ఆగని అన్వేషణ

‘సాహిత్య అధ్యయనం సామాజిక శాస్త్రవేత్తలకు తమ పరిశోధనలో కోల్పోయిన సమగ్రతను కల్పించగలదు’ అన్నారు బాలగోపాల్. సరిగ్గా నలభై సంవత్సరాల కింద ‘విభాత సంధ్యలు’ సమీక్షిస్తూ అన్న మాటలు అవి. 80 ల మధ్యకాలంలో నాబోటి సాహిత్య విద్యార్థులకు విభాత సంధ్యలు గొప్ప ఇన్స్పిరేషన్. సాహిత్య అధ్యయనానికి అది కొత్త దారులు చూపింది. విమర్శని వొక శాస్త్రంగా అధ్యయనం చేయడానికి అవసరమైన చూపుని అందించింది. సమాజానికీ సాహిత్యానికీ విడదీయరాని సంబంధం గురించి లోతైన అవగాహన కలిగించింది. అకడమిక్ రంగంలో కృషిచేసే సమాజ అధ్యేతల్ని సాహిత్యంలోకి, సాహిత్యకారుల్ని సామాజికశాస్త్రాల వైపు దృష్టి సారించేలా చేసింది. కాలక్షేప వ్యాపార సాహిత్యంలో కూరుకుపోయిన పాఠకులకు సీరియస్ సాహిత్యంపై ఆసక్తిని రేకెత్తించింది. సామాజిక శాస్త్రవేత్తలకు యేమో గానీ సాహిత్య విమర్శకులకు సాహిత్య అధ్యయనానికి విభాత సంధ్యలు కొత్త మెథడాలజీని ఇచ్చింది. ఆ యిద్దరి మధ్యా అనివార్యమైన వారధి నిర్మించింది. విమర్శకు శాస్త్రీయతని సాధించి సాహిత్య ప్రయోజనాన్ని పునర్నిర్వచించింది.

సాహిత్యంలో సామాజికత, సాహిత్యానికి సామాజిక ప్రయోజనం అనే మాటలు యివ్వాళ కొంతమందికి అర్థరహితంగా కనిపిస్తున్నాయి. కాలం చెల్లినవిగా అనిపిస్తున్నాయి. సాహిత్యాన్ని సమాజంతో ముడిపెట్టి చూడటాన్ని సాహిత్యంలోకి రాజకీయాల్ని చొప్పించడంగా భావించేవారి సంఖ్యకైతే కొదవలేదు. చదువరుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మౌలిక భావనలతో కూడిన విమర్శకు చోటులేకుండా పోయింది. దృక్పథ రాహిత్యమే రాజ్యమేలుతోంది. అనిబద్ధతే జబ్బలు చరుచుకొంటోంది. అసలు అధ్యయనమే కొందరికి పనికిమాలినదిగా మారింది. సమాజం రచయితల్లో పాఠకుల్లో విమర్శనాత్మక దృష్టిని కోరుకుంటున్న వర్తమాన సందర్భంలో సాహిత్య విమర్శను సామాజిక శాస్త్రాల అధ్యయనంతో అనుసంధానించిన ‘విభాత సంధ్యలు’(సంపా. సి.వి. సుబ్బారావు – సురా) అనే యీ చిన్న పొత్తం 40 సంవత్సరాల తర్వాత పునర్ముద్రణ పొందుతోంది. విభాత సంధ్యలు వెలువడ్డానికి కొంచెం ముందు కూడా శుద్ధకళావాదులు కవిసైనికుల పేరుతో కుప్పిగంతులు వేశారు. ఎర్రెర్రని అక్షరాల అట్టలతో పాత మ్యానిఫెస్టోలనే పునారచించారు. పాత సాహిత్య సంప్రదాయాలకే నవ్య – అతినవ్య విశేషణాలు తొడుక్కొని రూపవాదులు రంగప్రవేశం చేశారు. వారు సమాజాన్ని వెనక్కి నెట్టి వ్యక్తిని ముందుకు తెచ్చారు. సమూహం నుంచి మనిషిని వేరుచేసి వైయక్తిక వికాసానికి ప్రాముఖ్యం యిచ్చారు. సాహిత్య ప్రయోజనాన్ని మరోసారి ఆత్మోద్ధరణ వైపు నడిపించారు. సాహిత్యానికి స్వయంప్రతిపత్తిని ముందుకు తెచ్చారు. రచయితకు అతీత శక్తులు ఆపాదించి ప్రతిభకు పట్టం కట్టారు. ఈ ధోరణిని తిరస్కరిస్తూ సాహిత్య సృజన గానీ సాహిత్య విమర్శ గానీ వర్గపోరాటంలో భాగమే అని విప్లవ సాహిత్య విమర్శ బలంగా గొంతు విప్పింది. విభాత సంధ్యలు తెలుగు సాహిత్యంలో సమాజాన్ని దర్శించడానికి తోడ్పడిన నేపథ్యమదీ.

వాస్తవానికి సామాజిక శాస్త్రాల్ని సాహిత్యానికి అన్వయించి చేసే అధ్యయనాలు కొత్తవేం కావు. ప్రాచీన అలంకార శాస్త్రాలు లోక వ్యవహార పరిజ్ఞానానికి సాహిత్యం వుపయోగపడుతుందనీ కావ్యం విశ్వశ్రేయస్సు కోసం వుద్దేశించినదై వుండాలనీ గుర్తించినప్పటికీ అలంకార రీతి ధ్వని రస వక్రోక్తి ఔచిత్య చమత్కారాది సిద్ధాంతాల ద్వారా కావ్యానందాన్ని అలౌకికమైన బ్రహ్మానంద తుల్యమైన ఆత్మానుభవంతో పోల్చి అదే పరమ ప్రయోజనమని అంతిమంగా ప్రతిపాదించాయి. పోయిన శతాబ్దం తొలి దశకాల్లో సామాజిక చింతనాపరులు సమాజ సాహిత్యాల మధ్య వుండాల్సిన సంబంధాల గురించిన తొలి యెరుకతో స్వేఛ్చ సమానత్వం వంటి ఆధునిక ప్రజాస్వామిక లౌకిక విలువల ప్రాతిపదికమీద సాహిత్య విమర్శను నవీకరించారు. తర్వాతి కాలంలో సామ్యవాద రాజకీయాల ప్రభావంతో సమాజంలో మరింత అభివృద్ధికరమైన మార్పుకోసం ఆలోచనలు చేసే క్రమంలో సామ్యవాద వాస్తవికతని సాహిత్య సృజన విమర్శలకు ప్రాతిపదికగా నిర్దేశించుకున్నారు. సాహిత్యవిమర్శకు గతితార్కిక భౌతికవాదం కొలతబద్దగా స్వీకరించాకా సామాజిక పరిణామాలకే కాదు సాహిత్య పరిణామాలకు సైతం పునాదిలో వుత్పత్తి సంబంధాలను అనుసరించి వచ్చే మార్పులే కారణమవుతాయనే స్పృహ పెరిగింది. ఆ వొరవడిలోనే అభ్యుదయ సాహిత్య విమర్శను అభివృద్ధి చేశారు. విప్లవ సాహిత్యోద్యమం ప్రజల నుంచి ప్రజలకు అన్న ఆలోచనకు నిమగ్నత నిబద్ధతలు జోడించి రచయితలకు కళాకారులకు మరింత స్పష్టత నిచ్చింది. ఆ దారిలో విప్లవ సాహిత్య సిద్ధాంత నిర్మాణంలో మరో ముందడుగు ‘విభాత సంధ్యలు’.

నిజానికి ఇవ్వాళ అకడమిక్ రంగంలో సామాజిక శాస్త్రాల అధ్యయన ప్రయోజనమే మారిపోయింది. కార్పొరేట్లే సంపద సృష్టికర్తలు అని పాలకులు వూదరగొడుతున్నారు. అందుకు అనుగుణంగా సమాజ కేంద్రితమైన సాహిత్య రచనని ridicule చేసే గుంపులు వన్ టౌన్ సాహిత్య రౌడీల్లా వీథుల్లో వీరంగం వేస్తున్నారు. ప్రయోజనోద్దిష్ట దృక్పథంతో సాహిత్యాన్ని సృజించే క్రమంలో కళాత్మక విలువలు దెబ్బతింటాయనీ రచయితలు స్వీయ అభివ్యక్తి స్వేచ్ఛ కోల్పోతారనీ సాహిత్యంలో సాహిత్యం మాత్రమే చూడాలి అనీ గొణిగేవాళ్ళు యెప్పుడూ వుంటారు. వ్యక్తి కేంద్రితమైన పరిశోధనకూ భావవాదానికీ వీళ్ళు పెద్దపీట వేస్తారు.

సమాజంతో అసలు సంబంధం లేకుండా సాహిత్యంలో వైయక్తికత వుండడం యెట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. భౌతిక వాస్తవికతని మరిచి చేసే అభూత కల్పనలకు సైతం పునాది సమాజంలోనే వుంటుంది. రచయితా పాఠకులూ సమాజంలోనే పుట్టి పెరుగుతారు. వారి ఆలోచనల్ని ప్రభావితంచేసే అంశాలు సాహిత్య సృజనలో పఠనంలో అనివార్యంగా చొచ్చుకువస్తాయి. సాహిత్యానికి స్వయం ప్రతిపత్తి వుంటుందని వాదించేవాళ్ళు సైతం నేల విడిచి సాము చేయలేరు. సాహిత్యాన్ని మానవ ఆచరణ నుంచి వేరుచేసి చూడలేం. అలాగే సాహిత్య విమర్శ కూడా మనుషుల వుమ్మడి జీవితానుభవాల ద్వారా రూపొందే భావనల నుంచే నిర్మితమౌతుంది. అయితే భావనలన్నీ ప్రతిపాదనలు కావు ప్రతిపాదనలన్నీ సిద్ధాంతాలు కావు. సిద్ధాంతాలు ఆచరణ ద్వారానే నిరూపితమౌతాయి. అలా భావనలు సైద్ధాంతిక స్థాయికి చేరుకోడానికి వొక క్రమం వుంటుంది.

ఈ క్రమాల్ని నిరంతర అధ్యయనం ద్వారానే తెలుసుకోగలం. 90 వ దశకంలో ప్రపంచీకరణ నేపథ్యంలో వుత్పత్తి సంబంధాల్లో వచ్చిన మార్పుల్ని అర్థం చేసుకోవడంలో రచయితలు విమర్శకులు తడబడినప్పుడు సామాజిక శాస్త్రాల అధ్యయనమే ఆదుకుంది. అందువల్ల సమాజం, సాహిత్యం సంక్షోభానికి గురైన ప్రతి సందర్భంలోనూ విభాత సంధ్యలకు కొనసాగింపు అవసరం కనిపిస్తుంది. అయితే సురా అందించించిన సంవిధానాన్ని అభివృద్ధి పరచుకోవాల్సి వుండగా యెక్కడో ఆగిపోయామనిపిస్తుంది. రచయితలకు జీవన పోరాటంలో నిమగ్నమైన ప్రజాశ్రేణులకూ వుండాల్సిన లింక్ జారిపోయినట్టుంది. రచయితలు నిత్యం ప్రజా సంబంధాల్లో వుండాలనీ రచనకు వస్తువువుతోపాటు దృక్పథమే శిల్పాన్ని సమకూరుస్తుందనీ అల్లం రాజయ్య వంటి సాహిత్యకారులు పదే పదే హెచ్చరిస్తూనే వున్నారు. సామాజిక దృక్పథానికి పునాది అయిన వుత్పత్తి సంబంధాలు మారుతూ వున్నాయి. దోపిడీ స్వరూపం మారింది. దాన్ని అర్థం చేసుకోడానికి కొత్త పరికరాల అవసరం వుంది. మారిన వుత్పత్తి సంబంధాల గురించి అధ్యయనం కొరవడింది. సామాజిక శాస్త్రాల అధ్యయనంలో మార్పులు అవసరమైనప్పుడు ఆ మేరకు సాహిత్య విమర్శలో సైతం మార్పులు అవసరం. విమర్శ సాహిత్యంలో సమాజాన్ని అన్వేషించడం దగ్గర ఆగిపోరాదు. అది సమాజంలో మార్పుకి దోహదం చేసేదిగా వుండాలి. మార్పు సైతం గుణాత్మకంగా వుండాలి. ప్రజా ప్రయోజనోన్ముఖంగా సాగాలి.

సాహిత్యంలో సామాజికతని అధ్యయనం చేసే వాళ్ళందరూ కూడా వొకే దృక్పథం కలిగి వుండకపోవచ్చు. ఒకవేళ వున్నప్పటికీ వారు వొకే రచనపై భిన్నాభిప్రాయాలు కలిగి వుండవచ్చు; విరుద్ధమైన అంచనాలు ప్రకటించవచ్చు. కొందరు ఏ దృక్పథమూ లేకుండా వున్నదాన్ని యథాతథంగా రికార్డ్ చేయడం దగ్గర ఆగిపోవచ్చు. మార్పు పట్ల భయంతోనో నిశ్చిత నిశ్చయాల వల్లనో విముఖత చూపించవచ్చు. విభాత సంధ్యలు సాహిత్యంలో చూసిన సమాజం గడిచిన నాలుగు దశాబ్దాలుగా అనేక మార్పులకు గురైంది. సామాజిక న్యాయం సాధించే లక్ష్యంతో భిన్న సముదాయాలు అస్తిత్వ స్పృహతో కదలబారాయి. చైతన్యం బహుముఖాలుగా విస్తరించింది. సమాజంలో అణచివేతకు గురైన స్వరాలు సాహిత్యంలో సొంత గొంతుకలు విచ్చి ధిక్కారం ప్రకటించాయి. చీకటి నేలమాళిగల్లో దాగిన విస్మృత వర్గాల సాహిత్యం వెలుగులోకి వచ్చింది. ఖాళీలు పూరించే అధ్యయనాలు మొదలయ్యాయి. కొత్త ఆలోచనలు భాష వ్యక్తీకరణలు శైలీ శిల్పాలు బలంగా ముందుకు వచ్చాయి. అదే సమయంలో ఎవరి సమస్యలు వారివే ఎవరి పోరాటాలు వారివే అన్న ఆలోచన అతిగా పరిణమించి ఒంటెత్తు పోకడలకు దారితీసింది. భిన్న అస్తిత్వ ఉప అస్తిత్వ సమూహాల మధ్య పురోగామి శక్తుల మధ్య తలెత్తిన వైరుధ్యాల్ని పరిష్కారించుకొని ఘర్షణ ఐక్యత సూత్రాల మీద నిర్మించుకోవాల్సిన వుమ్మడి కార్యాచరణ కొరవడింది. అందుకు అవసరమైన సాహిత్యాన్ని సాహిత్య విమర్శను పెంపొందించుకోవాల్సిన అవసరం మన ముందు వుంది. జ్ఞాన సిద్ధాంతాన్ని స్థానిక కాలిక అవసరాలకు అన్వయించి వైరుధ్యాల్ని అధిగమించగలం. భిన్న అస్తిత్వాలు పీడిత విముక్తి కోసం యేకోన్ముఖ పోరాటం చేసినప్పుడే యేదైనా సాధించుకోగలం. ఆధిపత్యాలను కూల్చగలం. ఇవాళ మన అధ్యయనం ఆచరణ Inclusiveness ని కోరుకుంటున్నాయి. ఇందుకు సృజనాత్మక సాహిత్యం సాహిత్య విమర్శ సామాజిక శాస్త్రాలు కలిసిగట్టుగా పనిచేయాలి.

*

‘విభాత సంధ్యలు’ సాహిత్య విమర్శ కాదని పేర్కొన్నప్పటికీ అది తెలుగు సాహిత్యంలో వందేళ్ళ సమాజాన్ని, సామాజిక అభివృద్ధి క్రమాన్ని దర్శించడానికి సామాజిక చలానాలు మూలాల్ని తెలుసుకోడానికి అవసరమైన ప్రమేయ పరికరాల్ని అందించింది. నిజానికి పాఠకుల అవగాహన స్థాయిని పరిధిని పెంచి వొక రచన యెలా చదవాలి అని పరోక్షంగా తెలియజేసింది. రచననీ రచయితని అర్థం చేసుకోవడం దగ్గర ఆగిపోకుండా రచన చుట్టూ అల్లుకున్న రచయిత దృక్పథాన్ని సైతం పట్టుకుంది. ఆ దృక్పథం ప్రతిశీలమైనదా కాదా అని చర్చకు పెట్టింది. స్థూలంగానైనా సరైన దృక్పథం కలగజేయడానికి దోహదం చేసింది.

మరొక కోణంలో రచయితలకూ విమర్శకులకు తోడ్పడే గ్రంథం యిది. సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైన సామగ్రిని అందజేయడంతో పాటు దృక్పథ పటుత్వం వున్న రచనే నిలబడుతుంది అని రచయితల్ని సైతం హెచ్చరిస్తుంది. అయితే విభాత సంధ్యలు సామాజిక శాస్త్రాల్ని సాహిత్యానికి అన్వయించే వొక మెథడాలజీని అందజేసినప్పటికీ యీ నలభై యేళ్ళలో సాహిత్యం విమర్శను శాస్త్రంగా అభివృద్ధి పరచుకోగలిగామా? సాహిత్య విమర్శ శాస్త్రమైతే దాని అధ్యయన పద్ధతులేవి? అవి మౌలికంగా యితర సామాజిక శాస్త్రాల అధ్యయనం కంటే భిన్నంగా వుంటాయా? ఆ దిశలో కొత్తగా సైద్ధాంతిక పరిభాషను సమకూర్చుకోగలిగామా? సమాజ సాహిత్యాల పరిశోధనలో పునాది వుపరితలం వంటి మౌలిక భావనల దగ్గర నుంచి విస్తృతం కాగలిగామా? సామాజిక శాస్త్రాలు వాటి అధ్యయన పద్ధతులు పరస్పరం పూరకాలుగా వున్నాయా? సాహిత్య విమర్శలోకి వాటిని అనువర్తనం చేసుకోగలిగామా… యిలాంటి ప్రశ్నలెన్నో యీ పుస్తకంలోని వ్యాసాలు మరోసారి చదువుతున్నప్పుడు వుత్పన్నమౌతాయి. నిజానికి విభాత సంధ్యల్లో సమాజంలో అణగారిన అన్ని సెక్షన్లకూ ప్రాతినిధ్యం లభించలేదు. ఇప్పుడు దానికి కూడా సమాధానం అన్వేషించాలి. భిన్న శిబిరాల్లో భిన్న దృక్పథాలకు చెందిన విమర్శకులకు రచయితలకు సామాజిక శక్తులకు మధ్య వ్యక్తమయ్యే వైరుధ్యాలను పరిష్కరించుకోడానికి అవసరమైన స్పష్టమైన సమన్వయ వైఖరి వున్నప్పుడే వీటికి సమాధానాలు లభిస్తాయి.

చరిత్ర రాజనీతి అర్థ శాస్త్రం వంటి సామాజిక చలనంతో ముడివడివున్న శాస్త్రాలన్నీ విడివిడిగా ముక్కలుగా గాక కలివిడిగా సాహిత్య అధ్యయనానికి తోడ్పడినప్పుడే సాహిత్య విమర్శకు సమగ్రత సమకూరుతుంది. అలా చూసినప్పుడు మార్క్సిస్టు తత్త్వశాస్త్రాన్ని అన్వయించుకొన్న విమర్శ వీటన్నిటినీ అనుసంధానం చేయవలసిన అవసరాన్ని గుర్తించింది. చేయగల దృక్పథాన్ని అందించింది. చరిత్ర అధ్యయన ఫలితాన్ని వర్తమానానికి అన్వయించుకొని దాని ద్వారా సమాజాన్ని మెరుగుపరచుకునే పాఠాల్ని స్వీకరించాల్సిన ఆవశ్యకతని సైతం గతితార్కిక చారిత్రిక వాదమే బలపరచింది. కొమురంభీం నవలని పరామర్శిస్తూ ఈ పుస్తకంలో సురా రాసిన వ్యాసం, కొకు చదువు నవలపై హరగోపాల్ చేసిన విశ్లేషణ అందుకు మంచి వుదాహరణలుగా నిలుస్తాయి. అలాగే సిద్ధాంత పరిజ్ఞానానికి పరిమతమయ్యే అధ్యయనం వల్ల ప్రయోజనం వుండదనీ దాన్ని జీవితానుభవాల గీటురాయి మీద పరీక్షించుకొన్నప్పుడే సత్యాన్ని నిర్ధారించుకోగలమనీ కేశవరెడ్డి నవలపై డీఎన్ వ్యాసం నిరూపిస్తుంది. తమది కాని జీవితానుభవాన్ని సృజనాత్మకంగా చెప్పడంలో యేర్పడే పరిమితుల్ని అధిగమించడానికి రచయితలు, దాన్ని వ్యాఖ్యానించే సామాజికవేత్తలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి వస్తుందనడానికి దృష్టాంతంగా గరికపాటి నిరంజనరావు యజ్ఞం కథపై చేసిన పరిశీలనను చూడొచ్చు. అదే విధంగా సామాజిక అభివృద్ధి క్రమంలో యేర్పడే సమస్త వైరుధ్యాలకు, అమానవీయ చర్యలకు పాలకుల, ప్రభుత్వ యంత్రాంగాల వర్గ స్వభావం కారణమౌతుందని కన్యాశుల్కంపై ఆర్ఎస్ రావు, రావిశాస్త్రి రచనలపై విఎస్ ప్రసాద్ చేసిన పరామర్శలు ధ్రువీకరించాయి.

సామాజిక శాస్త్రాల వెలుగులో మానవ జీవిత అనుభవాలనుంచి రూపొందే రచనలోని వస్తువుని విశ్లేషించగలిగినప్పుడు అదే అనుభవం నుంచి నిర్మించే శిల్పాన్ని సైతం విశ్లేషించగలం. ఎందుకంటే రచనలో వస్తు శిల్పాలు అవిభాజ్యాలు. అలాగే సామాజిక శాస్త్ర అధ్యయన పద్ధతులు సాహిత్యంలో సమాజాన్ని అధ్యయనం చేయడానికి వుపయోగపడినట్టే కళాత్మక విలువల్ని విశదపరచుకోడానికి కూడా వుపయోగపడతాయి. సాహిత్యం సామాజిక వుత్పత్తి కాబట్టి, స్త్రీ దళిత ఆదివాసీ తదితర అస్తిత్వాల నుంచి రూపొందే ప్రతీకలు ఉపమా రూపక వుత్ప్రేక్షాదులు భాషా విశేషాలు విలక్షణమైన అభివ్యక్తి రీతులు వస్తు నిర్వహణ నైపుణ్యాలు వారి జీవితం నుంచి విడదీయరాని అంగాలుగా వుంటాయి. రచయిత కాల్పనిక శక్తి భౌతిక వాస్తవికత నుంచే వుద్భవిస్తుంది. ఊహాశాలీనత మాత్రమే కాదు భాషా శైలీ, అది వొక పదబంధం కావొచ్చు భావచిత్రం కావొచ్చు, ప్రతిదీ రచయిత సామాజిక జీవన నేపథ్యం నుంచే రూపొందుతాయి. సమాజంతో సంబంధం లేని సౌందర్యశాస్త్రం వుండదు; వుండే అవకాశమే లేదు. సమాజ చలనాన్ని అనుసరించే సామాజిక అవసరాలకు అనుగుణంగానే సాహిత్య రూపసారాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి సమాజాన్ని వ్యాఖ్యానించి మార్చే మార్క్సిస్టు తత్వశాస్త్రం భిన్న అస్తిత్వాల వాచకాల్లో వుండే సౌందర్యాన్ని చూడగల విమర్శనాత్మక దృష్టిని సైతం యివ్వగలదు. కానీ సాహిత్య విమర్శలో ఆ దిశగా జరగాల్సినంత కృషి జరగలేదు. సాహిత్య రూపాన్ని చర్చించడానికి విమర్శకులు రూపవాదాన్నో ప్రాచీన అలంకార శాస్త్రాన్నో ఆశ్రయిస్తున్నారు. దీన్నుంచి బయటపడటానికి సామాజిక శాస్త్రాల అధ్యయన పద్ధతి తోడ్పడుతుంది.

సమాజం చీకటి కాలంలోకి జారుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ప్రకాశవంతమైన మార్గం చూపగలిగేది సాహిత్యం మాత్రమే. ఫాసిస్టు పాలనలో సమాజం – సాహిత్యం, వాటి మధ్య సంబంధం వంటి అవగాహనలన్నీ రెలవెన్స్ కోల్పోతున్నాయి. సాహిత్యంలో స్వేచ్ఛా సమత్వం వంటి భావనలు వ్యక్తీకరణలు ఆంక్షలకు గురవుతున్నాయి. బుద్ధిజీవుల ఆలోచనలపై నిఘా అమలవుతున్నది. పుస్తకాలు నిషిద్ధమవుతున్నాయి. దశాబ్దాలుగా స్త్రీలు దళితులు కార్మికులు మైనారిటీలు ఆదివాసీలు పోరాడి సాధించుకున్న స్వేచ్చా స్వాతంత్ర్యాలు హక్కుల్ని రాత్రికి రాత్రి చట్టబద్ధంగా మాయం చేసే మూకస్వామ్యం రాజ్యమేలుతోంది. సృజన విమర్శన వ్యాసంగాలు ప్రకటిత అప్రకటిత సెన్సారింగ్ ని యెదుర్కొంటున్న సంక్లిష్ట సందర్భంలో శకలీకరణకు గురైన బాధిత అస్తిత్వ సమూహాలన్నీ వొకటి కావాల్సి వుంది. అందుకు అవసరమైన వుమ్మడి వేదికలు నిర్మించుకోవాలి. స్వీయ అస్తిత్వాలను కాపాడుకుంటూనే ఐక్య సంఘటన కట్టాలి. భిన్నాభిప్రాయం కల్గి వుండటమే నేరంగా పరిణమించిన నేలపై ప్రజాస్వామిక భావనలు బలపడటానికి దోహదం చేసే సాహిత్య సృజన జరగాలి. సామూహిక సృజన వొఖ్కటే జాతీయవాదం పేరుతో మతతత్వ ఫాసిస్టులు పెంచి పోషించే విద్వేష రాజకీయాలకు సమాధానం కాగలదు. బహుళత్వమే యీ దేశ ప్రజల బలం. దాన్ని కాపాడుకునే దారిలో సాహిత్యకారులకు సరైన దిగ్దర్శనం చేయడానికి ‘విభాత సంధ్యలు’ వంటి మరో ప్రయత్నం యిప్పుడు యెంతైనా అవసరం. అది తక్షణమే జరగాలి. సాహిత్యంలో సమాజం కోసం సామాజిక మూలాల కోసం సురా తదితర సామాజిక శ్శాస్త్రవేత్తలు మొదలుపెట్టిన అన్వేషణ ఆనాటికి ‘అనిశ్చితం’గానే వుండివుండొచ్చు; కానీ అన్వేషణ నిరంతరం. ఇది కొనసాగాలి. విస్తరించాలి. ఖాళీలను పూరించుకోవాలి. జ్ఞానం ఆచరణని కోరుకుంటుందని సురా యీ పుస్తకం ద్వారా చేసిన రాజకీయ ప్రకటన కార్యరూపం ధరించడానికి యీ మలి ముద్రణ స్ఫూర్తి నిస్తుందని నమ్ముతూ…

(ప్రచ్ఛాయా ప్రచురిస్తోన్న విభాత సంధ్యలు పునర్ముద్రణకు రాసిన ముందుమాట నుంచి)

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

One thought on “ఆగని అన్వేషణ

  1. విభాత సంధ్యల రోజులు గుర్తు వచ్చాయి

Leave a Reply