1916 నాటికే కులం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ , మాట్లాడుతున్న డా. బిఆర్. అంబేద్కర్ 1920 లో అస్పృశ్యత కు వ్యతిరేకంగా మూకనాయక్ పత్రిక పెట్టాడు.1924 లో బహిష్కృత హితకారిణి సభ ఏర్పాటుచేసి ఆచరణ రంగంలోకి దిగాడు. అదే సమయంలో భారత స్వాతంత్ర్య ఉద్యమ కాలపు ప్రధాన కార్యక్రమాలలో అస్పృశ్యత నిర్మూలన ఒక అంశం అయింది.స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, నాయకత్వ స్థానంలో ఉన్న మోహన్ దాస్ కరంచంద్ అస్పృశ్యతా సమస్యను ఎట్లాచూస్తున్నారో, యెట్లా పరిష్కరించాలనుకుంటున్నారో నిశితంగా పరిశీలించటం అంబేద్కర్ ఉద్యమంలో అనివార్య కార్యక్రమం అయింది.
కాంగ్రెస్ పార్టీ అస్పృశ్యతను ఒక సామాజిక సమస్యగా చూసింది. .గాంధీ సంప్రదాయ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, కానీ అస్పృశ్యతను మాత్రం వ్యతిరేకించాడు. వర్ణవ్యవస్థను పూర్తిగా తిరస్కరించలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం నైతిక పరివర్తన ద్వారా సామాజిక సమానత్వం సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా అంబేద్కర్ అస్పృశ్యతను సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతగా పరిగణించాడు. అంబేద్కర్ వాదన ప్రకారం రాజ్యాంగ పరమైన రక్షణల ద్వారా మాత్రమే అస్పృశ్యతకు శాశ్వత విముక్తి సాధ్యపడుతుంది. భారత రాజ్యాంగ నిర్మాతగా, దళిత వర్గాల నాయకుడిగా, రాజనీతివేత్తగా ప్రసిద్ధిగాంచిన అంబేద్కర్ అస్పృశ్యుల విముక్తిపై భారత జాతీయ కాంగ్రెస్ మరియు మహాత్మా గాంధీ తీసుకున్న విధానాల పట్ల విభిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. అస్పృశ్యుల విముక్తి గురించి గాంధీ, కాంగ్రెస్ ల భావనలపై అంబేద్కర్ విమర్శనాత్మక దృక్పథాన్ని వివరించటం ఈ ప్రసంగ వ్యాసం ఉద్దేశ్యం.
1
అస్పృశ్యుల విముక్తిపై గాంధీజీ, కాంగ్రెస్ భావనలు వివరిస్తూ అంబేద్కర్ ‘ కాంగ్రెస్, గాంధీలు అంటరాని వారికి ఏం చేశారు’, ‘గాంధీ : అస్పృశ్యుల విముక్తి’ అనే పుస్తకాలను రచించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 73 సీట్లు గెలుచుకుంది. అంటరాని వారి డిమాండ్ లను అంగుళం అంగుళం వ్యతిరేకించిన విషయం మరిచిపోయి అస్పృశ్యులు కాంగ్రెస్ పక్షాన చేరిపోయారా అని అంబేద్కర్ అనుమానించాడు. అస్పృశ్యులు అందరూ కాంగ్రెస్ చూపించిన బంగారానికి ఆశపడి ద్రోహులుగా తమ పాత్ర నిర్వహించడానికి కాంగ్రెస్ అనయూయులుగా మారారేమో అనే అనుమానంతో అస్పృశ్యుల పట్ల కాంగ్రెస్ వైఖరిని తెలపడానికి ‘కాంగ్రెస్, గాంధీలు అంటరాని వారికి ఏం చేశారు’ అనే పుస్తకం రాశానని పేర్కొన్నాడు. నాజీలు యూదులపై ఉపయోగించిన రక్తపాతాన్ని సృష్టించిన ఘోరమైన పద్ధతులు కాకపోయినా హిందువులు అస్పృశ్యులను అణిచివేసిన పద్ధతులు అంతకన్నా తక్కువైనవేం కావని అంబేద్కర్ భావించాడు. యూదుల మీద నాజీల వ్యతిరేకత ఎలాంటిదో భావజాల రీత్యా అస్పృశ్యులకు వ్యతిరేకమైన హిందువుల సనాతనత్వ భావన కూడా అలాంటిదే. ప్రపంచంలోని బానిసలు, యూదులు, నీగ్రోలు, బాధపడుతున్న వారే అయినా హరిజనులతో పోల్చి చూస్తే వీరి బాధ చాలా స్వల్పంగా కనిపిస్తుంది. భారతదేశంలోని అంటరానివారి సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకురావాలనే సంకల్పంతో ‘గాంధీ : అస్పృశ్యుల విముక్తి’ అనే పుస్తకం రచించానని అంబేద్కర్ పేర్కొన్నాడు.
గాంధీజీకి స్వరాజ్య సాధకుడుగా, అహింస వాదిగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ వీటన్నింటి కంటే అంటరాని వారి రక్షకుడిగా ఆయనకున్న ప్రతిష్టపై గాంధీజీకి మక్కువ ఎక్కువ. రౌండ్ టేబుల్ సమావేశంలో తాను ఒక్కడినే అంటరాని వారిని ఉద్ధరిస్తున్నాను అని ప్రకటించుకున్నాడు. ఈ గౌరవాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఆయన సిద్ధపడలేదు. అంటరాని వారిని ఉద్ధరించడంలో ఆయన ఒక్కడే ఛాంపియన్ కాదు, కాంగ్రెస్ కూడా ఛాంపియన్ అని ఆయన అభిప్రాయం. అంటరాని వారికి జరిగిన అన్యాయాన్ని తొలగించడానికి కాంగ్రెస్ పూర్తిగా నడుము కట్టింది అని భావించాడు. అంటరాని వారికి రాజకీయ రక్షణలు అనవసరమని, హానికరమని గాంధీ అభిప్రాయం. అస్పృశ్యుల విముక్తిపై కాంగ్రెస్, గాంధీ భావనల లోని డొల్లతనాన్ని వివిధ సంఘటనల ఆధారంగా అంబేద్కర్ వివరించాడు. కాంగ్రెస్ పార్టీ అస్పృశ్యుల సమస్యను గుర్తించటం, బర్దోలీ తీర్మానం, రౌండ్ టేబుల్ సమావేశం- అస్పృశ్యులకు ప్రత్యేక రక్షణలు, పూనా ఒడంబడిక, హరిజన సేవా సంఘం, అస్పృశ్యులకు కాంగ్రెస్ ప్రాతినిథ్యం, హరిజనుల దేవాలయ ప్రవేశం, అస్పృశ్యత పట్ల గాంధీ తత్త్వం మొదలైన అంశాలపై గాంధీ, కాంగ్రెస్ పార్టీ భావనలపై అంబేద్కర్ తన ఆలోచనలను వివరించాడు.
కాంగ్రెస్ పార్టీ అస్పృశ్యుల సమస్యను గుర్తించటం :
1917లో కలకత్తాలో శ్రీమతి అనిబిసెంట్ అధ్యక్షత వహించిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని ప్రకారం ఈ దేశంలో అస్పృశ్యులు అనాచారంగా వస్తున్న ఆచారం వల్ల అనేక కష్టనష్టాలకు గురవుతున్నారు. కాంగ్రెస్ ఈ ఇబ్బందులను తొలగించాల్సిన అవసరాన్ని న్యాయాన్ని ధర్మాన్ని గుర్తించాలని భారత ప్రజల్ని కోరింది. 1885 లో ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్ 1917 లో అకస్మాత్తుగా అస్పృశ్యుల సమస్యను గుర్తించడం ఒక వింత సంఘటనగా అంబేద్కర్ పేర్కొన్నాడు. అంబేద్కర్ ఇలా భావించటానికి రెండు అంశాలను కారణాలుగా చూపాడు. అవి. 1. భారత జాతీయ సాంఘిక సంస్థ పట్ల కాంగ్రెస్ వైఖరి. 2.అస్పృశ్యుల గురించి అనిబిసెంట్ ఆలోచనలు .
1887లో మద్రాస్ లో భారత జాతీయ సాంఘిక సంస్థ (ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్) అనే పేరుతో ఒక ప్రత్యేక సంస్థను కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏర్పాటు చేశారు. సమాజ స్థాయిని పెంచడానికి సాంఘిక ఆచారాలను బాగు చేయడానికి చర్యలను తీసుకోవడం కోసం ఈ సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఏర్పడినప్పటి నుండి ప్రతీ సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగిన తర్వాత అదే వేదికపై భారత జాతీయ సాంఘిక సంస్థ సమావేశం నిర్వహించేవారు. అయితే కొంత మంది కాంగ్రెస్ సభ్యులు ఈ సంస్థ సమావేశాలకు కాంగ్రెస్ వేదికను ఉపయోగించుకోవటాన్ని వ్యతిరేకించారు. 1895లో పూనాలో కాంగ్రెస్ సమావేశమైనప్పుడు ఈ సాంఘిక సంస్కరణ సభ వ్యతిరేక వర్గం తిరుగుబాటు చేసింది. ఈ సభ కాంగ్రెస్ వేదికను వినియోగించుకున్నట్లయితే వేదికను తగలబెడతామని వారు బెదిరించారు. వీరికి తిలక్ నాయకత్వం వహించాడు. వ్యతిరేకుల బలం ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్ సాంఘిక సంస్కరణ గురించి చర్చించడం మానేసింది.1895 తర్వాత 1917 వరకు కూడా జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో సాంఘిక విషయాలు, అస్పృశ్యుల గురించి చర్చించలేదు.
1917లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అనిబిసెంట్ అధ్యక్షత వహించింది. అనిబిసెంట్ 1909 ఇండియన్ రివ్యూలో రాసిన ‘దళిత వర్గాల ఉద్ధరణ’ అనే వ్యాసంలో అనిబిసెంట్ దళిత వర్గాలను ఉన్నత వర్గాలతో సమానంగా పాఠశాలలో చేర్పించడం అనేది తిరోగమన చర్యగా పేర్కొన్నారు. తరతరాలుగా తాగుడు వాసనలతో కూడిన ఆహారానికి అలవాటు పడ్డ పిల్లల శరీరాలు ఎప్పుడు కంపు కొడుతూ అసహ్యంగా ఉంటాయి. తరతరాలుగా శుచి గల భోజనం చేసి ఉత్తమ వ్యక్తిగత నియమాలు పాటించే వారి పిల్లల సరసన కూర్చోడానికి అర్హత ఉండేటట్లు చేయడం సమంజసం కాదని, దీనివల్ల ఉన్నత వర్గాలను వారు అలవాటు చేసుకున్న సంస్కృతి నాగరికతలను వదిలి పెట్టాలి అనడమే అవుతుంది అని పేర్కొన్నది. ముందుగా అస్పృశ్యుల పిల్లలకు మంచి భోజనం ఇచ్చి, మంచి అలవాట్లు నేర్పాలని దళిత వర్గాలను కూడా పై వారి శారీరక పరిశుభ్రత స్థాయికి తీసుకువెళ్లాలని, అంతేగాని శుభ్రంగా ఉన్న వారిని మురికి వారి స్థాయికి దిగజార్చడం సమంజసం కాదని పేర్కొన్నది. ఇంగ్లాండ్ లో వివిధ వర్గాల వారికి ప్రత్యేక పాఠశాలలు వారి వారి సామాజిక స్థాయిని బట్టి ఉంటాయని అదేవిధంగా ఇండియాలో కూడా అవలంబించాలనే సలహా ఇచ్చింది.
1917 లో హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ అస్పృశ్యుల సమస్యను గుర్తిస్తూ తీర్మానం ఆమోదించడానికి ప్రధానమైన కారణం 1917 లోని ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా మాంటెంగ్ కామన్స్ సభలో బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి క్రమంగా స్వయంపాలన సంస్థలని నెలకొల్పే విధానాన్ని ప్రకటించటమే అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ విధానం అమలు కోసం కాంగ్రెస్ రూపొందించిన పథకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చేత ఆమోదింప చేయడం కోసం కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ విధానానికి అస్పృశ్యుల మద్దతు కోసం మాత్రమే అస్పృశ్యులు అప్పటివరకు డిమాండ్ చేస్తున్న సామాజిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఇందుకోసం దళిత వర్గాల కమిషన్ సొసైటీ అధ్యక్షుడైన సర్ నారాయణ చెందావర్కర్ సహాయాన్ని తీసుకుంది. కాంగ్రెస్ ఈ తీర్మానం చేయటంలో దురుద్దేశం ఉందని, కేవలం రాజకీయ ప్రయోజయనాల కోసం మాత్రమే ఈ తీర్మానం ఆమోదించిందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. పై సంఘటనలను దృష్టిలో పెట్టుకునే అంబేద్కర్ దళితుల సమస్యను కాంగ్రెస్ పార్టీ గుర్తించడాన్ని ఒక వింత సంఘటనగా భావించాడు.
బర్దోలీ తీర్మానం :
సమాజాన్ని సంస్కరించడానికి చేపట్టిన నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 1922 ఫిబ్రవరిలో బర్దోలిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బర్దోలి కార్యక్రమంగా పిలిచే ఈ తీర్మానంలో అస్పృశ్యుల గురించి వివిధ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ తీర్మానం ప్రకారం అస్పృశ్యుల జీవన విధానం మెరుగుపడేందుకు చర్యలు తీసుకోవాలి. వారి సాంఘిక, మానసిక, నైతిక స్థితిని బాగు చేయాలి. వారి పిల్లల్ని జాతీయ పాఠశాలలకు పంపడానికి ప్రోత్సహించాలి. ఇతర ప్రజలకు అందుబాటులో ఉమ్మడి సదుపాయాలను వారికి కూడా అందచేయాలి. దేశవ్యాప్తంగా అంటరాని వారి స్థితిగతుల్ని బాగు చేయడానికి ఆచరణ యోగ్యమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఒక పథకాన్ని రూపొందించడానికి స్వామి శ్రద్దానంద, సరోజినీ నాయుడు, శ్రీ ఐ. కె. యాజ్ఞిక్, జి. బి. దేశ్ పాండే లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి నాయకత్వం వహించడానికి స్వామి శ్రద్దానందకు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ కార్యకమాల నిర్వహణ కోసం ఐదు లక్షల రూపాయల నిధిని సేకరించాలని నిర్ణయించారు.
అయితే ఈ కార్యక్రమానికి తగినంత విధులు నిధులు ఇవ్వటం లేదనే కారణంతో స్వామి శ్రద్దానంద తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. 1923లో బొంబాయిలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అంటరానితనం అనే సమస్యని ముఖ్యంగా హిందూ సమాజానికి సంబంధించింది కాబట్టి ఈ విషయాన్ని అఖిల భారత హిందూ సభకు అప్పగిస్తూ, దురాచారాన్ని హిందూ సమాజం నుంచి తొలగించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసింది. ఈ విధంగా కాంగ్రెస్ తనకు ఇష్టం లేని,ఇబ్బందికరమైన కార్యక్రమం నుంచి చేతులు దులుపుకుంటూ పక్కకు తప్పుకుందని అంబేద్కర్ భావించాడు. పైగా ఈ కార్యక్రమాన్ని హిందూ మహాసభకి అప్పగించడం అస్పృశ్యులను గాయపరచటమే కాక అవమానించటం కూడా అని అనుకొన్నాడు. హిందూ మహాసభ కేవలం ముస్లింలీగ్ కి వ్యతిరేకంగా ఏర్పడిన తీవ్రవాద హిందూ సంస్థ మాత్రమే అని భారత రాజకీయాలలో ముస్లింలను ప్రతిఘటించడమే దీని ప్రధాన ధ్యేయమని అంబేద్కర్ అభిప్రాయం.
అస్పృశ్యుల ఉద్ధరణ కోసం ఒక పథక రూపకల్పనకు తగినంత నిధులు అడిగిన స్వామి శ్రద్ధానందకు సహకరించకపోగా, ఆయన అసంతృప్తితో చేసిన రాజీనామా ఆమోదించకుండానే ఆ సబ్ కమిటీని రద్దుచేసి అదే పనిని హిందూ మహాసభకు అప్పగించడం కాంగ్రెస్ కి దళితుల ఉద్ధరణ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అంబేద్కర్ పేర్కొన్నాడు. పైగా ఈ కమిటీ తన నోట్ లో అంటరాని వారి పట్ల దురభిప్రాయం ఎక్కువగా ఉన్న చోట్ల కాంగ్రెస్ నిధులు వెచ్చించి ప్రత్యేకమైన బావులను తవ్వించాలని నిర్ణయించింది. దీనివల్ల అంటరానితనాన్ని నిషేధించడానికి ఈ పార్టీ సిద్ధంగా లేదని అర్థమవుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించక పోవడానికి నిధులు లేమి కారణం కాదని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. 1921లో కాంగ్రెస్ ప్రారంభించిన తిలక్ స్వరాజ్య నిధి ద్వారా ఒక కోటి 35 లక్షల రూపాయలు సేకరించారు. కానీ బర్దోలి నిర్మాణ కార్యక్రమం కోసం కేవలం 43,381 రూపాయలు మాత్రమే వెచ్చించారు. అంటరాని వారి పరిస్థితుల్ని మెరుగు పరచాలన్న పవిత్రమైన సిద్ధాంతాన్ని వల్లె వేయటం తప్ప ఈ కార్యక్రమ నిర్వహణలో గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి శ్రద్ధ లేదని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.
బర్దోలి కార్యక్రమం పూర్వ వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నం తప్ప వేరేది కాదని ఈ పథకం అంటరానితనాన్ని బాహాటంగా గుర్తించి అంటరాని వారికి ప్రత్యేక బావులు, పాఠశాలలు ఏర్పాటు చేయడం తప్పించి ఇంకేమీ చేయలేదని, అంటరాని వారికి సంబంధించినంత వరకు బర్దోలి తీర్మానం ఒక పచ్చి దగా అని అంబేద్కర్ భావించాడు.
రౌండ్ టేబుల్ సమావేశం – అస్పృశ్యులకు ప్రత్యేక రక్షణలు :
సైమన్ కమిషన్ తర్వాత భారత రాజ్యాంగం రూపుదిద్దుకునే లోపు భారతీయ ప్రతినిధులతో చర్చించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. లండన్ లో 1930 లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అస్పృశ్యుల పక్షాన దివాన్ బహదూర్ ఆర్. శ్రీనివాసన్, డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రాతినిధ్యం వహించారు. ఈ కాన్ఫరెన్స్ పని మొత్తం తొమ్మిది కమిటీలుగా విభజించబడింది. ఒకటి అందులో అల్పసంఖ్యాకుల కమిటీ. మతపరమైన, కులపరమైన సమస్యకు పరిష్కారం కనుక్కోవడం ఈ కమిటీ విధి. ఈ కమిటీకి ప్రధానమంత్రి రాంసే మెక్ డోనాల్డ్ అధ్యక్షత వహించాడు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ ప్రధానంగా కింది అభ్యర్థనలను సమర్పించాడు. 1.స్వపరిపాలక భారతదేశంలో అస్పృశ్యతా నివారణ కోసం ప్రాథమిక హక్కులు కల్పించాలి. 2. సామాజిక బహిష్కరణకు తోడ్పడే వారిని చట్టం కఠినంగా శిక్షించాలి. 3. అస్పృశ్యులకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం వహించడానికి హక్కు ఉండాలి. వయోజన ఓటు హక్కు ఉండాలి. అణచబడ్డ వర్గాల వాళ్ళు తమ తమ ప్రతినిథులను ఎన్నుకోవడానికి మొదటి పదేళ్ళు ప్రత్యేక నియోజక వర్గాలు ఉండాలి. 4. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అస్పృశ్యులకు రిజర్వేషన్లు ఉండాలి. 5. మంత్రివర్గంలో అస్పృశ్యులకు స్థానం ఉండేలా గవర్నర్ లేదా గవర్నర్ జనరల్ సూచనలు ఇవ్వాలి.
1931 లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తన ప్రతినిధిగా గాంధీని ఎన్నుకుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనడం వల్ల అన్ని సవ్యంగా జరుగుతాయని అంబేద్కర్ భావించాడు. మొట్టమొదట జరిగిన ఫెడరల్ స్ట్రక్చర్ కమిటీ పార్లమెంటులో హిందూ, ముస్లిం, సిక్కులకు ఇవ్వాల్సిన సీట్ల గురించి చర్చించింది. అయితే ఈ సమావేశంలో సిక్కులకి, ముస్లింలకి, ప్రత్యేక రాజకీయ రక్షణలు ఉండడానికి అంగీకరించిన గాంధీజీ అస్పృశ్యులకు ఇవ్వడానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాడు. అస్పృశ్యుల ప్రయోజనాలను ప్రస్తావించే గౌరవాన్ని డా.అంబేద్కర్ తో పాటు కాంగ్రెస్ కూడా పంచుకుంటుందని పేర్కొన్నాడు. ఇలా పేర్కొనటం గాంధీ, కాంగ్రెస్ అస్పృశ్యులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించటం తప్ప మరేమీ కాదని అంబేద్కర్ భావించాడు.
అల్పసంఖ్యాక వర్గాల కమిటీలో గాంధీజీ అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలను తీవ్రంగా వ్యతరేకించాడు. ఈ కమిటీ ఒక ఏకాభిప్రాయానికి రాకపోవడం వలన ఈ సమస్యపై నిర్ణయాన్ని ప్రధానమంత్రి రాంసే మెక్ డొనాల్డ్ కు అప్పచెప్తూ గాంధీతో సహా అందరూ సంతకాలు చేశారు. ఈ సమావేశంలో గాంధీ భారత దేశంలోని అస్పృశ్యుల పక్షాన మాట్లాడటానికి ప్రయత్నించటంలో అంబేద్కర్ సరైన రీతిలో వాదించటం లేదంటాడు. ఆయన వాదం హిందూయిజంలో చీలికను సృష్టిస్తుంది. అది ఏ రకంగాను కోరుకోదగినదికాదు అని అభిప్రాయపడ్డాడు. కావాలనుకుంటే అస్పృశ్యులు ఇస్లాం మతాన్ని గాని, క్రైస్తవ మతాన్ని గాని స్వీకరించటాన్నైనా నేను భరిస్తాను గాని, హిందూయిజానికి నిలయమైన గ్రామాల్లో రెండు శాఖల్ని సృష్టించటం సహించలేను అంటాడు గాంధీ. అస్పృశ్యుల రాజకీయ హక్కుల గురించి మాట్లాడే వాళ్లకు భారతదేశాన్ని గురించి తెలియదు అంటాడు. దానిని అడ్డగించాల్సిన వ్యక్తిని నేనొక్కణ్ణి అయితే, దానిని జీవితాన్ని పణంగా పెట్టైనా అడ్డగించి ఆజ్ఞాపించగలను. అని పేర్కొన్నాడు గాంధీ .
ఈ విధంగా అల్ప సంఖ్యాక వర్గాల కమిటీలో జరిగిన చర్చలు గాంధీకి అస్పృశ్యుల పట్ల గల దృష్టిని బహిర్గతం చేశాయని, గాంధీ అస్పృశ్యులకు బద్ద శత్రువని అంబేద్కర్ భావించాడు. గాంధీ అస్పృశ్యుల సమస్య మీద ఎంతో ఆసక్తి చూపారని, అదంతా అస్పృశ్యుల డిమాండ్లను వ్యతిరేకించడానికే, అందుకే గాంధీ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. అస్పృశ్యుల ప్రత్యేక నియోజకవర్గాకు ముస్లిం ప్రతినిధులు కూడా మద్దతు తెలుపుతున్నారనే విషయం తెలుసుకున్న గాంధీజీ ఏ విధంగానైనా వారు అస్పృశ్యులకు మద్దతు తెలపకుండా నివారించాలని భావించాడు. అందుకోసం సైమన్ కమిషన్, హిందూ మహాసభ, ఎవరూ ఒప్పుకోని ముస్లిం వర్గాల 14 డిమాండ్లను అంగీకరించాడు. ఇది ముస్లిం మైనారిటీలనుండి అస్పృశ్యలను వేరు చేయడానికి గాంధీజీ పన్నిన పన్నాగంగా అంబేద్కర్ పేర్కొన్నాడు. గాంధీ ప్రతినిధిగా రావడం అత్యంత దురదృష్టకరమని అందరి మధ్య ఐక్యం చేయాల్సిన వ్యక్తి అగాథాన్ని పెంచడానికి ప్రయత్నించాడని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.
కమ్యూనల్ అవార్డ్ – పూనా ఒడంబడిక :
గాంధీ ఎంతగా వ్యతిరేకించినప్పటికీ 1932 ఆగస్టు 17న మత సమస్యపైన ప్రధానమంత్రి ప్రకటన వెలువడింది. దీని ప్రకారం ఒక నిర్దిష్ట కాలం వరకు చట్టసభల్లో దళితులకు ప్రత్యేక స్థానాలు కేటాయిస్తారు. దీన్నే కమ్యూనల్ అవార్డ్ అన్నారు. ఈ ప్రకటన వెలువడగానే అంతవరకు ప్రధానమంత్రి నిర్ణయానికి తన సమ్మతి తెలియజేస్తానని చెప్పిన గాంధీ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ ప్రకటనను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు హిందూ మతానికి హానికరమని గాంధీజీ భావించాడు. అందులో భాగంగానే ఎర్రవాడ జైలులో నిరాహార దీక్ష చేశాడు.
బ్రిటీషు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోదని సవర్ణ హిందువులు, అస్పృశ్యులు ఒక ఒప్పందానికి వచ్చినట్లయితే దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని బ్రిటీష్ ప్రభుత్వం తెలియజేసింది. గాంధీజీ ప్రాణ రక్షణ కోసం అంబేద్కర్ ముందుకు వెళ్లి గాంధీజీతో ఒడంబడిక చేసుకున్నాడు. దీనిని పూనా ఒడంబడిక అని అంటారు. పూనా ఒడంబడిక ప్రకారం 148 సీట్లు అస్పృశ్యులకు కేటాయించబడ్డాయి. కానీ వాటికి ఎన్నికలు ఉమ్మడి ఎన్నికల ద్వారానే జరుగుతాయి. అయితే ప్రధానమంత్రి ప్రకటన వల్ల పొందిన 73 సీట్ల కన్నా కూడా అధికంగా 148 సీట్లు వచ్చినప్పటికీ దీనివల్ల నష్టమే జరిగిందని, అస్పృశ్యులు ప్రత్యేక నియోజకవర్గాలనే కాదు, ప్రత్యేక ఓటు హక్కును కూడా కోల్పోయారని అంబేద్కర్ భావించాడు. ప్రత్యేక నియోజక వర్గాల ద్వారా దళిత అభ్యర్థుల ఎన్నిక, ప్రత్యేక నియోజకవర్గం ఓటు హక్కుతో పాటు ఉమ్మడి నియోజకవర్గాల్లో కూడా ఓటు హక్కు ఉన్నట్లయితే హిందూ అభ్యర్థులు దళితులను ఆశ్రయించే వారని అంబేద్కర్ అనుకొన్నాడు.
ఈ చట్టం ప్రకారం 1937 లో జరిగిన ఎన్నికలలో అస్పృశ్యులకు కేటాయించిన సీట్లలో కాంగ్రెస్ జోక్యం చేసుకోదని దళితులు భావించినప్పటికీ ఆ నియోజక వర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. మొత్తం 148 స్థానాలతో పాటు బీహార్, ఒరిస్సాలో మూడు సీట్లు కలిపి 151 స్థానాల్లో 73 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం 78 స్థానాల్లో మాత్రమే నిజమైన అస్పృశ్యులు గెలుపొందారు. ఈ పూనా ఒడంబడిక వల్ల అస్పృశ్యులకు ఘోరమైన నష్టం జరగగా, కాంగ్రెస్ పార్టీ భారీగా లబ్ధి పొందింది. అస్పృశ్యుల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి ప్రధానమైన కారణాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీని సంపాదించడం, అస్పృశ్యులకు నిజమైన ప్రతినిధి తానే అని నిరూపించుకోవడం ఆని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.
పూనా ఒడంబడిక ద్వారా అస్పృశ్యులకు జరిగిన మరొక నష్టాన్ని కూడా అంబేద్కర్ తెలియజేశాడు. అంబేద్కర్ ముందు నుండి కూడా అస్పృశ్యులకు కేవలం శాసనసభలో ప్రాతినిధ్యం లభిస్తే సరిపోదు, పరిపాలన, పబ్లిక్ సర్వీసులు హిందువుల చేతిలో ఉన్నంతకాలం అస్పృశ్యులు పోలీసుల నుంచి రక్షణ కానీ, న్యాయస్థానం నుంచి న్యాయంకానీ, పరిపాలన కానీ పొందలేరని, కాబట్టి పబ్లిక్ సర్వీసులు అస్పృశ్యులకు అనుగుణంగా ఉండాలంటే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా ఉండాలని వాదించాడు. ఇందుకోసం మంత్రివర్గ కూర్పులో గవర్నర్ లేదా గవర్నర్ జనరల్ సూచనలు ఇచ్చే విధంగా ఒక క్లాజును ప్రతిపాదించాడు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నిబంధనను పూర్తిగా వ్యతిరేకించింది. ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యాన్ని నిరాకరించింది. దీనికి కారణం మంత్రివర్గంలో అస్పృశ్యులను తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోవటమే అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.
మధ్య పరగణాల్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయిన డా. ఖేర్ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును అంబేద్కర్ ఉదాహరించాడు. ఆయన తన నూతన మంత్రివర్గంలో దళిత వర్గం నుంచి విద్యాదికుడైన అగ్నిభోజ్ ని మంత్రిగా నియమించాడు. దీనిని 1938 లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రమశిక్షణ రహితచర్యగా పరిగణించింది. ప్రభుత్వంలోకి అస్పృశ్యున్ని తీసుకోవడమే పార్టీ దృష్టిలో, గాంధీ దృష్టిలో క్రమశిక్షణ లేని పని అయింది. మంత్రిమండలిలో అస్పృశ్యులను మంత్రులుగా తీసుకోవడం దేశానికి హాని చేసేదిగా ఉండకూడదని, ఒక క్యాబినెట్ మంత్రి సార్వజనీన విశ్వాసాన్ని పొందే ఉన్నత వ్యక్తి అయి ఉండాలి అని, ఒక వ్యక్తి ఎన్నికైన తర్వాత పదవుల కోసం తన సహజమైన ప్రతిభ మీద ప్రతిష్ట మీద ఆధారపడాలని గాంధీజీ భావించాడు. అయితే అనర్హుడైన అస్పృశ్యుడు మంత్రి కావాలని ఎవరూ కోరలేదని ఇది గాంధీ హృదయంలో అస్పృశ్యుల పట్ల అంతరంగికంగా దాగిన వ్యతిరేకతను నిరూపిస్తున్నదని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.
పూనా ఒప్పందాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంకొక విధానాన్ని కూడా అవలంబించిందని అంబేద్కర్ పేర్కొన్నాడు. అందులో మొదటిది అభ్యర్థులను ఎన్నిక చేసే విధానం. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ఒక్కో వర్గానికి ఒక్కో విధంగా విద్యార్హతలను పాటించింది. బ్రాహ్మణులలో అత్యంత విద్యార్హతలు కల వారికి సీట్లు కేటాయించినప్పటికీ, బ్రాహ్మణేతరులలో కొంత తక్కువ విద్యార్హతలు ఉన్నవారికి, అస్పృశ్యులలో విద్యార్హత లేనివారికే కేటాయించింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అస్పృశ్యులు అగ్రవర్ణాలకు మంత్రివర్గంలో శత్రువులు కాకుండా ఉండటం, శాసనసభ్యులు అయ్యామని సంతృప్తి పడిపోయి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఉండటం, ఒకవేళ ఎప్పుడైనా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో అస్పృశ్యులు భాగస్వామ్యం కాకుండా ఉంటారని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ విధానం వల్ల అస్పృశ్యులు కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక వర్గం చెప్పు చేతల్లో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యవహరించిందని అంబేద్కర్ భావించాడు. పూనా ఒప్పందం వల్ల కాంగ్రెస్ పార్టీ అస్పృశ్యులకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ “ పూనా ఒప్పందంలోని రసాన్ని పీల్చుకొని తొక్కను పిప్పిని అస్పృశ్యుల ముఖాన కొట్టింది” అని అంబేద్కర్ అభిప్రాయ పడ్డాడు.
అస్పృశ్యుల ప్రత్యేక నియోజక వర్గాలకు ఒప్పుకోకపోవటానికి భారత కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ కు, అస్పృశ్యులకు మధ్య తలెత్తిన వివాదంలో ప్రాథమికమైన ప్రశ్న – భారత జాతీయ జీవనంలో అస్పృశ్యులు ఒక ప్రత్యేక వర్గం కాదా? అవునా? ఈ ప్రశ్నకి అస్పృశ్యుల సమాధానం ‘భారత జాతీయ జీవనంలో అస్పృశ్యులు ఒక ప్రత్యేక వర్గం అని’ – కాంగ్రెస్ వాదన ‘వారు ప్రత్యేక వర్గం కాదు హిందూ వృక్షానికి ఒక కొమ్మ మాత్రమే’ అని. ఒకవేళ ప్రత్యేక వర్గమని ఒప్పుకొని రిజర్వేషన్ కల్పించినట్లయితే శాసన, కార్యనిర్వహక, ఉద్యోగ వ్యవస్థల్లో తమ స్థానాలను పరిమితం చేసుకొని దళితులకు వాటా ఇవ్వాల్సి వస్తుందని హిందువులకు కాంగ్రెస్ కు భయం అని అంబేద్కర్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో అంబేద్కర్ హిందూ పదం గురించి చర్చించాడు.
2
హిందూ మతం – అస్పృశ్యులు :
హిందూ శబ్దానికి అనేక అర్ధాలు ఉన్నప్పటికీ హిందూ శబ్దం ప్రాథమికంగా మతవిషయకంగానే వాడబడుతుంది. మత పరంగా అస్పృశ్యులు హిందువులు కాదా అవునా అన్నప్పుడు హిందూ మతానికి సంబంధించిన మూఢ సిద్ధాంతాలను పరిగణలోకి తీసుకుంటున్నామా? లేదా హిందూ మత పూజా విధానాన్ని పరిగణలో తీసుకుంటున్నామా అన్నది కీలకం అని అంబేద్కర్ పేర్కొన్నాడు. కులము, అంటరానితనం వంటి మూఢ సిద్ధాంతాలు హిందూ మతానికి గీటురాళ్ళయితే అస్పృశ్యులు హిందువులు కారని అంబేద్కర్ వాదించాడు. ఒక ఉమ్మడి మతం సౌభాతృత్వంతో ఉండాలి. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండాలి. కానీ అస్పృశ్యులను హిందువులతో కలిపే మానవ బంధం- అంతర్ వివాహము, సహ పంక్తి భోజనం వంటివి ఏమీ లేకపోగా ముట్టుకునే హక్కు కూడా లేదు అని గుర్తు చేసాడు. ముట్టుకున్నట్లయితే అంటును కలుగజేస్తుంది కాబట్టి హిందూ సంప్రదాయం పూర్తిగా అస్పృశ్యులను ప్రత్యేక వర్గంగానే పరిగణిస్తున్నదని అంబేద్కర్ స్పష్టం చేసాడు.
సంప్రదాయ సిద్ధంగా హిందూ మతం వాడే భాష కూడా అస్పృశ్యులను వేరు చేసి చూస్తుందని అంబేద్కర్ అభిప్రాయం.ఈ సంప్రదాయ భాషలో హిందూ సవర్ణులను చాతుర్వర్ణమని, అస్పృశ్యులను పంచములని పేర్కొంటారు.ఇలా వేరుపరిచే ఆవశ్యకత ఒకటి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి భాష ఒకటి ఆవిర్భవిస్తుందని అంబేద్కర్ భావన. గాంధీ సృష్టించిన హరిజన్ పదం కూడా వారిని హిందువులతో కలవకుండా ఒక ప్రత్యేక వర్గంగానే పరిగణిస్తుందని అంబేద్కర్ అభిప్రాయ పడ్డాడు.
అస్పృశ్యులు హిందూ మతంలో భాగమే అనే వాదన ఒప్పుకున్నప్పటికీ ఒక మతం వారైనంత మాత్రాన ప్రత్యేక రక్షణ కోరే హక్కులు లేవనే కాంగ్రెస్ వాదన సమంజసం కాదని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. ఆంగ్లో ఇండియన్లు క్రిస్టియానిటీలో భాగమైనప్పటికీ ప్రత్యేక వర్గంగా పరిగణించబడుతున్నారు. సిక్కులు హిందువుల్లో భాగంగా ప్రకటించబడుతున్నప్పటికీ వారికి ప్రత్యేక హక్కులున్నాయి. ముస్లింలలోనూ అనేక శాఖలు ఉన్నప్పటికీ వారికి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదని అంబేద్కర్ వాదించాడు. అస్పృశ్యత కేవలం సాంఘిక సమస్య మాత్రమేనని, ఇది రాజకీయ సమస్య కాదని కాంగ్రెస్ వాదిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సాంఘిక సంస్కరణకు కృషి చేయకుండా తిరిగి సమస్యను సాంఘిక మనటం, రెండు నాలుకల ధోరణి తప్ప వేరే కాదని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. రాజకీయ సాంఘిక అంశాల మధ్య సంబంధాన్ని గూర్చిన ఒక స్పష్టమైన అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి లేదు అని అంబేద్కర్ భావించాడు.
అస్పృశ్యత మత ధర్మాన్ని దాటిపోయి ఒక ఆర్థిక విధానంగా పరిణమించిందని అంబేద్కర్ అభిప్రాయ పడ్డాడు. అస్పృశ్యత నివారణ వల్ల హిందువులు నష్టపోయేది చాలా ఉంది. అస్పృశ్యతా వ్యవస్థ హిందువులకు ఒక బంగారు గని. ఒక యజమాని తన గర్వాన్ని ప్రకటించుకోవడానికి, తన విలాసమైన జీవితాన్ని సాగించుకోవడానికి 240 బిలియన్ హిందువులను సేవించే పరివారంగా 60 బిలియన్ల అస్పృశ్యులు అవసరం. 60 మిలియన్ల అస్పృశ్యులను వెట్టి కార్మికులుగా, 240 బిలియన్ హిందువులు ఊడిగం చేయించుకోవడానికి ఈ వ్యవస్థలో వీలు ఉన్నది. వాళ్లు దైన్య స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉండటం వల్ల నామమాత్రపు భత్యానికి, ఒక్కొక్కప్పుడు అది కూడా లేకుండా వారితో పని చేయించుకోవచ్చు. హిందువులు చేయడానికి నిరాకరించిన పాకీ పని చేయడానికి హిందువుల కోసం హిందువులు కాని వారు చేసే వీలు ఈ వ్యవస్థలో ఉంది. ఆ పని చేసే వాళ్ళు కేవలం అస్పృశ్యులే కావడం తప్పనిసరి. మాంధ్యపు సమయంలో అస్పృశ్యున్ని మొదటగాను హిందువుని ఆఖరుగాను ఇంటికి పంపిస్తారు. వికాసపు రోజుల్లో హిందువును మొదటగాను, అస్పృశ్యున్ని ఆఖరిగాను కొలువులో నియమిస్తారు. అస్పృశ్యత బానిసత్వం కంటే హీనమైన విధానంగా కూడా పరిణమించింది. బానిస విధానములో బానిసకింత తిండి, బట్ట, వసతి కల్పించి,మంచి స్థితిలో ఉంచవలసిన ఆగత్యం యజమానికి ఉంటుంది. లేకపోతే బానిసకు మార్కెట్లో ధర పలకదు. కానీ అస్పృశ్యతా వ్యవస్థలో అస్పృశ్యున్ని పోషించే బాధ్యతను హిందువులు చేపట్టరు. బాధ్యతలేని దోపిడిని ఈ ఆర్థిక వ్యవస్థ అనుమతిస్తుంది. అస్పృశ్యత నియంతృత్వం లేని ఒక ఆర్థికపరమైన దోపిడీ విధానం మాత్రమే కాదు, ఎలాంటి నియంత్రణ లేనిది. దాన్ని అదుపులో పెట్టడానికి ఒక పాలనా యంత్రాంగం లేదు. పోలీసు, న్యాయవ్యవస్థల నుంచి కూడా అదుపు ఉండదు. ఎందుకంటే వారంతా హిందువులే కావడం వల్ల దోపిడీదారుల పక్షం వహిస్తారు.
హిందువులకు అస్పృశ్యత వ్యవస్థ కలిగిస్తున్న ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అస్పృశ్యతను అంతమొందించడం పోయి స్వరాజ్యం దాని ఆయుష్షును పెంచే అవకాశం ఉంది. స్వరాజ్యం హిందువులను మరింత బలవంతులుగా, అస్వశ్యులను మరింత నిస్సహాయులుగా చేస్తుంది. వర్తమానంలోని కఠోర సత్యాలను, భవిష్యత్తులోకి అవి కొనసాగే వాస్తవాన్ని విస్మరించి రాజ్యాంగ రక్షణలు కావాలని అస్పృశ్యులు చేస్తున్న డిమాండ్లను పరిశీలించడంలో దీనిని లెక్కలోకి తీసుకోకపొవటం మూర్ఖత్వమే కాకుండా నేరం కూడా అవుతుంది అని అంబేద్కర్ పేర్కొన్నారు.
3
అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం – ఒక మాయ :
1932 పూనా ఒడంబడిక తర్వాత అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం గురించి గాంధీజీ ఆసక్తి చూపాడు కానీ హరిజనుల దేవాలయ ప్రవేశంపైన గాంధీజీకి చిత్తశుద్ధి లేదు అని చెప్తూ దానికి రెండు ఉదాహరణలు చూపించాడు అంబేద్కర్.అవి : 1. గురవయ్యారు దేవాలయ ప్రవేశము 2. రంగయ్యరు హరిజనుల దేవాలయ ప్రవేశ బిల్లు మలబార్ లోని పొణ్ణని తాలూకా గురవయారులో ఒక కృష్ణాలయం ఉంది. దానికి కాలికట్ రాజు జామెరిన్ ధర్మకర్తగా ఉన్నాడు. మలబార్ లో అంటరానివారి శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కేలప్పన్ అనే హిందువు ఆ గుడిలో అస్పృశ్యులకు ప్రవేశం కల్పించడానికి ఆందోళన ప్రారంభించాడు. కానీ అంటరాని వారి కోసం గుడి తెరవడానికి ధర్మకర్తగా ఉన్న కాలికట్ రాజు జామెరిన్ నిరాకరించాడు. దీనికి అతను చూపిన కారణం చట్టం ప్రకారం తన సంరక్షణలో ఉన్న దేవాలయాల ఆచారాలు, వ్యవహారాలకు వ్యతిరేకంగా ధర్మకర్త ఏమి చేయలేడు. అంటరానివారికి అనుకూలంగా రాజు తన అభిప్రాయాలను మార్చుకోవాలని కోరుతూ కేలప్పన్ 1932 సెప్టెంబర్ లో దీక్ష చేయడం ప్రారంభించాడు. కొంతకాలం పాటు దీక్షను ఆపడానికి కేలప్పన్ ను కోరవల్సిందిగా కాలికట్ రాజు గాంధీజీని అభ్యర్థించాడు. 1933 జనవరి వరకు అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం కల్పించకపోతే తానే స్వయంగా దీక్ష చేస్తానని గాంధీ ఇచ్చిన హామీ మేరకు కేలప్పన్ కొంత కాలం పాటు దీక్ష విరమించాడు. ఈలోగా ఆ ప్రాంతంలో రెఫరెండం కూడా నిర్వహించారు. రెఫరెండంలో 56 శాతం మంది దేవాలయ ప్రవేశానికి అనుకూలంగా ఓటు వేశారు. అయినప్పటికీ కాలికట్ రాజు ఆ గుడి తలుపులు తెరవడానికి నిరాకరించాడు. రెఫరెండం ఫలితాన్ని బట్టి గాంధీజీ నిరాహార దీక్ష చేయాలి కానీ అంటరాని వారికి ప్రవేశం లేని గుడిలో తాను కూడా ప్రవేశించనని కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టిన గాంధీ చిత్తశుద్ధిని హరిజనుల దేవాలయ ప్రవేశం విషయంలో నమ్మలేమని అంబేద్కర్ భావించాడు.
అస్పృశ్యుల దేవాలయ ప్రవేశానికి సంబంధించిన శాసన సంబంధ ప్రయత్నాలలో కాంగ్రెస్ పార్టీ అస్పృశ్యులను ఎలా వంచించిందో కూడా అంబేద్కర్ వివరించాడు. 1933 జనవరి 23న రంగయ్యరు దేవాలయ ప్రవేశ బిల్లును కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఒక దేవాలయం చుట్టుపక్కల ఉన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఓటర్లలో అధిక సంఖ్యాకులు దళిత వర్గాల దేవాలయ ప్రవేశాన్ని అనుమతించడానికి సమ్మతి తెలిపినట్లైతే దేవాలయ ధర్మకర్తలు ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి. అయితే ఈ బిల్లు విప్లవాత్మకమైనది ఏమీ కాదని, అంటరానితనాన్ని ఒక పాపిష్టికార్యంగా చూడటం లేదని, అలాగే ధర్మకర్త గుడి తలుపులు తెరవని సమయంలో ఇంజక్షన్ తెచ్చుకునే అధికారం కూడా లేదని, తెలివి కలిగిన సనాతన హిందువు ఎవరైనా ఈ బిల్లును సమ్మతిస్తారు, వ్యతిరేకించరని అంబేద్కర్ భావించాడు. ఈ బిల్లుకి గాంధీ మద్దతు ఉంది. ఈ బిల్లుకు ఇతర సభ్యుల మద్దతును సంపాదించడం కోసం గాంధీజీ రాజగోపాలాచారిని నియమించాడు. 1934 జూన్ వరకు ఈ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ ముగించి తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపించారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వం శాసనసభను రద్దుచేసి కొత్తగా ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఈ ప్రకటన ఫలితంగా రంగయ్యరు బిల్లు పట్ల కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వటానికి పూర్తిగా నిరాకరించింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ బిల్లుకు మద్దతు తెలిపినట్లైతే తర్వాత ఎన్నికల్లో హిందువుల మద్దతును కోల్పోతామని కాంగ్రెస్ పార్టీ భయపడింది. అంతవరకు బిల్లుకు మద్దతు తెలిపినటువంటి గాంధీజీ ఈ బిల్లును ప్రవేశపెట్టిన రంగయ్యరుని తప్పుపట్టాడు. ఇది సంస్కర్తల తరఫున సంస్కర్తలు ప్రోత్సహించిన బిల్లు కాదని, ప్రతిపాదకుడు సంస్కర్తలను సంప్రదించి వారి ఆదేశాలకు మేరకు నిర్వర్తించవలసింది ఉందని, మిగతా హిందువుల కంటే కాంగ్రెస్ హిందువులకు ఎక్కువ పట్టదల ఉన్న సంస్కరణ కాదని, ఈ చర్చలోకి కాంగ్రెస్ ను ఈడ్వడం బాధకరమని గాంధీజీ పేర్కొన్నాడు. హరిజనుల దేవాలయ ప్రవేశం పట్ల గాంధీ, కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానలను రాజకీయ పిల్లి మొగ్గల వింత క్రీడగా అంబేద్కర్ అభివర్ణించాడు.
అస్పృశ్యుల ఆసక్తి దేవాలయ ప్రవేశంపై లేదని, అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశమే అంత్యమైన కార్యమైనట్లయితే అది తమకు అవసరం లేదని, దళితుల ఆసక్తి కేవలం విద్య మీదే ఉందని, సామాజికంగా ఉన్నతి వస్తే దళితులకు గౌరవం దక్కుతుందని, హిందూమతంలో ముందు సమానత్వాన్ని సాధించాలనేదే అస్పృశ్యుల అభిప్రాయమని నొక్కి చెప్పాడు అంబేద్కర్.
అస్పృశ్యుల దేవాలయ ప్రవేశంపై గాంధీకి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించే సంఘటన ఇంకొకటి కూడా అంబేద్కర్ పేర్కొన్నాడు. బొంబాయి రాష్ట్రంలో కొలాబా జిల్లా మహద్ లో, బొంబాయి రాష్ట్రంలో నాసిక్ జిల్లాలో సత్యాగ్రహం చేశారు. నాసిక్ జిల్లాలో ఈ సత్యాగ్రహం అంటరాని వారి ఆలయ ప్రవేశం కోసం చేశారు. ఈ కాలంలో దళితులకు గాంధీ నైతిక మద్దతు లభిస్తుందని ఆశించినప్పటికీ అది లేకపోగా సత్యాగ్రహం చేసినందుకు దళితుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. సత్యాగ్రహం అనేది కేవలం విదేశీయుల మీదే మాత్రమే ప్రయోగించాలని గాంధీ అభిప్రాయపడ్డాడు.
గాంధీజీకి అస్పృశ్యత నివారణ ప్రథమ కార్యక్రమం కాదని చెప్పడానికి అంబేద్కర్ ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు. 1935 లో గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలోని కవితా గ్రామంలో అస్పృశ్యులు హిందువులతో పాటు తమ పిల్లల్ని కూడా చదువనివ్వాలని కోరారు. అయితే ఈ చర్యకు ప్రతి చర్యగా హిందువులు ఆగ్రహావేశాలతో అస్పృశ్యులను సామాజిక వెలివేయడంతోపాటు వారి పశువులకి గ్రాసం దొరకకుండా, పిల్లలకు మంచి ఆహారం దొరకకుండాను చేశారు. పిల్లలను మళ్లీ బడిలో చేర్పించమని కోరుకుండా ఉండడానికి హరిజన నాయకుడితో ప్రమాణం కూడా చేయించారు. దీన్ని ప్రశ్నిస్తూ వారు కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. అయితే వల్లభాయ్ పటేల్ హిందువులను ఒప్పించడానికి ఆ గ్రామానికి చేరి హిందువులు తన మాట వినకపోవడం వల్ల ఆ కేసును విరమించుకునే విధంగా అస్పృశ్యులని బలవంత పెట్టాడు. . ఆ ఊరిలోని అస్పృశ్యులు కవితా గ్రామం నుండి వేరే చోటుకి వలస వెళ్లారు. గాంధీ ఈ బహిష్కరణకు సంబంధించి జోక్యం చేసుకోవాలని హరిజన సేవా సంఘం కార్యదర్శి ఏ.వి.ఠక్కర్ ను కోరగా అతను కవిత గ్రామానికి వెళ్లి ఒక నివేదిక సమర్పించాడు. ఏ.వి.ఠక్కర్ నివేదిక సమర్పించిన తర్వాత గాంధీజీ వారికి ఒక సలహా ఇచ్చాడు. తమకు తాము సహాయం చేసుకునే వారికి దేవుడు కూడా సహాయం చేస్తాడని కవితా గ్రామ ప్రజలు ఆ గ్రామంలో ఉన్నటువంటి దుమ్మును దులుపేసుకోవాలని ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని పేర్కొన్నాడు. హిందువులను అంటరానితనానికి వ్యతిరేకంగా ఒప్పించడానికి సిద్ధపడాల్సినటువంటి గాంధీజీ కవితా గ్రామ ప్రజలను ఆ గ్రామం నుండి వెళ్ళిపొమ్మని సలహా ఇవ్వడమనేది గాంధీజీకి అస్పృశ్యుల అభ్యున్నతిపై చిత్తశుద్ధి లేదనే విషయాన్ని తెలియజేస్తుందని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.
4
హరిజన సేవా సంఘం ఆచరణ పై విమర్శ :
అంటరానితనం అన్ని అవశేషాలను సవర్ణుల సమ్మతితో తొలగించడానికి ప్రయత్నం చేస్తూ 1932లో గాంధీజీ హరిజన సేవా సంఘాన్ని ప్రారంభించాడు. దళిత వర్గాలను విద్యా పరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతికి తేవడం లాంటి నిర్మాణాత్మకమైన కృషి హరిజన సేవా సంఘానికి ప్రధాన మార్గమని గాంధీజీ పేర్కొన్నాడు. అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, శాంతియుత ప్రబోధం ద్వారా సాధ్యమైనంత త్వరలో ఉమ్మడి వాడుకలో ఉన్న బావులు, ధర్మశాలలు, రోడ్లు, పాఠశాలలు, స్మశానాలు, దహనవాటికలు, దేవాలయాలలో అస్పృశ్యులకు ప్రవేశం కల్పించడానికి సత్వర చర్యలు తీసుకోవడం సంస్థ కార్యాచరణగా ప్రకటించాడు. అంతేకానీ అస్పృశ్యత నివారణ, కుల నిర్మూలన, వర్ణాంతర భోజనాలు లాంటి సాంఘిక సంస్కరణలను ఈ సంఘం చేపట్టలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం హిందువులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి కార్యక్రమాన్ని ఈ సంస్థ ద్వారా చేపట్టడానికి గాంధీ సిద్ధంగా లేడు అన్నది స్పష్టం అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.
మొదట్లో ఈ సంఘంలో అంబేద్కర్, రావ్ బహదూర్ ఎం.సి.రాజా, ఆర్. శ్రీనివాసన్ సభ్యులుగా ఉన్నారు. వివిధ కారణాల వల్ల వారు సంస్థకు రాజీనామా చేసిన తర్వాత ఈ స్థానంలో వేరే హరిజనులను ఎవరిని కూడా నియమించలేదు. ఈ సంఘంలో హరిజనులకు స్థానం కల్పించాలని, ఈ సంఘాన్ని హరిజనులకు అప్పగించాలని హరిజనులు కోరారు. వారి కోరికను గాంధీ నిరాకరించాడు. దీనికి ప్రధానంగా గాంధీజీ రెండు కారణాలు చెప్పాడు.
1. అస్పృశ్యుల సంక్షేమానికి హిందువులు కలిసి రావడం తరతరాలుగా వారు అస్పృశ్యుల పట్ల చూపిన పాపానికి ప్రాయశ్చిత్తమవుతుంది.
2. అస్పృశ్యుల సంక్షేమం కోసం పోగు చేసే డబ్బులు కేవలం హిందువులు మాత్రమే విరాళంగా ఇచ్చినవి.
అందుచేత రెండు విధాలుగా ఈ సంఘాన్ని హిందువులే నిర్వహించాలని, ఈ సంఘంలో స్థానం కోరడం హరిజనులకు భావ్యం కాదని గాంధీజీ అభిప్రాయపడ్డాడు. ఈ సంస్థ 1933 నుంచి 34 వరకు పాదయాత్ర ద్వారా 8 లక్షల నిధిని సేకరించింది. హరిజనుల అభ్యున్నతికి సంబంధించిన కార్యక్రమాలకు వాళ్ళు సేకరించిన నిధి ఏ మాత్రం సరిపోదని, అస్పృశ్యుల కోసం ఏర్పాటు చేసిన ఈ సంఘంలో వారికి స్థానాన్ని నిరాకరించడాన్ని బట్టి అంబేద్కర్ ఈ సంస్థ కృషిపై గాంధీజీ చిత్తశుద్ధిని శంకించాడు.
అలాగే ఈ సంస్థ దళితులకు చేసిన ఇంకొక అన్యాయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ధోరణి కారణంగా బొంబాయిలో నివసిస్తున్న మహర్లను ఈ సంస్థ నల్ల జాబితాలోకి ఎక్కించింది. వారికి విద్యార్థుల వేతనాలు, ఇతర విద్యాపరమైన సదుపాయాలను నిరాకరించింది. అస్పృశ్యుల రాజకీయ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి మొదటి నుంచి కాంగ్రెస్ తో పోరాడుతూ వచ్చిన మహర్లు ఒకవేళ హరిజన సేవా సంఘం సదుపాయాలను పొందాలనుకుంటే కాంగ్రెస్ వ్యతిరేక భావాలు లేవని నిరూపించుకోవాల్సి వచ్చేది.
హరిజన సేవా సంఘం కార్యక్రమాలు భాగవత పురాణంలో వర్ణించిన రాక్షసి పూతన కథను స్ఫురణకు తెచ్చేలా ఉన్నాయని అంబేద్కర్ భావించాడు. పూతన శ్రీకృష్ణుడికి పాలు ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా పైకి కనిపించినప్పటికీ అంతిమంగా శ్రీకృష్ణుని మరణం కోసం మాత్రమే ఆమె దరిచేరింది. అంటరాని వారికి హరిజన సేవా సంఘం కూడా అలాంటిదే. రౌండ్ టేబుల్ సమావేశం నాటికి దళితులు పూర్తిగా స్వావలంబకులు, స్వతంత్రులయ్యారు. వారిలో స్వతంత్ర భావాన్ని చంపేయడానికి గాంధీజీ హరిజన సేవా సంఘాన్ని స్థాపించాడు. హరిజన సేవా సంఘం అంటరాని వారికి కొన్ని సేవలు చేసి గాంధీ అంటరాని వారి రక్షకుడని వారి చేత ప్రచారం చేయించింది. ఈ సంఘంలో చేరిన అంటరాని వారు ఎంత అమాయకులు అంటే హరిజన సేవా సంఘం చేసే సేవ ఖరీదు అంటరాని వారి స్వతంత్రమేనని వారు గ్రహించలేకపోయారని అంబేద్కర్ భావించాడు.
హరిజన సేవా సంఘం నిర్వహించే హాస్టల్లో చదువుకునే విద్యార్థులు నైతికంగా పతనమయ్యారని అంబేద్కర్ పేర్కొన్నాడు. వారు వసతి గృహాల్లో ఉన్నంతకాలం భీష్ముని పాత్ర నిర్వహించారని, తర్వాత కచుడి పాత్రని నిర్వహించారని పేర్కొన్నాడు. పాండవుల పక్షాన న్యాయం ఉందని పేర్కొన్నప్పటికీ కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి ప్రధాన కారణం కౌరవులు తనను పోషించటమే అని భీష్ముడు భావించాడు, అలాగే వారు వసతి గృహాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ ను తెగ పొగడేవారు. వసతి గృహాల నుంచి బయటకు వచ్చిన తర్వాత గాంధీని, కాంగ్రెస్ ను తెగుడుతూ పురాణంలోని కచుడి పాత్రని నిర్వహించారు. మృత సంజీవిని విద్య కోసం దేవతల దగ్గరికి చేరినప్పటికీ దేవయానితో ఒప్పందాన్ని నిరాకరించి, కచుడు తన జాతి శ్రేయస్సు ఎక్కువ ముఖ్యం అన్నాడు. హరిజన సేవా సంఘం చేసిన గొప్ప అపకారం ఏమిటంటే అంటరాని వారిని నైతికంగా పతనం చేసింది. గాంధీజీ కోరుకున్నది కూడా ఇదే అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ సంఘం ప్రధాన ఉద్దేశం బానిస మనస్తత్వాన్ని సృష్టించడమేనని అంబేద్కర్ భావించాడు.
హరిజన సేవా సంఘాన్ని అంటరాని వారికి అప్పగించకపోవడానికి ప్రధాన కారణం సంఘాన్ని అంటరాని వారికి అప్పగిస్తే గాంధీజీకి కాంగ్రెస్ కి అంటరాని వారిని అదుపు చేసే సాధనం ఉండదు. అంటరాని వారు హిందువుల మీద ఆధారపడడం మానేస్తారు. స్వతంత్రులై తర్వాత హిందువులకు కృతజ్ఞులై ఉండటం ఆగిపోతుంది. అంటరాని వారిని హిందువుల దాస్యం నుండి విముక్తున్ని చేయడంలో కంటే హిందువులను కొంగుకు కట్టడానికే గాంధీజీ ఎక్కువగా ఆతృత చూపించాడని అంబేద్కర్ భావించాడు. అందువల్లనే కాంగ్రెస్ అస్పృశ్యులకు ప్రతినిధి కాదు అని చెప్పగలిగాడు.
భారత ప్రజానీకానికి ఒకే ఒక రాజకీయ సంస్థగా తాను ప్రాతినిధ్యం వహిస్తానని కాంగ్రెస్ గొంతు చించుకొని అరుస్తుంది కానీ ఈ వాదనలో నిజం లేదని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. దళితులకు సంబంధించినంత వరకు తానే ఏకైక ప్రతినిధి అని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వాదిస్తుంది. కాంగ్రెస్ ఈ విషయంలో అస్పృశ్యులను, కాంగ్రెస్సేతర పక్షాలను కూడా వంచించగలిగింది. కానీ 1937 ఎన్నికల తర్వాత ఈ వైఖరిలో కొంత మార్పు వచ్చింది. కేవలం ప్రచారం కోసం చేసే వాదనలను వదిలేసి సీట్లు, ఓట్ల లెక్కింపు గనుక గమనించినట్లయితే కాంగ్రెస్ ఏ విధంగా అందరికీ ప్రతినిధి కాదో తెలుస్తుంది. 1937 లో జరిగిన ఎన్నికలలో శాసనసభలు, కౌన్సిల్లను కలుపుకొని మొత్తం 1758 స్థానాలలో 777 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 50 శాతం కంటే తక్కువ మొత్తం మాత్రమే గెలుపొందింది. కేంద్ర శాసనసభలో అస్పృశ్యులకు కేటాయించిన 151 సీట్లలో 78 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ గెలిచిన 78 సీట్లు కూడా ఉమ్మడి ఓటు వల్ల కేవలం హిందువులు మెజార్టీగా ఉన్న ఓట్ల ద్వారా మాత్రమే కాంగ్రెస్ గెలవగలిగిందని అంబేద్కర్ అభిప్రాయం. మొత్తం జనాభాలో 10 శాతం మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంది. అత్యధికమైన ఓటర్ లు మధ్యతరగతి వర్గానికి చెందినవారు. ఈ రెండు అంశాలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. ఎన్నికల పోరాటాన్ని ఒక సైన్యానికి, ఒక మామూలు గుంపుకు మధ్య జరిగిన పోరాటంతో అంబేద్కర్ పోల్చాడు. కాంగ్రెస్ మరియు ఇతర పక్షాల బలాలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం, ధన బలం, కూడా ఉన్నాయి. ఇతర అభ్యర్థులకు ఎలాంటి వనరులు లేవు. దేశంలో కాంగ్రెస్ పత్రికలు తప్ప వేరే పత్రికలు లేవు. ఇన్ని వనరులు, ప్రజాదరణ ఉన్నప్పటికీ నల్లేరు మీద నడకగా సాగాల్సిన ఈ ఎన్నికలలో కేవలం 50% కూడా ఓట్లను, సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ సంపాదించలేకపోయింది. అన్ని వర్గాలకు, జాతులకు తానే ప్రతినిధిని అని కాంగ్రెస్ చెప్పుకునే గొప్పలకు ఎలాంటి ఆధారం లేదని, అస్పృశ్యులకు తానే ఏకైక ప్రతినిధి అని చెప్పుకునే కాంగ్రెస్ వాదనకు కూడా స్థానం లేదని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. కాంగ్రెస్ ఆపాదించుకునే ప్రాతినిధ్యపు లక్షణము పూర్తిగా అసంగతం. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించే వ్యవస్థనే కావచ్చు కానీ అనుసూచిత కులాల వారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉండాలా లేదా అనే దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి దానికి ఎలాంటి సంబంధం లేదు అని అంబేద్కర్ భావించాడు.
5
అస్పృశ్యులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకపోవటానికి కారణం :
1919 నుండి గాంధీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగామారిన తర్వాత 1942 వరకు దేశ స్వాతంత్రం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొన్నది హిందువులే. ముస్లింలు కేవలం ఖిలాఫత్ ఉద్యమం సమయంలో తప్ప పాల్గొనలేదు. అయితే స్వతంత్ర ఉద్యమంలో అస్పృశ్యులు పాల్గొనక పోవడానికి కారణమేమిటి అని ఎవరైనా అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వద్ద సిద్ధంగా ఉన్న జవాబు – అస్పృశ్యులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి కీలుబొమ్మలు కావటం వల్లనే అని.
అస్పృశ్యులు స్వతంత్ర పోరాటంలో పాల్గొనక పోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు సామ్రాజ్యవాదుల కీలుబొమ్మలైనందు వల్ల కాదని స్వతంత్ర భారతదేశం హిందువుల అధిపత్యం నెలకొల్పుతుందని వారు భయపడుతున్నారని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. హిందువుల ఆధిపత్యంలో అస్పృశ్యుల మాన, ప్రాణ, స్వేచ్ఛ, స్వతంత్రాలు శాశ్వతంగా హరించుకుపోతాయి అని అంబేద్కర్ భావన.
బ్రిటిష్ వారికి హిందువులు బానిసలు కనుక బానిసలు బానిసలకు స్వేచ్ఛను ప్రసాదించలేరు అనేది గాంధీ తర్కం. ఒక బానిస ఇంకొక బానిసకుస్వేచ్ఛను ప్రసాదించలేడు కాబట్టి స్వాతంత్రోద్యమం తర్వాతనే దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేయగలదని గాంధీజీ అభిప్రాయం. అందువల్ల అస్పృశ్యులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగ రక్షణను కల్పించాలని పోరాడవచ్చు కదా అని అంటాడాయన. దానికి అంబెడ్కర్ జవాబు ముందుగా తమ డిమాండ్ కు అంగీకరించడం వల్ల కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమీ లేదని.
జాతీయోద్యమంలో అస్పృశ్యుల సహాయ నిరాకరణకు ప్రధానమైన కారణం ఏమిటంటే హిందువుల ఆధిపత్యంలో తమ స్థితిగతులు ఎలా ఉంటాయో అని భయం వారిని నిరంతరం వెంటాడుతుంది. స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రం తమను లోబర్చుకోవడానికి హిందువులకు లాభపడుతుందని అస్పృశ్యులు అభిప్రాయం. అందువల్ల ఒక చిన్న మూల్యాన్ని చర్చించి ముందుగానే అంగీకారానికి వచ్చి అస్పృశ్యుల భయాన్ని కాంగ్రెస్ ఎందుకు తొలగించదు అన్నది అంబేద్కర్ ప్రశ్న. దీనితో పాటు రెండవ కారణాన్ని కూడా అంబేద్కర్ పేర్కొన్నాడు. ఇది అనుభవం మీద ఆధారపడింది.
స్వతంత్ర పోరాటం ముగిసిన తర్వాత బలహీన వర్గాలకు రక్షణ కల్పించడంలో బలమైన వర్గాలు ఔదార్యం చూపవని లోకానుభవం చెప్తుందని అంబేద్కర్ గుర్తించాడు. . అమెరికాలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత నీగ్రోలకు జరిగిన నమ్మకద్రోహాన్ని ఉదాహరణగా చెప్పాడు. యూనియన్ ను రక్షించడానికి యుద్ధాన్ని తలపెట్టి దాన్ని గెలవడానికి నీగ్రోల సహాయం తీసుకున్న రిపబ్లికన్లు ఆ తర్వాత ఏ విధంగా నీగ్రోలను మోసం చేశారో వివరిస్తూ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అస్పృశ్యులను అదేవిధంగా మోసం చేసే అవకాశం ఉందని అంబేద్కర్ భావించాడు. 80,000 మంది నీగ్రోలు ఫెడరల్ సైన్యాలతో కలిసి పనిచేశారు. 450 పోరాటాల్లో పాల్గొన్నారు. ఈ యుద్ధంలో 37 వేల మంది నీగ్రోలు రిపబ్లిక్ ను రక్షించడం కోసం తమ ప్రాణాలను కోల్పోయారు. అంతర్యుద్ధం ముగిసిన తర్వాత రిపబ్లికన్లు బానిస విముక్తికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఓటు హక్కును కూడా వారసత్వం ఆధారంగా అమలు చేశారు. దీనివల్ల నీగ్రోలకు ఓటు హక్కు కూడా కల్పించలేదు. ఆ తర్వాత కాలంలో డెమోక్రట్లతో అవగాహనకు వచ్చి రిపబ్లికన్లు నీగ్రోలను కనీస పౌర హక్కులకు కూడా దూరం చేశారు. బూర్జువా వర్గంతో ఒప్పందం చేసుకొని నీగ్రోల ఓటు హక్కుకు తిలోదకాలు ఇవ్వడంతో పాటు, వారిని వెట్టి చాకిరి లోనే ఉంచి, వారి విద్యా అవకాశాలను, పౌరసత్వాన్ని కూడా హరించకపోయేలా చేశారని అంబేద్కర్ అభిప్రాయ పడ్డాడు. అమెరికాలో నీగ్రోల దుస్థితిని మర్చిపోలేదు కాబట్టే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అస్పృశ్యులు పాల్గొనలేదని పేర్కొన్నాడు.
భారత స్వాతంత్ర పోరాటం పట్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్న ధోరణి చూసినట్లయితే పోరాటం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని అంబేద్కర్ భావన. కాంగ్రెస్ పోరాటం వల్ల స్వరాజ్యం పూర్వం ఉన్నంత దూరంలోనే ఉంది, కానీ దేశ విభజన మాత్రం చాలా దగ్గరగా అయిందని అంబేద్కర్ భావించాడు. భారతీయులు కోరేపక్షంలో భారతీయుల స్వేచ్ఛకు గల హక్కును, ఆపైన స్వతంత్రాన్ని బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరిస్తుంది. భారతీయులు తమ రాజ్యాంగాన్ని రూపొందించుకునే హక్కును కూడా బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది. మాంటెంగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణల ద్వారా భారతీయులకు స్వయంపాలనలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన షరతు ఏమిటంటే దేశంలోని అన్ని వర్గాల ఆమోదంతో భారతీయులు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. రాజ్యాంగ రూపకల్పనలో భారతీయుల మధ్య ఒక అంగీకారం సాధించడానికి బదులు స్వతంత్ర పోరాటం కోసం కాంగ్రెస్ కోరడంలో ప్రధానమైన ఉద్దేశం అస్పృశ్యులతో వ్యవహరించడానికి షరతులు లేని పూర్తి స్వేచ్ఛ ఉన్న స్వతంత్ర భారతదేశాన్ని హిందువులకు అప్పగించాలన్న ఉద్దేశమే కీలకం. దళితులతో కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణను రూపొందించకుండా కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమానికి ఎత్తుగడ వేయడంలో ప్రధానమైన ఉద్దేశం అస్పృశ్యులు కోరుతున్న సర్వజన ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించే ఆగత్యం నుండి తప్పించుకుపోవడమే అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ కారణాల వల్లనే స్వతంత్ర ఉద్యమంలో అస్పృశ్యులు పాల్గొనడానికి నిరాకరించారు తప్ప వారు బ్రిటిష్ వారి కీలుబొమ్మలు కాదని అంబేద్కర్ పేర్కొన్నాడు.
అయితే కాంగ్రెస్ ని బలపరచాలని కోరేవారు అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న – ఎవరి స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ పోరాడుతుంది? ఇండియాలో పాలకవర్గం స్వేచ్ఛ కోసం అది పోరాడుతుందా లేక భారత ప్రజలందరి కోసం పోరాడుతుందా? ఇండియాలో పాలకవర్గం ముఖ్యంగా బ్రాహ్మణులతో కూడుకుంది. హిందూ జనాభాలో బ్రాహ్మణుల నిష్పత్తి తక్కువ అయినప్పటికీ అధికార వర్గం పూర్తిగా బ్రాహ్మణులతో నిండిపోయిందని, ధనిక వర్గాలకు చెందిన బనియాలు,వ్యాపారస్తులు, భూస్వాములకు మాత్రమే కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుందని అంబేద్కర్ పేర్కొన్నాడు. పాలకవర్గానికి వ్యతిరేకంగా పోరాడడానికి బదులు కాంగ్రెస్ నిజానికి పాలకవర్గానికి అధికారం హస్తగతం చేసుకోవడానికి మాత్రమే సహాయపడుతుందని అంబేద్కర్ భావించాడు.
ఇతర దేశాల్లో సమానత్వం కోరినప్పుడు పాలక వర్గం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన హక్కుల్ని వదులుకుని ప్రజాస్వామ్యంలో కలిసిపొయిందని అంబేద్కర్ తెలిపాడు. ఉదాహరణకి ఫాన్స్ లో కేర్లీ (ఫాదరులు), నోబుల్స్ ఇద్దరు కలిసి 1200 మంది సభ్యులలో 600 మంది వరకు ఉంటారు అయినప్పటికీ తమకు ఉన్నటువంటి ప్రయోజనాలను వదులుకొని స్వేచ్ఛ,సమానత్వం, సౌభాతృత్వం ఆధారంగా ఫ్రాన్స్ కు రాజ్యాంగం రూపొందించారు. 1870 లో జపాన్ ప్రజలు జమిందార్ వ్యవస్థ నుంచి ఆధునిక దేశంగా పరిణామం చెందే క్రమంలో దామియోస్ అనే జమీందారీలు మరియు ఇంకో ఉన్నత వర్గమైన సమురాయిలు తమకున్న పూర్తి హక్కులను కూడా వదులుకొని సామాజికంగా ప్రజలతో కలిసి పోవడానికి సిద్ధమయ్యారు. ఇండియాలోని పాలక వర్గం మాత్రం తనకున్న సదుపాయాలను వదులుకోవడానికి బదులు దేశభక్తిని దుర్వినియోగం చేస్తూ తమకున్న పాలనాధికారాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. సేవా వర్గాల వారిని స్వేచ్ఛగా పరిపాలించే స్వాతంత్రం మాత్రమే కాంగ్రెస్ కోరుకుంటుంది. జన సామాన్యాన్ని పరిపాలించడానికి ఆధిపత్య జాతికి స్వేచ్ఛ, సామాన్య మానవుని పరిపాలించడానికి మానవతీతుడికి స్వేచ్ఛ కావాలి అనే నాజీల లేక నియంతల సిద్ధాంతంతో కాంగ్రెస్ సిద్ధాంతం సమానమైంది అని అంబేద్కర్ భావించాడు. కాంగ్రెస్ ని సమర్థించడం అంటే బానిసత్వం చేయడానికి నియంతృత్వానికి స్వేచ్ఛను ఇవ్వడమేనని అంబేద్కర్ అభిప్రాయపపడ్డాడు.
6
గాంధీతత్వం – ఒక అంచనా :
గాంధీ తత్వం చాలా విషయాల్లో పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలతో ఉంటుందని అంబేద్కర్ భావించాడు. గాంధీ తత్వం బ్రిటీషు పాలన నుండి స్వతంత్రం సంపాదించడం కోసం నిలుస్తుంది. అంటే దేశంలో ఇప్పుడు ఉన్న రాజకీయ నిర్మాణం నాశనం చేయడానికి కృషి చేస్తుంది. అదే సమయంలో వంశపారంపర్యత ఆధారంగా ఒక వర్గం మరొక వర్గం మీద పెత్తనం చెలాయిస్తూ శాశ్వతంగా అది కొనసాగాలంటే ప్రస్తుత సామాజిక నిర్మితి చెదరకుండా కొనసాగాలని గాంధీ తత్వం చెప్తుంది. దురదృష్టాలను కూడా అదృష్టంగా చిత్రించి మోసం చేసింది గాంధీ తత్వం. హిందూ పవిత్ర శాసనాలు శూద్రులు ఐశ్వర్యం సంపాదించడాన్ని నిషేధించి వారిని శిక్షించాయి. గాంధీ తత్వం ఈ నిషేధాన్ని తొలగించదు. ఆస్తిని వదులుకునే ధైర్యం ఉన్నందుకు అది శూద్రుడిని ఆశీర్వదిస్తుంది. గాంధీతత్వం పాకీ పని వారిపట్ల అవలంబించిన వైఖరి కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తుంది. పాకీవాని సంతానం పాకీపని చేసుకొని బతకాలి. హిందూ సమాజంలో పాకీ పని ఎంపిక చేసుకున్న వృత్తి కాదు. బల ప్రయోగంతో చేసే వృత్తి అయినప్పటికీ గాంధీతత్వం దాన్ని సమాజానికి అత్యున్నత సేవగా ప్రచారం చేసి ఈ పద్ధతిని శాశ్వతం చేయడానికి చూస్తుంది. మీరు హిందూ సమాజాన్ని శుభ్రపరుస్తున్నారని గమనించాలని వారికి బోధిస్తుంది.
గాంధీతత్వం ఏమిటంటే ముట్టుకుంటే మైలబడడం, స్నానం చేస్తే శుద్ధి కావడం అనే భావం కేంద్రంగా కలది. గాంధీతత్వంలోని అస్పృశ్యతా నిరోధం కేవలం మాటలోనే ఉంది. అది బూటకం. దాన్లో పసలేదు. ఎంత విద్యాభ్యాసం చేసినప్పటికీ వారి వృత్తిని ఎంచుకునే హక్కు వారికి లేదని, వారు కేవలం కులవృత్తులను మాత్రమే అనుసరించాలని, జీవనోపాధికి వారు నేర్చుకున్న విద్యలను ఉపయోగించకూడదని గాంధీజీ భావించాడు. అంటరానివారి చివరి ముక్తికి బాటగా వారు స్వీకరించగలిగింది గాంధీ తత్వంలో ఏమీ లేదు. అంటరాని వారికి వ్యతిరేకంగా తలపెట్టిన బూటకపు ప్రచారమైన హిందూతత్వం, సనాతన తత్వం మరొక రూపమే గాంధీ తత్వమని అంబేద్కర్ అభిప్రాయపపడ్డాడు. హిందూ మతంలో కులం ఉంది, గాంధీ తత్వంలో కులం ఉంది. హిందూ మతం కులవృత్తిని వంశపారపర్యంగా నమ్ముతుంది, గాంధీ తత్వం కూడా అదే నమ్ముతుంది. హిందూ మతం కర్మ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది, గాంధీ తత్వం కూడా అదే పని చేస్తుంది. హిందూ మతం భగవంతుని అవతారాలను విశ్వసిస్తుంది, గాంధీతత్వం కూడా విశ్వసిస్తుంది. హిందూ మతం విగ్రహాలను విశ్వసిస్తుంది, గాంధీ తత్వం కూడా అదే పని చేస్తుంది. గాంధీతత్వం చేసిందల్లా హిందూ మతం పిడివాదాలకు తాత్విక సమర్ధన ఇవ్వడమే. మోటుగానూ, క్రూరంగాను కనిపించే కట్టుబాట్లతో కూడిన వ్యవస్థను, తాత్త్విక అంశాలను గాంధీ తత్వం కూడా అందించి చూడటానికి కాస్తా అందంగా గౌరవప్రదంగా, ఆకర్షణీయంగా కూడా కనిపించేటట్లు మార్చేసి అలంకరించిందని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు.
గాంధీతత్వం అంటరాని వారికి ఆమోదయోగ్యం కాదు. గాంధీ మార్గం అంటరానివారిపట్ల యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అంటరాని వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసి, ధ్వంసం చేసి, నాశనం చేసే ఆయుధాలు గాంధీ తత్వంలో ఉన్నాయి. అస్పృశ్యుల పట్ల తన వ్యతిరేకతను చూపడానికి గాంధీజీ ఎప్పుడు వెనుకాడలేదు. అంటరానివారు తమను తాము రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం గాంధీ పట్ల జాగ్రత్తగా ఉండటమే అని అంబేద్కర్ ఉద్బోధించాడు.
‘Is Gandhi Mahatma’ అనే వ్యాసంలో అంబేద్కర్ ఈ విధంగా అన్నాడు. “అంటరానివారికి, ముస్లింలకు స్నేహితుడిగా భావించిన వ్యక్తి, తాను ఛాంపియన్ అని చెప్పుకునే అదే ప్రజల లక్ష్యాన్ని మోసం చేశాడు. ఇది నన్ను చాలా బాధించింది. ఈ సందర్భానికి ఉపయోగపడే ఒక పాత సామెత ఉంది. (బాగల్ మే చుర్రీ మున్ మే రామ్)’ పెదవులపై దేవుని పేరు, బాహువుల కింద కత్తి. అలాంటి వ్యక్తిని మహాత్మా అని పిలవగలిగితే, గాంధీని మహాత్మా అని పిలవండి. నా అభిప్రాయం ప్రకారం, అతను కేవలం మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ కంటే ఎక్కువ కాదు.”
అస్పృశ్యత నివారణలో గాంధీ వైఫల్యానికి కారణాలు :
అంటరానితనం నిర్మూలనలో గాంధీజీ విఫలం కావడానికి అంబేద్కర్ మొత్తం మూడు కారణాలను చూపించాడు.
1. అంటరానితనాన్ని నిర్మూలించాలని ఆయన ఏ హిందువులనయితే కోరారో వారు కేవలం గాంధీజీని స్వరాజ్య నాయకుడిగా చూశారు తప్ప ఆధ్యాత్మిక నేతగా ఎప్పుడూ పరిగణించలేదు. అంటరానితనం పట్ల ఆయన పిలుపుకు హిందువులు స్పందించలేదు.
2. గాంధీజీ అంటరానితనం వ్యతిరేక కార్యక్రమం విజయానికి ఆయన హిందువులతో విరోధం పెట్టుకోదలుచుకోలేదు. అంటరాని వారి ఉద్ధరణ గాంధీజీకి వీలైతే ఉద్ధరిస్తాడు కానీ హిందువులకు ఆగ్రహం తెప్పించి మట్టుకు కాదు.
3. అంటరాని వారు సంఘటితం కావడం, వారు బలం పుంజుకోవడం గాంధీజీ కోరుకోలేదు. వారు బలవంతులై హిందువులను వదిలి స్వతంత్రులై హిందువుల గౌరవ స్థానాన్ని బలహీన పరుస్తారేమోనని గాంధీజీ భయం. అంటరాని వారిలో బానిస మనస్తత్వాన్ని సృష్టించటమే ఆయన లక్ష్యం.
గాంధీ అంటరానితనం నిర్మూలించడం అవసరం అని హిందువులకు ప్రచారం చేయడం కంటే దాని గురించి సత్యాగ్రహ ఉద్యమం కానీ, ఉపవాస దీక్ష కానీ చేయలేదు. ఒక టన్ను బొధన కంటే ఒక ఔన్సు ఆచరణ మేలు అనే సామెతని గాంధీజీ పాటించలేకపోయాడని అస్పృశ్యుత విముక్తిలో గాంధీ క్రియాశీలతను అంబేద్కర్ ప్రశ్నించాడు.
7
అస్పృశ్యుల విముక్తి పై గాంధీ – అంబేద్కర్ భావనల మధ్య ప్రధాన తేడాలు:
అంటరానివారు స్వేచ్ఛ, సమాన అవకాశాలు పొందాలంటే, మొదట రాజ్యాంగపరమైన, శాసనపరమైన భద్రతలను పొందడం చాలా ముఖ్యమని అంబేద్కర్ విశ్వసించాడు. కానీ గాంధీ అంటరానితనం సామాజిక సమస్య అని భావించాడు. గాంధీ – అంబేద్కర్ ల మధ్య అస్పృశ్యుల విముక్తికి సంబంధించి ఆలోచనల పరంగా ఉన్న బేధాలు కింది విధంగా గుర్తించవచ్చు.
విషయం
గాంధీ/కాంగ్రెస్ భావన
అంబేద్కర్ భావన
అస్పృశ్యత నివారణ
నైతిక చర్య , సామాజిక మార్పు ద్వారా సాధ్యం
చట్టబద్ధ నిషేధం ఉండాలి
హక్కులసాధన మార్గాలు
సహోదరత్వం పాటించాలి, హరిజన సేవ చేయాలి
ప్రత్యేకనియోజక వర్గాలు, రాజ్యాంగ పరమైన రక్షణలు ఉండాలి
అస్పృశ్యుల విముక్తి
వ్యక్తిగత పరివర్తన, సామాజిక సామరస్యం ద్వారా సాధ్యం
కుల నిర్మూలన, నిర్మాణాత్మక రాజకీయ పరిష్కారం ద్వారానే సాధ్యం
రాజకీయ ప్రాతినిధ్యం
అస్పృశ్యులకు ప్రత్యేకంగా అవసరం లేదు
ప్రత్యేక ఓటుహక్కు, స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం అవసరం
తాత్వికత
హిందూ మత సంస్కరణ అవసరం
ఆధునిక లౌకిక మరియు సమానత్వవిలువ ఆధారిత సమాజ నిర్మాణం
అస్పృశ్యుల విముక్తి విషయంలో గాంధీ , కాంగ్రెస్ భావజాలం నైతిక దృష్టికోణాన్ని కలిగి ఉన్నప్పటికీ, అంబేద్కర్ చూపించిన రాజకీయ, సామాజిక సమానత్వ మార్గమే స్థిరమైన పరిష్కారంగా కనిపిస్తుంది. స్వతంత్ర భారతదేశం అంబేద్కర్ సూచించిన చట్ట పరమైన, రాజ్యాంగ పరమైన చర్యల ద్వారా మాత్రమే అస్పృశ్యుల విముక్తిలో పురోగతి సాధించగలిగింది. ఒక సామాజిక పునర్నిర్మాణ కర్తగా అస్పృశ్యత నిర్మూలనలో అంబేద్కర్ పాత్ర ఆత్మగౌరవం, చట్టబద్ధ హక్కులు అనే మూలతత్వాలపై ఆధారపడి ఉండటం వల్ల ఆయన మార్గమే శాశ్వత అస్పృశ్యుల పరిష్కారమయ్యిందని చెప్పవచ్చు.
ఉపయుక్త గ్రంథాలు :
1. Ambedkar, Bhimrao Ramji. Dr. Babasaheb Ambedkar: Writings and Speeches. Edited by Vasant Moon, Third ed., vol. 17, Part-II, Dr. Ambedkar Foundation, Ministry of Social Justice & Empowerment, 2020.
2. డా. అంబేద్కర్ బి. ఆర్. ‘ఆధునిక’ భారతంలో అంటరానితనం. Translated by కాత్యాయని, పునర్ముద్రణ ed., హైదారాబాద్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, 2015.
3. డా. అంబేద్కర్ బి. ఆర్. కుల నిర్మూలన. Translated by భీమన్న బోయి, హైదరాబాద్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2023.
4. డా. అంబేద్కర్ బి. ఆర్. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు. Edited by జగన్నాథం పేర్వారం, translated by ఆంధ్ర విశ్వవిద్యాలయం, First ed., vol. 3, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, 1994.
5. డా. అంబేద్కర్ బి. ఆర్. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు. Edited by జగన్నాథం పేర్వారం, translated by కాకతీయ విశ్వవిద్యాలయం, First ed., vol. 5, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, 1994.
6. డా. అంబేద్కర్ బి. ఆర్. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు. Edited by జగన్నాథం పేర్వారం, translated by శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, First ed., vol. 9, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, 1993.
7. డా. అంబేద్కర్ బి. ఆర్. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు. Edited by భూమయ్య అనుమాండ్ల, translated by డా. అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, First ed., vol. 10, భాగం-2, డా. అంబేద్కర్ ఫౌండేషన్, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూ ఢిల్లీ, 2009.
8. డా. అంబేద్కర్ బి. ఆర్. భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ది. Translated by భార్గవ, పునర్ముద్రణ ed., హైదారాబాద్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, 2011.
9. డా. పద్మారావు కత్తి. భారత రాజకీయాలు అంబేడ్కర్ దృక్పథం. మొదటి ముద్రణ ed., పొన్నూరు, గుంటూరు, లోకాయుత ప్రచురణలు, 2018.
10. డా. విజయభారతి బి. బాబాసాహెబ్ అంబేద్కర్. హైదరాబాద్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1982.
(ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన ‘అంబేద్కర్ ఆలోచనల తాత్వికత’ అంతర్జాల సమావేశాల పరంపరలో భాగంగా 23 ఫిబ్రవరి, 2025 నాడు ‘అస్పృశ్యుల విముక్తి – కాంగ్రెస్, గాంధీ భావనలపై అంబేద్కర్’ అనే అంశంపై చేసిన ప్రసంగ పాఠం.)
గాంధీ, అంబేద్కర్ ల ఆలోచన పద్ధతిని శాస్త్రీయంగా విశ్లేషించిన తీరుకు అభినందనలు.