కులం పులిమిన
కటిక చీకటిని గొడుగా కప్పుకొని
తాను ప్రకాశమై వెలుగుతుంటాడు…
ఆకలి పోగులను దారంలా అల్లి
చినిగిన దేశపు మనుగడకు
తాను కొత్త అడుగుల నిస్తుంటాడు…
డబ్బును వరాల వర్షంలా కురిపించే దైవాలనా
ఆహ్వానించేందుకు
ఏ నూనె దీపాలు అతని
అంగడి ముంగిట వెలగవు !!
వత్తులేసుకొని వెలుగుతున్న
అతని కళ్ళుకు చెప్పులే దైవాలు !!
తన చెమటతో తడిసిన నేల
యజ్ఞవేదిక గా మారుతుంది,
ఆ వాసనే శ్రమకు ఉన్న పవిత్రత.
మరిచిపోయిన మనిషితనాన్ని,
మోసం చేసిన వాగ్దానాల మడతలను
తన చేతి గూటం దెబ్బలతో సరి చేస్తుంటాడు
ప్రతి కుట్టు ఒక ప్రశ్న,
ప్రతి గాటులో ఒక గాయ చరిత్ర
చిరిగిన రాజ్యాంగపు మూల పుటల్లో
అతని చెమట బొట్లలా జారిపడతాయి….
పట్టభద్రులు వదిలేసిన బాధ్యతను
అక్షరాస్యుడై తన సూదితో మళ్ళీ కుడతాడు….
ఒక ముక్క తోలు,
ఒక చినిగిన అంచు
తన శ్రమ శ్లోకాలచే పవిత్రమైతాయీ
అచ్చం న్యాయం
అతని దుకాణపు గడప దాటి పోతున్నట్లు
పాత చెప్పుల రూపంలో !!