ఆకాశంలా వెలిగే భూమి

ఈ చీకట్లను నా కలం మొనతో పెకిలిస్తాను
నల్లరంగురాత్రికి నాపద్యంతో వెలుగు వెన్నెలేస్తాను
రాత్రులన్నీ ఒకటికావని
అందరిమెలకువలన్నీ ఒకటి కానేకావని
క్షణంకిందటి అక్కరలేని తనకుతాను
కొత్తదనాన్ని ఆవహిస్తూ
ఉమ్రావ్ జాన్ పాట
అర్థరాత్రి విరహపు మంటల్లో
ఎక్కడో దగ్ధమవుతున్న పాత వాక్యం,
ఇది కొత్త పల్లవుల పాట
బిగిసిన పిడికిళ్ళరణగీతం, ఉద్యమ నిరసనగళం
చీకటిసామ్రాజ్యాల మీద రెపరెపలాడే పతాకం
పోరుజెండా, జనం గుండె మంట!

*

ఈ అర్థరాత్రి నన్ను నేను గేయంగా మలుచుకున్నాక
బలిమెల రిజర్వాయర్ రక్తం నాలో కొండవాగై దూకింది..
అడవి గొంతుకనై ఎలుగెత్తాను..
అన్నం ముద్దను విషాన్ని చేసిన ఆ హంతకుల్ని చూసాను
ఓ రోజు వెలుగును చూడ్డనికేనేమో
సెంట్రీ ఎదురు చూపుల్లో ఈ అర్థరాత్రి నిదురపోని మెలకువ

గాలిహోరు కంటే ముందుగా
నిప్పుల జడివానకంటే మరికొంత ముందుగా
నల్లనల్లటి రాత్రిలో, నగ్నంగా…
నిలబడ్డ వెదురువనం లో..
మెలకువ కదం తొక్కుతుంటే
వెలుగును పులుముకున్న మిణుగుర్ల అడుగులకు
ఆశయాల ఊట ఆరని దివిటీల్లా దారిని పరుస్తూ
ఎండి ఎండి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆకులు
చావైనా రేవైనా సమరమే అంటుంటే…

*

ఆకలి కుంపటిని చల్లార్చుకోవడానికి
పోరుగానం వాళ్ల అడుగుల
అడుగడుగునా చెకుముకిరాళ్ల రాపిడిపాట
తెగించి పోరాడిన ఇంద్రవల్లి నాగళ్ల కవాతు
గోదావరి నదీ తీరంలో ఎగరేసిన ఎర్రజెండా
నాగావళీ గట్లమీద బిగిసిన పిడికిళ్లు
పాణిగ్రహిపాటేకదా ఉద్యమఊపిరిఊట
ఆదిబట్ల, వెంపటాపుల అక్షరమే కదా
అరణ్యానికి అండగా ఆయుధాన్నిచేసి నిలబెట్టింది

రాజ్యం హింసకు ఎగిసిన కెరటాలే
ఉద్యమ చనుబాలు తాగి
ఉరికంబాన్ని ముద్దాడిన బిడ్డల ఊపిరి
మహాజ్వాలను రగిలించి
ఆదివాసుల గూడాల్లో పొడిచిన పొద్దు
తుడుం మోతల్లో, చిర్రల్లో ఎగిసిన ధ్వని తరంగాలు
రగిలి రగిలి ఆశయాలై పోరుబాట పడుతున్నాయి

చీకటి రాత్రి నా నిద్రను మింగి
ఆలోచనల్లో ఎగసిన అల
నా మెలకువ!
శతాబ్దాల దేహగాయాల నింగి నిండా
తూర్పు పొడుస్తుంది
సూర్యుడు నిద్రలేవబోతున్నాడు
దిక్కు దిక్కున రగిలే ఆదివాసుల ధిక్కారంతో!!

మేఘాలు మంటలను వర్షిస్తున్నాయి
భూమి ఆకాశంలా వెలుగుతుంది.

ముచర్ల గ్రామం, ఖమ్మం జిల్లా. 2014 నుంచి కవిత్వం రాస్తున్నారు. 'ఇప్పుడేది రహస్యం కాదు' కవితా సంపుటి ప్రచురించారు. 2019 విమల శాంతి పురస్కారం, 2019 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకున్నారు.

3 thoughts on “ఆకాశంలా వెలిగే భూమి

  1. బలిమెల రిజర్వాయర్ రక్తం నాలో కొండ వాగై

  2. నా కవిత “కొలిమి సాహిత్య సాంస్కృతిక వేదికలో “ప్రచురించిన ఎడిటర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  3. కవిత బాగుంది.నడకలో అదే ఉధృతి వుండాలి.

Leave a Reply