అస్తిత్వ రక్షణకై

అర్థరాత్రి…
అరణ్యంలో ధూమ్ ధాం
ప్రకృతి సంగీత ధ్వనుల మధ్య
నల్లని కోయిల నోట నల్లమల పాట
నెమలి తల్లి మట్టి పాదాల నాట్యం

వేకువజామున…
కోడి పుంజుల యుద్ద సైరన్
నల్లమల నలుమూలలా పెద్దపులుల సెంట్రి

కృష్ణమ్మ అలల ఆక్రోశ ఉప్పెన
పల్లెపల్లెనా తూర్పుజాతి కోడెల రంకెలు
చెట్టుచెట్టుకు తేనెతుట్టెల అణుబాంబులు
పుట్టపుట్టకు ఎర్ర చీమలదండు కవాతు

దోపిడీ ప్రవేశ నివారణకై
బలుసు – రేగు ముళ్ళ కంచెలు
దారి పొడుగునా
కాకుల రెక్కల నిరసన పతాకాలు

ప్రేమగా పెట్టిన మైదాకు
ఇష్టంగా తిన్న నాగజెముడు పండ్లు
చేతుల్ని హృదయాన్ని ఎరుపెక్కిస్తున్నాయి

ప్రేమలో…
ఊపిరితిత్తులు స్వీకరించిన
నల్లమల స్వేచ్ఛాపూరిత గాలులు
సామూహిక జీవనంలో
ఉద్యమం అనివార్యమంటున్నాయి

ఆ స్వేచ్ఛ కోసం ఆ వెన్నెల కోసం
కలిసి నడుద్దాం కలిసి శ్వాసిద్దాం

దోపిడి…
జీవించే హక్కును కమ్మేసిన చోట
బతకటం కోసమే శ్వాసించకుండా
శ్వాసించే హక్కు కోసం బతుకుదాం
ప్రకృతి తల్లిని బతికించుకుందాం

నల్లమలలో…
వృక్షాలు చిగురిస్తున్నంత కాలం
శ్వాసించే స్వేచ్ఛ కోసం
నెత్తుటి జెండాను ఎత్తిపడుదాం
ప్రకృతి ప్రేమకు చిహ్నమైన
ఎర్ర మందారాల రక్షణకై
ఆరిపోతున్న నల్లమల దీపాన్ని
రేపటి నిండు వెన్నెలగా ఆవిష్కరిద్దాం

Leave a Reply