యొక్క అధికార స్థానాలకు వ్యతిరేకంగా దాడి చేసే పార్టీలు వ్యూహాత్మకంగా ప్రవర్తించడం. మూడవది సంపూర్ణ ప్రజాస్వామ్యంలో శ్రామిక వర్గాలు, ప్రజాస్వామ్య శక్తులు ప్రత్యేక ఆర్థిక, రాజకీయ పౌర హక్కులు అధికారాల కోసం విజయవంత పోరాటంలో నిమగ్నమైనపుడు జరుగుతుంది. దేశం ఈ నాడు రెండవ స్థితిలోనే ఉంది.
గ్రాంషీ భావాల ప్రకారం దోపిడీ వర్గాల ఆధిపత్య స్థానాన్ని శ్రామిక వర్గాల ఆధిపత్య రాజకీయాల ద్వారానే ఎదుర్కోవాలి.బలాబలాల సమతూకంలో విజయాన్ని సాధించడం అవసరం. ఇది వామపక్షాల కన్న మిన్నగా బూర్జువా వర్గాలకు అర్థమైంది. అవి తమ ప్రయోజనాల కోసం అన్ని రంగాల్లో అంటే సాంస్కృతిక ,మేధోపర నైతిక ,విద్యాసంస్థల్లో, లైంగిక ,సామాజిక, మత సమస్యల పైన ఘర్షణ పడతాయి. నేడు మనం చూస్తున్న పరువు హత్యలు, సహజీవన వ్యతిరేకత, లవ్ జిహాద్ చట్టాలు, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛా మత ప్రచారానికి , జీవనోపాధి హక్కుకు మతోన్మాదులు కల్పిస్తున్న ఆటంకాలు ఈ ఆధిపత్య సంస్కృతి మనుగడకే సాయపడతాయి.
ఈ సందర్భంగా ప్రగతి శీల శక్తులు అన్ని రంగాల్లో ఆధిపత్య సాధన కోసం , లౌకిక, సామ్యవాద, సావరిన్ రిపబ్లిక్ విలువల కోసం ముందుకు రావాలి. వారు క్రియా శీలకంగా వ్యవహరించి వ్యవస్థను మార్చాలి. అసమానతలు ఎప్పుడూ ఉండవు. కృషి ఉంటే సామాన్య ప్రజలు సాహసవీరులు అయి చరిత్ర దశ, దిశలను మారుస్తారు.